Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ‘బ్రో’ బోధిస్తున్నదేమిటి?

ఎమ్బీయస్‍: ‘బ్రో’ బోధిస్తున్నదేమిటి?

‘‘బ్రో’’ విడుదలకు ముందు బజ్ లేకుండా రిలీజవుతోందని వార్తలు వచ్చాయి. రిలీజయ్యాక చూస్తే బజ్ లేకపోవడమే మంచిదనిపించిందిట. అంచనాలు పెంచిన కొద్దీ అందుకోవడం మరీ కష్టమౌతుంది. ఆ సినిమా బాక్సాఫీసు కలక్షన్లు ఎంత వచ్చాయి, నిర్మాతలకు థియేటర్ల ద్వారా ఎంత వస్తుంది, ఓటిటి ద్వారా ఎంత వస్తుంది, మొత్తం మీద లాభమేనా? డిస్ట్రిబ్యూటర్ల సంగతేమిటి? యిలాటి ఆర్థికపరమైన సంగతులు పక్కన పెడితే, కంటెంట్ పరంగా పవన్ అభిమానులను తప్ప సినిమా అందర్నీ అలరించ లేదనే రిపోర్టు వచ్చింది. అభిమానులు ఫస్ట్ వీకెండ్ వరకే కాసుకోగలరు. ఇతరులు కూడా యింప్రెస్ అయితేనే రెండో వీకెండ్ కూడా గట్టెక్కుతుంది. పవన్ యొక్క స్టార్ యిమేజి, సినిమాలోని సీరియస్ కంటెంట్‌ను డామినేట్ చేయడంతో ఒరిజినల్ సినిమా సందేశం నీరుకారి అభిమానులను దాటి సినిమా వెళ్లలేదని వ్యాఖ్యాతలు అంటున్నారు. ఈ సినిమా ఫలితాన్ని రాజకీయాలకు అన్వయించి చూస్తే, రాజకీయాల సీరియస్ వాతావరణాన్ని పవన్ పెర్శానా డామినేట్ చేస్తే ఆయన అందరివాడు కాకుండా అభిమానుల వాడు మాత్రమే అవుతాడనే భయం వేస్తోంది.

ఒరిజినల్ సినిమా ‘‘వినోదాయ సితం’’ ఒక ఆర్ట్ సినిమా లాటిది. 5 కోట్ల బజెట్‌లో, యిద్దరు మధ్య వయస్కులను ప్రధాన పాత్రల్లో పెట్టి తీశారు. థీమ్ కొత్తదేమీ కాదు. ఇలాటి వాటిల్లో ముఖ్య పాత్రధారి ఎప్పుడూ మధ్యవయసు దాటినవాడే అవుతాడు. స్టార్ అయివుండడు. ‘‘దేవుడే దిగివస్తే..’’ (1975) సినిమాలో ముఖ్యపాత్రధారి సత్యనారాయణ. దానికి మూలం తేంగాయ్ శ్రీనివాసన్ అనే హాస్యనటుడు ముఖ్యపాత్రధారిగా వేసిన ‘‘కలియుగ కణ్ణన్’’ (1974) అనే తమిళ సినిమా. దానిలో కృష్ణుడి పాత్ర వేసినతను స్థూలకాయుడైన నీలూ అనే హాస్యనటుడు. ‘‘దేవుడే దిగివస్తే’’లో కృష్ణ పాత్రధారి రామకృష్ణ. ఒకప్పుడు హీరోగా వేసినా, ఓ మోస్తరు నటుడిగానే చెప్పాలి. ఇది ఎందుకు చెప్పానంటే జీవితంలో మనిషి చేసే పొరపాట్ల గురించి చెప్పాలంటే ముఖ్య పాత్రధారి దాదాపు వృద్ధుడై ఉండాలి. తక్కిన తారాగణం కూడా మరీ ప్రముఖులు కానక్కరలేదు.

‘‘తోడుదొంగలు’’ (1954) సినిమాలో ఎన్టీయార్ ఓ మిల్లులో భాగస్వామి. అతనికి మృత్యువు దగ్గర్లో ఉందని తెలుస్తుంది. అప్పుడు తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుందామని ప్రయత్నిస్తాడు. 31 ఏళ్ల ఎన్టీయార్ ఆ సినిమాలో యంగ్ హీరోగా వేయలేదు. వృద్ధుడిగా వేశారు. ఆయనకు తోడుగా గుమ్మడి కూడా వృద్ధుడిగానే వేశారు. గతంలో చేసిన తప్పులు దిద్దుకోవాలి అనే తపన ఎప్పుడు వస్తుంది? కొంత జీవితం గడిచాకనే ఆ సందర్భం ఏర్పడుతుంది. యవ్వనంలో ఉండగా తప్పులు చేయడానికి ఆస్కారం యింకా ఉండదు. వయసు పైబడి, బాధ్యతలు నెత్తిన పడిన వారికే, తన తర్వాత తన వారసులు అవి నిభాయించ లేరనే అభద్రతా భావం, తను లేకపోతే ప్రపంచం ఆగిపోతుందనే ఫీలింగు కలుగుతాయి తప్ప ఒక యువకుడికి అలాటి ఆందోళనలుండవు. ప్రపంచాన్ని జయించగలననే ఆశతో, ధైర్యంతో ఉంటాడు.

తను నిష్క్రమించే ముందు వ్యవహారాలు సెట్ చేసి వెళ్లాలనే ఆతృత యువకుడికీ ఉండడం సహజమే కానీ మిడిల్ ఏజ్ బ్లూస్ అతన్ని చుట్టుముట్టవు. కూతురి వివాహం గురించి, కట్టుకున్న భార్య భవిష్యత్తు గురించి ఉండే ఫీలింగ్స్ వేరు, చెల్లెలి గురించి, ప్రియురాలి గురించి ఉండే ఫీలింగ్స్ వేరు. సినిమా చివర్లో యువకుడు బాధ్యతలు నెరవేర్చి వెళ్లినా అతనిది అకాలమృత్యువనే బాధ ప్రేక్షకుణ్ని యిబ్బంది పెడుతుంది. అదే వృద్ధుడి కేసులో అయితే అన్నీ ముగించుకుని వెళ్లాడని ప్రేక్షకుణ్ని సర్ది చెప్పుకుంటాడు. అంతేకాదు, పొడిగించిన జీవితం కారణంగా ముసలాయన గతంలో తను చేసిన తప్పులు దిద్దుకున్నాడనే తృప్తి కూడా ప్రేక్షకుడికి కలుగుతుంది. జీవితమే చిన్నదైనప్పుడు యువకుడికి గతంలో తప్పులు చేశాడని, అవి యిప్పుడు దిద్దుకున్నాడని చూపించే అవకాశం లేదు కదా!

‘వినోదాయ సితం’ను తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నపుడు కాలపురుషుడి పాత్ర పవన్ తీసుకున్నా, తంబి రామయ్య పాత్రను ఏ తనికెళ్ల భరణికో, ఎల్బీ శ్రీరామ్‌కో, పోసాని కృష్ణమురళికో, ప్రకాశ్ రాజ్‌కో యిచ్చి ఉంటే అద్భుతంగా పండేది. కానీ అలా అయితే కమ్మర్షియల్‌గా రిస్క్ అవుతుందనుకున్నారు. పవన్‌ని పెట్టడంతో సినిమా బజెట్ అమాంతం పెరిగిపోయింది. అది రికవర్ చేయడానికి కమ్మర్షియల్ చేయవలసి వచ్చింది. దానికోసం లుంగీ డాన్సులు, తాగుళ్లు పెట్టారు. అవి పై చెప్పినవారిపై నప్పవు కాబట్టి యూత్‌ఫుల్ యాక్టర్‌ను తీసుకుని వచ్చారు. వినోదాయ సితంలో దేవుడి కారెక్టరు వేసిన సముద్రఖని స్టార్ కాదు కాబట్టి, కథ ప్రకారమే నడిపారు. ఇక్కడ పవన్ స్టార్ కాబట్టి, అభిమానుల కోసం అంటూ పాత సినిమా పాటలూ అవీ పెట్టి కథ పెంచారు. దానాదీనా సినిమా నిడివి 45 ని.లు పెరిగి కలరే మారిపోయింది. అయ్యవారిని చేయబోతే అల్లరి కుర్రాడు తయారయ్యాడు.

ప్రతి సినిమాకు దానికి తగిన తారాగణం ఉండాలి. ‘‘తీస్రీ కసమ్’’ (1966) సినిమా గురించి చెప్తాను. ఫణీశ్వర నాథ్ రేణు అనే ఆయన రాసిన ‘మారే గయే గుల్ఫాం’ అనే కథ ఒక అమాయకుడైన బండివాడు, నౌటంకీలో నాట్యకత్తె అయిన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. దాన్ని బాసు భట్టాచార్య అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో గీతకారుడు శైలేంద్ర ఒక ఆర్ట్ ఫిల్మ్‌గా, తక్కువ బజెట్‌లో తీద్దామనుకున్నాడు. అయితే ఆ కథ రాజ్ ‌కపూర్‌కి బాగా నచ్చి తను బండివాడిగా వేస్తానన్నాడు. తనను బాగా ఎంకరేజ్ చేసిన దర్శకనిర్మాత కాబట్టి శైలేంద్ర కాదనలేక పోయాడు. ఎప్పుడైతే రాజ్ కపూర్ హీరో అన్నారో, హీరోయిన్‌గా పెద్దతార కావలసి వచ్చింది. వహీదాను తెచ్చారు. అలాగే టెక్నీషియన్లు పెద్దవాళ్లు కావలసి వచ్చారు. హంగు పెరిగింది. ఇక దాంతో ఖర్చు పెరిగాయి. శైలేంద్రకు సినీనిర్మాణంలో అనుభవం లేకపోవడంతో అయినవాళ్లు మోసం చేసి, బజెట్‌ను తడిపి మోపెడు చేశారు. ఇతర కష్టాలు కూడా చుట్టుముట్టాయి. అది శైలేంద్ర పాలిట గుదిబండ అయి, అతని అకాల మృత్యువుకి కారణమైంది.

సినిమా రిలీజైంది. రాజ్ కపూర్, వహీదా సినిమా అనగానే ప్రేక్షకుల అంచనాలు ఎక్కడో ఉన్నాయి. ఎందుకంటే అంతకు రెండేళ్ల క్రితం వచ్చిన ‘‘సంగమ్’’ భారీ బజెట్ కలర్ రిచ్ సినిమా. మొట్టమొదటిసారి విదేశాల్లో తీసిన సినిమా. వైజయంతిమాల, రాజేంద్ర కుమార్ కూడా ఉన్నారు. సూపర్ డూపర్ హిట్. శంకర్ జైకిషన్ యిచ్చిన సంగీతం ఎవర్‌గ్రీన్. ఈ సినిమా చూడబోతే బ్లాక్ అండ్ వైట్ సినిమా. పల్లెటూళ్లలో, దుమ్మూధూళిలో పంచి కట్టుకుని ఎడ్లబండి నడుపుతూ హీరో. చుట్టూ చిన్నాచితకా స్టార్లు. అందరిదీ పల్లెటూరి యాసే. కథ నెమ్మదిగా సాగుతుంది. శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చిన పాటలు ఎంతో బాగున్నా ప్రేక్షకులు తిరస్కరించారు. ఇది శైలేంద్రను కృంగదీసింది. సినిమా రిలీజైన కొద్ది నెలలకే గుండెపోటుతో తన 43వ ఏట మరణించాడు. ఆయన పోయిన తర్వాత సినిమాకు ప్రశంసలు కురిశాయి. రాష్ట్రపతి అవార్డు వచ్చింది. సినిమా చాలా బాగుంటుంది. కానీ పెద్ద తారలు వేయడం వలన కమ్మర్షియల్‌గా ఫ్లాపైంది కానీ సినిమా ఆత్మ చెడలేదు. అందుకనే తర్వాతి రోజుల్లో రీరన్స్‌లో ఆ సినిమా బాగా ఆడింది. ఆ సినిమాను క్లాసిక్స్‌లో ఒకటిగా పేర్కొంటారు.

‘‘బ్రో’’ విషయంలో అది జరగలేదని నా అభిప్రాయం. అది తప్పో రైటో తేలాలంటే మరో భాషలో దీని రీమేక్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. సముద్రఖని తన యింటర్వ్యూలలో తన సినిమా ప్రపంచానికి అంతటికీ చేరవలసిన సందేశమని, దీన్ని 12 భాషల్లో తీద్దామనే ఉద్దేశం ఉందనీ చెప్పాడు. అందువలన ఏ కన్నడంలోనో, మలయాళంలోనో తిరిగి తీసినపుడు ‘వినోదాయ సితం’ ఫార్ములా అనుసరిస్తాడో, ‘బ్రో’ టెక్నిక్ ఫాలో అవుతాడో చూదాం. ఐడియాను ఒరిజినల్‌గా కన్సీవ్ చేసినది, ఎగ్జిక్యూట్ చేసినది సముద్రఖనియే కాబట్టి, అతని వ్యూ పాయింటు ఎలా ఉందో మనకు అర్థమౌతుంది. నిజానికి మనవాళ్లు అతన్ని అతనిలా ఉండనివ్వలేదు. త్రివిక్రమ్ మొత్తమంతా మార్చేశాడని సముద్రఖనియే చెప్పాడు. రిలీజుకి ముందు ఆ విషయాన్ని గొప్పగా చెప్పాడు. రిలీజు తర్వాత ఏమనుకుని ఉంటాడో మనం ఊహించగలం. కానీ ఆ మాట అతను పైకి అనడు. తెలుగులో ఛాన్సులు రాకుండా పోతాయనే భయం ఉంటుందిగా! మరో భాషలో రీమేక్ చేసినప్పుడు మాత్రమే అతని భావం మనకు తెలుస్తుంది.

‘‘బ్రో’’లోని స్టార్ హంగామా సందేశాన్ని మింగేసిందని అందరూ అభిప్రాయ పడ్డారు. నిర్మాతలకు,  మన అగ్రతారలకు యిదో జబ్బు అయిపోయింది. తెలుగు కథకులు రాసే కథల మంచిచెడ్డలు బేరీజు వేయడం వాళ్లకు రాదు. తమ నిర్ణయంపై తమకే నమ్మకం లేదు. కథాచర్చలకు సమయం వెచ్చించడం దేనికి, ఎవరికో పుట్టిన బిడ్డను దత్తత తెచ్చుకుంటే పోతుంది కదా అనుకుంటున్నారు. మళ్లీ ఆ బిడ్డను అలా ఉంచుతున్నారా అంటే అదీ లేదు. గ్రాండ్ స్కేలులో తీయడానికి అంటూ చిత్తం వచ్చినట్లు మార్చేసి మూలంలో ఉన్న అందాన్ని, సింప్లిసిటీని చెడగొడుతున్నారు. దాంతో అప్పీల్ పోతోంది. గతంలో అయితే యితర భాషల్లోంచి రీమేక్ చేస్తే చెప్పేవారు కాదు. చెప్పినా తెలుగు ప్రేక్షకులకు వాటిని చూసే వీలుండేది కాదు. ఇప్పుడు ఒటిటి ధర్మమాని యితర భాషా చిత్రాలు మనకు బాగానే వంటపట్టాయి. తెలుగు వాళ్లలో చాలామంది ఒరిజినల్ చూసేస్తున్నారు. రీమేక్ రాగానే పోల్చి చూసి, పెదవి విరుస్తున్నారు.

నాటకాలు వేసేవాళ్లకు చాలా యిబ్బందులుంటాయి. స్త్రీ పాత్రధారిణి దొరకపోవడం, ఒక పాత్రధారి సమయానికి రాకపోవడమో, వచ్చినా మత్తులో ఉండి నటించే స్థితిలో లేకపోవడమో, కొందరు డైలాగులు మర్చిపోవడమో.. యిలాటి కారణాల చేత తమ కనుగుణంగా స్క్రిప్టు మార్చేసు కుంటూంటారు. ఈ ధోరణిని వెక్కిరిస్తూ, తమ మీద తనే జోక్ చేసుకుంటూ హాస్యనటుడు, నిర్మాత చలం, భమిడిపాటి రాధాకృష్ణ గారితో అనేవాడట – ‘రాధాకృష్ణగారూ, మాంఛి నాటకం చూడండి, మార్చి ఆడేద్దాం’ అని. ఇది రాధాకృష్ణగారే నాతో చెప్పారు. ఇక్కడ కీవర్డ్ ‘మార్చి’. మార్చి ఆడేసేదానికి మంచి నాటకం తీసుకుని చెడగొట్టడం దేనికి? నాటకాల వాళ్ల మీద సెటైర్ అది. ఇప్పుడు అగ్రహీరోల మీదా వేయవచ్చు యీ సెటైర్. మాంచి యితర భాషా చిత్రం పట్టుకు రావడం, మార్చి చెడగొట్టడం!

‘‘గాడ్‌ఫాదర్’’ సినిమా ఒరిజినల్ చాలా పాప్యులర్. స్టార్ అయినా మోహన్‌లాల్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. చిరంజీవికి అది నచ్చింది కానీ తెలుగు ప్రేక్షకులు తనను అలా ఆమోదిస్తారో లేదో అనే జంకు. దశాబ్దాలుగా తన ప్రేక్షకులను అలా తయారు చేసుకున్నాడాయన. ప్రయోగాలు అప్పట్లోనే చేసి ఉంటే యిప్పుడీ యిబ్బంది ఉండేది కాదు. ఇప్పటికీ ఆయన్ను ‘‘వాల్తేరు వీరయ్య’’గానే చూడడానికి యిష్టపడుతున్నారు ఆయన అభిమానులు. అప్పటికా సినిమా రాకపోయినా, ఈ విషయం మనసులో మెదలుతోందేమో ‘‘గాడ్‌ఫాదర్’’లో చిరంజీవి యిబ్బంది పడుతూ, ఇంత డిగ్నిఫైడ్ రోల్ నాకు నప్పుతుందా అని సందేహిస్తూ నటించారు. విలన్ సత్యదేవ్‌లో కనబడినంత యీజ్ ఆయనలో కనబడలేదు. ‘‘భీమ్లా నాయక్’’ ఒరిజినల్‌లో ముఖ్యపాత్ర ధారులిద్దరి మధ్య కనబడిన సమతూకం తెలుగుకి వచ్చేసరికి మిస్సయింది. దానితో మ్యాజిక్కూ మిస్సయింది. మన స్టార్ యిమేజికి తగినట్లుగానే సినిమాలుండాలంటే, మన కోసమే కథలు రాయించుకోవాలి. ఇలాటి రీమేక్స్ తక్కిన చిన్న స్టార్లకు వదిలేయాలి. లేకపోతే దోభీ కా కుత్తా న ఘర్‌కా, న ఘాట్‌కా అన్నట్లు తయారవుతుంది.

ఇప్పుడు పవన్ అభిమానులు త్రివిక్రమ్‌ను తిడుతున్నారు. ఆయనకేం పోయింది, ఆయన ఏదైనా సజెస్ట్ చేయవచ్చు. దాన్ని ఎప్రూవ్ చేసినవారి తెలివి, వివేకం ఏమయ్యాయి? మంత్రి సరైన సలహాలు యివ్వాలి నిజమే, కానీ ఆ మంత్రిని నియమించేవాడు ఎవరు? రాజే కదా! ఎటువంటి వారిని మంత్రులుగా నియమించుకోవాలంటూ చాణక్యుడు పెద్ద లిస్టు యిచ్చాడు. ఇచ్చకాలు చెప్పేవాళ్లను మంత్రులుగా పెట్టుకోకూడదనే యింగితం రాజుకి ఉండకపోతే ఎలా?  ఈ విషయంలో హీరో, నిర్మాత, దర్శకులను కూడా తప్పు పట్టాలి. కాదంటే యింత పెద్ద ఛాన్సు పోతుందనే భయంతో సముద్రఖని తన కథ ధ్వంసం అయిపోతున్నా, వేరే రచయిత వచ్చి కెలికేస్తున్నా నోరెత్తలేక పోయి ఉండవచ్చు. కానీ హీరో అయితే అన్నీ శాసించగల స్థితిలో ఉన్నాడు. నా యిమేజి యీ సినిమా ఆత్మను మింగేస్తుంది, మరోటి చూడండి అని ఆయన అని ఉండాల్సింది.

పవన్ చేష్టలన్నిటికీ త్రివిక్రమ్‌నే బాధ్యుణ్ని చేయడం తరచుగా చూస్తున్నాను. చాణక్య నీతిలో చదివానో, చందమామ కథలో చదివానో కానీ పన్నులు పెంచుదా మనుకున్నపుడు రాజు మంత్రి చేత హెచ్చు పన్ను ప్రకటన చేయిస్తాడు. ప్రజలు గగ్గోలు పెట్టినపుడు దానిలో రాయితీని రాజు ప్రకటిస్తాడు. ప్రజలు మంత్రిని తిట్టుకుంటారు, రాజుని మెచ్చుకుంటారు. రాజుకి మెప్పుతో పాటు పన్ను కాస్త పెరిగి, ఆదాయం కూడా వస్తుంది. ప్రజాస్వామ్యం వచ్చాక రాజుల స్థానంలో మంత్రులు, మంత్రుల స్థానంలో అధికారులు అయ్యారు. అధికారులు చెడు సలహాలిచ్చి మా నాయకుణ్ని చెడగొడుతున్నారు అని కార్యకర్తలు వాపోతూ ఉంటారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చినపుడు చేసిన తొలి ప్రసంగం చాలా బాగుండి, అనేక ఆశలు కల్పించింది. అది త్రివిక్రమ్ రాసినదనే పుకారు వచ్చింది. రెండో ఉపన్యాసం నిరుత్సాహ పరిచింది. రెండో దాన్నుంచి పవన్ సొంత కవిత్వమే తప్ప త్రివిక్రమ్ పాత్ర ఏదీ లేదుట అన్నారు. కానీ యీ ‘‘బ్రో’’ వ్యవహారం చూశాక, ఉపన్యాసాల పర్యవేక్షణ త్రివిక్రమ్ దేనేమో అనే సందేహం వచ్చింది. ఎందుకంటే అవి కూడా పవన్‌ను, ఆయన అభిమానులను మెప్పిస్తున్నాయి తప్ప సామాన్యుడికి చేరటం లేదు.

పవన్ ఉపన్యాసాల్లో ఉండే స్వోత్కర్ష సామాన్యుడికి ఉత్సాహం కలిగిస్తుందా? ఎవరైనా వాళ్లమ్మాయి మేరేజి ఆల్బమ్ చూపిస్తున్నారనుకోండి, అబ్బాయి, అమ్మాయి కలిసి నానా రకాల పోజుల్లో దిగిన ఫోటోలు చూపించి వాళ్లు మురిసిపోతూ ఉంటే మనకు విసుగొస్తుంది. ‘ఇవన్నీ సరే, నేను రిసెప్షన్‌కి వచ్చి ఫోటో దిగాను కదా, అదెక్కడుందో చూపించు చాలు’ అంటాం. అలా పవన్ ‘ఫలానావారిని తాట తీస్తా, తొక్క ఒలుస్తా..’ లాటి కార్యక్రమాల లిస్టు చదువుతూంటే ‘అది సరే, నీ మానిఫెస్టోలో నా చోటు ఎక్కడుంది, అది చెప్పు. తక్కినవాళ్లను ఏం చేస్తావో చేసుకో, నాకు ఏం చేస్తావో చెప్పు’ అనుకుంటాడు సామాన్యుడు. బ్రో సినిమా స్క్రీన్‌ప్లే కూడా పవన్ అభిమానుల, వారికోసం, వారికై తయారైంది కాబట్టి సామాన్య ప్రేక్షకుడు డిస్‌కనెక్ట్ అయ్యాడు. ఇది రాజకీయాల్లో జరగకూడదంటే పవన్ తన థింక్‌ట్యాంక్‌ను విస్తరించుకోవాలి.

కాంగ్రెసు, టిడిపి రెండిటితో ప్రజలు విసిగి ఉన్నపుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టారు. అదే టైములో జయప్రకాశ్ లోకసత్తాతో ముందుకు వచ్చారు. జెపి మేధస్సు, చిరంజీవి గ్లామర్ రెండూ కలిస్తే గట్టి ప్రత్యామ్నాయం వస్తుంది అని ఆశ పడ్డాను. కానీ అది జరగలేదు. పవన్ వచ్చినపుడూ అలాటి ఆశే పడ్డాను. కొన్ని నెలలు పోయాక పవన్ జెపి, ఉండవల్లి, ఐవైఆర్ వంటి మేధావులతో కలిసి కేంద్రం నుంచి రావల్సిన నిధులెంతో తేల్చమని సమావేశం ఏర్పరచినపుడు ఎంతో సంతోషించాను. ఈ థింక్‌ట్యాంక్‌ను పర్మనెంటుగా నడుపుతూ సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా యీయన వెళతాడేమో, సరైన దిశానిర్దేశం జరుగుతుంది అని లెక్కలు వేశాను.

ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చినపుడు ఎందరో మేధావులు కూటమిగా ఏర్పడి ఆయనకు సలహాలిచ్చారు. అందుకే ఎన్టీయార్ అతి తక్కువ కాలంలో రివల్యూషనరీ ఐడియాస్‌ను అమలు చేయగలిగారు. పవన్ విషయంలో థింక్‌టాంక్ నిలవలేదు. పైగా ఆయన పార్టీలో చేరిన మేధావులెవరూ నిలదొక్కుకోలేదు. అందరూ బయటకు నడిచారు. బయటకు వచ్చాక ‘పవన్ ఎపాయింట్‌మెంట్ యివ్వడు, పిలవడు, చెప్పినా వినడు, విమర్శలు సహించడు, మనోహర్‌కి అన్నీ అప్పగించేసి కూర్చున్నాడు’ అని ఆరోపించారు. రాజకీయాల్లో మనోహరైతే, సినిమాల్లో త్రివిక్రమేమో. తనకు ఏది మంచిదో అది చెప్పకుండా, ఏది తనకు నచ్చుతుందో అదే చెప్పేవాళ్లను చుట్టూ పెట్టుకుంటే అనర్థమే. సరే, సినిమాల విషయంలో పవన్‌కు సలహా యిచ్చే పని లేదు. ఆయనకు మార్కెట్ ఉంది. ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. రాజకీయాల వద్దకు వచ్చేసరికే ఆయన కష్టానికి తగిన ఫలితం రావటం లేదు. ‘‘బ్రో’’ అనుభవంతో ఆయన తన స్ట్రాటజీని కొంత మార్చుకుంటే మంచిదనిపిస్తోంది.

జీవితం లాగానే రాజకీయాలు కూడా సీరియస్ బిజినెస్. ఎన్టీయార్ అలాగే చేశారు, జనాలు నమ్మారు

జనసేన విషయంలో మాత్రం అది అభిమానుల కోసమే అన్నట్లు తయారైంది. దాంతో దాని అప్పీలు లిమిటెడ్ అయిపోయింది. ఒక వ్యక్తి చుట్టూనే తిరుగుతోంది. కంటెంట్ తక్కువ, గ్లామర్ ఎక్కువ అయిపోయి మౌలిక ప్రయోజనం దెబ్బ తింటోంది. ఎంతో గ్లామరున్న తారలు ఎన్నికలలో ఫెయిలయ్యారు. శివాజీ గణేశన్, కమలహాసన్, కృష్ణ, జమున, మురళీమోహన్, కృష్ణంరాజు ఓడారు, అంతెందుకు ఎన్టీయార్, చిరంజీవి కూడా ఓడారు. పవన్ కూడా ఓడారు. ప్రజలు వినోదాన్ని, రాజకీయాలను విడివిడిగా చూస్తారు. గ్లామర్ అనేది జనాలను పోగెయ్యడానికే పనికి వస్తుంది. అప్పుడు గ్యాలరీని ఉద్దేశించి ప్రసంగాలు చేసి, హుషారు చేయడంతో సరిపెడితే ఆనందించి వెళ్లిపోతారు. సందేశం ప్రజలకు అందాలంటే సీరియస్‌నెస్ పెరగాలి. పార్టీలో మేధావులూ, వేదికపై యితర వక్తలూ ఉండాలి. వాళ్లూ గంభీరంగా మాట్లాడాలి. కలక్టివ్ విజ్‌డమ్‌తో నడిచే పార్టీ యిది అనిపించాలి. ఒన్ మ్యాన్ షోగా నడిస్తే మాత్రం ‘‘బ్రో’’ సినిమా లాగానే అభిమానులకే పరిమితమౌతుంది. జనరల్ ఆడియన్స్‌ను, ఓటర్లను చేరదు.  

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?