చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ ఆయనకి ఒకటే ఆలోచన ఉండేది. ఎప్పటికైనా వైయ్యస్సార్ కంచుకోట అయిన పులివెందులలో తెలుగుదేశం జెండా ఎగరాలని.
దాదాపు ముప్పై ఏళ్లుగా అదే యావతో బతికాడాయన. సతీష్ రెడ్డి అనే వ్యక్తిని ఎమ్మెల్సీని చేయడం కూడా ఆ ఆక్రమణవ్యూహంలో ఒక భాగమే.
కానీ పులివెందుల్లో వైయస్సార్ కుటుంబం మీద జనానికున్న అభిమానం అనే కోటలో ఒక చిన్న ఇటుకని కూడా కదపలేకపోయాడు బాబు. మహమ్మద్ గజినీ దండయాత్రలాగ ఎన్ని సార్లు తన కుట్రలతో ప్రయత్నించినా అస్సలు ఫలితం దక్కలేదు.
కాలమహిమ ఏంటంటే అదే వైయ్యస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి కుప్పం ని ఆక్రమించాడు.
తన సొంత ఇలాకాలో జనం మనసుల్ని ఎలా గెలుచుకోవాలో తెలియని వాడిగా చంద్రబాబు నిర్వీర్యంగా కనిపిస్తున్నారు. తన పక్కనున్న నియోజకవర్గం చంద్రగిరిలో కూడా ఎదురుదెబ్బలే. సొంత జిల్లాలోనే తన ప్రాపకం నశించి పార్టీని అంపశయ్య ఎక్కించే పనిలో ఉన్నారు.
అంటే ఎన్నో ఏళ్లుగా ఎదుటి కొంపని ఎలా ముంచాలా అని ఆలోచిస్తూ కూర్చున్న చంద్రబాబుకి వెనుక తన సొంతకొంప తగలడిపోతున్న సంగతి తెలియలేదు. మరి ఈయన్ని పట్టుకుని రాజకీయ చాణక్యుడని కొన్ని పత్రికలు ఎందుకంటాయో అస్సలు అర్థం కాదు.
అదలా ఉంటే చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి జగన్ మీద మామూలు అణచివేతచర్య చెయ్యలేదు. జగన్ కాంగ్రెస్ వీడి సొంత పార్టీ పెట్టుకున్న వెంటనే ఆయన బాబాయికి మంత్రి పదవిచ్చి డివైడ్ అండ్ రూల్ పాలసీని ప్రయోగించారు కాంగ్రెస్ నాయకులు. దానికి సూత్రధారి, సలహాదారు బాబేనని రాజకీయవర్గాల్లో అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా సొంత పార్టీ తరపున ఎంపీగా నిలబడి తన దమ్ము చూపించాడు జగన్. కాంగ్రెస్ పార్టీ కోట్లు గుమ్మరించి జగన్ ని ఓడించాలనుకున్నా పని జరగలేదు. ప్రజాభిమానమంటే అది.
ఇది మింగుడు పడని తెలుగుదేశం అధినేత తన చేతకానితనాన్ని ఒప్పుకోకుండా, జగన్ వర్గం రౌడీయిజం చేసి గెలిచారనో, దొంగ ఓట్ల ప్రభావం అనో చెబుతారు తప్ప మరొక మాటుండదు.
అసలు ఇదంతా కాదు. కంటికి కనిపించే విషయమొకటి చూద్దాం. ఇన్నేళ్ల పాలనలో చంద్రబాబు కుప్పం ని పంచాయితీగానే ఉంచారు తప్ప కనీసం మునిసిపాలిటీ స్థాయికి తీసుకురాలేదు. ఆ పని చేసింది జగన్.
ఆంధ్రాలో నేషనల్ హైవే లేని ఏకైక జిల్లా చిత్తూరు. ఆ జిల్లానుంచి ప్రాతినిథ్యం వహిస్తూ, దేశంలో ప్రధానమంత్రుల్ని కూడా తానే నియమించానని చెప్పుకుంటూ కూడా ఇన్నేళ్లుగా ఒక నేషనల్ హైవే కనెక్టివిటీ కూడా తెచ్చుకోకలేకపోవడం కూడా విడ్డూరమే.
ఎంతసేపూ చంద్రబాబుకి అమరావతి వ్యాపారమే తప్ప కుప్పం బాధ్యత పట్టలేదు. అందుకే అక్కడి జనం కూడా క్రమంగా చంద్రబాబుకి దూరమవుతూ వచ్చారు.
గెలిస్తే తన ప్రతిభ అని, ఓడితే ఎదుటివాడు తొండి ఆడాడని చెప్పుకోవడం చంద్రబాబుకి ముందు నుంచీ అబ్బిన విద్య. దాంతోటే ఇన్నాళ్లూ కాలక్షేపం చేసారు. ఇక కష్టం. రోజులు మునుపట్లా లేవు. జనానికి అన్నీ అర్థమౌతూనే ఉన్నాయి. కుప్పంలో ఎన్ని కుప్పిగంతులేసినా చంద్రబాబుకది సొంత అడ్డాగా నిలబడదు. ఈ చేదు నిజాన్ని తెలుగు తమ్ముళ్లు మింగాల్సిందే.
– హరగోపాల్ సూరపనేని