Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: అభ్యర్థుల మార్పు

ఎమ్బీయస్‍: అభ్యర్థుల మార్పు

రాబోయే ఎన్నికలకై వైసిపి 70 మంది దాకా అభ్యర్థులను మారుస్తుందన్న వార్త వచ్చిన దగ్గర్నుంచి ‘జగన్ బెదిరిపోయాడు, ఓటమి భయంతోనే మారుస్తున్నాడు’ అని తెలుగు మీడియా తెగ చెప్పసాగింది. అలా చెప్తూ ఉండగానే కొందర్ని మారుస్తూ వైసిపి జాబితాలు వెలువడ సాగాయి. దానితో వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరు పార్టీలు మారుతున్నారు (ఫోటో చూడండి). భగ్గుమన్నవారు జగన్‌ని తిట్టిపోస్తున్నారు. ఓటమి భయం మాట ఎలా ఉన్నా వీడి వెళ్లే అభ్యర్థుల శాపనార్థాల భయం మట్టుకు జగన్‌కు లేనట్టుంది. ఈ ధైర్యం పర్యవసానమేమిటో ఎన్నికల తర్వాతే తెలుస్తుంది. సోనియాను ఎదిరించినప్పుడు, 2014 ఎన్నికలలో బాబుకి కౌంటర్‌గా తనూ రైతు ఋణాల మాఫీ ప్రకటన చేయనని భీష్మించినప్పుడు, బాబు హయాంలో అసెంబ్లీని బహిష్కరించి పాదయాత్ర చేపట్టినపుడు అతను ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. ఈ తెగింపు లాభిస్తుందో, నష్టపరుస్తుందో యిప్పుడే చెప్పలేం.

వైసిపి ప్రక్రియ యిలా సాగుతోంది కానీ టిడిపి - జనసేన అభ్యర్థుల ప్రకటన యింకా రావటం లేదు. కూటమిలోకి ఎవరొస్తారో ఎవరు రారో యింకా తేలటం లేదు కాబట్టి వారికా యిబ్బంది. బిజెపి వస్తే దానికి ప్రిఫరెన్స్ అని బాబు చూస్తున్నారు కానీ అది ఎటూ తేల్చకుండా నానుస్తోంది. రానని అది ఒక్కమాట చెప్పేస్తే అప్పుడు టిడిపి-జనసేన కూటమిలోకి లెఫ్ట్, వీలైతే కాంగ్రెసు చొరబడతాయి. భాగస్వాములు తేలితే సీట్లు ఎక్కడెక్కడో చర్చకు వస్తాయి. అప్పుడు అభ్యర్థుల ప్రకటన, అసంతృప్తులు, ఫిరాయింపులు వగైరా, వగైరా...!

ఈ క్రమంలో కూటమి అభ్యర్థులను కూడా మారుస్తారు. వైసిపి ఎవర్ని పెట్టిందో చూసుకుని వారిని ఎదుర్కోగల అభ్యర్థి కులం, సామర్థ్యం, యిమేజి వగైరాలు పరిగణనలోకి తీసుకుని అప్పుడు నిర్ణయిస్తారు తప్ప, గతంలో ఫలానావారికి టిక్కెట్టిచ్చాం కాబట్టి, యీసారీ వాళ్లకే యిద్దాం అనుకోరు. అందువలన అభ్యర్థుల మార్పు వారికీ తప్పని ప్రక్రియ. ఏ స్థాయిలో ఉంటుంది అనేది ముందుగా ఎవరూ చెప్పలేరు. ఇవాళ వైసిపి కానీ, రేపు కూటమి కానీ తన అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఓటమి భయంతో చేసింది అనడానికి వీల్లేదని నా ఉద్దేశం. ఇటీవలి ట్రెండు ఏమిటంటే, అధికారంలో ఉన్న పార్టీ దాదాపు 25శాతం దాకా అభ్యర్థులను మారుస్తోంది. ఎల్లెడలా బలంగా ఉన్న బిజెపి కూడా అదే పని చేస్తోందంటే దాని అర్థం అది ఓడిపోతోందని భయపడుతున్నట్లు కాదుగా!

పాతదాన్నే కొత్తగా చూపించడం మార్కెట్ ట్రెండ్. అమృతాంజనం ఉంది, కోల్గేట్ టూత్‌పేస్ట్ ఉంది, తరతరాలుగా అమ్ముడు పోతున్నాయి. అయినా మార్కెట్లోకి కొత్త ఉత్పాదన వచ్చి వాళ్ల సేల్స్ తగ్గాయనుకోండి, వెంటనే కొత్త అమృతాంజనం అంటూ పబ్లిసిటీ యిస్తారు. ఏమిటి కొత్త అంటే రంగు మారుస్తారు. టూత్‌పేస్ట్ కైతే కొత్తగా ఉప్పు కలిపామంటారు, కర్పూరం కలిపామంటారు. కొన్నాళ్లకు యీ ‘కొత్త’ పాత పడిపోతుంది. అప్పుడు ‘సరికొత్తగా..’ అనే పదం వాడతారు. పేస్టయితే ‘మరింత తాజాగా..’ అంటారు, అప్పుడే తయారు చేసి పట్టుకుని వచ్చినట్లు! సినిమాల విషయంలో చూడండి, ప్రతీదానికీ కథను కొత్తగా చెప్పాం అంటారు, హీరోను డిఫరెంటుగా చూపించాం అంటారు, తరతరాలుగా ఉన్న ప్రేమ సమస్యనే కొత్త కోణంలో చూపాం అంటారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్న పద్ధతే యిది. అందుకే ‘ఓల్డ్ వైన్ యిన్ న్యూ బాటిల్’ అనే సామెత పుట్టింది.

రాజకీయ పార్టీల విషయానికి వస్తే ప్రజలకు అతి త్వరగా బోరు కొట్టేస్తారు. మన దగ్గర ఫర్వాలేదు కానీ కొన్ని రాష్ట్రాలలో ప్రతి ఐదేళ్లకూ పాలకులను దింపేస్తూంటారు. ఎంత బాగా పాలించినా ఏం లాభం, ఐదేళ్లలో ఎలాగూ దింపేసే కాడికి అనే నిస్పృహ తెచ్చుకోకుండా మళ్లీ ఎన్నిక కావడానికి వాళ్లు శతథా ప్రయత్నిస్తారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చడం, ఎన్నికలకు ముందు కొత్త పథకాలు ప్రకటించడం, యీసారి అభ్యర్థులలో ఎక్కువగా మహిళలను, యూత్‌ను తెచ్చామనడం.. యిలాటి గిమ్మిక్స్ వేస్తారు. ప్రాంతీయ పార్టీలైతే అధ్యక్షుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి అతను మారకుండా చుట్టూ ఉన్న ముఖాలను కాస్త మార్చి ప్రజల ముందుకు వస్తాడు.

హీరోలు చూడండి, 50 దాటినా యంగ్ కారెక్టరు వేస్తారు. వాళ్లెలాగూ వయసు మీరిన వారే, అందుకని యూత్‌ఫుల్‌ అనిపించడానికి 20 ఏళ్ల వయసున్న హీరోయిన్‌ను పెట్టుకుంటారు. రెండు సినిమాలయ్యేసరికి పాతపడి పోయింది అంటూ ఆమెను మార్చేస్తారు. తనను కొత్త లుక్‌తో చూపించడానికంటూ మరో దర్శకుడికి ఛాన్సిస్తారు, పాత డైరక్టరు హిట్ యిచ్చినా! కమెడియన్‌ను మారుస్తారు, కారెక్టరు ఆర్టిస్టులను మారుస్తారు. ఫ్రెష్‌నెస్ ఫీలవడానికి తనని తప్ప తక్కినందర్నీ మార్చమంటాడు. రాజకీయ నాయకులూ అంతే. మూలవిరాట్టు మారకుండా చుట్టూ ఉన్నవారిని మార్చి తమను తాము కొత్తగా ప్రెజంటు చేసుకుంటారు. పికె-లోకేశ్ ఆర్టికల్‌లో రాశాను. ఇందిరా గాంధీ కాంగ్రెసుకు కొత్త లుక్ ఎలా యిచ్చిందో! ఎన్టీయార్ 60 దాటినవాడు. కానీ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలందరూ యువతీయువకులు. లేస్తే కూర్చోలేని వృద్ధనాయకులున్న కాంగ్రెసుతో పోలిస్తే యిది యూత్‌ఫుల్ పార్టీగా ఓటర్లకు కనబడింది. గెలిపించారు.

పేకాటలో చూడండి. చేతిలో ఉన్న పేకముక్కలతో ఆట ముందుకు సాగకపోతే సెట్టు మారుద్దామని చూస్తాం. ఇక్కడి ముక్క అక్కడ పెట్టి, అక్కడిది యిక్కడకి తెచ్చి సంఖ్యాపరంగానో, గుర్తుపరంగానో  కొత్త సెట్టు కడదామని చూస్తాం. అప్పటికీ అనుకున్న ముక్క రావడం ఆలస్యమైతే చేతిలో ఉన్నవి ఒక్కోటి పడేసి, కొత్త ముక్కలు సేకరిస్తూ కొత్త సెట్టు ఏర్పాటు చేయడానికి చూస్తాం. ఈలోగా అవతలివాడికి అదృష్టం బాగుండి, సరైన ముక్కలు పడి, షో చేస్తే మనది కౌంటే. వాడి అదృష్టమూ మనలాగానే ఉంటే మన ఓపిక ఒక్కోప్పుడు ఫలిస్తుంది. పేక ముక్కలైతే పడేసినా నోరు పెట్టుకుని నిరసన తెలపవు. కానీ రాజకీయ సహచరులు అలా కాదు. విరుచుకు పడతారు.

టిక్కెట్టు దక్కని నాయకుడికి ఆక్రోశం ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టి తమ నాయకుడి లోపాలన్నీ ఏకరువు పెడతారు. అతనితో పని చేస్తూన్నంత కాలం ఉక్కిరిబిక్కిరి అయ్యాననీ, తన పట్ల మర్యాద చూపలేదనీ, ప్రజలకు ఎలా ద్రోహం చేస్తున్నామో చెపుదామంటే ఎపాయింట్‌మెంట్ యివ్వలేదనీ, పార్టీలో లోపాలను చర్చించడానికి వేదిక కల్పించలేదనీ చెప్పుకుంటాడు. టిక్కెట్టు యివ్వనప్పుడే యివన్నీ గుర్తుకు వచ్చాయా, యిన్నాళ్లూ చెప్పలేదేం? అని అడిగితే నియోజకవర్గ ప్రజల కోసం ఓర్చుకున్నానని చెప్తారు. రెబెల్‌గా పోటీ చేసి ఓట్లు చీలుస్తామని బెదిరిస్తారు. కొందరు అంత పనీ చేస్తారు కూడా. నెగ్గిన రెబెల్స్‌ను పార్టీ మళ్లీ చేర్చుకుంటూంటుంది కూడా. ఇన్ని తిట్లూ తిట్టిన వీళ్లు నిస్సిగ్గుగా అదే పార్టీలో తిరిగి చేరతారు.

ఈ అసమ్మతి బెడద విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న పార్టీలో తీవ్రంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో బిజెపి యీ సమస్య పలు రాష్ట్రాలలో ఎదుర్కుంటోంది. నడ్డా బుజ్జగింపు మాటలు పని చేయకపోవడంతో ప్రతీ చోటికి అమిత్ షా వెళ్లి అసమ్మతి వాదులను బెదిరించి విత్‌డ్రా చేయిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన కేంద్ర హోం మంత్రి కూడా కాబట్టి చాలామంది లొంగుతున్నారు. కెసియార్ 40 మంది ఎమ్మెల్యేలను మారుద్దామనుకుని కూడా వాళ్లు తిరగబడతారు, లేదా యితర పార్టీల్లోకి వెళ్లి, పార్టీ మొరేల్ దెబ్బ తీస్తారు అని భయపడ్డారు అంటారు. అంతకంటె వీళ్లనే మళ్లీ నిలబెట్టి రిస్కు తీసుకుందాం, నా యిమేజే వీళ్లకి శ్రీరామరక్ష అనుకుని ముందుకు వెళ్లారు. ఫలితం అందరికీ తెలుసు. మార్చినా రిస్కే, మార్చకపోయినా రిస్కే. నాయకుడు ఏదో ఒక రిస్కు తీసుకోక తప్పదు. దాని ఫలితం ఏమిటో ఎన్నికల తర్వాతే తేలుతుంది. ఫలితం కూడా రాష్ట్రమంతా ఒకేలా ఉండాలని లేదు. అక్కడున్న అభ్యర్థి బట్టి, పోటీగా నిలిచిన ప్రతిపక్ష అభ్యర్థి బట్టి, ఓవరాల్‌గా అధికార పార్టీ పట్ల పబ్లిక్ మూడ్ బట్టి ఉంటుంది.

జగన్ విషయానికి వస్తే అతను కొందరు అభ్యర్థులను మార్చడం అనివార్యం. 2019 ఎన్నికలలో బాబు ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నా వైసిపికి 120 సీట్ల కంటె ఎక్కువగా వచ్చే పరిస్థితి కాదు. కానీ ఒక వేవ్‌లా వచ్చి 151 వచ్చి పడ్డాయి. వెల్లువ వచ్చినపుడు చెత్త కూడా కొట్టుకుని వస్తుంది. ఇందిర ప్రభంజనం, ఎన్టీయార్ ప్రభంజనం టైములో చూశాం. చదువురాని వాళ్లు, ప్రజల్లోకి ఎప్పుడూ వెళ్లనివారూ కూడా నెగ్గేసి ఎమ్మెల్యేలు అయిపోయారు. ఇలాటి ఉప్పెన వచ్చినపుడు అభ్యర్థి ఎవరని చూడకుండా పార్టీ గుర్తుపై ఓటర్లు గుద్దేస్తారు, యిప్పుడైతే నొక్కేస్తారు. అలా యీ 151లో ఓ 30 మంది రిఫ్‌రాఫ్ కూడా నెగ్గేసి ఉంటారు. ఈసారి వేవ్ ఉండే సూచనలు లేవు కాబట్టి యీ 30 మందీ మళ్లీ గెలవకపోవచ్చు.

ఇంతవరకు లాజిక్ బాగానే ఉంది కానీ, ఆ రిఫ్‌రాఫ్ 30 మంది ఎవరు అనేది తేల్చడమే కష్టం. 2019లో బలహీనంగా ఉన్న ఎమ్మెల్యే గత ఐదేళ్లలో ప్రజలను మెప్పించి బలవంతుడై ఉండవచ్చు. అదే విధంగా అప్పుడు బలంగా ఉన్నవాడు ప్రజలతో సంపర్కం పెట్టుకోకుండా బలహీన పడి ఉండవచ్చు. వేవ్ ఉంటే తప్ప, ఎన్నికలలో అన్నీ సమకూరాలి. ముఖ్యమంత్రి సమర్థ పాలన, స్థానిక ఎమ్మెల్యే పట్ల ఆదరణ రెండూ జతపడితేనే అభ్యర్థి గెలుస్తాడు. ఎవరిలో లోపం ఉన్నా ఓటు పడదు. కెసియార్ హేట్రిక్ అనే నా వ్యాసం చదివి ఒక మిత్రుడు ఫోన్ చేసి ‘మీరు చెప్పినట్లు కెసియార్ ఇండస్ట్రీ, యిరిగేషన్, వైద్యం విషయంలో చాలా చేశాడు. కానీ మాకు యిక్కడి కాండిడేటు దానం నాగేందర్. పోయిపోయి అతనికి ఓటేయాలంటే నాకు మనసు ఒప్పటం లేదు. అందుకని నోటాకే నా ఓటు.’ అన్నాడు. అధినేత పాలన పట్ల వ్యతిరేకత ఉంటే మంచి అభ్యర్థి కూడా ఓడిపోతాడు.

జగన్ తన పాలన బాగానే ఉందనే అభిప్రాయంతో ఉన్నాడు కాబట్టి, అభ్యర్థులను మారిస్తే మళ్లీ గెలవవచ్చనే అభిప్రాయ పడుతున్నాడు. ‘మార్చవలసినది జగన్ని! కింది ఎమ్మెల్యేలను మారిస్తే ఏం లాభం? అసలు ఎమ్మెల్యేలకు అధికారం ఎప్పుడు యిచ్చాడు కనుక! వాళ్లంతా నిమిత్తమాత్రులు, తోలుబొమ్మలు కదా, తప్పు వాళ్ల మీద నెట్టేసి తను తప్పించుకుందామని చూస్తున్నాడు’ అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ‘మేం బాగా పని చేయకపోతే మధ్యలో పిలిచి చెప్పాలి కదా, అసలు మమ్మల్ని కలవనే లేదు, యిన్నాళ్లూ మా చేతులు కట్టేసి ఉంచి, యిప్పుడు ఐ ప్యాక్ వాళ్ల అబద్ధపు సర్వే నమ్మి, మాకు అన్యాయం చేస్తున్నాడు.’ అని టిక్కెట్లు దక్కనివాళ్లు ఆక్రోశిస్తున్నారు.

సుమారు రెండేళ్లగా యీ మార్పు మాట వినబడుతోంది. గడపగడపకు వెళ్లకపోతే కుదరదని, ప్రజలకు అసంతృప్తి ఉన్న చోట మార్చవలసి వస్తుందని, మార్చినా మీరంతా నా వారేనని జగన్ చెప్తూ వచ్చాడు. గడపగడప కార్యక్రమంలో పాలు పంచుకోమంటే కొందరు యింటి గడప దాటలేదని, జగన్ ఆగ్రహించాడనీ వార్తలు వచ్చాయి. వెళ్లినవారు కొందర్ని ప్రజలు నిలదీశారని కూడా ఎబిఎన్ చెప్పింది. ఇక ఎమ్మెల్యేలను కలవడం గురించి, ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ ఉపన్యసించే ఫోటోలు చూశాను. బహుశా ఒన్ ఆన్ ఒన్ సమావేశాలు జరపలేదేమో. ఏకాంత సమావేశాల్లో తమ కోర్కెల లిస్టు బయటకు తీస్తారన్న భయమేమో జగన్‌కు. తమను జగన్ యిన్నాళ్లూ డమ్మీలుగా, పూచికపుల్లలుగా చూస్తూ వచ్చాడని ఫీలయ్యేవాళ్లు ‘హమ్మయ్య, టిక్కెట్టు యివ్వలేదు, యికపై యీ దురవస్థ లేదు. హాయిగా దర్జాగా బతకవచ్చు. ఎన్నికల ఖర్చూ మిగిలింది.’ అని సంతోషించి ఊరుకోకుండా పబ్లిక్‌ లోకి వచ్చి ఫిర్యాదు చేయడమెందుకో నాకు అర్థం కావటం లేదు. జగన్ వ్యవహార శైలి నచ్చకపోతే రెండేళ్ల క్రితమే పార్టీ వీడి టిడిపిలోనో, జనసేనలోనో చేరాల్సింది. జగన్ పద్ధతి బాగా లేదనీ, తమ పార్టీకి ఓటమి తప్పదనీ యిప్పుడే తెలియడం ఆశ్చర్యంగా లేదూ!

పాలకుడెప్పుడూ తన యిమేజి కాపాడుకుందామని చూస్తాడు. చిన్నపుడు చందమామ కథ చదివాను. పన్నులు విధించేటప్పుడు మంత్రి చేత విధింప చేస్తారని, మినహాయింపులో, ఎత్తివేతలో చేసేటప్పుడు రాజుగారి చేత ప్రకటింప చేస్తారనీ ఆ కథ. ప్రజలంతా మంత్రి దుర్మార్గుడని తిట్టుకుని, రాజుగారు ఉదారహృదయుడని మెచ్చుకోవడానికి యిది అవసరం. ఈ ధోరణి యిప్పటికీ చూస్తాము. గతకాలపు మంత్రి యిప్పటి ఐఏఎస్ అధికారి, అప్పటి రాజు, యిప్పటి మంత్రి లేదా ముఖ్యమంత్రి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల్లో వ్యతిరేకత రగిలిస్తోందని గ్రహించగానే అనుకూల మీడియా వారు ముఖ్యమంత్రికి అధికారులు చెడు సలహాలు యిచ్చి పెడదోవన పట్టిస్తున్నారని విమర్శించి ముఖ్యమంత్రి యిమేజి కాపాడతారు. సాంకేతిక నిపుణులతో కూర్చుని అధికారులు ఏదైనా పెద్ద ప్రాజెక్టు తయారు చేసి పెడితే దాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రిది దూరదర్శనం, ప్రపంచపు భవిష్యత్తు చూడగలిగే దివ్యదృష్టి అని రాస్తారు.

రాజుల కాలం నాటి విప్పింగ్ బాయ్ కాన్సెప్ట్ వినే వుంటారు. యువరాజు విద్యార్థిగా ఉండగా తప్పు చెపితే టీచరు యువరాజును కొట్టకూడదు కాబట్టి, దెబ్బలబ్బాయిగా నియమించ బడిన మరో కుర్రాణ్ని కొట్టేవారు. ఓహో నేను తప్పు చేశానన్నమాట అని యువరాజు గ్రహించాలి. ఆధునిక కాలంలో యీ దెబ్బలబ్బాయిలు చాలామంది తయారయ్యారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. యిలా ఎవరినైనా సరే బలి వేసి, పెద్ద తలకాయను కాపాడుకుంటారు. బాబు ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉండే రోజుల్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పదేపదే ‘అధికారులు, జన్మభూమి కమిటీల వారు, ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారు. బాబు దృష్టికి దీన్ని ఎవరూ తీసుకుని వెళ్లటం లేదు’ అని రాసేవారు. గుంపులో వారంతా దొంగలే కానీ వారి నాయకుడు మాత్రం మంచివాడు అన్నట్లుంటాయి యిలాటి రాతలు. పోనీ యీ వ్యాసం ద్వారా బాబు దృష్టికి వచ్చి ఉంటుందిగా, ఆ తర్వాత ఆయనేమైనా చర్యలు తీసుకున్నారా? అంతా ప్రతిపక్షాల దుష్ప్రచారం అని కొట్టి పారేశారు.

చెప్పవచ్చేదేమిటంటే, యిప్పుడు జగన్ కూడా తన పాలనావైఫల్యాలను కొందరు ఎమ్మెల్యేలపై రుద్దేసి, తన యిమేజి కాపాడుకోవడానికి యీ మార్పులు చేస్తూండవచ్చు. 

అన్నిటికంటె ముఖ్యం తన పార్టీలో ఎవరూ బలపడకుండా చూడడం. సాంప్రదాయకంగా నడుస్తూ వచ్చిన రాజకీయాలు ఎలా ఉంటూ వచ్చాయంటే, ఒకడు మొదటిసారి ఎమ్మెల్యే అవుతాడు. నెగ్గాడు కదాని రెండోసారి టిక్కెట్టు యిస్తారు. సహాయ మంత్రి పదవి అడుగుతాడు, మూడోసారీ నెగ్గితే కాబినెట్ పదవి అడుగుతాడు. ఇవ్వకపోతే అసమ్మతి అంటాడు, యీలోగా డబ్బూ, దానితో పాటు కొందరు ఎమ్మెల్యేలనూ కూడగట్టుకుని ఉంటాడు కాబట్టి బ్లాక్‌మెయిల్ చేస్తాడు. అతని కంటూ లాబీ ఏర్పడుతుంది. నియోజకవర్గంలో ఎవర్నీ ఎదగనివ్వడు. 20, 25 ఏళ్లు యిలా ఏలిన తర్వాత యిక తప్పుకో, యువతరానికి టిక్కెట్టిద్దాం అంటే సరే దీన్ని మా అబ్బాయికి యిచ్చి, పక్క నియోజకవర్గం నాకివ్వండి అంటాడు. కుదరదంటే యిన్నాళ్లూ జండా మోసాను కదా అంటాడు. అనుకూల మీడియా చేత పార్టీ అధినాయకత్వం తప్పు చేస్తోందని రిపోర్టు రాయిస్తాడు. ఇలా కొందరే రాజకీయాల్లో పాతుకుపోతూ వచ్చారు.

దీన్ని మార్చి కొత్త రక్తాన్ని తేవాలని రాజీవ్ గాంధీ ప్రయత్నించాడు. కొంతమేరకే సక్సెసయ్యాడు. సోనియా వచ్చాక మళ్లీ పాతతరమే ఏలింది. రాహుల్ గాంధీ కొత్త కోసం ప్రయత్నించాడు కానీ సోనియా పడనివ్వటం లేదు. తెలుగునాట ఎన్టీయార్ కొత్త రక్తం తెచ్చారు. కొన్నాళ్లకు అది పాతబడింది. బాబు వాళ్లనే కంటిన్యూ చేస్తున్నారు. చిరంజీవి కొత్తవాళ్లకు అవకాశం యిచ్చేవారేమో కానీ కాంగ్రెసు, టిడిపి వాళ్లే అందులో దూరారు. జగన్ పార్టీ పెట్టినపుడు కాంగ్రెసు వాళ్లే వచ్చారు. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోలేదు. గెలుపు గుఱ్ఱాలంటూ టిడిపి వారినీ తీసుకున్నాడు. వీళ్లందరికీ పాత ఖాతాలున్నాయి. ఇప్పుడు బలపడ్డా ననుకుంటున్నాడు కాబట్టి కొత్త నాయకత్వాన్ని, తనకు మాత్రమే విశ్వాసపాత్రంగా ఉంటారనుకున్న వారిని తయారుచేసే ప్రయత్నంలో పడ్డాడు. దీనికి గాను కులసమీకరణాలు మారుద్దా మనుకుంటున్నాడు.

జనాభాలో తక్కువే అయినా రాజకీయాల్లో కీలకంగా ఉంటే రెడ్డి, కమ్మ కులాల ప్రాధాన్యత తగ్గించి, కొత్త కులాలను ముందుకు తోసి రాజకీయ వాతావరణాన్ని అతలాకుతలం చేయాలని జగన్ ప్లాను. తమిళనాట డిఎంకె బిసిలను అధికారంలోకి తెచ్చింది. అది చూసి ఎన్టీయార్ ఆధిపత్యం కమ్మల చేతిలో ఉంచుకుని, సంఖ్యాబలం ఉన్న బిసిలకు అధికారంలో వాటా యిచ్చి వారిని వెన్నుదన్నుగా నిలుపుకున్నాడు. టిడిపికి అది బలమైన ఓటు బ్యాంకుగా ఉంది. టిడిపిని బలహీన పరచడానికి, జగన్ ఆ పార్టీ కమ్మ, బిసిలలో విభేదాలు తేవడానికి కమ్మలపై వైరం పూని, బిసిలను చేరదీస్తూ రాజకీయం చేస్తున్నాడు. ఇలాటి ‘సోషల్ ఇంజనియరింగ్’ లోహియా వాదులు ఉత్తరాదిన ఎప్పుడో చేశారు. కర్ణాటకలో దేవరాజ్ అరసు బిసి థియరీ, గుజరాత్‌లో మాధవసింహ్ సోలంకీ ఖామ్ థియరీ, యుపిలో ములాయం, బిహార్‌లో లాలూ ఎంవై థియరీ.. యిలా ఎన్నో చూశాం.

బిసి ఏకశిలను కదల్చడానికి బిజెపి బిసిలలో యాదవేతర కులాలను విడిగా లాక్కుని వచ్చి, విజయం సాధించింది. ఎస్సీలలో కూడా ఉపకులాలను చీల్చి, వారి ఓట్లూ తెచ్చుకుంది. జగన్ కూడా యిప్పటిదాకా ప్రాతినిథ్యం లేని బిసిలను గుర్తించి, వారికి కార్పోరేషన్లు పెట్టి, పదవులిచ్చి రాజకీయంగా వారికి చైతన్యం కలిగిస్తున్నాడు. తన వెనుక ఉన్న రెడ్లు తిట్టుకుంటున్నా, చాలా చోట్ల బిసిలకు టిక్కెట్లు యిస్తున్నాడు. రెడ్లకు ప్రత్యామ్నాయం ఏముంది? ఇతన్ని కాదంటే కమ్మ ఆధిపత్యంలోని టిడిపి కూటమి చెంత చేరాలి. బిసిలకు టిక్కెట్లు యివ్వడం వలన ఆ వర్గాల ఆర్థికస్థితి మెరుగుపడి పోతుందని నేనటం లేదు. అలా అయితే ఎన్టీయార్ 1983లో చేసిన మార్పులకే గత 40 ఏళ్లలో వారందరూ బాగుపడి పోయి ఉండాలి. ఇప్పుడు జగన్ చేస్తున్న మార్పులు ఫలితాల నిస్తే, వారికి రాజకీయ ప్రాధాన్యత పెరిగి, రెడ్డి, కమ్మల సరసన కూర్చోగలుగుతారు.

బిసిలను ‘ఉద్ధరించే’ క్రమంలో కాపులను కాపాడుకోవలసిన అవసరం జగన్‌కు ఉంది. 2014-19 మధ్యలో బాబు బిసి, కాపుల మధ్య ఊగిసలాడి రెంటికి చెడ్డ రేవడి అయ్యారు. జగన్ ప్రయోగం వికటిస్తే రెడ్డి, బిసి, కాపు అందరూ దూరమౌతారు. కానీ రిస్కు తీసుకోక తప్పదు. మధ్యతరగతి వారు, అగ్రవర్ణస్తులు జగన్ పట్ల విసుగు చెంది ఉన్నారు. ఆ వర్గాల నుంచి 2019లో పడిన ఓట్లు యీసారి పడకపోవచ్చు. దాన్ని భర్తీ చేసుకోవాలంటే యీ రిస్కు తీసుకోక తప్పని పరిస్థితి. ప్రజారాజ్యం బిసిలకు హెచ్చు స్థాయిలో టిక్కెట్లిచ్చి నష్టపోయింది. కులగణన, టిక్కెట్ల పంపిణీ అంటూ జగన్ బిసిలకు ప్రాధాన్యత పెంచుతున్నాడు తప్ప యితరులను వదిలిపెట్టటం లేదు. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా బిజెపి కూడా బిసి మంత్రం పఠిస్తోంది. ఇది బిసి సీజను.

జగన్ ఎంపీలను ఎమ్మెల్యేలుగా నిలబెట్టడం బిజెపిని చూసి చేస్తున్నట్లుంది. బిజెపి అనేక ప్రయోగాలు చేస్తోంది. హరియాణాలో నాన్-జాట్‌ను ముఖ్యమంత్రిని చేసింది. యుపిలో అనూహ్యంగా యోగి ఆదిత్యనాథ్‌ను చేసింది. ఇప్పుడు ఉత్తరాదిన నెగ్గిన మూడు రాష్ట్రాలలోనూ ముఖ్యమంత్రులను మార్చేసింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో చేసిన ముఖ్యమంత్రి మార్పులు కలిసి రాకపోయినా, కొత్త ప్రయోగాలు చేయడం మానలేదు. జగన్ కూడా యిలాటి ప్రయోగమే చేస్తున్నాడు. మంత్రి పదవులు యిచ్చినపుడే సగకాలం మాత్రమే మీరుంటారు, తర్వాతి సగం కొత్తవాళ్లకు ఛాన్సిస్తాను అని చెప్పాడు జగన్. మధ్యంతరంగా పదవులు పోయినవాళ్లు తిరగబడతారు అనుకున్నాం. కానీ అది జరగలేదు. దాంతో యితనికి ధైర్యం పెరిగినట్లుంది. ప్రస్తుతం చేస్తున్న మార్పుల వలన వచ్చే అలజడులు, తిరుగుబాట్లు తట్టుకుంటాననే ధీమాతో ముందుకు సాగుతున్నాడు. ప్రయోగ ఫలితాల కోసం కొన్ని నెలలు ఆగాలి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2024)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?