Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: బాబు తెలంగాణ వ్యూహం ఫలించేనా?

ఎమ్బీయస్‍: బాబు తెలంగాణ వ్యూహం ఫలించేనా?

తెలంగాణకు ఇప్పుడు టిడిపి అవసరం ఉంది అన్నారు బాబు డిసెంబరు 21 నాటి ఖమ్మం సభలో. కానీ యిప్పుడు టిడిపికి తెలంగాణ అవసరం ఉంది అని అందరికీ తెలుసు. అయితే ఆ అవసరం తాత్కాలికమా? దీర్ఘకాలికమా? ఏ రకంగానైనా ఆ అవసరం నెరవేరుతుందా? అనేవే ప్రశ్నలు. అవసరం ఎందుకు పడింది అంటే బాబు తాజా వ్యూహం చేత. ఆంధ్రలో వైసిపిని గద్దె దింపడానికి జనసేన కలిసి వచ్చినా చాలదని, 2014 తరహాలో బిజెపి కూడా కలిసి రావాలని బాబు లెక్క వేశారు. అయితే బాబుతో ఓ పట్టాన కలవడం యిష్టం లేని బిజెపి దోబూచులాడుతోంది. కొందరు బిజెపి నాయకులు టిడిపిపై బాహాటంగా కారాలు, మిరియాలు నూరుతున్నారు కూడా. వారిని అధిష్టానం వారించక పోవడం చేత దిల్లీ ఏలికలు కూడా టిడిపితో పొత్తు అనవసరమని భావిస్తున్నారని అందరికీ బోధపడుతోంది.

ఇలాటి పరిస్థితుల్లో తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకుని, ఆ పొత్తును ఆంధ్రకు విస్తరింప చేయాలని బాబు ఆలోచన. కెసియార్‌ను గద్దె దింపాలని ఊరికే తహతహ లాడితే లాభం లేదు, యిప్పటికీ తెలంగాణలో బలమున్న మాతో పొత్తు పెట్టుకుంటేనే అది సాధ్యం అని బిజెపికి నిరూపించడం బాబు తక్షణ కర్తవ్యం. తెలంగాణలో బలముందని నిరూపించడం ఎలా? ఖమ్మంలో సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా అనుకుని బాబు ఆ పని చేశారు. తర్వాతి సమావేశం హైదరాబాదులో, ఆ పై మెహబూబ్ నగర్‌లో పెట్టి, యితర పార్టీల్లోకి వెళ్లిన కొంతమంది నాయకులను వెనక్కి రప్పించి, చూశారా నా తడాఖా అని, ఇప్పటికైనా రండి, యిక్కడా అక్కడా పొత్తు పెట్టుకోండి. ఇటు కెసియార్‌ను, అటు జగన్‌ను దింపేద్దాం అని బిజెపి అధిష్టానాన్ని ఒప్పించాలని బాబు వ్యూహమని పరిశీలకులందరూ ముక్తకంఠంతో చాటి చెప్తున్నారు. అది సాధ్యమే అని కొందరు, అబ్బే కుదరదని మరి కొందరు అంటున్నారు. సాధ్యాసాధ్యాలు చర్చించడమే యీ వ్యాసలక్ష్యం.

మొట్టమొదటగా వచ్చే ప్రశ్న. టిడిపికి తెలంగాణలో బలముందని ఒప్పుకుని, యిక్కడ దానితో పొత్తు పెట్టుకోవడానికి బిజెపి సమ్మతించినా, ఆంధ్రలో కూడా పెట్టుకుంటుందా? బిజెపికి జనసేనతో ఆంధ్రలో పొత్తు ఉంది, పవన్‌ను ముఖ్యమంత్రి చేస్తామని కూడా ఒక దశలో అంది. కానీ జనసేనతో తెలంగాణలో పొత్తు లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అది తేటతెల్లమైంది. కలిసి కార్యక్రమాలు చేసే ప్రసక్తే లేదు. మోదీ వచ్చినపుడు పవన్ నివాసమున్న హైదరాబాదులోనే కలవవచ్చు. కానీ తెలంగాణ బిజెపి నాయకుల విముఖత చేత కాబోలు, వైజాగ్ రప్పించి కలిశారు. అదే విధానాన్ని టిడిపి పట్ల కూడా అవలంబించవచ్చు కదా!

బిజెపి తెలంగాణ నాయకులు టిడిపితో పొత్తు పెట్టుకోవడానికి యిష్టపడరనేది బహిరంగ రహస్యం. బాబు తన సన్నిహితుడు వెంకయ్య నాయుడి ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో బిజెపిని తొక్కేశారని, ఎదగనీయకుండా చేశారని, లేకపోతే కర్ణాటక తరహాలో పార్టీ ఎంతో ఎదిగేదని వాళ్ల అభియోగం. 2014 ఎన్నికలలో టిడిపితో కలిసి పోటీ చేసి కొన్ని సీట్లు గెలుచుకున్నా, ఆంధ్రలో టిడిపితో కలిసి అధికారం పంచుకున్నా, బిజెపి తెలంగాణ యూనిట్ టిడిపితో భుజాలు కలిపి రాసుకుపూసుకు తిరగలేదు. ఎవరికి వారే అన్నట్లున్నారు. ఓటుకు నోటు కేసులో బాబు యిరుక్కున్నపుడు ఆయనకు మద్దతుగా బిజెపి ఆందోళనలు చేపట్టలేదు. ఇప్పుడు తమంతట తాము పోరాటాలు చేసి, బలపడుతూంటే మళ్లీ బాబు అధీనంలోకి వెళ్లమంటే వాళ్లు వెళతారా?

బాబు అధీనంలోకి వెళ్లే ప్రశ్న లేదు, యిప్పటి పొత్తులో టిడిపిది జూనియర్ భాగస్వామి పాత్రే’ అని అధిష్టానం తెలంగాణ యూనిట్‌కు నచ్చచెపుతుందనుకుందామా? పొత్తు లాభదాయకమని ముందు వాళ్లకు తోచాలి కదా! 2018లో బాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెసు అనుభవం కళ్ల ముందు ఉంది. బాబు తెలంగాణ వేదికపై ప్రవేశం చేయగానే అదిగో మళ్లీ ఆంధ్రుల పెత్తనం అంటూ కెసియార్ గగ్గోలు పెట్టడం, దానితో మహా కూటమి దెబ్బ తినిపోవడం, బాబుతో పొత్తు వల్ల రావలసిన ఓట్లు కూడా పోయాయని కాంగ్రెసు వాపోవడం అందరికీ గుర్తున్నాయి. అప్పట్లో తెరాస కాబట్టి కెసియార్ అలా అనగలిగాడు, యిప్పుడు భా(రత)రాస అయింది కాబట్టి నోరెత్తలేడు. ఎందుకంటే ప్రాంతీయ వాదన తెస్తే ఆంధ్రలో అడుగుపెట్టనివ్వరు కదా అని వాదించవచ్చు.

కెసియార్ ఎప్పుడైనా ఏదైనా అనగలడు. సోనియాకు దేవత దగ్గర్నుంచి దెయ్యం దాకా అన్ని పేర్లూ పెట్టాడు. 2009లో బాబుతో పొత్తు పెట్టుకున్నపుడూ అంతే! పూటకో మాట. మాది జాతీయ పార్టీ, ఆంధ్రలో కూడా యూనిట్ పెడతానంటాడు కానీ అక్కడ అంబ పలకదని తెలియదా? తెలంగాణలో ఆంధ్రమూలాల ఓట్లు ఉన్నాయి కానీ ఆంధ్రలో తెలంగాణ మూలాల ఓట్లు లేవు. ఇక వెలమ కులానికి చెందిన ఓట్లా? అవి గణనీయమైనవి కావు. ఆంధ్ర యిప్పటికే పార్టీలతో కిక్కిరిసి ఉంది. దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెసు, కమ్యూనిస్టులకే ఠికాణా లేదు. మధ్యలో దీనికి చోటెక్కడ? ఉన్న పార్టీలతో విసిగెత్తితే కెఎ పాల్‌కు వేయవచ్చు, నోటాకు వేయవచ్చు కానీ ఆంధ్రులను అడ్డమైన తిట్లు తిట్టిన కెసియార్‌కు ఓట్లు పడతాయా? భారాసకు పొరుగు రాష్ట్రాలలో ఓట్లు రాల్చాలంటే కర్ణాటక, మహారాష్ట్రలలో తెలంగాణ మూలాలున్నవారు కొంత ఆలోచిస్తారేమో తప్ప తక్కిన చోట స్పందన వస్తుందనుకోవడం అత్యాశే. ఇది అర్థం కాగానే కెసియార్ తెలంగాణలో పీఠం కదలకుండా ఉండాలని తన పార్టీ పేరును మళ్లీ తెరాసగా మార్చేసినా ఆశ్చర్యపడ నక్కరలేదు.

పోనీ భారాస కారణంగా కెసియార్ ఆంధ్ర పార్టీ యిక్కడకు వచ్చి ప్రచారం చేయకూడదని పైకి అనకపోయినా యితర నాయకులు నోరు కట్టుకుంటారా? గంగుల కమలాకర్, కవిత అప్పుడే నోరు విప్పారు. ఇవి బహిరంగ ప్రకటనలైతే లోపాయికారీగా ప్రచారం సాగించరా? సోషల్ మీడియాను వాడుకోరా? తెలంగాణ ప్రజలు బాబుని తెలంగాణకు మేలు చేసే వ్యక్తిగా భావిస్తే యీ ప్రచారానికి ప్రభావం ఉండేది కాదు. కానీ వాళ్లు ఆయన్ను నమ్ముతారా? 2009 డిసెంబరు 9 నాటి తెలంగాణ ఆవిర్భావ ప్రకటన తర్వాత అన్ని పార్టీలకు చెందిన ఆంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం బాబు వ్యూహం ప్రకారమే జరిగిందని అందరూ నమ్మారు. బాబు రెండు కళ్ల సిద్ధాంతం అపహాస్యం పాలైంది. తెలంగాణ ఏర్పరచమని లేఖ యిచ్చినది నేనే అని బాబు పదేపదే గుర్తుచేసినా 2014 ఎన్నికలలో టిడిపికి వచ్చిన తెలంగాణలో సీట్లు 15. అవీ ఎక్కడ? సమైక్యవాదులు ఎక్కువమంది ఉన్నచోట. తెలంగాణ ఉద్యమం బలంగా నడిచిన చోట కాదు. ఇప్పుడు కూడా టిడిపి సభ ఎక్కడ పెట్టారు? షర్మిల కార్యక్షేత్రమూ ఖమ్మమే! ఎందుకంటే ఆంధ్రమూలాల వారు ఎక్కువగా ఉన్న ప్రాంతమది. ఇలాటి పరిస్థితుల్లో ఫక్తు తెలంగాణవాది టిడిపి వైపు వస్తాడని ఎలా అనుకోగలం?

పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, బిసిలకు రాజకీయాధికారం సమకూర్చి, టిడిపి తెలంగాణలో ఒకప్పుడు బలమైన శక్తిగా ఉండేదన్నది చారిత్రక వాస్తవం. అయితే అది గతం. 2011 వరకు బెంగాల్‌లో కమ్యూనిస్టులే అధికారంలో ఉన్నారు. మరిప్పుడు బలంగా ఉన్నారా? వారి స్థానాన్ని బిజెపి తీసుకుంది కదా! బాబు మాటకొస్తే 2004లో అధికారం పోగొట్టుకున్న తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాలేదు కదా! 11 ఏళ్ల గ్యాప్ తర్వాత లెఫ్ట్ ఓటు బెంగాల్‌లో యింకా స్థిరంగా ఉందనుకోగలమా? అలాటప్పుడు 18 ఏళ్ల తర్వాత తెలంగాణలో టిడిపి ఓటు స్థిరంగా ఉందని ఎలా అనగలం? లెఫ్ట్ నాయకులు చెల్లాచెదురై పోయినా, వాళ్లు ఎంతోకొంత చేస్తూ బెంగాల్‌లోనే ఉన్నారు. బాబు తెలంగాణ రాజకీయాలు గాలికి వదిలేసి నిశ్చేతనంగా ఉన్నారు.

పార్టీ నాయకులు, క్యాడరు, ఓటర్లు గతాన్ని పట్టించుకోరు. వర్తమానంలో ఉంటారు. ఇది గ్రహించకే షర్మిల వైయస్ నామజపం చేస్తోంది. చనిపోయి పుష్కరం దాటినా వైయస్ పట్ల ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయనుకోవడం ఏం సబబు? ఇన్నాళ్లూ పట్టించుకోకుండా ఉండి యిప్పుడు కోడల్ని, వియ్యపురాల్ని అంటే కుదురుతుందా? ఆమె రాజకీయప్రవేశంపై రాసిన వ్యాసం బాబుకీ వర్తిస్తుంది. తెలంగాణకు బాబు ఏం చేశారిన్నాళ్లూ? కోవిడ్ టైములో ఆంధ్రకు వెళ్లలేదు, కనీసం తాను నివాసముంటున్న తెలంగాణలో ఏమైనా చేశారా? సహాయసహకారాలు అందించారా? రాజకీయంగా పార్టీ ఖాళీ అయిపోతూ ఉంటే, క్యాడర్ స్థయిర్యం అడుగంటిపోతూ ఉంటే జవసత్త్వాలు నింపారా?

విభజన తర్వాత తను ఆంధ్రకు పరిమితమైనప్పుడు, తనయుడు, వారసుడు ఐన లోకేశ్‌ను తెలంగాణకు కేటాయించారా? బలమైన సహచర నాయకులు పార్టీ వీడి వెళ్లిపోతూ ఉంటే ఆపారా? వాళ్లు యీయనతో పోట్లాడలేదు. మీకెలాగూ యిక్కడ పని లేదు, మా భవిష్యత్తు కోసం మేం వెళ్లిపోతాం అంటే సరేనన్నారు. ఏ తలసానినో ‘మీరు పార్టీలోని ఉండి నిలబెట్టండి. ఎప్పటికైనా పనికి వస్తుంది. తెరాస బలహీనపడి, వేరే పార్టీతో మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే అధికారం పాక్షికంగానైనా దక్కుతుంది. ఈలోగా ఆంధ్ర ప్రభుత్వం సలహాదారు అనే కాబినెట్ రాంక్ పదవి యిస్తాను.’ అని బుజ్జగించి ఆపారా? లేదే! బలమైన నాయకులందర్నీ ‘ఇక్కడేం పని లేదు, మీ బాగు మీరు చూసుకోండి’ అని వదిలేశారు. 2018 ఎన్నికల్లో బిసి నాయకుడు కృష్ణయ్యను సిఎం అభ్యర్థి అనడం క్రూయల్ జోక్. ఆయనే నెగ్గలేక పోయాడు. పార్టీకి 2 సీట్లు (అదీ ఖమ్మం జిల్లాలో మాత్రమే), 3.5శాతం ఓట్లు వచ్చాయి. 2019 పార్లమెంటు ఎన్నికలలో ఒక్క సీటూ రాలేదు. ఓట్ల శాతం తెలియదు. ఆ తర్వాత బాబు తెలంగాణ యూనిట్ అతీగతీ పట్టించుకోవడం మానేశారు. అధ్యక్షుడే పార్టీ ఫిరాయించినా ఊరుకున్నారు.

ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు తెలంగాణ యూనిట్‌ను రివైవ్ చేయబుద్ధయింది. అదీ దేనికి? ఆంధ్రలో అధికార ప్రాప్తికి ఉపయోగపడడానికి! అధికారం దక్కితే యిటువైపు చూడడానికి టైముండదు. దక్కకపోతే నిరాశతో మళ్లీ వదిలేస్తారు. 2018 తర్వాత కాంగ్రెసుతో దోస్తీ కొనసాగించారా? లేదే! పోనీ సొంత పార్టీ యూనిట్‌కి నిధులిచ్చి కార్యక్రమాలు చేస్తూండండి అన్నారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేపట్టి, ప్రెస్ మీట్లు అవీ పెడుతూ ఉంటే నాయకులు యాక్టివ్‌గా ఉంటారు. ప్రజలు కూడా పార్టీని మర్చిపోకుండా ఉంటారు. ఇన్నాళ్లూ తెలంగాణలోని కెసియార్ ప్రభుత్వంపై ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటూ, తెలంగాణ ప్రజలూ, బాబు ఒకరినొకరు మర్చిపోయాక యిన్నాళ్లకు ఆయన వచ్చి నా అవసరం మీకుంది అంటే ఒప్పుతుందా? ఆంధ్రలో బిజెపితో బేరాలకై మమ్మల్ని వాడుకుని వదిలేస్తాడేమో అనే సందేహం వీళ్లకు రాదా?

ఇప్పుడు టిడిపితో కలిసి నడిస్తే మాకేమిటి లాభం అని తెలంగాణ నాయకులు, క్యాడరు, ఓటర్లు అనుకోరా? బిజెపికి, టిడిపికి పొత్తు కుదరాలి. ఇద్దరూ కలిసి తెరాసను ఓడించి, అధికారంలోకి వచ్చి పంచుకోవాలి, టిడిపికి చెప్పుకోదగ్గ మంత్రి పదవులు దక్కాలి. అప్పుడే టిడిపిలోకి వెళితే లాభముంటుంది. పొత్తు పెట్టుకుని నెగ్గాక, బిజెపి టిడిపికి మంచి పదవులు యిస్తుందా? 2014లో ఆంధ్ర సర్కారులో టిడిపితో తమతో వ్యవహరించినట్లే నామ్‌కే వాస్తే పదవులు యిచ్చి సరిపెడుతుందా? మోదీ హయాంలోని బిజెపివి మొహమాటం లేని కర్కశమైన రాజకీయాలు. ఏక్‌నాథ్ శిందే ద్వారా శివసేనను చీల్చి బలహీనపరచి, యిప్పుడు శిందేకే ఎసరు పెడుతున్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అతని ఎదురుగానే మహారాష్ట్ర బాగుపడాలంటే ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి కావాలి అని బహిరంగ ప్రకటన చేశాడు! శిందే కిక్కురుమనలేదు. బాబు వంటి తలపండినవాణ్ని చూసి బిజెపి ఉలిక్కి పడుతుంది. బాబు ఏమైనా చేస్తాడేమోనని తనే ముందుగా పార్టీని చీల్చవచ్చు కూడా.

ఇదంతా భవిష్యత్తుకి సంబంధించిన విషయం. అయినా తెలంగాణలో టిడిపి-బిజెపి పొత్తు గురించి ఓ పట్టాన తేలుతుందా? ఆంధ్రలో ఫైనాన్షియల్ మిస్‌మేనేజ్‌మెంట్ కారణంగా జగన్ పలుకుబడి దిగజారినా, అది గ్రహించి నాయకులు వీడి పార్టీ బలహీనపడినా, కేసుల విచారణ మొదలై జగన్ మళ్లీ జైలుకి వెళ్లినా టిడిపిలో ఆశలు చిగురిస్తాయి. ఎవరి పొత్తూ లేకుండా సొంతంగానే వైసిపిని ఓడిస్తా మనుకుంటారు. లేదా జనసేనకు ఓ పది యిచ్చి బిజెపితో పొత్తు లేదంటారు. నిధుల పంపిణీకి అడ్డు రాకూడదనుకుంటే బిజెపికి గెలవని సీట్లు ఓ నాలుగిచ్చి పోటీ చేయమంటారు. బాబు ఎప్పుడైనా ప్లేటు ఫిరాయించవచ్చు, ఎవరితోనైనా కలవవచ్చు. అందువలన చివరి నిమిషం దాకా బిజెపి ఆగి చూడవచ్చు. టిడిపితో పొత్తు పెట్టుకోకపోతే తెలంగాణలో అధికారంలోకి రావడం అసాధ్యమని బిజెపికి తోచినప్పుడే యీ పొత్తు చిగురిస్తుంది. ఆ పొత్తు చిగురుస్తుందని తోస్తేనే మాజీ టిడిపి నాయకులు మళ్లీ టిడిపి కేసి చూడనారంభిస్తారు.

బిజెపి జనసేననే దగ్గరకు రానీయటం లేదు. షర్మిలతో పొత్తు పెట్టుకోవచ్చేమో అంటున్నారు కానీ అదీ డౌటే. క్రైస్తవ మతప్రచారకుడు అనిల్ షర్మిలను వెంటనంటి ఉండగా అది సాధ్యమా? బిజెపి హిందూత్వ కార్డుకి విఘాతం కాదా? మహా అయితే బిహార్‌లో చిరాగ్ పాశ్వాన్‌ను ఉపయోగించుకున్నట్లు షర్మిలతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకుని భారాసకు పడే మైనారిటీ ఓట్లను చీల్చడానికి చూడవచ్చు. అనేక రాష్ట్రాలలో ముస్లిము ఓట్లను చీల్చడానికి మజ్లిస్ ఉపయోగపడుతున్నట్లు, క్రైస్తవ ఓట్లు చీల్చడానికి షర్మిల పనికిరావచ్చు. వీళ్ల శక్తియుక్తులపై ఒక స్పష్టరూపం వచ్చేదాకా బిజెపి ఎటూ అడుగు వేయకపోవచ్చు.

బిజెపి టిడిపి పట్ల సుముఖంగా లేదనే వార్త బయటకు వస్తే మాజీ టిడిపిలెవరూ బాబుని పట్టించుకోరు. ఎందుకంటే సొంతంగా అది అధికారంలోకి రాలేదని అందరికీ తెలుసు. గతంలో ఎంత పాప్యులారిటీ ఉన్నా ప్రస్తుతం ఆంధ్ర పార్టీగా ముద్రపడిన పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందా? కెసియార్ ఆంధ్రకు వెళ్లి పాత టిడిపి మిత్రులను అడిగితే వాళ్లు భారాసలో చేరతారా? స్నేహం దారి స్నేహానిదే, రాజకీయం రాజకీయమే అంటారు. రెండు తెలుగు రాష్ట్రాలు సజావుగా, సుహృద్ధావంతో విడిపోలేదు. కొట్టుకున్నాయి. పరస్పరం నిందించుకున్నాయి. ద్వేషాగ్ని యింకా చల్లారలేదు. ఇంకా విభజన పంచాయితీలు తీరలేదు. ఇలాటప్పుడు అక్కడిది యిక్కడ, యిక్కడిది అక్కడ గెలవదు. ఇప్పటిదాకా ఏ ప్రాంతీయ పార్టీ పక్క రాష్ట్రంలో గెలవలేదు.

‘టిడిపికి ఓటు బ్యాంకుగా చెప్పుకుంటున్న వర్గాలుగా మిగిలినది ఎవరు అంటే కమ్మ కులస్తులు, ఆంధ్రమూలాల వాళ్లు. వాళ్ల మద్దతుతో టిడిపి పుంజుకుంటుంది’ అని కొందరు విశ్లేషిస్తున్నారు. పేదలైతే కులాభిమానంతో ఓటేయడానికి అవకాశం ఉంది. కానీ ధనికులు, మధ్యతరగతి వాళ్లు తమకు ఏది ప్రయోజనకరమో ముందుగా ఆలోచిస్తారు. తర్వాత సెంటిమెంట్లు. ఉద్యోగస్తులైన కమ్మలైతే కులాభిమానం ప్రదర్శించగలరు కానీ ఎంటర్‌ప్రెనార్స్, వ్యాపారస్తులు ఐన కమ్మలు మాత్రం ఏది లాభదాయకమో ఆలోచించి ఆ విధంగా ఓటేస్తారు. రెడ్డి డామినేషనున్న కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నపుడూ కమ్మలు విరాజిల్లారు. ఎన్టీయార్ తెలుగుదేశం పెట్టినపుడు ప్రముఖ కమ్మవారందరూ కాంగ్రెసులోనే ఉండిపోయారు. మనవాళ్ల పార్టీ అని చెప్తే కావాలంటే విరాళాలిస్తాం కానీ బయటపడం అన్నారు. అలాగే తెలంగాణలో వ్యాపార ప్రయోజనాలున్న వారెవరూ స్థానిక ప్రభుత్వంతో పేచీ పెట్టుకోరు. ప్రత్యర్థులపై కెసియార్ ప్రభుత్వపరంగా ఎలా దాడులు చేయిస్తున్నారో చూశాక కొరివితో తలగోక్కునే వారెవరు? ఏదైనా పేచీ వస్తే బాబు వచ్చి అండగా నిలుస్తారన్న హామీ కూడా లేదు. ఆంధ్రలో బాధిత టిడిపి నాయకుల పక్షాన బాబు ఏ మాత్రం నిలబడుతున్నారో చూస్తున్నారు కదా!

ఇక తెలంగాణ లోని ఆంధ్రమూలాల వాళ్ల ఓట్లన్నీ టిడిపికే అన్న రీతిలో తెలుగు మీడియా రాస్తుంది. తెలంగాణ ఆంధ్రమూలాల వారిలో అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల అభిమానులూ ఉన్నారు. ఆంధ్రలోనే టిడిపి అభిమానులు మైనారిటీలో ఉన్నపుడు, తెలంగాణ ఆంధ్రుల్లో మెజారిటీలో ఉంటారని ఎలా చెప్పగలం? విభజన సమయంలో జగన్ సమైక్యవాదానికి గట్టిగా నిలబడలేదు. కేంద్రం ఏం చేస్తే అదే ఒప్పుకుంటాం అన్నారు. బాబు పైకి విభజనవాదం అని చెప్తున్నా మనసులో సమైక్యవాది అనే నమ్మకంతో విభజన తర్వాత తెలంగాణలోని ఆంధ్రమూలాల వారిలో బాబు తమను కెసియార్ నుంచి కాపాడుతాడనే నమ్మకం ఉండేది.

2014 ఎన్నికలలో ఎప్పుడైతే టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేశాయో, ఆయనే ఆంధ్రకు ముఖ్యమంత్రి అయ్యి, ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో తమ ప్రయోజనాలను సంరక్షిస్తాడనే విశ్వాసంతో టిడిపికి ఓట్లేశారు. అందుకే అప్పుడు 15 సీట్లు వచ్చాయి. వాటిలో నగరంలో వచ్చినవి ఎక్కువ. టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకు బిజెపికి రూరల్‌లో కంటె అర్బన్‌లో సీట్లు ఎక్కువ వచ్చాయి. తెలంగాణ రాగానే కెసియార్ తన ప్రతాపాన్ని ఆంధ్రమూలాల వారిపై చూపించారు. శివసేన తరహాకి మారతాడని అనుకుంటూండగానే తన ధోరణి మార్చుకున్నారు. తనే యిక కింగ్ అని ఆంధ్రమూలాల వారికి నిరూపించాక వారిని అక్కున చేర్చుకోనారంభించారు. ఆయన కొడుకుకి ఆంధ్రులతో వ్యాపారబంధాలున్నాయని ఎప్పణ్నుంచో వినికిడి. కారణం ఏమైతేనేం, తెలంగాణలో ఘర్షణ వాతావరణం లేకుండా చేశారు కెసియార్.

దానికి ఆంధ్రమూలాల వారు సంతోషించినా, ఏదైనా రాజకీయ సంక్షోభం రాగానే ‘ఆంధ్ర దోపిడీదారులు’ అనే అస్త్రాన్ని కెసియార్ బయటకు తీస్తాడనే భయం పోలేదు. అందువలన టిడిపిని అంటిపెట్టుకుని ఉండేవారు. టిడిపికి అది పెర్మనెంట్ ఓటు బ్యాంకుగా కొనసాగి, ఎప్పుడైనా రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడితే పాలనలో పాలు పంచుకునే అవకాశం వచ్చి ఉండేది. కానీ మధ్యలోనే బాబు పారిపోయారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉండాల్సిన హైదరాబాదు ఏడాదికే తెలంగాణకు ధారాదత్తం చేసేసి, తట్టాబుట్టా పట్టుకుని వెళ్లిపోయారు. ఆంధ్రమూలాల వారిని వారి కర్మానికి వాళ్లను వదిలేసి పారిపోయారు. ఇది వారిని కలవర పరిచింది.

కర్ణాటకలోని బెల్గాం (బెళగావి) జిల్లాలో మరాఠీవాళ్లు ఎక్కువ కాబట్టి బాంబే స్టేట్‌లో జరపాలని 1948 నుంచి డిమాండ్ ఉంది. కానీ స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిటీ మైసూరు స్టేట్‌లో కలపమంది. దాంతో ఆ జిల్లాలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి అనే పార్టీ ఏర్పడి, ఆ జిల్లాను మహారాష్ట్రలో కలపాలనే డిమాండుతో 1957 నుంచి ఎన్నికలలో పోటీ చేస్తూంటుంది. ప్రతీ ఎన్నికలో రెండో, మూడో స్థానాల్లో గెలుస్తుంది. ఓసారి ఐదు కూడా గెలిచింది. అంత తక్కువ సీట్లతో కర్ణాటక రాజకీయాలను ప్రభావితం చేయలేరన్న సంగతి ఓటర్లకూ తెలుసు. అయినా ఆ పార్టీకి ఓట్లేస్తూనే ఉన్నారు. 2018లో ఆ పార్టీ రెండుగా చీలి ఓడిపోయింది కానీ యిన్నాళ్లూ పట్టువిడకుండా పోరాడుతూనే ఉంది. బాబు కూడా అదే తరహాలో తెలంగాణలో ఆంధ్రమూలాల వారిని కాపాడడమే నా లక్ష్యం అని నిలబడి ఉంటే టిడిపికి స్థిరమైన ఓట్లు, సీట్లు ఉండేవి. కానీ ఆయనకు ఆంధ్ర దక్కగానే తెలంగాణ చాప చుట్టేశాడు.

అది గమనించి తెలంగాణలోని ఆంధ్రమూలాల వారు ఆశ విడిచారు. కూకట్‌పల్లిలో కూడా తెరాసను గెలిపించారు. హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలలో కూడా తెరాస పక్షాన నిలిచారు. టిడిపి నాయకులు తెరాస నాయకులై పోయారు, యిబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు బాబు ఆంధ్రలో తన ప్రయోజనాల కోసం యిక్కడికి వస్తే ఆంధ్రమూలాల వారు యీ కొమ్మ వదిలేసి ఆ కొమ్మ పట్టుకుంటారా? అది గట్టి కొమ్మేనా? మీ కోసం నిలబడతాం అని టిడిపి చెప్తుందని ఎదురుచూసి గతంలో నిరాశ చెందినవారు యిప్పుడు మళ్లీ ఆశ పడతారా? అప్పుడు దగా చేసి, హ్యేండిచ్చి వెళ్లిపోయి ‘ఇప్పుడు మళ్లీ వచ్చాను. మీరూ ఘర్ వాపసీ అంటూ పార్టీలోకి రండి’ అంటే ఎవరెళతారు? వెళితే స్థానికుల్లో ఫీలింగు రెచ్చగొట్టించుకుని కష్టాల పాలవడం తప్ప ఏం సాధిస్తారు?

ఖమ్మం టిడిపి మీటింగుకి చాలామందే వచ్చారు. వాళ్లంతా ఓట్లేసే బ్యాచేనా? తెలియదు. బాబు యథావిధిగా హైదరాబాదు తనే కట్టానని స్పీచి యిచ్చారు. కట్టారు సరే, దాన్ని నిలుపుకున్నారా? కాపాడుకున్నారా? కట్టానని చెప్పుకున్న హైదరాబాదులోనే 2004లో ఓట్లు పడలేదు. ఇప్పుడు గతం గుర్తు చేసి ఓట్లేయమంటే 2004ని గుర్తు చేసుకుంటే ఏం గతి? తెలంగాణలో ఉపయెన్నికలలో కూడా పోటీ చేయకుండా తిలోదకాలు యిచ్చేశారు. నిధులు వెచ్చించి, ఏదో ఒక రకంగా యిక్కడి కుంపటి ఆరిపోకుండా చూసుకోవాల్సింది. ఆరిపోయి మిగిలిన బూడిదలో ఎన్ని నిప్పుకణాలు దాగి ఉన్నాయో ఓపిగ్గా వెతుక్కోవాలి. వెతికి పట్టుకున్నాక, బిజెపికి మనతో పొత్తు కుదుర్చుకోవడం తప్ప వేరే గతి లేదు అని వారిని నమ్మించాలి. అప్పుడే వారు టిడిపికి తిరిగి రావచ్చు. ఇదంతా జరిగేనా? 

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2022)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?