cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: లాలూతో కాంగ్రెస్ చెడగొట్టుకున్న విధం

ఎమ్బీయస్‍:  లాలూతో కాంగ్రెస్ చెడగొట్టుకున్న విధం

2020లో బిహార్‌లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు కారణంగానే మహాగఠ్‌బంధన్ అధికారానికి ఆవల వుండిపోయిందని అందరూ దుమ్మెత్తిపోశారు. బలం లేకపోయినా 70 స్థానాలకు టిక్కెట్లు తీసుకుని, కేవలం 19 స్థానాల్లో గెలిచిందని, రాహుల్ ప్రచారానికే రాలేదని, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెసు నాయకులెవరికీ స్టేచర్ లేదనీ.. యిలా వ్యవస్థాగత లోపాలెన్నో ఎత్తి చూపారు. బిహార్‌లో మళ్లీ పుంజుకోవాలంటే, స్థానికంగా పెద్ద నాయకులను తయారుచేసుకోవాలని నిశ్చయించుకున్న కాంగ్రెసు సిపిఐ నుంచి కన్హయ కుమార్‌ను ఫిరాయింప చేసుకుంది. జెఎన్‌టియు వివాదంలో విద్యార్థి నాయకుడిగా జాతీయంగా గుర్తింపు వచ్చింది కానీ రాజకీయంగా అతని బలమెంతో ఎవరికీ తెలియదు. సిపిఐ అతన్ని తీసుకుని వచ్చి 2019 పార్లమెంటు ఎన్నికలలో బెగుసరాయ్ నియోజకవర్గంలో తన అభ్యర్థిగా నిలబెట్టింది. బిజెపి ప్రత్యర్థి గిరిరాజ్ సింగ్ చేతిలో 4 లక్షల ఓట్ల తేడాతో అతను ఘోరంగా ఓడిపోయాడు.

బిహార్‌లో యువతను ఆకర్షిస్తున్న 32 ఏళ్ల తేజస్వి యాదవ్‌కు ప్రతిగా 34 ఏళ్ల కన్హయను ముందుకు నెట్టింది కాంగ్రెసు. అతనితో పాటు గుజరాత్‌కు చెందిన 38 ఏళ్ల జిగ్నేశ్ మేవాణీని తీసుకుని వచ్చి బిహార్‌లో ఎన్నికల ప్రచారానికి తిప్పింది. జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సుస్మితా దేవ్ వంటి వారు కాంగ్రెసు విడిచి వెళ్లడంతో ఆ పార్టీలో యువతకు చోటు లేదనే ప్రచారం బాగా సాగుతోంది. దాన్ని తిప్పికొట్టడానికి హార్దిక్ పటేల్‌ను తీసుకుని వచ్చారు. ఇప్పుడు కన్హయను! బిహార్‌లో 1990ల వరకు కాంగ్రెసుకు జగన్నాథ్ మిశ్రా వంటి పెద్ద నాయకులుండేవారు. అగ్రవర్ణాలు, దళితులు, ముస్లిముల మద్దతు వుండేది. ఇతర కులాలు కూడా ఓటేస్తూ వుండేవి. 1990లో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి బిసిలు, ముస్లిములు దూరమై పోయారు. లాలూ తర్వాత నీతీశ్ బిసిలలో యాదవేతరులను, మరీ వెనకబడిన బిసిలను చేరదీసి, ముస్లిము ఓట్లు కూడా సమకూర్చుకుని ముఖ్యమంత్రి అయిపోయాడు.

ఈ యాదవప్రాభవాన్ని అరికట్టడానికై అగ్రవర్ణాలు బిజెపి వెనక్కాల చేరాయి. చివరకు ఎలా అయిందంటే అధికాంశం యాదవులు (జనాభాలో 15%), ముస్లిములు (16%) లాలూ వెంట పోగా, అగ్రవర్ణాలు బిజెపి వెంట పోగా, తక్కిన బిసిలు, ఇబిసిలు, మహాదళితులు, మహిళలు నీతీశ్ వెంట పోగా, కాంగ్రెసుకు తనదంటూ కచ్చితమైన ఓటు బ్యాంకు లేకుండా పోయింది. సందర్భం బట్టి, స్థానిక పరిస్థితుల బట్టి ఓ మేరకు ఓట్లు పడుతున్నాయంతే! అందువలన లాలూ ఆర్‌జెడితో పొత్తు పెట్టుకుని వాళ్ల భుజాల మీద సవారీ చేస్తోంది. 40 మంది ఎంపీలున్న బిహార్‌ రాష్ట్రానికి కాంగ్రెసు యిచ్చిన ప్రాధాన్యత యిలా వుంటోంది. రాహుల్ యిప్పుడు హఠాత్తుగా మేలుకొని జులైలో 35 మంది బిహార్ నాయకులతో సమావేశమై స్ట్రాటజీ వర్కవుట్ చేసి కన్హయను పట్టుకుని వచ్చి ఇడిగో మీ రక్షకుడు అన్నాడు. ‘ఇతను బిహార్ పాలిట నవజ్యోత్ సిద్దూలా తయారై పార్టీని లోపల్నుంచి నాశనం చేస్తాడు చూడండి.’ అన్నాడు ఆర్‌జెడి లీడరు శివానంద తివారీ.

కన్హయకు ఆర్‌జెడి అంటే, మరీ ముఖ్యంగా తేజస్వి అంటే పడదు. బెగుసరాయ్‌లో కన్హయ నిలబడినపుడు తేజస్వి తన ఆర్‌జెడి అభ్యర్థిని నిలబెట్టాడు. విత్‌డ్రా చేయమని కన్హయ కోరినా వినలేదు. దాంతో బిజెపి వ్యతిరేక ఓట్లు చీలిపోయి గిరిరాజ సింగ్‌కు 6.92 లక్షల ఓట్లు వచ్చాయి. కన్హయకు 2.70, ఆర్‌జెడికి 1.98 వచ్చాయి. తన ఓటమికి తేజస్వియే కారణమని కన్హయకు కోపం. అలాటివాడు యిప్పుడు ఉపయెన్నికలలో తేజస్వితో పొత్తు పెట్టుకోమంటే పెట్టుకుంటాడా? ఈసారి స్వతంత్రంగా పోటీ చేసి తమకంటూ ఎన్ని ఓట్లున్నాయో లోకానికి, కూటమి భాగస్వాములకు చాటి చెప్దామని కాంగ్రెసు నిశ్చయించుకుంది. దానికి తొలిమెట్టుగా ఆర్‌జెడిపై నింద వేయాలని ‘ఆర్‌జెడి, బిజెపి కలిసి కాంగ్రెసును ఓడిద్దామని చూస్తున్నాయ’ని కాంగ్రెసు బిహార్ ఇన్‌చార్జి భక్త చరణ్ దాస్ ప్రకటించాడు. దానిపై వ్యాఖ్యానించమని లాలూను అడిగితే అలా అన్న చవట ఎవడు? అనే అర్థంలో కాబోలు ‘భక్‌ఛోన్‌హర్’ అనే పదాన్ని వాడాడు. వెంటనే కాంగ్రెసు యిదే అదనుగా గగ్గోలు పెట్టేసింది. రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు అనిల్ శర్మ దాస్ దళితుడు కాబట్టే లాలూ అలా మాట్లాడాడని అన్నాడు. నేను లాలూని క్షమించేశాను అన్నాడు దాస్.

బిజెపికి రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ ‘బిహార్‌లో అవినీతికి, దుష్పరిపాలనకు మారుపేరుగా నిలిచిన లాలూతో బిజెపి పొత్తు పెట్టుకోవడం కల్ల. 2020 ఎన్నికలలో ఆర్‌జెడియే తన పోస్టర్లలోంచి లాలూ బొమ్మ తీసేసింది. అలాటివాడు మాకు భాగస్వామా? కాంగ్రెసు యింత అంటున్నా రేపు సిగ్గు లేకుండా అతనితో పొత్తు పెట్టుకుంటుంది చూడండి.’ అన్నాడు. అది జరగలేదనుకోండి. లాలూ మాత్రం యీ భాషావివాదంలో దిగదల్చుకోలేదు. ఇంతకు మించిన సమస్య అతన్ని వేధిస్తోంది. అతని యిద్దరు కొడుకులూ భీకరంగా పోట్లాడుకుంటున్నారు. పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ ‘మాది కృష్ణార్జునుల యుద్ధం’ అని చెప్పుకుంటున్నా, నిజానికి అది సుందోపసుందుల యుద్ధంలా వుందనిపిస్తోంది పరిశీలకులకు. లాలూకు 9 మంది పిల్లలు. 7గురు కుమార్తెలు. ఇద్దరు కొడుకులు. కూతుళ్లలో విద్యావంతులున్నా, కొడుకులకు పెద్దగా చదువు అబ్బలేదు. పెద్దవాడు తేజ్ ప్రతాప్ గతంలో ఆరోగ్యమంత్రిగా వున్నాడు. ప్రస్తుతం ఎమ్మెల్యే. చురుకైనవాడు కాదు. రెండో కొడుకు తేజస్వి చురుకైనవాడు. నీతీశ్ దగ్గర ఉపముఖ్యమంత్రిగా చేశాడు. ప్రస్తుతం ఎమ్మెల్యే. శాసనసభలో ప్రతిపక్షనాయకుడు.

లాలూ జైల్లో వుండడంతో పార్టీ పగ్గాలను తేజస్వి అంది పుచ్చుకున్నాడు. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో యువతతో బాటు యితరులనూ విపరీతంగా ఆకర్షించి, బిజెపికి, నీతీశ్‌కు దడ పుట్టించాడు.  ముఖ్యమంత్రి అయిపోతాడేమోనని ఊహలు కల్పించాడు. చివరకు అతని నేతృత్వంలో ఆర్‌జెడికి 23% ఓట్లతో 75 సీట్లు వచ్చాయి. బిజెపికి 74, జెడియుకి 43 వచ్చాయి. సహజంగా పార్టీ పెద్దలందరూ అతనికి అండగా నిలిచారు. ఇన్నాళ్లూ ప్రతాప్ యిదంతా చూస్తూ వూరుకున్నాడు. తేజస్వి అర్జునుడైతే తను కృష్ణుణ్నని చెప్పుకుంటూ తిరిగాడు.  లాలూ పార్టీ అధ్యక్ష పదవి నవంబరుతో పూర్తవుతుంది. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆ పదవి వదిలేస్తాడేమో, అది తనకు కావాలని అతనికి కోరిక పుట్టింది. తను పోరాడకపోతే తమ్ముడే తండ్రి వారసుడిగా తేలతాడని భయం పట్టుకుంది. అందుకని తమ్ముడి సమర్థకులపై, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్, తేజస్వి రాజకీయ సలహాదారు సంజయ్ యాదవ్‌లపై దాడి మొదలుపెట్టాడు.

అంతేకాదు, తనకంటూ కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఆగస్టు 8న ఛాత్ర ఆర్‌జెడి అంటూ స్టూడెంట్స్ వింగ్ సభ పెట్టాడు. పోస్టర్లపై తేజస్వి బొమ్మ లేదు. అదేమంటే ప్రతాప్ అనుచరుడు, ఆ సంస్థ అధ్యక్షుడు ఆకాశ్ యాదవ్‌దే తప్పన్నారు. ప్రతాప్ ఆకాశ్‌ని వెనకేసుకుని వచ్చాడు. ఇది జరిగిన 11 రోజులకు జగదానంద్, ఆకాశ్‌ను తీసేసి అతని స్థానంలో గగన్ యాదవ్‌ను ఛాత్ర ఆర్‌జెడి అధ్యక్షుడిగా నియమించాడు. స్టూడెంట్స్ వింగ్ నా విభాగం, నన్నడగకుండా యీ మార్పు చేస్తావా? అని ప్రతాప్ భగ్గుమన్నాడు. 76 ఏళ్ల జగదానంద్ లాలూకు ముఖ్య అనుచరుడు. చాలా క్రమశిక్షణ కలిగిన నాయకుడు. ప్రతాప్‌ను యిన్నాళ్లూ కట్టడి చేస్తూ వచ్చాడు. ప్రతాప్ బహిరంగంగా దాడి చేయడంతో రిజైన్ చేస్తానన్నాడు. లాలూ వద్దన్నాడు. ఇక సలహాదారు సంజయ్ యాదవ్ గురించి ప్రతాప్ ‘హరియాణా నుంచి వచ్చిన వలస కన్సల్టెంటు. తన కుటుంబంలో ఎవర్నీ సర్పంచ్‌గా కూడా గెలిపించుకోలేని అసమర్థుడు. మా కుటుంబంలో చిచ్చు పెట్టడానికి తయారయ్యాడు.’ అన్నాడు. వీటికి వేటికీ తేజస్వి సమాధానం చెప్పలేదు. ‘అన్నగారికి గౌరవం యివ్వాలని మా అమ్మానాన్నా నేర్పించారు. కానీ ఎంతవారైనా పార్టీ క్రమశిక్షణను పాటించాలి కదా.’ అన్నాడు.  

కానీ ప్రతాప్ తగ్గలేదు. జనాభా గణన కులపరంగా జరగాలని డిమాండు చేయడానికి నీతీశ్ అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లినపుడు తేజస్వి అక్కడికి వెళితే ‘రాష్ట్రంలో వరదలు వచ్చిన సమయంలో తేజస్వికి దిల్లీలో ఏం పని?’ అంటూ విరుచుకు పడ్డాడు. తన ప్రతాపం చూపించడానికి జయప్రకాశ్ నారాయణ్ పుట్టినరోజు అక్టోబరు 11న ‘జనశక్తి యాత్ర’ అని పట్నా గాంధీ మైదాన్ నుంచి పాదయాత్ర తలపెట్టాడు. అన్నదమ్ముల మధ్య పోరు పార్టీకి చేటు తెస్తుందని భయపడిన తల్లి రబ్డీ దేవి పట్నాలో ప్రతాప్ యింటికి వెళ్లి యిది వద్దని బతిమాలబోయింది. కానీ ఆమె వచ్చేలోపునే ప్రతాప్ బయటకు వెళ్లిపోయాడు. అనుకున్న ప్రకారం యాత్ర ప్రారంభించేశాడు. అంతకుముందే అతను దిల్లీ వెళ్లి అక్కగారింట్లో చికిత్స పొందుతున్న తండ్రి ఆశీస్సులు కోరివున్నాడు. కానీ లాలూ అతన్ని సమర్థించకపోవడంతో ‘అక్కడ మా నాన్నను బందీ చేసి వుంచారు. పట్నా రానివ్వటం లేదు.’ అని ప్రకటించాడు.

కొడుకుల మధ్య సయోధ్య కుదర్చడం ఎలా లాలూ తలపట్టుకుంటున్న సమయంలో అధికార పక్షాలైన జెడియు, బిజెపి మధ్య సఖ్యత ఎలా వుందో చూదాం. నీతీశ్ అంటే మోదీ-అమిత్‌లకు ప్రేమేమీ లేదు. మోదీని వ్యతిరేకించి ఎన్‌డిఏలోంచి బయటకు నడిచిన వారిలో నీతీశ్ ప్రథముడు. మళ్లీ అవసరం కొద్దీ చెంతన చేరాడు. నువ్వు ఒకందుకు పోస్తే, నేను మరొకందుకు తాగాను అన్నట్లు బిజెపి దగ్గరకు రానిచ్చింది. నీతీశ్‌కున్న ఖ్యాతిని ఉపయోగించుకోవడానికి అతన్నే కూటమి ముఖ్యమంత్రిగా చూపింది. కానీ అతని సీట్లు తగ్గించడానికి చిరాగ్ పాశ్వాన్‌ను దువ్వింది. ఆ తర్వాత చిరాగ్ దీపాన్ని ఆర్పేసింది. మొత్తం మీద కూటమిలో తనకే ఎక్కువ సీట్లున్నా, నీతీశ్‌ను ముఖ్యమంత్రిని చేసి, తన పార్టీలో అతనికి సన్నిహితంగా వున్న సుశీల్ మోదీని రాజ్యసభకు పంపి యిద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించింది. వారిలో ఒకరు తార్‌కిశోర్ ప్రసాద్ అనే వైశ్యకులస్తుడు. మరొకరు నీతీశ్‌ ఓటు బ్యాంకుకి చెందిన ఇబిసి, మహిళా వర్గాలకు చెందిన రేణు దేవి. ఈవిడకు అప్రధానమైన డిజాస్టర్ మేనేజ్‌మెంట్, బిసి, ఇబిసి వెల్‌ఫేర్ వంటివి యిచ్చినా తార్‌కిశోర్‌కు ఫైనాన్స్, కమ్మర్షియల్ టాక్సెస్, అర్బన్ డెవలప్‌మెంట్, హౌసింగ్ వంటి ముఖ్యమైన శాఖలు యిప్పించారు.

ఈ తార్‌కిశోర్‌కు రాజకీయంగా చాలా ప్రణాళికలున్నాయి. నీతీశ్ తన పాలనలో రాజకీయ నాయకుల ప్రమేయం తగ్గించి, అధికారులకు పైచేయి కల్పించాడు. ఇప్పుడు తార్‌కిశోర్ ‘అధికారులు మా మాట వినాల్సిందే’ అంటున్నాడు. ప్రతి మంగళవారం జనతా దర్బార్ ఏర్పరచి ముఖ్యమంత్రి కంటె ఎక్కువ పాప్యులర్ అవుదామని చూస్తున్నాడు. మహిళా ఎంటర్‌ప్రెనార్లకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించేందుకు కార్పోరేషన్ నెలకొల్పాడు. వీళ్లతో బాటు బిజెపి విజయ్ సిన్హా అనే భూమిహార్‌ను స్పీకరుగా పెట్టింది. ఈ ముగ్గురి కులాలకు జనాభాలో 20% వాటా వుంది. బిహార్‌లో వచ్చేసారి నీతీశ్ ప్రమేయం లేకుండా గెలిచేందుకు గాను ఆగస్టులో బిజెపి భిఖ్కూభాయ్ దల్సానియా అనే గుజరాత్ బిజెపి ఆర్గనైజేషనల్ సెక్రటరీని బిహార్ ఇన్‌చార్జిగా తెచ్చింది. ఇప్పటికే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయంటూ నీతీశ్‌పై విసుర్లు విసురుతున్నాడు. నీతీశ్ మౌనం పాటిస్తూనే తన పార్టీ సీనియర్ లీడరు ఉపేంద్ర కుశావహ చేత సమాధానం యిప్పిస్తున్నాడు.

తార్‌కిశోర్ సూపర్ ముఖ్యమంత్రిగా వెలుగుదామని చూస్తూండడంతో జెడియు ఎమ్మెల్యే గోపాల్ మండల్ ‘ఈయన తరచుగా భాగల్పూరు ఎందుకు వెళుతున్నాడు? హఫ్తాలు (ఒత్తిడి చేసి తీసుకునే డబ్బు) వసూలు చేయడానికా?’ అన్నాడు. బిజెపి అభ్యంతరం తెలపడంతో నీతీశ్ సీనియర్ అనుచరుడు విజయ్ చౌధురి గోపాల్‌ను పిలిచి చివాట్లేశాడు. గోపాల్ బహిరంగంగా తన మాటను వెనక్కి తీసుకున్నాడు. రాష్ట్రస్థాయిలో యిలాటి చిటపటలుండగా జాతీయ స్థాయిలో కూడా తక్కువేమీ లేవు. జులైలో కేంద్ర కాబినెట్ విస్తరణ సమయంలో తమ పార్టీకి ఒకే ఒక్క మంత్రి పదవి యివ్వడంతో జెడియుకు కోపం వచ్చింది. ఉత్తర ప్రదేశ్ జనాభా నియంత్రణ బిల్లును నీతీశ్ బహిరంగంగా విమర్శించాడు. ఇలాటి చట్టాల కన్నా బాలికలలో విద్యాభ్యాసం ప్రోత్సహిస్తే జనాభా అదుపు సాధ్యమని హితవు చెప్పాడు.

అంతేకాదు, జనాభాగణనను కులపరంగా చేయాలని డిమాండు చేయడంతో బాటు తన రాష్ట్రంలోని అన్ని పార్టీలతో కలిసి వెళ్లి దిల్లీలో హోం శాఖను కలిశాడు. ఆగస్టులో పెగాసస్ వివాదం వచ్చినపుడు ఎన్‌డిఏ భాగస్వామి అయి కూడా దానిపై విచారణ జరగాలని డిమాండ్ చేశాడు. గతంలో ఎన్నార్సీని వ్యతిరేకించిన రికార్డు కూడా నీతీశ్‌కు ఉంది. రాజకీయావసరాల కొద్దీ చేతులు కలిపినా, బిజెపి హిందూత్వ పాలసీతో తన ఏకీభవించనని, తనకు స్వతంత్ర భావాలున్నాయనీ నీతీశ్ మాటిమాటికీ తన సమర్థకులకు యీ విధంగా చాటుకుంటున్నాడు. ఎంతసేపూ బిసిల వెంటనే పడడం చేత అగ్రవర్ణాల వారందరూ బిజెపి వైపు వెళ్లిపోతున్నారని గ్రహించి, తను కూడా అగ్రవర్ణాల వారిని ఆదరిస్తానని చూపుకోవడానికి జెడియు నేషనల్ ప్రెసిడెంటుగా భూమిహార్ నాయకుడు రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్‌)ను నియమించాడు. అంతకుముందు ఆ పదవిలో వున్న ఆర్‌సిపి సింగ్ కేంద్రమంత్రి కావడంతో ఖాళీ ఏర్పడి, దాన్ని యీ విధంగా పూరించడం జరిగింది.  

2003లో పార్టీ ఏర్పడినుంచి యిప్పటివరకు నలుగురు ప్రెసిడెంట్లు మాత్రమే వున్నారు. వారిలో ఫెర్నాండెజ్ క్రైస్తవుడు. తక్కిన ముగ్గురూ బిసిలే. లాలన్ తొలి అగ్రవర్ణ అధ్యక్షుడు. భూమిహార్లు జనాభా పరంగా అధిక సంఖ్యలో వుండడమే కాక, పలుకుబడి వున్న వర్గం. ప్రతి నియోజకవర్గంలో ఆ కులపు ఓట్లున్నాయి. 2011-12లో జరిపిన ఓ సర్వే ప్రకారం బిహార్ జనాభాలో హిందూ, ముస్లిము అగ్రవర్ణస్తులు (హిందువుల్లో బ్రాహ్మణులు, భూమిహార్లు, రాజపుత్రులు, కాయస్థులు, ముస్లిముల్లో షేక్‌లు, సయ్యద్‌లు, పఠాన్‌లు) 20% మంది ఉన్నారట. జెడియును దెబ్బ తీయడానికి 2020 ఎన్నికలలో చిరాగ్ పాశ్వాన్ జెడియు నిలబడిన చోట అగ్రవర్ణస్తులను తన అభ్యర్థులుగా పెట్టాడు. బిజెపి జెడియుకు సపోర్టు యివ్వకపోవడంతో, అగ్రకులస్తులు జెడియుకు ఓటేయకపోవడంతో చాలా చోట్ల అది ఓడిపోయింది. ఆ పొరబాటు దిద్దుకోవాలనే యీ ప్రయత్నం.

ఈ నియామకం జెడియులో నెంబరు టూ ఎవరనే వివాదానికి తెర తీసింది. ఇప్పటివరకు అధ్యక్ష పదవి బిసిలకు యిస్తూండడంతో బిసి నాయకుడు, కోయిరీ కులస్తుడు ఉపేంద్ర కుశావహ ఆ పదవిపై ఆశ పెట్టుకున్నాడు. అతను తన రాష్ట్రీయ లోక సమతా దళ్ పార్టీని యీ ఏడాది మొదట్లోనే జెడియులో విలీనం చేసి పార్లమెంటరీ బోర్డు చైర్మన్ అయ్యాడు. ఆర్‌సిపి సింగ్ మంత్రి కావడంతో తనకీ పదవి ఖాయం అనుకున్నాడు. కానీ నీతీశ్ లెక్కలు వేరు. యాదవ పక్షపాతి అయినా, లాలూ తన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా రాజపుత్రుడైన జగదానంద్ సింగ్‌ను నియమించాడు. కాంగ్రెసు తన రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మదన్ మోహన్ ఝా అనే బ్రాహ్మణ్ని పెట్టుకుంది. తనొక్కడే బిసిలను పట్టుకుని వేళ్లాడుతున్నాడిన్నాళ్లూ. అందుకని బిజెపికి మద్దతుదారులుగా వున్న భూమిహార్లను ఆకర్షించడానికి లాలన్ సింగ్‌కు పదవి యిచ్చాడు. లాలన్‌కు కేంద్రమంత్రి పదవి యిస్తారని నీతీశ్ ఆశించాడు. అది దక్కకపోవడంతో యీ రిస్కు తీసుకోవలసి వచ్చింది.

ఆర్‌జెడి నుంచి నీ ఒక్కడికే మంత్రి పదవి యిస్తానని బిజెపి తనతో అన్నప్పుడు ఒక్కడికే అయితే నాకూ వద్దు అని ఆర్‌సిపి సింగ్ అంటాడని నీతీశ్‌తో సహా అందరూ ఆశించారు. అతను గతంలో ఐఏఎస్ అధికారి, నీతీశ్‌కు రెండు దశాబ్దాలుగా ఆత్మీయుడు. కానీ ఆర్‌సిపి నిరభ్యంతరంగా పదవి స్వీకరించడంతో అతను తప్ప పార్టీ నుంచి వేరెవరూ ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. అంతేకాదు, లాలన్ జాతీయ అధ్యక్ష హోదాలో దిల్లీ నుంచి పట్నా వచ్చినపుడు వేసిన స్వాగత పోస్టర్లలో ఆర్‌సిపి ఫోటో వేయలేదు. పది రోజుల తర్వాత ఆర్‌సిపి పట్నా వచ్చినపుడు అతను సమర్థకులు వేసిన పోస్టర్లలో లాలన్ ఫోటో వేయలేదు. ఇదంతా చూసి యికపై పార్టీ పోస్టర్లలో నీతీశ్ బొమ్మ తప్ప వేరెవరిదీ వేయకూడదని పార్టీ నిర్ణయం తీసుకుంది.

పార్టీల వ్యవహారం యిలా వుండగా దర్భంగా జిల్లాలోని రిజర్వ్‌డ్ సీటు కుశేశ్వర్ ఆస్థాన్, ముంఘేర్ జిల్లాలోని తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మృతి కారణంగా అక్టోబరులో ఉపయెన్నికలు వచ్చాయి. రెండూ జెడియు సిటింగ్ స్థానాలే. ఆరేళ్ల విరామం తర్వాత లాలూ స్వయంగా ప్రచారంలో పాల్గొన్నాడు. ఉన్న రెండు స్థానాల్లో కాంగ్రెసు ఒకటి అడిగింది. లాలూ యివ్వనంటే రెండు చోట్లా పోటీ చేసి, ఓ చోట ప్రతిపక్ష విజయావకాశాలను దెబ్బ తీసి జెడియు గెలుపుకు కారకురాలైంది.

50% పోలింగు జరిగిన కుశేశ్వర్ ఆస్థాన్‌ జెడియు అభ్యర్థి అమన్ భూషణ్ హజారీకి 60 వేల ఓట్లు వచ్చి, 47 వేల ఓట్లు వచ్చిన ఆర్‌జెడి గణేశ్ భారతిపై 12,695 మెజారిటీతో గెలిచాడు. కాంగ్రెసు అభ్యర్థి అతిరీక్ కుమార్‌కు 5603 ఓట్లు వచ్చాయి. 49% పోలింగు జరిగిన తారాపూర్‌లో రాజీవ్ కుమార్‌కు 79 వేల ఓట్లు, ఆర్‌జెడికి చెందిన అరుణ్‌కుమార్‌కి 75 వేల ఓట్లు వచ్చి 3652 మెజారిటీతో గెలిచాడు. కాంగ్రెసుకు చెందిన రాజేశ్ కుమార్ మిశ్రాకు లోకజనశక్తి కంటె తక్కువగా కేవలం 3590 ఓట్లు వచ్చాయి. కాంగ్రెసు బరిలో లేకుండా వుంటే ఆర్‌జెడి గెలిచేదేమో! ఇలా కాంగ్రెసు సొంతానికి బావుకున్నదేమీ లేకపోయినా లాలూతో చెడగొట్టుకుంది. కన్నయ్య ఏ చక్రమూ తిప్పలేకపోయాడు. – (ఫోటో – 1. తార్‌కిశోర్, రేణు దేవి, 2. లాలన్, ఆర్‌సిపి, 3. ప్రతాప్, తేజస్వి 4. హార్దిక్, కన్హయ, మేవాణీలతో రాహుల్) 

- ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2021)

mbsprasad@gmail.com

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!