Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: తెలంగాణలో కాంగ్రెసు స్థితి

 ఎమ్బీయస్‍: తెలంగాణలో కాంగ్రెసు స్థితి

తెలంగాణ ఎన్నికల ప్రచారం యివాళ్టితో ముగుస్తోంది. దాదాపు స్పష్టమైన రూపం వచ్చింది. మీడియా వరస చూస్తే అధికారంలోకి రావడానికి కాంగ్రెసుకు చాలా అవకాశాలు ఉన్నాయని, వచ్చినా రావచ్చుననే అభిప్రాయం కలుగుతోంది. కొందరు పరిశీలకులు కూడా ఆ దిశగా మాట్లాడుతూ యూట్యూబు వీడియోలు చేస్తున్నారు. లేటెస్టు సర్వే ఒకటి కెసియార్‌కు వ్యక్తిగతంగా రేవంత్ కంటె రెట్టింపు కంటె ఎక్కువ ప్రజాదరణ ఉందని చెప్తూనే కాంగ్రెసుకు ఎక్కువ సీట్లు వస్తాయని అంది. బిజెపిని ఎవరూ లెక్కలోకి తీసుకోవటం లేదు. బండి సంజయ్ తొలగింపు తర్వాత దాని ఊపు తగ్గిపోయిందని, తెలంగాణలో కాంగ్రెసు రాకుండా చేయడానికి బిజెపి తెరాసకు పరోక్షంగా మద్దతు యిస్తూ, నామమాత్రానికి పోటీ చేస్తోందని అంటున్నారు. అప్పడు రంగంలో ఉండేవి తెరాస, కాంగ్రెసు మాత్రమే!

కాంగ్రెసు హవా వీస్తోందని చెప్పేవారు ప్రస్తావించే అంశాలపై నా అనుమానాలు చెప్తాను. మొదటిది కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత యిక్కడ కాంగ్రెసుకి జోష్ పెరిగింది అనడం! కర్ణాటకతో పోలిక ఎందుకు రావాలి? మొన్నటిదాకా కలిసి ఉన్న ఆంధ్రతోనే పోలిక తేవడం తప్పంటున్నారుగా! అక్కడి పొత్తులు వేరే, యిక్కడి పొత్తులు వేరే అంటున్నారు. అక్కడ ఐదేళ్లకే ప్రభుత్వం మారిపోయింది. ఇక్కడ మారలేదు. అక్కడ టిడిపి ఉరకలు వేస్తోంది, యిక్కడ రణరంగంలోకే దిగనంటోంది. అక్కడ పవన్ రంకెలు వేస్తారు, యిక్కడ శాంతిబోధలు చేస్తారు. సిపిఐ నారాయణ యిక్కడ కాంగ్రెసు అంటారు, అక్కడ టిడిపి అంటారు. ఇలా సోదరరాష్ట్రంతోనే తేడాలున్నపుడు కర్ణాటకను పిక్చర్‌లోకి ఎందుకు తీసుకురావాలి? అక్కడ బిజెపి, కాంగ్రెసు రెండూ పెద్ద పార్టీలే. ప్రాంతీయ పార్టీ ఐన జెడిఎస్ కొన్ని జిల్లాలకే పరిమితం. ఇక్కడ తెరాస బలమైనది. కాంగ్రెసుది గత వైభవం. బిజెపి బలం అంతంతమాత్రం.

2018 మే కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెసు చిత్తుగా ఓడిపోయి, బిజెపికి అధికారం అప్పగించింది. 122 స్థానాల నుంచి 80కి పడిపోయింది. 2018 నవంబరు తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెసు కర్ణాటక పోలిక తేలేదుగా! అక్కడలాగే యిక్కడా ఓడిపోతాం అనలేదుగా! టిడిపితో కలిసి దున్నేస్తాం అని చెప్పుకుంది. ఇప్పుడు హఠాత్తుగా కన్నడమంత్రం పఠిస్తోంది. కర్ణాటక ఫలితం ప్రభావం ప్రజలపై ఎందుకు ఉంటుంది? అక్కడ కాంగ్రెసు యొక్క ప్రత్యర్థి వేరు, యిక్కడి ప్రత్యర్థి వేరు. ‘ప్రజలపై కాకపోయినా నాయకులపై ప్రభావం పడింది, కలిసిమెలసి పని చేస్తే విజయం సాధించగలం అనే నమ్మకం కలిగింది.’ అంటున్నారు కొందరు. ఐకమత్యమే మహాబలం అని చిన్నప్పుడే చదువుకోలేదా, యిప్పుడు కొత్తగా చెప్పాలా? కాంగ్రెసులో బహునాయకత్వ సమస్య యీనాటిదా?

తమలో ఎవరైనా ముందుకు వెళుతూంటే వెనక్కి లాగే పీతల్లాటి నేతలు కాంగ్రెసు నిండా పుష్కలం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెసు ప్రభుత్వం 2019లో ఎందుకు పడిపోయింది? సింధియా తిరుగుబాటు వలన కాదా? రాజస్థాన్‌లో పైలట్ తిరుగుబాటు చేసి చూడలేదా? ఇవన్నీ ఓటర్లపై ప్రభావం చూపుతాయని కాంగ్రెసు వాళ్లకి తెలియదా? కేవలం కర్ణాటక ఫలితం తర్వాతనే వాళ్ల కళ్లు విచ్చుకున్నాయా? ఇప్పుడైనా కాంగ్రెసు గెలిస్తే రేవంత్ రెడ్డియే ముఖ్యమంత్రి అని అతను కాక వేరెవరైనా చెప్తున్నారా? అతను  డిసెంబరు 9న ప్రమాణస్వీకారం చేస్తా అని చెప్పుకుంటే ఔను, చేస్తాడు అని ఎవరైనా ప్రకటించారా? జలగం వెంగళరావు తర్వాత ఖమ్మం నుండి సిఎంను నేనే అని భట్టి విక్రమార్క చెప్పుకుంటే ఔను అని ఎవరైనా అన్నారా? దళితుడే ముఖ్యమంత్రి అంటూ భట్టి వర్గీయులు యిటీవల ప్రచారం మొదలెట్టారట.

ఒక్క రేవంత్ రెడ్డి తప్ప వేరే ఏ లీడరైనా పక్కవాళ్ల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నాడా? ఎవరికి వారు వాళ్ల గెలుపు కోసమే చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కుర్చీపై ఆశ పెట్టుకున్న అరడజను మంది కూడా పక్క నియోజకవర్గానికి వెళ్లటం లేదు. కాంగ్రెసు గెలిస్తే మాత్రం ముఖ్యమంత్రిగా నేనంటే నేనని ముందుకు వస్తారు. ఇప్పటిదాకా తమ సత్తా చాటనివాళ్లందరూ హఠాత్తుగా నాయకులై పోతారా? కర్ణాటకలో ఐక్యంగా ముందుకు వెళ్లారు కాబట్టి గెలిచారు అని అధిష్టానం తెలంగాణ కాంగ్రెసీయులకు సుద్దులు చెప్పవచ్చు. ఫలితాల తర్వాత ఏపాటి ఐక్యత కనబడింది? వారం రోజుల దాకా సిద్దరామయ్య, డికెల మధ్య సిగపట్లు నడిచాయి. ఎవరూ తగ్గలేదు.

చివరకు డికెకు ఎవరో స్వామీజీ చెప్పారనో, సోనియా బుజ్జగించిందనో తగ్గాడు. రెండున్నరేళ్ల తర్వాత పంచాయితీ ఖాయం. పదవి అప్పగిస్తానని సిద్ధరామయ్య ఒప్పుకున్నాడని డికె, అలాటిదేమీ లేదని సిద్ధరామయ్య పేచీలు పెడతారు. 2018లో కాంగ్రెసు-జెడిఎస్ మిశ్రమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి కుమారస్వామికి యిచ్చారనే కోపం మీదనే సిద్దరామయ్య తన అనుచరులను బిజెపిలోకి పంపి ప్రభుత్వాన్ని కూల్చాడు. ఇప్పుడు సిద్దరామయ్య మీద కోపంతో డికె మరో ప్లాను వేయడన్న నమ్మకమేమిటి? అధిష్టానమంటే భయం ఉంటేనే, కాంగ్రెసు నాయకుల్లో ఐక్యత సాధ్యం. ప్రస్తుత అధిష్టానం ఎంత బలహీనంగా ఉందో అశోక్ గెహలోత్ ఉదంతం నిరూపించింది. నిన్ను పార్టీ అధ్యక్షుణ్ని చేశాం, ముఖ్యమంత్రి పదవి వదిలేయ్ అంటే, తన ఎమ్మెల్యేల చేత తిరుగుబాటు చేయించాడతను. సోనియా కళ్లప్పగించి చూసింది.

కర్ణాటక కాంగ్రెసులో సిద్ధరామయ్య ఒకలా, డికె మరొకలా ఓటర్లను ప్రభావితం చేయగలిగారు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సిద్దరామయ్య సంక్షేమ పథకాలు అమలు చేశాడనే యిమేజి కారణంగా ప్రజలు అతనివైపు మొగ్గారు. తెలంగాణ కాంగ్రెసు నాయకుల్లో అలాటి రికార్డు ఎవరికి ఉంది? రేవంత్ మంత్రిగా కూడా చేయలేదు. డికెకు మంచి ఆర్గనైజింగ్ కేపబిలిటీ ఉంది. ఖర్చు పెట్టే సత్తా, మనసు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెసు నాయకుల్లో క్యాడర్ కోసం ఖర్చు పెట్టే వాళ్లు ఎవరున్నారు?

కర్ణాటక కాంగ్రెసుకు బలం ఎంత ఉన్నా, బిజెపి ప్రభుత్వం చేసిన పొరపాట్లే వాళ్లకు అధికారం తెచ్చిపెట్టాయి. ఫిరాయింపులతో సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత తరచుగా ముఖ్యమంత్రులు మారి, 40శాతం కమిషన్ల ప్రభుత్వమనే పేరుబడి, మతపరంగా సమాజంలో అలజడి కలగచేసి.. యిలాటి పొరపాట్ల కారణంగానే కర్ణాటక ప్రజలు బిజెపిని తిరస్కరించారు. తెలంగాణలో అలాటి పరిస్థితి ఎక్కడుంది? తెరాస ఫిరాయింపులను ప్రోత్సహించింది కానీ అంతకు ముందే, సొంత మెజారిటీతో ప్రభుత్వం ఏర్పరచింది. సుస్థిరపాలన అందించింది. మతఘర్షణలు లేవు. అవినీతి పుష్కలంగా ఉంది కానీ ఫిర్యాదు చేసినవారు లేరు. కవిత వ్యవహారాన్ని బిజెపితో లాలూచీ పడి, సంబాళించుకున్నా రనుకోవాలి. ఏది ఏమైనా కర్ణాటకలో బిజెపి అవినీతిపై కాంగ్రెసు నిరంతర పోరాటం చేసింది. దానికి తగ్గ బలగం, నాయకత్వం దానికి ఉంది.

తెలంగాణలో యీ మధ్య కదా కాంగ్రెసు హడావుడి మొదలుపెట్టింది. అంతకుముందు బిజెపి తరఫున బండి సంజయ్ హల్‌చల్ చేశాడు. కానీ దేన్నీ లాజికల్ కన్‌క్లూజన్‌కు తీసుకుని రాలేకపోయారు. కాంగ్రెసు తరఫున అవినీతి గురించి పోరాడాలంటే భట్టి విక్రమార్క వంటి క్లీన్ యిమేజి ఉన్నవాడు పోరాడాలి. కానీ ఆయన నిన్నటిదాకా జిల్లా స్థాయి నాయకుడే. ఇప్పుడే కాంగ్రెసు పోస్టర్ల మీద రేవంత్‌తో పాటు కనబడసాగాడు. కెసియార్‌తో పోల్చగల స్థాయి ఆ యిద్దరికీ లేదు. పోస్టర్లపై భట్టి బొమ్మ అంటే భట్టికి ప్రమోషను, కాంగ్రెసుకు రివర్షన్ అన్నమాట. ఇక రేవంత్‌ది దారుణమైన యిమేజి. దేశం మొత్తంలో లంచాన్ని యిస్తూ రెడ్‌హేండెడ్‌గా కెమెరాలకు పట్టుబడ్డ నాయకుడు యితనే అనుకుంటాను. తనను ఆ కేసులో పట్టిచ్చిన కెసియార్ కుటుంబంపై వ్యక్తిగత కక్షతోనే రేవంత్ అంతటి తీవ్రమైన భాష వాడుతున్నాడని అందరికీ అనిపిస్తుంది. జగన్ బెయిలు మీద ఉన్న ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేసే టిడిపి వారు యిక్కడ రేవంత్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం వింతగా ఉంది. అతనూ బెయిలు మీదే ఉన్నాడుగా!

కర్ణాటక ప్రయోగాన్ని యిక్కడా చేయాలని తెలంగాణ కాంగ్రెసు ఎందుకు అనుకుంటోందో నాకు అర్థం కావటం లేదు. అలాటి హామీలే యిక్కడా యిస్తున్నారు. ఆర్నెల్లలో మా ప్రభుత్వం సాధించిన విజయాలు అంటూ కర్ణాటక ప్రభుత్వం యిక్కడి పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ యిస్తోంది. ఇసి దానికి ఆక్షేపణ తెలిపింది. ‘మా హామీలు నెరవేర్చకుండా కేంద్రంలోని బిజెపి అడ్డుపడుతోంది’ అని ఓ పక్క సిద్దరామయ్య ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అన్నభాగ్యకు బియ్యం దొరక్కుండా చేశారని వాపోతున్నాడు. అంతలోనే హామీలు అద్భుతంగా అమలు చేశామని గొప్పలకు పోతున్నారు. అక్కడి ప్రజల అవసరాలేమిటో, యిక్కడి ప్రజల అవసరాలేమిటో స్టడీ చేసి మానిఫెస్టో రూపొందించాలి కానీ కట్ అండ్ పేస్ట్ చేస్తే లాభమేమిటి? పైగా కర్ణాటకను ఆదర్శ రాష్ట్రంగా ప్రొజెక్టు చేయబోవడమేమిటి?

నిజంగా అది అంత గొప్పగా ఉంటే ఆ క్రెడిట్ ఆర్నెల్ల క్రితం దాకా పాలించిన బిజెపికి పోతుంది. ఆర్నెల్ల క్రితమే కాంగ్రెసు ‘కర్ణాటక అత్యంత అధ్వాన్నంగా తయారైంది, మేం వచ్చి ఉద్ధరించాల్సిందే’ అంది. ఈ ఆర్నెల్లలోనే దాన్ని స్వర్గధామం చేసేశారా? విద్యుత్ విషయమే తీసుకోండి. రేవంత్ తెలివితక్కువగా 24 గంటల విద్యుత్ ఎందుకు? మూడు గంటలు చాలన్నాడు. కర్ణాటకలో దానితోనే సరిపెడుతున్నారు అన్నాడు. విద్యుత్ సరఫరా, చవక లేదా ఉచిత విద్యుత్ అనేవి తెలంగాణ వ్యవసాయానికి అత్యంత కీలకమైన అంశాలు. ఆ సమస్యను గుర్తించి, దానికై పోరాడడంలోనే కెసియార్ మేధస్సు కనబడుతుంది. చంద్రబాబుతో ఆ విషయంగానే పేచీ పెట్టుకుని బయటకు వచ్చి తెరాస ప్రారంభించాడు. ఆ అంశం తీవ్రత గమనించిన వైయస్ ఉచిత విద్యుత్ నినాదంతో అధికారంలోకి వచ్చాడు. ఉచిత విద్యుత్తును ఎద్దేవా చేసిన చంద్రబాబు యింటికి వెళ్లి పదేళ్లపాటు ప్రతిపక్షంలో మగ్గాడు.

వైయస్ ఉచిత విద్యుత్ అమలు చేసి, తెలంగాణ రైతుల్లో ఆదరణ పొంది, మళ్లీ గెలిచాడు. రాష్ట్రాన్ని విభజిస్తే విద్యుదుత్పాదన సౌకర్యం లేని తెలంగాణ చీకట్లో మగ్గుతుందని కిరణ్ కుమార్ రెడ్డి భయపెట్టాడు కూడా. ఏం ఫర్వాలేదు, ఛత్తీస్‌గఢ్ నుంచి కొంటాం అన్నాడు కెసియార్. అన్నట్లు గానే ముఖ్యమంత్రి కాగానే కొంటున్నాడు కూడా. ఏ ధరకు కొంటున్నాడు, ఎంత బకాయి పెట్టాడు అనేది వేరే విషయం. ఏది ఏమైనా తెలంగాణలో విద్యుత్ సరఫరా బాగుంది. గ్రామాల్లో 24 గంటలు యివ్వటం లేదని రేవంత్ అంటున్నది ఏమేరకు నిజమో నాకు తెలియదు కానీ సిటీలో అప్పుడప్పుడు తప్ప మామూలుగా యిబ్బంది లేదు. కరోనా టైములో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే రోజుల్లో యిది ఎంతో ఉపయోగపడింది. విద్యుత్ సరఫరా బాగుంది కాబట్టే కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, పారిశ్రామిక ప్రగతి సాగుతోంది.

విద్యుత్ సరఫరా తగ్గిస్తాను అని రేవంత్ అనడం ఏమంత తెలివైన పనో నాకు అర్థం కాలేదు. ‘అబ్బే, సిటీలో తగ్గించను, పరిశ్రమలకు తగ్గించను, కేవలం వ్యవసాయ దారులకు మాత్రమే తగ్గిస్తాను’ అని సవరించుకుంటే రైతులకు మండుతుంది, ఏం మేమేనా అంత తేరగా దొరికినది అని. గ్రామీణులకూ మండుతుంది, సిటీలో షాపులన్నీ దీపావళిలా వెలిగిపోతూ ఉంటే మా యిళ్లల్లో మాత్రం చీకట్లు కమ్ముకోవాలా? మా పిల్లలు చదువు కోనక్కరలేదా? మాకు ఓటిటి సినిమాలు చూసుకునే సౌకర్యం ఉండకూడదా? అని. రేవంత్ విద్యుత్ గురించి ఎత్తగానే తెరాస వాళ్లు తగులుకున్నారు. కర్ణాటక రైతులు చూడండి, విద్యుత్తు లేక కడుపు మండి కరంటు ఆఫీసులో మొసలి విడిచిపెట్టారు అని గుర్తు చేశారు. కొందరు కర్ణాటక రైతుల చేత తెలంగాణలో ప్రదర్శనలు కూడా యిప్పించారు.

కర్ణాటకలో విద్యుత్ ఎన్ని గంటలు యిస్తున్నారు అనేది ఎన్నికల అంశంగా మారింది. చివరకు డికె వచ్చి మొదట్లో రిపేర్ల గురించి షట్‌డౌన్ చేశాం కానీ తర్వాత ప్రాంతాన్ని బట్టి రోజుకి 5,6,7 గంటల కరంటు యిస్తున్నాం అన్నాడు. అలా ఒప్పుకుంటూనే తెలంగాణ ప్రభుత్వంలా మేం విద్యుత్ చెల్లింపుల బకాయిలు పెట్టలేదు అని చెప్పుకున్నాడు. తమరు అధికారంలోకి వచ్చి ఆర్నెల్లే అయింది కాబట్టి అటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఘనత బిజెపికే పోతుంది. ప్రజలకు కావలసినది నిరంతర విద్యుత్తు. ప్రభుత్వం అరువు చేసి తెచ్చిందా, అప్పు చేసి తెచ్చిందా అన్నది వాళ్లకు పట్టదు. నిరంతర విద్యుత్తు యివ్వాలన్న సంకల్పమే మాకు లేదు అని కాంగ్రెసు పార్టీ యిక్కడ చెప్పడమే పెద్ద దెబ్బ. దాన్ని తెరాస దొరకబుచ్చుకుని రైతులను అడలగొడుతోంది.

కాంగ్రెసుకి ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలు ఏడుగురే. 2018 నుంచి 12 మంది పార్టీ వదిలి పోయారు. ఒక్క ఉపయెన్నికలో కూడా నెగ్గలేదు. జానారెడ్డి లాటి వాళ్లే ఓడిపోయారు. ఉన్న మునుగోడును తెరాసకు పోగొట్టుకుంది. ఇలాటి పరిస్థితుల్లో కాంగ్రెసుకి ప్రజాదరణ పెరుగుతోంది, విజయానికి చేరువగా ఉంది అని ఎలా తీర్మానించగలరు? మీడియాతో వచ్చిన యిబ్బంది ఏమిటంటే, వాళ్లు క్షేత్రస్థాయికి వెళ్లి పథకాలు ఎలా అమలు అవుతున్నాయి అని పరిశీలించి, పరిశోధించి రిపోర్టులు తయారు చేయటం లేదు. గ్రామగ్రామాన వాళ్లకు రిపోర్టర్లు ఉన్నా (కరోనా టైములో చాలామందిని తీసేశారట) యాజమాన్యాలు వాళ్లకా పని అప్పగించటం లేదు. వారికి జీతాలే యివ్వరని, అడిగితే ‘ఊళ్లో పెద్దవాళ్లపై నెగటివ్ వార్త రాస్తానని బెదిరించి, సంపాదించుకో’ అంటారని వినికిడి. ప్రస్తుతం మీడియా చేస్తున్నదేమిటంటే ఎవరైతే గట్టిగా నోరు పెట్టుకుని అరుస్తారో, తిడతారో వాళ్లకు కవరేజి యిచ్చి, వాళ్ల కారణంగా పార్టీ కార్యకర్తల్లో, ప్రజల్లో జోష్ వచ్చిందని, యీసారి వారి గెలుపు తథ్యమనీ రాసేయడం!

బండి సంజయ్ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో యింకేముంది తెరాస పని అయిపోయింది, బిజెపిదే తెలంగాణ అంటూ రాసేశారు. సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించగానే మొత్తం చప్పబడి పోయింది అనేస్తున్నారు. పైన మోదీ-అమిత్ అలాగే ఉన్నారు. పార్టీ యంత్రాంగం, ఆరెస్సెస్ కాల్బలం అలాగే ఉంది. జస్ట్ రాష్ట్ర అధ్యక్షుణ్ని మార్చగానే పార్టీ బలం యావత్తూ యిగిరిపోతుందా? పార్టీకి ఓటేద్దామను కున్నవారు మానేస్తారా? నాన్సెన్స్. బండి హయాంలో పార్టీ బలం పెరగలేదని ఎన్నికలు దగ్గర పడేసరికి రుజువైంది. అతని హయాంలో కూడా పార్టీలో నాయకులెవరూ చేరలేదు కదా! కోమటిరెడ్డి వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోయాడు. ఎన్నికలు దగ్గర పడేసరికి, ఆశావహులు కాంగ్రెసు వైపు చూశారు. ఎందుకంటే కెసియార్ సిటింగ్ ఎమ్మెల్యేలలో ఏ పదిమందికో తప్ప తక్కిన వారందరికీ టిక్కెట్లు యిచ్చాడు. అక్కడ ఛాన్సు లేదు. ఇవతల కాంగ్రెసు రారమ్మని బతిమాలుతోంది. బిజెపి కాడి పారేసి కూర్చుంది. అందుకని చేరారు.

ఇదంతా రేవంత్ ప్రజ్ఞే, బండి తరహాలో ఆయనా గొంతు చించుకుని ప్రగల్బాలు పలుకుతున్నాడు కాబట్టి, కాంగ్రెసు బలపడి పోయిందని అనుకోవడం భ్రమ అని నా ఉద్దేశం. పార్టీ బలపడింది అని ఎవరైనా చెప్పాలంటే ఫలానా ఎన్నికలో దానికి యిన్ని ఓట్లు పెరిగాయి చూడండి అని చెప్పగలగాలి. అది లేకుండా పేపర్లో, టీవీల్లో స్టేటుమెంట్లు చూపించి ఊహిస్తే ఎలా? రేవంత్ వచ్చాక ఏమైంది? మునుగోడు కాంగ్రెసు చేజారి తెరాస ఖాతాలో పడింది. ‘ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా పట్టుబడి పరువు పోగొట్టుకున్న రేవంత్ చంద్రబాబు మనిషి, తను రావడమే కాక టిడిపి వాళ్లందరినీ పార్టీలోకి తెచ్చి, కాంగ్రెసును పసుపుమయం చేస్తూ తనో పెద్ద లీడర్నంటూ పోజు కొడుతూ, ఎప్పణ్నుంచో పార్టీ కోసం కష్టపడిన మామీద పెత్తనం చలాయిస్తాడేమిటి’ అని కాంగ్రెసు సీనియర్లు, జూనియర్లు అందరూ కారాలు, మిరియాలు నూరుతూ వచ్చారు.

రేవంత్ టిడిపి మనిషి కాబట్టి తెలంగాణలోని ఆంధ్రమూలాల వారందరూ అతని మొహం చూసి కాంగ్రెసుకు ఓటేసి గెలిపించేస్తారని తెలుగు మీడియా ఊదరగొడుతోంది. 2018లో టిడిపి ప్రత్యక్షంగా పోటీ చేసినప్పుడే దానికి 3.5శాతం ఓట్లు వచ్చాయి. 14 సీట్లలోనే పోటీ చేసింది కాబట్టి అన్ని వచ్చాయి, అని వాదిస్తే దాని బలం అక్కడే ఉందన్నమాట అనే సమాధానం వస్తుంది. పోనీ తక్కిన చోట్ల అది కాంగ్రెసుకు బదిలీ చేసిన ఓట్ల శాతం కూడా కలిపినా 4శాతం అవుతుంది. 2018 తర్వాత టిడిపి పరిస్థితి యిక్కడ యింకా దిగజారింది. 2019లో ఆంధ్రలో అధికారం పోగొట్టుకున్న బాబు, లోకేశ్ అప్పణ్నుంచి ఆంధ్రకు విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉంటూ యిక్కడే ఉంటున్నారు. ఇక్కడే ఉన్నాం కదాని పోనీ తెలంగాణ వ్యవహారాలు పట్టించుకున్నారా? అదీ లేదు.

ఆ నిర్లిప్తత చూసి విసిగిపోయి రాష్ట్ర అధ్యక్షులే తెరాసలోకి వెళ్లిపోయారు. అయినా బాబు చలించలేదు. బిజెపిని ఊరించడానికి కాసాని చేత ఖమ్మంలో సభ పెట్టించారు కానీ ఫాలో అప్ లేదు. కాంగ్రెసు ప్రయోజనాల కోసం యీసారి పోటీ చేయవద్దని అంటే కోపం వచ్చిన కాసాని యింకెందుకు యీ పార్టీ అంటూ వెళ్లిపోయారు. ఆయన స్థానంలో వేరెవరూ యింకా ముందుకు రాలేదు. ఇలాటి స్థితిలో ఉన్న పార్టీకి యింకా గట్టి ఓటు బ్యాంకు ఉందని, యితరులకు బదిలీ కూడా చేయగలదని నమ్మాలంటే కష్టంగా లేదా? తెలంగాణలో ఉన్న ఆంధ్రమూలాల వారందరూ టిడిపి అనుయాయులని, ఆల్మోస్ట్ కమ్మవారనీ చేసే విశ్లేషణలు చూస్తే నాకు నవ్వు వస్తుంది.

కొందరు కమ్మలు పని గట్టుకుని కెసియార్ గతంలో ఆంధ్రులను తిట్టిన దుర్మార్గుడని, తనని ఓడించడానికై కాంగ్రెసుకు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. కానీ రేవంత్ ఏమైనా తక్కువ తిన్నాడా? నాలుగు రోజుల క్రితం కూడా కెసియార్ సమైక్యరాష్ట్రంలో ఆంధ్రపాలకుల వంటి దుర్మార్గుడు అన్నాడు. ఆంధ్రమూలాల వారికి అతన్ని అక్కున చేర్చుకోవాల్సిన పనేముంది?  అయినా ఆ ప్రొజెక్షన్ మానలేదు. దానికి అనుకూలంగా ఉండేట్లు సర్వేలు చేయిస్తున్నారు కొందరు. నాకు యీ మధ్య టెలిఫోనిక్ సర్వేలు అంటూ మూడు కాల్స్ వచ్చాయి. రాబోయే ఎన్నికలలో ఏ పార్టీకి ఓటేస్తారు? ఎందుకు? అని అడగడం సాధారణం. అబ్బే, ఎత్తుకోవడమే, ‘మీరు ఆంధ్రవాళ్లా? తెలంగాణ వాళ్లా? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారా?’ అని ప్రశ్న.

ఏమిటీ నాన్సెన్స్? పూర్తి స్థాయి సర్వే అయితే యీ ప్రశ్న ఏ పదిహేను ప్రశ్నల తర్వాతనో రావాలి. రాష్ట్రజనాభాను ప్రాంతాల వారీగా విడగొట్టి చూసే యీ ధోరణి చికాకు పుట్టించింది నాకు. అందుకే కాల్స్ కట్ చేశాను. ఒకవేళ కాంగ్రెసు గెలిస్తే మా వలననే అని టిడిపి ప్రచారం చేసుకుంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. అది కూడా మా వల్లే అని కొన్ని కమ్మ సంఘాలు బోర విరుచుకోవచ్చు. ఎవరి పిచ్చి వారికి ఆనందం, మనమేం చేస్తాం? ఇంతకీ తెలంగాణ యిచ్చింది కాంగ్రెసు కదా, దానికి విజయావకాశాలు పెద్దగా లేవంటారా? అని అడిగేవారు నా తర్వాతి వ్యాసం ‘‘కెసియార్ హేట్రిక్?’’ చదవగోర్తాను.

- ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?