విశాఖలో కాపునాడు సభలో వక్తలు పదేపదే ఓ మాట అన్నారు. నాలుగైదు శాతం జనాభా మాత్రమే ఉన్న వారికి సీఎం పదవి, తమకు మాత్రం రాజ్యాధికారం ఎందుకు రావడం లేదని ఆవేశంతో ప్రశ్నించారు. వారి ఆవేదన అర్థం చేసుకోవాల్సిందే. అయితే ఇదే సందర్భంలో సీఎం పదవి అనేది ఊరికే ఇంట్లోనే లేదా సొంత పనుల్లో ఉంటేనో వస్తుందని అనుకోవడం దురాశే అవుతుంది. పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా కాపునాడు సభ జరిగింది.
ఆ సభలో వక్తల ప్రసంగాలనే తీసుకుందాం. పవన్‌కల్యాణ్ కాపుల ఆరాధ్య నాయకుడిగా చూస్తున్నారు. దీన్ని ఎవరూ కాదనలేరు. ఎవరిని ఇష్టపడాలో, ఇష్టపడకూడదో వారి వ్యక్తిగతం. సీఎం కావాలని పవన్ ఏనాడైనా కోరుకున్నారా? అందరి ఆదరణను పొందేందుకు పవన్ ప్రయత్నించారా? ఎంతసేపూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సామాజిక వర్గంపై విద్వేష రాజకీయాలు చేయడమే లక్ష్యంగా పవన్ గత మూడేళ్ల రాజకీయ పంథా సాగింది.
చంద్రబాబు, వైఎస్ జగన్‌లకూ ముఖ్యమంత్రి పదవి ఊరికే రాలేదని కాపునాడు సభలో మాట్లాడిన నేతలు గ్రహించాలి. వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఇంట్లో కూచోలేదు. ఇల్లు, తల్లి, భార్యాబిడ్డల్ని వదిలేసి సంవత్సరాల తరబడి జనం మధ్యే ఉన్నారు. ఎండనక, వాననక పాదయాత్రికుడయ్యారు. ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్నారు. తానున్నానంటూ భరోసా కల్పించారు.
అధికారంలోకి వస్తే కష్టాల్ని, కన్నీటిని తుడుస్తానని మాట ఇచ్చారు. వారి నమ్మకాన్ని చూరగొన్నారు. చివరికి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ పాలనపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అధికారాన్ని పోగొట్టుకున్న చంద్రబాబు 73 ఏళ్ల వయసులో కూడా నిత్యం జనంలో ఉంటున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. వయసుతో పాటు వచ్చిన అనారోగ్య సమస్యల్ని లెక్క చేయడం లేదు. మళ్లీ మనదే అధికారమంటూ టీడీపీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తున్నారు. వైసీపీపై యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నారు.
మరి పవన్ ఏం చేస్తున్నారు? వారానికి ఒకసారి వచ్చి మొక్కుబడిగా కొందరితో కలిసి వెళుతున్నారు. వైసీపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. టీడీపీపై మాట మాత్రం కూడా విమర్శ చేయడం లేదు. టీడీపీ నుంచి ప్యాకేజీ తీసుకోవడం వల్లే చంద్రబాబును విమర్శించడం లేదని వైసీపీ ఘాటు ఆరోపణలు చేస్తోంది. పవన్‌ను ప్యాకేజీ స్టార్ అనకుండా ఏమంటారని ప్రత్యర్థులు నిలదీస్తున్నారు. మూడో ప్రత్యామ్నాయ శక్తిగా రావాలనుకున్న నాయకుడు, అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలను ఉతికి ఆరేయకపోతే… ఇలాంటి విమర్శలే ఎదుర్కోవాల్సి వుంటుంది. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడ్తానని …అది చూపితే వెనక్కి తగ్గుతారని అనుకోవడం పవన్ అజ్ఞానమే తప్ప మరొకటి కాదు.
పూర్థి స్థాయిలో రాజకీయాలు చేయకుండా, షూటింగ్‌లు లేని సమయాల్లో మాత్రమే ఏపీకి వచ్చిపోయే నాయకుడికి సీఎం సీటు ఆశించే అర్హత వుందా? అనే ప్రశ్నకు పవన్ ఏం సమాధానం చెబుతారు? అందుకే కాపునాడు నాయకులు ముందు తమ ఆరాధ్య లీడర్‌ను ముందుగా జనంతో మమేకం అయ్యేలా ప్రోత్సహించాలి. నాలుగైదు శాతం వున్న వాళ్లే సీఎం అవుతున్నప్పుడు, 15 శాతం ఉన్న తమలో నుంచి సీఎం స్థాయికి ఎందుకు ఎదగలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి. అప్పుడే సమాధానం వస్తుంది. అంతే తప్ప అధిక జనాభా ఉన్నారు కాబట్టి సీఎం పదవి దక్కాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కుదరదు. రాజ్యాధికారం అంటే అంగట్లో సరుకు కాదని గ్రహించాలి.