cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ధృతరాష్ట్రుడు యిప్పటికీ ఉన్నాడు

ఎమ్బీయస్‍: ధృతరాష్ట్రుడు యిప్పటికీ ఉన్నాడు

మహాభారత పాత్రల్లో యిప్పటికీ రిలెవంట్‌గా వుండే పాత్ర ధృతరాష్ట్రుడు. సంతానం పట్ల గుడ్డి ప్రేమ కనబరచిన అతను ఒక రకంగా మనందరిలో వున్నాడు, ఇక ముందూ వుండబోతాడు, చిరంజీవి అనవచ్చు. అతనికి ఉన్న శారీరక దారుఢ్యం, బుద్ధివిశేషాలు, అంధత్వం మనకు లేకపోవచ్చు. కానీ పిల్లలు తప్పులు చేసినా వెనకేసుకుని రావడం, వాళ్లు పైకి రావడానికి పక్కవాళ్ల అడ్డు తొలగించడం అనే లక్షణాలు మనందరిలో కొద్దోగొప్పో ఉన్నాయి. మన చేతిలో ధనమో, రాజకీయ అధికారమో, పాలనాధికారమో, పలుకుబడో వుంటే యిక చెప్పనక్కరలేదు. కొడుకెంత అసమర్థుడని తేలినా అధికారం కట్టబెట్టి, అతనిపై ఎందరు ఫిర్యాదులు చేస్తున్నా పెడచెవిన పెట్టి, అనర్థం జరిగినప్పుడు విధిలిఖితమని సరిపెట్టుకుంటూ అనేకమంది కాలం గడపడం చూస్తూంటాం. కొడుకు దుశ్చేష్టలు చేశాడని రుజువై పోయినా, దానికి కారణం అది పక్కవారి సావాస ఫలితమని, ఎదుటివారి కవ్వింపు కారణంగా జరిగిందని బుకాయించడమూ చూశాం. అలాటి తండ్రుల గతి ఏమైందో ధృతరాష్ట్రుడి జీవితం ద్వారా మహాభారతం చెప్తుంది.

ముందుగా ధృతరాష్ట్ర, పాండురాజాదుల పుట్టుకకు కారణమైన నియోగపద్ధతి గురించి డాక్టర్ గుంటుపల్లి రామారావుగారు ‘మహాభారత వైజయంతి’లో రాసిన వ్యాసం నుంచి సేకరించినది రాస్తాను. భీష్ముడు రాజ్యం చేపట్టనని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి శంతనుడి అనంతరం అతనికి, సత్యవతికి పుట్టినవారిలో మిగిలిన విచిత్రవీర్యుడు రాజు అయ్యాడు. భీష్ముడు అతనికి అంబిక, అంబాలికలను తెచ్చి పెళ్లి చేశాడు. వారికి పిల్లలు కలిగే లోపునే అతను క్షయవ్యాధి పీడితుడై చనిపోయాడు. సంతానం కోసం వేరే ఎవరి ద్వారా నైనా వీర్యదానం చేయించాలని సత్యవతి నిశ్చయించింది. భారతకాలం నాటికి కొన్ని రంగాల్లో శాస్త్రవిజ్ఞానం పెరిగినా, భౌతికమైన కలయిక జరగకుండా వీర్యదానం చేయడం తెలియదని అనుకోవాలి. అందువలన తనకు పరాశరుడి వలన పుట్టిన వ్యాసుణ్ని పిలిచి, మరదళ్లతో శయనించి, రాజ్యం అరాచకం కాకుండా చూడమని కోరింది సత్యవతి.

సంతానోత్పత్తికి వేరేవాళ్లను నియోగించే నియోగపద్ధతి చరిత్ర కందని ప్రాచీనకాలం నుంచి భారతదేశంలో ఒక సామాజిక ధర్మంగా వున్నట్లు తెలుస్తుంది. ఋగ్వేదంలో నియోగవిధానం ప్రసక్తి వుంది. భర్తను కోల్పోయిన యువతి సంతానం కోసం మరిదిని ఆహ్వానించడం యాజకుడు (యజమాని తరఫున యజ్ఞం చేసే పురోహితుడు) దేవతలను ఆహ్వానించటంతో పోల్చబడింది. అయితే నియోగవిధానం విషయంలో ధర్మశాస్త్రాలలో ఏకాభిప్రాయం లేదు. గౌతమ ధర్మసూత్రం దాన్ని అంగీకరిస్తూనే నియోగం వలన పొందే సంతానం యిద్దరికి మించకూడదని చెప్పింది. మనుస్మృతి ఒక్కడికి మించకూడదని అంటూనే కొన్ని సందర్భాల్లో యిద్దరిని పొందడం ధర్మబద్ధమే అంది. వశిష్టధర్మసూత్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం, యాజ్ఞవల్క్యస్మృతి వంటివి నియోగధర్మాన్ని అంగీకరిస్తున్నాయి. ఆపస్తంబధర్మసూత్రం, బోధాయన ధర్మసూత్రం వంటివి కొన్ని నిరసిస్తున్నాయి.

పాండురాజు కుంతిని దుర్వాసమహర్షి వరం వలన క్షేత్రజసంతానం (పుట్టినవారు తల్లికి చెందే పద్ధతి) పొందమని కోరే సమయంలో నలుగురితో కూడిన పొందిన స్త్రీ స్వైరిణి, ఐదుగురితో కూడిన స్త్రీ బంధకి (దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని కురుసభలోకి యీడుస్తూ ‘రావే బంధకీ’ అంటాడు) అవుతుందని చెపుతాడు. కానీ ఎంతమంది పిల్లలను పొందవచ్చననే అంశం చెప్పలేదు. ముగ్గురి వరకు ఫర్వాలేదన్నాడు కాబట్టి కుంతి ముగ్గురితో ఆపింది. (అంతకు ముందే సూర్యుడితో కలిసిన విషయం కుంతి భర్తకు చెప్పలేదు) పాండవుల్లో తక్కిన యిద్దరు మాద్రికి కలిగినవారు. నియోగవిధానంలో కలిగిన పిల్లలు ఎవరికి చెందుతారు అనే విషయంలో సూత్ర గ్రంథాలు విభేదించాయి. ఋగ్వేదంలో వీర్యదాతకు చెందుతారని వుంది. వశిష్ట ధర్మసూత్రం కూడా అలాగే చెప్పింది.

భర్తే భార్యను సంతానార్థమై నియోగిస్తే ఆ సంతానం భర్తకు చెందుతుంది అని గౌతమసూత్రం చెప్పింది. (ధర్మరాజాదులు ఆ విధంగా పాండురాజు పుత్రులయ్యారు). భర్త మరణించిన తర్వాత పెద్దలు ఆ కాంతను పుత్రార్థం నియోగించినట్లయితే ఆ సంతానం వీర్యదాతకు చెందుతుంది అని కూడా చెప్పింది. అంటే ఈనాటి సరోగసీ కంటె పై మెట్టు అన్నమాట. గర్భాన్ని అద్దె కివ్వడమే కాక, శయనించడం కూడా! మనుస్మృతి ప్రకారం వివాహం నిశ్చయమై వివాహానికి ముందే భర్త చనిపోతే, వరుడి సోదరుడు ఆ కన్యను వివాహమాడి, సంతానాన్ని కంటే ఆ సంతానం చనిపోయినతనికి చెందుతుంది. నియోగం వలన పుట్టిన పిల్లవాడు తల్లికి చెందిన సందర్భాలలో క్షేత్రజుడు అని పిలుస్తారు. క్షేత్రజుడు కావాలంటే వీర్యదాత బావ లేదా మరిది కానీ, కనీసం సగోత్రుడు కానీ కావాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. వ్యాసుడు విచిత్రవీర్యుడికి తల్లి ద్వారా సవతి సోదరుడు అవుతాడు కాబట్టి యీ సూత్రాన్ని అనుసరించి ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులను విచిత్రవీర్యుడి సంతానంగా లెక్కించి వుంటారు.

సంభోగసమయంలో వ్యాసుడి భీకరరూపం చూసి భయపడిన అంబిక కళ్లు మూసుకోవడంతో ధృతరాష్ట్రుడు పదివేల ఏనుగుల బలంతో పుట్టినా గుడ్డివాడిగా పుట్టాడు. అంబాలిక భయంతో పాలిపోయింది కాబట్టి పాండురాజు పాండువర్ణంతో (పాండురోగంతో కాదు) పుట్టాడు. ధృతరాష్ట్రుడు జ్యేష్ఢుడైనా అంధుడు కాబట్టి, వేదవేదాంగాలు నేర్చాడు కానీ, యుద్ధవిద్యలు నేర్వలేక పోయాడు కాబట్టి రాజు కాలేకపోయాడు. యుక్తవయసు వచ్చాక పాండురాజు పట్టాభిషిక్తుడయ్యాడు. అతను కుంతి, మాద్రిలను పెళ్లాడాడు. ఇక ధృతరాష్ట్రుడికి సుభానుడు అనే రాజు కుమార్తె గాంధారితో భీష్ముడు పెళ్లి కుదిర్చాడు. తండ్రి నీకు కాబోయే భర్త ఫలానా అని చెప్పగానే ఆమె ‘నా భర్తలో వున్న లోపాన్ని నేను చూడకూడదు’ అనుకుని ఆమె ఒక బట్టను తెప్పించుకుని కళ్లకు కట్టుకుంది.

పాండురాజు దిగ్విజయయాత్ర చేసి, రాజ్యాన్ని విస్తరింపచేసి, అశ్వమేధయాగం చేశాడు. గెల్చుకుని వచ్చినదాన్ని ధృతరాష్ట్రుడి చేతికిచ్చాడు. తనకు ఋషిశాపం తగలగానే వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలని అనుకుని, రాజ్యాన్ని ధృతరాష్ట్రుడుకి అప్పగించి, అడవులకు వెళ్లిపోయాడు. అందువలన ధృతరాష్ట్రుడిది సింహాసనంపై గౌరవాధ్యక్ష పదవియే తప్ప స్వయంసిద్ధ అధికారం కాదు. పాండురాజుకి కొడుకులు పుట్టాక వాళ్లకే సింహాసనంపై అధికారం ఉంది. అయినా వాళ్లు పెదతండ్రిపై గౌరవం కొద్దీ ఆయనను దిగమని అడగలేదు. అది అలుసుగా తీసుకుని దుర్యోధనుడు ‘మా నాన్నదే రాజ్యం, ఆయన పెద్ద కొడుకుగా తర్వాతి అధికారం నాదే’ అనసాగాడు. భీష్ముడే కాదు, ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా వేర్వేరు సందర్భాల్లో నీ వాదన తప్పని దుర్యోధనుడికి చెప్పారు. అయినా అతను వినలేదు. కానీ ధర్మసూక్ష్మం తెలిసినవాడు కాబట్టి ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు 30 ఏళ్లు నిండగానే అతన్నే యువరాజుగా చేశాడు. తర్వాత అర్ధరాజ్యం యిచ్చి ఇంద్రప్రస్థానికి పంపాడు. ఈ విధంగా తన కొడుకు దుర్యోధనుడికి శాంతియుతంగా సగం రాజ్యం కట్టబెట్టానని సంతోషించాడు. కానీ దుర్యోధనుడి ఆశకు, అసూయకు అంతు లేకపోవడంతో జూదం, దానిలో పాండవుల ఓటమి, యుద్ధంలో కౌరవుల ఓటమి జరిగి చివరకు రాజ్యమంతా పాండవులది అయింది.

పాండురాజు అరణ్యంలో వున్న సమయంలోనే గాంధారి గర్భం దాల్చింది. రెండు సంవత్సరాలయినా ప్రసవం కావటం లేదు. ఈలోగా కుంతికి ధర్మరాజు పుట్టాడని తెలియగానే అసూయతో గాంధారి కడుపు మీద కొట్టుకోవడంతో ప్రసవమై ఒక మాంసపిండం బయటపడింది. దాని నుంచి వ్యాసుడు దుర్యోధనాది వంద పుత్రులను, దుశ్శల అనే కూతుర్ని తయారుచేసి యిచ్చాడు. గాంధారి యీ దశలో వుండగా ధృతరాష్ట్రుడు తనకు సేవ చేస్తున్న ఒక వైశ్యయువతి ద్వారా యుయుత్సువు అనే కొడుకుని కన్నాడు. కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో ఎవరైనా కావలిస్తే మాతో చేరవచ్చు అని ధర్మరాజు ఆఫర్ యిచ్చినపుడు యితను పాండవపక్షంలో చేరాడు. ధృతరాష్ట్రుడి కొడుకులలో యుద్ధంలో చావకుండా మిగిలినవాడు ఇతనొక్కడే. 

ధృతరాష్ట్రుడు అడుగడుగునా తన పుత్రప్రేమను కనబరుస్తూనే వుండడం గురించి అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఘట్టాన్ని వివరించటం లేదు. ‘మహాభారతంలో రాయబారాలు’ పేర వ్యాసం రాసినపుడు ఆ సమయాల్లో అతని కపటం గురించి రాస్తాను. భీష్మద్రోణులు హితవు చెప్పినప్పుడు అతను విన్నట్లు నటిస్తూనే వుంటాడు. మళ్లీ కొడుక్కి నచ్చినట్లే ప్రవర్తిస్తాడు. అదేమిటని అడిగితే ‘మా అబ్బాయి నా మాట వినటం లేదు’ అని వాపోతాడు. ‘నువ్వు రాజువి కదా, నువ్వు ఆదేశిస్తే ఎవడు కాదనగలడు?’ అని సూటిగా అడిగితే ‘అంతా నా కర్మానికి వచ్చింది’ అంటూ దొంగవేషాలు వేస్తాడు. అన్నిటికంటె విచిత్రం, రాత్రిపూట విదురుణ్ని పిలిపించి నీతులు చెప్పించుకోవడం, మర్నాటికి వాటిని అటకెక్కించడం. భారతం ఒరిజినల్‌లో యిన్ని విదురప్రసంగాలు వున్నాయనుకోను. భారతాన్ని సమగ్ర నీతిశాస్త్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో యీ ప్రసంగాలు చేరుస్తూ పోయారు కాబట్టే లక్ష శ్లోకాలకు విస్తరించింది. ఏది ఏమైనా విదురుడు చెప్పిన నీతి శ్రవణానందానికే తప్ప ధృతరాష్ట్రుడు తలకు ఎక్కించుకోలేదు. తను అనుకున్నదే చేశాడు. ధర్మమనేది మరొకరి నుంచి వినడానికో, మరొకరికి చెప్పడానికో కాదు. ఆచరించి చూపాలి. అప్పుడే జీవితానికి సార్ధకత.

పక్షపాతబుద్ధితో తమ్ముడి సంతానానికి అన్యాయం చేస్తూ, పుత్రప్రేమతో దుర్వర్తనుడైన దుర్యోధనుణ్ని వారించకుండా యుద్ధం జరగనిచ్చినందుకు ధృతరాష్ట్రుడికి దక్కినదేమిటి అనేది చెప్తాను. యుద్ధం ముగిసి, దుర్యోధనుడు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోయాక ధర్మరాజు కృష్ణుడితో ‘నువ్వు వెళ్లి ధృతరాష్ట్ర, గాంధారిలను ఓదార్చాలి. మేం యిప్పుడు వెళితే బాగుండదు.’ అన్నాడు. కృష్ణుడు వెళ్లి ‘గతంలో నేను యుద్ధం కోరుకోవద్దు, నాశనమై పోతారు అని చెప్పాను. ఈసారి అది నిజమైంది అని చెప్పడానికి వచ్చాను. ధృతరాష్ట్రా, నీకు పుత్రులు లేరని అనుకోవద్దు. పాండవులనే పుత్రులుగా స్వీకరించు. వాళ్లు నిన్నెప్పుడూ తండ్రిగానే చూశారు కదా!’ అన్నాడు. పక్కనే వున్న గాంధారి ‘నువ్వు చెప్పినది నిజమే కృష్ణా. నేను నా కొడుకులకు ఎన్నోసార్లు చెప్పాను. ఏం చేయను.’ అని వాపోయింది.

అశ్వత్థామ వచ్చి ఉపపాండవులను చంపానని చెప్పగానే దుర్యోధనుడి ఆనందంగా ప్రాణాలు విడిచాడు. అప్పటితో అక్కడ జరిగినదంతా చూస్తూ ధృతరాష్ట్రుడి చెప్తున్న సంజయుడి దివ్యదృష్టి అంతరించింది. దుర్యోధనుడి మరణవార్త విని శోకిస్తున్న ధృతరాష్ట్ర దంపతులను విదురుడు, వ్యాసుడు ఓదార్చారు. దంపతులిద్దరూ యుద్ధభూమికి వెళ్లారు. వారిని చూడగానే పాండవులు పాదాలకు నమస్కరించారు. ధర్మరాజు నమస్కరించగానే ధృతరాష్ట్రుడు ఆలింగనం చేసుకుని దీవించాడు. తర్వాత భీముడెక్కడ? అని అడిగాడు. తన కొడుకులు నూర్గురూ చచ్చిపోగా పాండవుల్లో ఒక్కడూ పోలేదని సంజయుడి దగ్గర అప్పటికే వాపోయిన ధృతరాష్ట్రుడు ఆ నూర్గుర్నీ ఒంటిచేత్తో చంపిన భీముడిపై పగతో రగులుతూంటాడని ఊహించిన కృష్ణుడు భీముణ్ని పోలిన రాతి (కొందరు లోహ అన్నారు) విగ్రహాన్ని ముందే ఏర్పాటు చేసి దాన్ని ముందుకు జరిపాడు. ‘నాయనా, వచ్చావా?’ అంటూ ఆప్యాయత కనబరుస్తూనే ధృతరాష్ట్రుడు ఆ విగ్రహాన్ని పిండిపిండి చేసేశాడు. వెంటనే ‘అయ్యో భీమా, మరణించావా?’ అంటూ విచారం ప్రకటించాడు. పైకి కపటప్రేమ కనబరుస్తూ నాశనం చేయాలని చూసే యీ చర్య ధృతరాష్ట్రుని కౌగిలిగా సామెతల్లో స్థిరపడింది.

అప్పుడు కృష్ణుడు అతన్ని ఎత్తిపొడిచి, నీ బలం నాకు తెలియనిదా? ఇప్పటికైనా నీ కోపాన్ని ఉపసంహరించుకో. నీ కొడుకుల మరణానికి కారణం వాళ్ల పాపాలు పండడమే తప్ప భీముడు నిమిత్తమాత్రుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు సిగ్గుపడ్డాడు. పాండవులూ నా కుమారులే అంటూ పేరుపేరునా వాళ్లని తడిమి పరామర్శించాడు. పాండవులు గాంధారి వద్దకు వెళ్లినపుడు ఆమె వాళ్లను శపిద్దామనుకుంది. కానీ చటుక్కున వేదవ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. ‘గాంధారీ, గుర్తు తెచ్చుకో, దుర్యోధనుడు యుద్ధానికి వెళుతూ నీ ఆశీర్వాదం కోరితే నువ్వు నీకు జయం కలగాలి అనలేదు, ధర్మం ఎక్కడుంటే అక్కడే గెలుపు అన్నావు. ఇప్పుడు అదే జరిగింది.’ అని గుర్తు చేశాడు. గాంధారి ‘శాపమిచ్చే ఆలోచనను విరమించుకుంటాను కానీ భీముడు చేసిన పనులను ఆమోదించ లేకపోతున్నాను. దుర్యోధనదుశ్శాసనులు తప్పులు చేశారు కానీ భీముడు దుశ్శాసనుడి రక్తం తాగడమేమిటి? ఎంతో అభ్యాసం చేసిన దుర్యోధనుణ్ని ధర్మయుద్ధంలో ఓడించలేక నాభి కింద కొట్టడమేమిటి?’ అని కోపంగా అంది.

అప్పుడు భీముడు ‘తల్లీ, ఎవరైనా రక్తం తాగుతారా? పైగా సోదరుడి రక్తాన్ని? నేను శపథం నెరవేర్చుకోవడానికి తాగినట్లు నటించానంతే. ఆ నెత్తురు నా దంతాలను, పెదవులనూ దాటిపోలేదు. ఇక దుర్యోధనుడి విషయమంటావా? ధర్మమో, అధర్మమో ఆత్మరక్షణ కోసం అలా చేశాను. అన్ని రకాలుగా మోసగించిన, మమ్మల్ని బాధించి, అవమానించిన నీ కొడుకుని ధర్మయుద్ధంలో ఓడించలేక విషమంగా ప్రవర్తించాను. ఆ విధంగా శత్రుత్వాన్ని అతిగమించి, కోపం పోగొట్టుకున్నాను.’ అని వివరణ యిచ్చాడు. గాంధారి ‘నీ పట్ల వందమందీ క్రూరంగా ప్రవర్తించలేదు కదా. వీరిలో చిన్న తప్పులు చేసినవారినైనా మిగిల్చి వుంచవచ్చుగా. మేం వృద్ధులం, అంధులం, రాజ్యాన్ని కోల్పోయాం. ఈ స్థితిలో మా అతీగతీ చూసేందుకు ఒక్కణ్నయినా విడిచి పెట్టవచ్చు కదా’ అని వాదించింది. నిజానికి వికర్ణుణ్ని చంపినప్పుడు భీముడు ఆక్రోశించాడు. ‘నా ప్రతిజ్ఞ కోసం యీ ధర్మాత్ముణ్ని చంపవలసి వస్తోంది’ అని విలపించాడు.

భీముడితో మాట్లాడి ప్రయోజనం లేదనుకున్న గాంధారి ‘ఇంతకీ యింతమందిని చంపించిన ఆ రాజెక్కడ?’ అని క్రోధంతో అడిగింది. ధర్మరాజు వణుకుతూ ఆమె వద్దకు వచ్చి ‘‘దేవీ, నీ కుమారులను చంపించిన క్రూరుడిని నేనే. నన్ను శపించు.’ అంటూ వంగి నమస్కరించాడు. అతను వంగినప్పుడు గాంధారి కళ్ల గంతల కింద నుంచి ఆమె చూపు అతని వేళ్ల మీద పడింది. ఆ చేతి వేళ్లు ఆమె చూపుల వేడికి దగ్ధమై, నల్లగా మాడిపోయాయి. గాంధారి కోపం కాస్త ఉపశమించింది. కానీ ఆమె దివ్యదృష్టితో యుద్ధభూమిలో జరిగిన దారుణం చూసినపుడు భర్తలను పోగొట్టుకుని విలపిస్తున్న కౌరవసైన్యాధిపతుల భార్యలు, వితంతువైన కూతురు కనబడడంతో కోపం మళ్లీ ప్రజ్వరిల్లింది.

తొడలు విరిగి అతి దీనంగా మరణించిన దుర్యోధనుడి శవాన్ని చూసినపుడు, ఛాతీ చీల్చబడి మరణించిన దుశ్శాసనుడి శవం చూసినపుడు ఆమె కోపం అదుపు తప్పింది. అంతలో కృష్ణుడు తన దగ్గరకు రాగా ‘నా కూతురు, కోడళ్లూ హృదయవిదారకంగా రోదిస్తున్నారు. తలచుకుంటే నువ్వు యిదంతా ఆపగలిగేవాడివి, కానీ ఆపలేదు. అందుకే శపిస్తున్నాను. 36 ఏళ్ల తర్వాత నీ వాళ్లందరూ సామూహికంగా మరణిస్తారు. నువ్వు ఒక్కడివే అడవుల పాలై, దిక్కులేని చావు చస్తావు.’ అంది. కృష్ణుడు నవ్వి ‘వాళ్లను వేరెవరూ ఓడించలేరు కాబట్టి, 36 ఏళ్ల తర్వాత వాళ్లలో వాళ్లే కొట్టుకుని చచ్చేలా నేనెప్పుడో ప్లాను చేశాను. అనవసరంగా శపించి, నీ తపశ్శక్తి వృథా చేసుకున్నావు.’ అన్నాడు.

ఒక నెల తర్వాత అశౌచం పూర్తయ్యాక, కృష్ణుడు నచ్చచెప్పిన మీదట ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. కానీ ‘ఈ రాజ్యానికి మహారాజు ధృతరాష్ట్రుడే. ఆయన ఆదేశం మేరకు నేనీ బాధ్యత వహిస్తున్నాను. రాజ్యపాలనను ఆయనకు శుశ్రూషగా భావిస్తాను.’ అని ప్రకటించాడు. ఆ తర్వాత అంపశయ్యపై వున్న భీష్ముడి వద్దకు వెళ్లి ఆయన చెప్పిన రాజనీతి, ధర్మాధర్మవివేచన విన్నాడు. ఏ పని చేయాలన్నా ధృతరాష్ట్రుణ్ని అభిప్రాయం అడిగి, గౌరవించేవాడు. యుయుత్సువును సంప్రదించేవాడు. కుంతి, ఆమె కోడళ్లు కూడా గాంధారి పట్ల ఆదరభావంతో వుండేవారు. ధృతరాష్ట్ర దంపతులు ‘దుర్యోధనుడు వున్నప్పటి కంటె యిప్పుడే సంతోషంగా వున్నాం కదా’ అని అనుకునేట్లా చేశాడు. కానీ దుర్యోధనుణ్ని తలచుకున్నప్పుడల్లా ధృతరాష్ట్రుడికి భీముడిపై కోపం రగులుతూ వుండేది. భీముడు కూడా తక్కువ తినలేదు. తక్కిన పాండవులకు తెలియకుండా వీళ్లని సూటిపోటి మాటలతో ఎత్తిపొడిచేవాడు. ‘ఈ బాహువులతోనే వందమంది కౌరవులను చంపాను తెలుసా’ అని వాళ్ల ఎదురుగానే వేరేవాళ్లకి చెప్పినట్లు మాట్లాడేవాడు.

ఇలా 15 ఏళ్లు గడిచేసరికి యీ హింస భరించలేమనుకున్నాడు ధృతరాష్ట్రుడు. వానప్రస్థానికి వెళదామనుకున్నాడు. ‘నా పుత్రుల గురించి బెంగ లేదు. వాళ్లు యుద్ధంలో మరణించారు కనుక పుణ్యలోకాలకి వెళతారు. నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్లి నారవస్త్రాలు ధరించి తపస్సు చేసుకుంటాం.’ అని ధర్మరాజుతో చెప్పాడు. అతను అంగీకరించకపోతే ప్రజల్ని పిలిచి ‘దుర్బుద్ధితో నా కొడుకు దుర్యోధనుడు చేసిన దుష్కార్యాల వలన వేలాది రాజులు, లక్షలాది మంది సైనికులు చనిపోయారు. అతణ్ని అదుపు చేయకుండా నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి.’ అని ప్రకటించి, గంగాతీరపు అరణ్యాలలో వానప్రస్థానికి వెళ్లాడు. అతనితో పాటు గాంధారి, విదురుడు, కుంతీదేవి కూడా వెళ్లారు. కొన్నేళ్లకు ధర్మరాజు సోదరులతో కలిసి అక్కడకు వెళ్లి పరామర్శించాడు. విదురుడు కనబడలేదు. వెతగ్గా ఒక చెట్టు మొదట శుష్కించి కనబడ్డాడు. ధర్మరాజుని చూసి దేహత్యాగం చేశాడు. అతని తేజస్సు వచ్చి ధర్మరాజులో కలిసింది.

పాండవులు హస్తినకు తిరిగి వచ్చేశారు. ధృతరాష్ట్రుడికి పూర్తి వైరాగ్యం ఆవహించింది. వ్యాసుడు వచ్చి నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు ‘నాకు భవబంధాలపై విరక్తి కలిగింది. నీ దయ వుంటే చాలు.’ అన్నాడు. ధృతరాష్ట్రుడు గాలి భుజిస్తూ తపస్సు చేస్తే, గాంధారి, కుంతి నీరు తీసుకుంటూ తపస్సు చేశారు. మరో రెండేళ్లకు ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అడవిలో చెలరేగిన దావాగ్నిలో దగ్ధమై పోయారు. వాళ్లు ప్రాణభీతితో పారిపోలేదు. కావాలని అగ్నికి ఆహుతయ్యారు. అది ఒకరకంగా పశ్చాత్తాపాగ్ని అనే అనుకోవాలి. మితిమీరిన పుత్రప్రేమ కనబరిచిన వాళ్లకు చివరిలో పశ్చాత్తాపం తప్పదని ధృతరాష్ట్రుని కథ చెప్తుంది.

ఈ వ్యాసరచనకు, పైన ఉదహరించిన వ్యాసంతో పాటు సామవేదం షణ్ముఖశర్మ గారి ‘ఇదీ యథార్థ మహాభారతం’, లలితా త్రిపుర సుందరీ ధార్మిక పరిషత్ ప్రచురించిన సంస్కృత భారత తెలుగు అనువాద పుస్తకాలు ఉపకరించాయి. ఆ యా రచయితలకు కృతజ్ఞతలు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)

mbsprasad@gmail.com

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు