Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీమూలం: పెళ్లినాటి ప్రమాణాలు -1/2

ఒక్కొక్కప్పుడు మూలకథను తీసుకుని కాస్త అక్కడా యిక్కడా సర్దేసి తెలుగు సినిమాకు ఎడాప్ట్‌ చేసేసుకుంటాం. భారతీయ చిత్రాలకైతే యీ పద్ధతి చెల్లిపోతుంది. అదే హాలీవుడ్‌ సినిమా ఆధారంగా కథ తయారుచేయాలనుకోండి, చచ్చేటంత కష్టం. వాళ్ల జీవనవిధానం వేరు, మన విధానం వేరు. అసలు వేల్యూ సిస్టమ్‌లోనే తేడా వుంది. వాళ్లకు ఒప్పయినది మన సాంఘిక పరిస్థితుల దృష్ట్యా తప్పవుతుంది. అయితే - యిక్కడ గుర్తించవలసిన దేమిటంటే - మౌలికంగా ప్రపంచంలోని మనుష్యులందరం ఒక్కటే! రాగద్వేషాలు, భావోద్వేగాలు, సెంటిమెంట్స్‌, బలహీనతలూ ఒక్కటే. అందుకే  యితర భాషారచనలను సైతం మనం ఆస్వాదిస్తాం. చిత్రాలను ఆదరిస్తాం. అందుకని విదేశీ గడ్డమీద తయారైన ఓ సెక్స్‌కామెడీని తీసుకుని తెలుగులో సంసారపక్షంగా తీస్తే ఆదరించాం. ఆశ్చర్యంగా వుందా? ఆ సంసారపక్షమైన సినిమా తీసిన వ్యక్తి కెవి రెడ్డిగారని చెపితే యింకా ఆశ్చర్యపోతారేమో! ఆ సినిమా పేరు ''పెళ్లినాటి ప్రమాణాలు'' 1958 నాటిది. దానిలో పెళ్లి సమయంలో వధూవరులిరువరి చేత ప్రమాణాలు చేయిస్తూ పెళ్లి చేయించిన పెద్దమనిషి, పెళ్లయిన కొన్నాళ్లకు సాధారణంగా మొగవాళ్లకు ప్రేమగండం వస్తుంది, జాగ్రత్తగా వుండాలి సుమా అని హెచ్చరిస్తాడు. హీరోకు యీ ప్రేమగండాన్ని సృష్టించడానికి రచయితకు ప్రేరణ కలిగించినది ఓ హాలీవుడ్‌ సినిమా ''సెవెన్‌ యియర్‌ యిచ్‌'' అనే  సినిమా. ప్రఖ్యాత శృంగార తార మార్లిన్‌ మన్రో నటించిన సెక్స్‌ కామెడీ యిది. మార్లిన్‌ మన్రో గౌను ఎగిరిపోయే ఫోటో చూసి వుంటారు. ఆ సీను ఆ సినిమాలోనిదే. 

 ఇలాటి సినిమా లోంచి నాగేశ్వరరావు, జమున నటించిన సకుటుంబ చిత్రం తయారు చేశారంటే నమ్మగలమా? కానీ స్టోరీ ఐడియా మాత్రం తీసుకున్నారని చక్కగా తెలుగైజ్‌ చేశారని నేనంటాను. మొదట ''సెవెన్‌ ఇయర్‌ యిచ్‌'' గురించి చెప్పేస్తాను. 1955 నాటి యీ సినిమాను డైరక్టు చేసినది బిల్లీ వైల్డర్‌. దీనిలో ప్రధానమైనవి రెండే పాత్రలు. పురుషపాత్ర వేసినది టామ్‌ ఎవెల్‌. స్త్రీపాత్ర వేసినది మార్లిన్‌ మన్రో. హీరో, హీరోయిన్‌ అనకుండా మగ, ఆడ అంటున్నాడేమిటి? అనుకుంటున్నారా? అదే మరి తమాషా! పెళ్లయిన మగవాడి బలహీనత గురించే కథంతా. దీనిలో వున్న ప్రధానపాత్రలు భార్యాభర్తలు  కారు. ఓ యింటాయన, అతని పక్కవాటాలో అద్దెకుండే అమ్మాయి. నిజానికి యిది ఓ స్టేజ్‌ డ్రామా. దాన్ని సినిమాగా మలచారు. అందుకని ఎక్కువభాగం ఓ గదిలోనే సాగుతుంది. ఆది నుండి వ్యంగ్యంతోనే సాగుతుంది. మన బలహీనతలను చూసి మనం నవ్వుకోగలిగితే చాలు.

'మాన్‌హట్టన్‌ వాసులు గతకాలంలో ఓ పద్ధతి పాటించేవారు. వేసవిలో వేడి తట్టుకోలేరని భార్యాబిడ్డలను చల్లని ప్రాంతాలకు పంపేసి, తాము మాత్రం ఉద్యోగం చేసుకుంటే అక్కడే వుండేవారు. అయితే భార్యాబిడ్డలు అలా ఓడ ఎక్కగానే యిక సందడే సందడి. రోజులు మారాయి కానీ మగవాడి స్వభావం మారలేదు' అనే వాయిస్‌ ఓవరుతో పాత కాలం రెడ్‌ ఇండియన్స్‌ను చూపించి కథ ప్రారంభం చేసి రైల్వే స్టేషన్‌లో భార్యను, పిల్లవాడిని రైలెక్కిస్తున్న హీరోను చూపిస్తారు. హీరో పేరు రిచర్డ్‌. ఊళ్లో వేడి ఎక్కువగా వుందని భార్యను, పిల్లవాడిని ఓ రిసార్టుకి పంపిస్తున్నాడు. ఉద్యోగం వదలలేడు కాబట్టి తను వూళ్లోనే దిగడ్డాడు. వాళ్లావిడ జాగ్రత్తలు చెపుతోంది. వేళకు తిండి తినమని, సిగరెట్లు తాగవద్దని, మందు కొట్టవద్దనీ.. యిలా. అన్నిటికీ వూకొడుతూనే వున్నాడు. ఈ హడావుడిలో పిల్లవాడి బేస్‌బాల్‌ ప్యాడిల్‌ వాడికివ్వడం మర్చిపోయాడు. మన హీరోగారి వుద్యోగం ఓ పుస్తకాల కంపెనీలో. చవకరకం పుస్తకాలు పబ్లిష్‌ చేసే ఓ ప్రచురణ సంస్థలో సర్వం తానై పనిచేస్తాడు. చవక అంటే ధరలో మాత్రమే కాదు, మనిషిని రెచ్చగొట్టే పుస్తకాలు వేస్తారు వీళ్లు. దానికి తగ్గట్టుగా ముఖచిత్రాలు కూడా వుండాలి మరి. ఉద్యోగధర్మంగా సెక్సీ బొమ్మలు వేస్తున్నా హీరో ప్లేబాయ్‌ కాదు, పోకిరీ వేషాలు వేసే బాపతు కాదు. సెక్రటరీ మిస్‌ మోరిస్‌తో కూడా మర్యాదగానే వుంటాడు!

ఆ రోజు ఆఫీసులో పని ముగించుకుని ఓ సామాన్యమైన హోటల్లో వెజిటేరియన్‌ భోజనం చేసి యిల్లు చేరాడు. భార్య లేని యిల్లు హాయిగా అనిపించింది. వంటింట్లోంచి వాసనలు, 'ఇవాళ ఆఫీసులో ఏం చేశావ్‌, డియర్‌?' అనే పిచ్చిప్రశ్నలు లేవు. హేపీగా ఏ డిస్టర్బెన్సు లేకుండా యింట్లో ఆఫీసు పని చేసుకోవచ్చు అనుకుంటూ అచ్చు వేయవలసిన పుస్తకం మ్యానుస్క్రిప్టు చేతిలోకి తీసుకుని నడుస్తూ వాళ్ల పిల్లాడు నిర్లక్ష్యంగా పడేసిన స్కేటర్‌ కాలికింద పడి జారి పడ్డాడు. ఇది సింబాలిక్‌ షాట్‌ అనిపిస్తుంది, అదేక్షణంలో అతని జీవితంలో పై వాటా అమ్మాయి ప్రవేశించడంతో. వీళ్లిద్దరికీ ఒకటే లాబీ. దానిలోకి వచ్చే తాళం చెవి పారేసుకుంది కాబట్టి ఆ అమ్మాయి బెల్లు కొట్టి యితన్ని పిలిచింది. ఇక్కడ హీరో మానసిక స్థితిని పరిశీలిద్దాం. అతను మధ్యవయస్కుడు, అందగాడు కాడు. ఏడేళ్లగా కాపురం చేస్తూ చేస్తూ అతని జీవితంలో ఓ స్తబ్ధత ఏర్పడింది. తనమీద తనకు నమ్మకం సడలింది. తనలో ఆకర్షణ ముగిసి పోయినందువలన భార్య తనను పట్టించుకోవడం మానేసిందని, అవకాశం వస్తే ప్రియుడితో కులుకుతుందని ఓ అనుమానం. ఆ యిన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ కప్పిపుచ్చుకోవడానికి తను విచ్చలవిడిగా తిరుగుతున్నట్టు, లోకంలో ఆడాళ్లంతా తనంటే పడిఛస్తున్నట్టు ఏవేవో మధురమైన వూహల్లో తేలిపోతూ వుంటాడు. అతను ప్రచురించే చెత్తపుస్తకాలు అతని కలలకు ముడిసరుకు అందిస్తూ వుంటాయి. అంతలోనే ఛ, ఛ నేను అలాటివాణ్ని కాను అని నచ్చచెప్పుకుంటాడు. తనను తాను కంట్రోల్లో వుంచుకోవడానికి ప్రయత్నిస్తూ వుంటాడు. తనంటే పడి చచ్చే ఆడది ఎవరూ లేరన్న సంగతి అతనికీ తెలుసు. అలాటి స్థితిలో వుండగా యీ అమ్మాయి పరిచయమయ్యింది. ఆ అమ్మాయి ఎలాటిదో,  ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూద్దాం. 

ఆ అమ్మాయి మార్లిన్‌ మన్రో, చాలా అందమైనది. అది కూడా రెచ్చగొట్టే అందం. ఇతని దగ్గరకు వచ్చి, సమ్మర్‌కోసం పై వాటా అద్దెకు తీసుకున్నాననీ, బైట తలుపు తాళం మర్చిపోయాననీ ఆ అమ్మాయి చెప్పింది. ఆమె వంపుసొంపులు చూసి మనవాడు మతి పోగొట్టుకున్నాడు. కానీ తనను తాను కంట్రోలు చేసుకోవాలనుకొని సిగరెట్లు కూడా దాచేశాడు. అంతలోనే ''సెవెన్‌ ఇయర్‌ ఇచ్‌'' అనే ఓ పుస్తకం అతని కంట పడింది. పెళ్లయిన ఏడేళ్ల తర్వాత ఓ దురద ప్రారంభమవుతుందని, అప్పుడు పక్కచూపులు చూడడం సహజమనీ దానిలో రాశారు. తన పెళ్లీ అయి ఏడేళ్లయిందని గుర్తుకు వచ్చింది. తనెంత రొమాంటిక్కో కొన్ని ఘట్టాలు వూహించుకున్నాడు. తనంటే ఆడవాళ్లు పడిఛస్తారని, కానీ తనే నిగ్రహించుకుంటున్నాననీ భార్యతో చెప్పినట్టు వూహించుకున్నాడు. ఆ వయ్యారిని డ్రింక్‌ తాగుదాం రమ్మనమని పిలవాల్సింది అనుకున్నాడు. ఇరుగు పొరుగూ అన్నాక ఆ మాత్రం రిలేషన్‌షిప్‌ మేన్‌టేన్‌ చేయకపోతే ఎలా అని సర్ది చెప్పుకున్నాడు. 

ఇలా వూహల్లో తేలిపోతూ వుండగానే ఫోన్‌ మోగింది. రిసార్టు నుండి వాళ్ల ఆవిడ. అక్కడ ఆవిడ పాతఫ్రెండ్‌ టామ్‌ తగిలాట్ట. బాగానే కాలక్షేపం అవుతోంది అంది. ఫోన్‌ పెట్టాడో లేదో ఢాం అని చప్పుడు. పై వాటా నుంచి ఓ పూలకుండీ పడింది. ఆ అమ్మాయే పడేసి వుంటుంది. తిడదామా అనుకునేంతలో సారీ చెపుతూ ఆ అమ్మాయే ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే ఐసై పోయాడు. కూల్‌డ్రింక్‌ తీసుకుందాం రమ్మనమన్నాడు. బట్టలు మార్చుకుని వస్తానంది ఆమె. ఆమె వస్తే ఏమేం చేయాలో, చేయవచ్చో రొమాంటిక్‌గా వూహించుకోసాగాడు. తను పియానో వాయించి ఆమెను మురిపించినట్లు, ముద్దాడినట్లు అనుకుని మురిశాడు. కల యిలా సాగుతూండగానే కాలింగ్‌ బెల్‌ మోగింది. ఎవరాని చూస్తే లాండ్రీవాడు. బట్టలివ్వడానికి వచ్చాడు. ఇదేమిటి యింత రాత్రివేళ వచ్చావ్‌ అంటే, 'రేపు ఎంజాయ్‌ చేయాలి. ఇవాళ పెళ్లాం పిల్లలు వూరెళ్లిపోతున్నారు.' అన్నాడు. ఛ ఛ అనుకుంటూ పొమ్మన్నాడు. ఇంతలో అమ్మాయి వచ్చింది. ఇతనితో కూచుని ముచ్చట్లాడింది. అరమరికలు లేకుండా మాట్లాడింది.

ఈ పక్కింటమ్మాయి పాత్ర యితనికి పూర్తిగా వ్యతిరేకమైనది. ఇతనికున్న మనోవికారాలు ఆ అమ్మాయికి లేవు. ఇతని గదిలో ఏసి వుంది కదాని యిక్కడే పడుక్కుంటానంటుంది. అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. ఇతనిలా అబద్ధాలు చెప్పదు. కాస్సేపు పెళ్లయిందనీ, కాస్సేపు కాలేదనీ..యిలా. ఇతను నచ్చి ముద్దు పెట్టుకోవాలంటే పెట్టేసుకుంటుంది. పెట్టనిస్తుంది. అంతేకానీ యితనిలా పెట్టాలని ఆశ పడి, తర్వాత అది తప్పని బాధపడి, కొన్ని పరిస్థితుల్లో తప్పుకాదని తనను తాను నచ్చచెప్పుకుని.. యిలాటి నైతికపరమైన గుంజాటనలు ఆమెకు లేవు. నిష్కల్మషంగా వ్యవహరిస్తుంది. తను మోడల్‌ననీ, యీ మధ్యే టూత్‌పేస్ట్‌ యాడ్‌ ఒకటి యిచ్చాననీ చెపుతుంది. పెళ్లయినవాళ్లతో తనకు హాయి అనీ, పెళ్లి చేసుకోమని వెంటపడరనీ అంటుంది. చెప్పుకోవడానికి సిగ్గుపడే సంఘటనలు కూడా నిస్సిగ్గుగా, అతి అమాయకంగా చెప్పేస్తుంది. అది విని యితను మెలికలు తిరిగిపోవాలి కానీ ఆ అమ్మాయి తిరగదు. మన హీరో ఆ అమ్మాయిని అదను చూసి ముద్దుపెట్టుకోబోయి బోర్లాపడ్డాడు. తర్వాత తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పుకుని ఆమెను తన గదికి తిరిగి వెళ్లిపోమన్నాడు. కానీ ఆ అమ్మాయి తప్పుగా ఏమీ అనుకోలేదు. 'అందరూ నాతో యిలాగే ప్రవర్తిస్తారు. ఈ రాత్రికి ఇక్కడే పడుక్కుంటా, నా గదిలో వుక్క' అంది. కానీ యితని హిపాక్రసీ యితనిది. వెళ్లిపొమ్మన్నాడు.  

తనను తాను కంట్రోలు చేసుకోలేన్న భయం పట్టుకుంది మన హీరోకి. భార్య దగ్గరకి వెళ్లిపోదామనుకున్నాడు. మర్నాడు వెళ్లి బాస్‌ను అడిగాడు - 'సెలవిస్తే ఓ రెండు వారాలపాటు ఫ్యామిలీతో గడిపి వస్తాన'ని. 'వాళ్లు లేకపోతే హాయిగా ఎంజాయ్‌ చేయాలి కానీ బెంగపెట్టుకుంటావేమిటి' అని జోకులేసి, బిజీ సీజన్‌ కాబట్టి సెలవు లేదు అన్నాడు బాస్‌.  హీరో అంతటితో ఆగలేదు. ఆ సెవెన్‌ యియర్‌ యిచ్‌ రాసిన సైకియాట్రిస్టు వద్ద తన అవస్థ వెళ్లబోసుకుని సలహా అడిగాడు. అంతా విని, 'దురద వేస్తే గోక్కోవడమే మందు' అని చెప్పాడు ఆ పెద్దమనిషి. కానీ హీరోలోని పిరికివాడు మహా యాక్టివ్‌గా పనిచేస్తున్నాడు. ఆ పై వాటా అమ్మాయి వూళ్లో అందరికీ తమ ఎఫైర్‌ గురించి చెప్పేసినట్టు, తన భార్యకు కూడా తెలిసిపోయినట్టు  వూహించుకుని వణికిపోయాడు. ఇంటికి వచ్చాక యింకో వూహ తోచింది - అక్కడ భార్య తన పాతఫ్రెండు టామ్‌తో కలిసి మజా వుడాయిస్తున్నట్టు! ఆమెమీద కసి తీర్చుకోవాలని పై వాటా అమ్మాయిని సినిమాకు తీసుకెళ్లాడు. ఆ రాత్రి తన యింట్లోనే పడుక్కోబెట్టు కుందామనుకున్నాడు. ఆ అమ్మాయి సరేననడంతో భంగపడ్డాడు. తను ఏదైనా చేసేస్తానని భయపడదేమిట్రా అని దిగాలు పడ్డాడు. వీళ్లిద్దరూ గదిలో వుండగా లాండ్రీవాడు వచ్చి యిదా సంగతి అన్నట్టు కన్నుకొట్టి వెళ్లాడు. దాంతో ఆ అమ్మాయిని పంపించివేశాడు. అయితే ఆ అమ్మాయి లోపల మెట్ల ద్వారా యితని గదిలోకి వచ్చేసింది. ఆమె చొరవ చూసి యితను హడులుకున్నాడు. తనను రొంపిలోకి దింపి ఈ పిల్ల బ్లాక్‌మెయిల్‌ చేసేస్తుందా ఏమిటి? అని బెంగపెట్టుకున్నాడు. 

మర్నాడు ఉదయం ఆ అమ్మాయి అడిగింది. ఇలా నీ గదిలో యింకో అమ్మాయి వుంటే మీ ఆవిడ అసూయ పడదా? అని. 'అబ్బే, నేను చేతకానివాడినని మా ఆవిడ నమ్మకం. నా కోటు మీద ఇంకో అమ్మాయి తాలూకు లిప్‌స్టిక్‌ వున్నా అది టొమాటో సాస్‌ అనుకుంటుంది మా ఆవిడ. ఆవిడ మాటా నిజమే. అందమైన అమ్మాయిలు అందమైన అబ్బాయిలను కోరుకుంటారు కానీ నాలాటి మొహమాటస్తులను కోరుకోరు.' అంటాడు హీరో. అప్పుడు ఆ అమ్మాయి చెపుతుంది. 'అందగాణ్నని, తనంటే అమ్మాయిలు పడిఛస్తారని బోరవిరుచుకు తిరిగేవాళ్లంటే అందమైన అమ్మాయిలు చికాకుపడతారు. బెరుకు, బెరుకుగా వుండే నీలాటి వాళ్లే వాళ్లకు నచ్చుతారు. నీలాటి వాడు ఎవరికీ అక్కరలేదని అనుకుని మీ ఆవిడ ధైర్యంగా వుంటే ఆమె పొరబాటు చేసినట్టే.' అని చెప్పింది. 

ఈలోగా బెల్‌ మోగింది. వచ్చినవాడు యితని భార్య ఫ్రెండు. కొడుకు ప్యాడిల్‌ పట్టుకురమ్మనమని ఆమె యితన్ని పంపింది. పైవాటా అమ్మాయితో తన వ్యవహారం తెలిసిపోయి భార్య విడాకుల పత్రం యితనితో పంపిందేమోనన్న భ్రమతో వున్న హీరో అతన్ని చచ్చేట్లా కొట్టాడు. తర్వాత సంగతి తెలుసుకుని, ఆ ప్యాడిల్‌ నేనే స్వయంగా యిస్తానులే అని భార్య వద్దకు పరిగెట్టాడు. వెళ్లేముందు ఆ అమ్మాయికి తన వాటా తాళంచెవి యిచ్చేశాడు - సమ్మరంతా ఏసి సౌఖ్యం అనుభవించమంటూ! తన మాటలతో అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఆ అమ్మాయి అతనికి గుడ్‌బై చెపుతూ ముద్దు పెట్టింది. 'నీ భార్యకు నా మాటగా చెప్పు. నువ్వంటే పడిచచ్చేవాళ్లు కూడా వున్నారని తెలుసుకుని జాగ్రత్తగా వుండమని!'' అని.  -  (సశేషం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?