Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: హనుమంతుడి మాటతీరు

ఎమ్బీయస్‍: హనుమంతుడి మాటతీరు

పురుషోత్తముడైన రాముడిపై, రామాయణంపై నాకెంతో గౌరవం. అందుకే ‘‘ఆదిపురుష్’’ చూడాలనిపించలేదు. కానీ దాని గురించిన చర్చలు చూశాను, విన్నాను. తక్కినవాటి మాట ఎలా ఉన్నా హనుమంతుడు, ఇంద్రజిత్తు మధ్య పెట్టిన డైలాగు చాలా బాధ కలిగించింది. వాగ్విశారదుడైన హనుమ నోట అలాటి మాటలా? చిన్నపుడు రామాయణ గాథ చదవడం వేరు. తర్వాతి రోజుల్లో ప్రవచనకారులు, పౌరాణిక వేత్తలు విశ్లేషించి చెప్పినప్పుడు ఒక్కో విశేషం గ్రహించడం వేరు. ఆంజనేయుడి వచోవైభవం గురించి ఉషశ్రీ వంటి వ్యాఖ్యాత రాసిన ‘‘రామాయణంలో హనుమంతుడు’’ (ఉషశ్రీ మిషన్ ప్రచురణ, 1992) పుస్తకం చదివినప్పుడు ఓహో, యింతటి ఘనుడా అనిపించింది. అలాటి హనుమ పాత్రను వినోదం కోసం అంతలా దిగజార్చాలా? అనిపించింది. వీరుడు, శూరుడు అని భారతంలో చెప్పబడని లక్ష్మణకుమారుడిని హాస్యానికి వాడుకుంటే నష్టమేమీ లేదు అని పింగళి చేసిన వాదన యిక్కడ పొసగదు. హనుమ కారెక్టరే వేరు. వీరుడు, శూరుడే కాదు, మహా పండితుడు. సుగ్రీవుడికి మంత్రిగా పని చేసినవాడు.

బాలుడిగా ఉన్నపుడే హనుమ సూర్యుణ్ని మింగబోయిన కథ అందరికీ తెలుసు. ఆ తర్వాత అతను సూర్యుడితో సమానంగా ఎగురుతూ అతడి వద్ద సమస్త విద్యలు నేర్చాడు. సంగీతాన్ని నేర్చుకున్నాడు. త్యాగరాజ స్వామి ‘‘సంగీత జ్ఞానము, భక్తి వినా సన్మార్గము కలదే మనసా.. ’’ కీర్తనలో భృంగి నటేశ, సమీరజ, ఘటజ, మతంగ నారదాదాలుపాసించే... అని సాగే చరణంలో సమీరజుడు (వాయుపుత్రుడు) హనుమంతుడే! ఆంజనేయుడనగానే కండలు, గద, తోక గుర్తుకు వస్తే చాలదు. ఇవీ గుర్తు పెట్టుకోవాలి. సినిమాకు పాత్రోచిత సంభాషణలు రాసేటప్పుడు మరీ పెట్టుకోవాలి. చిల్లర భాష వాడకూడదు.

సంభాషణలు రాసిన మనోజ్ ముతాషిర్‌కి ఆ యింగితం లేకపోయింది. పైగా మా అమ్మా, అమ్మమ్మా నాకు చిన్నపుడు యిలాటి భాషలోనే కథ చెప్పారన్నాడు. ‘ఇదెక్కడి ఫ్యామిలీరా బాబూ’ అనిపించింది మనకి కానీ ఏలినవారికి మాత్రం అలా తోచలేదు. ఇతన్నీ, ‘‘కేరళ స్టోరీ’’ సినీ నిర్మాత విపుల్ షాను సత్కరించ దలచింది. 54వ అంతర్జాతీయ చిత్రోత్సవ నిర్వహణకై ఇన్‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఏర్పరచిన స్టీరింగ్ కమిటీలో అనధికార సభ్యులుగా చేర్చింది. సంభాషణల పట్ల ప్రేక్షకుల గగ్గోలు పెట్టినపుడు మనోజ్ బుకాయించాడు కానీ యీ మధ్యే క్షమాపణ చెప్పాడు. అతని మాట ఎలా ఉన్నా, యీ సందర్బంగా హనుమంతుడి వాక్పటిమ గురించి పైన చెప్పిన ఉషశ్రీ గారి పుస్తకం నుంచి నేను సేకరించిన సమాచారాన్ని పాఠకులతో పంచుకోవాలని పించింది. ముందుగా ఉషశ్రీ మిషన్‌కు కృతజ్ఞతలు.

రామాయణంలో హనుమంతుడు నాల్గవ కాండ ఐన కిష్కిందాకాండలో ప్రవేశిస్తాడు. సినిమా భాషలో చెప్పాలంటే సెకండాఫ్‌లో నన్నమాట. ఆ తర్వాత స్టోరీ అతన్నే ఫాలో అవుతుంది. సీతాన్వేషణలో భాగంగా రామలక్ష్మణులు ఋశ్యమూక పర్వతంపైకి వచ్చినపుడు వాళ్లను చూస్తూనే తనను చంపడానికి వాలి పంపిన వారనుకుని సుగ్రీవుడు భయపడ్డాడు. అప్పుడు అతన్ని ఊరడిస్తూ పలికిన మాటలతో హనుమ పాత్ర యింట్రడ్యూస్ అవుతుంది. పాత్ర ప్రవేశపెడుతూనే వాల్మీకి వాక్యకోవిదుడైన అనే విశేషణంతో ప్రారంభించాడు. ‘రాజా, భయం వలన అనుమానాలు కలుగుతున్నాయి. విజ్ఞానంతో బుద్ధిని నడిపించాలి. నేను వెళ్లి వాళ్లెవరో కనుక్కుని వస్తాను.’ అని చెప్పాడు. ఆ తర్వాత భిక్షువు రూపంలో రామలక్ష్మణుల వద్దకు వెళ్లి ‘‘రాజర్షుల్లా, తపస్వుల్లా ఉన్న మీరు నారచీరలు ధరించి, ఆయుధాలు చేపట్టి యిక్కడెందుకు సంచరిస్తున్నారు?’’ అని అడిగాడు.

రాజర్షి, తపస్వి అంటూనే వారి పరాక్రమం వర్ణిస్తూ మధ్యలో ఆయుధాలు ధరించి ఎందుకు వచ్చారు? అని కూడా అడిగేశాడు. కానీ వాళ్లు పెదవి విప్పకపోవడంతో తన తప్పు తెలుసుకుని తనను తాను పరిచయం చేసుకున్నాడు, ‘ధర్మాత్ముడైన సుగ్రీవుడు అన్నగారి ఆగ్రహానికి గురై అవస్థల్లో ఉన్నాడు. మీతో సఖ్యం కోసం మంత్రినైన నన్ను పంపాడు. నా పేరు హనుమంతుడు.’ అని. తన రాజుని ధర్మాత్ముడిగా ఎస్టాబ్లిష్ చేసి, అతని అన్నగారిని విలన్ స్థానంలో నిలబెట్టాడు. మీతో స్నేహాన్ని కోరి, వేరెవరినో కాకుండా మంత్రి పదవిలో ఉన్న నన్నే పంపాడు అంటూ తన లెవెల్ చెప్పుకుంటూనే సుగ్రీవుడి స్నేహకాంక్షను తెలిపాడు. స్నేహం కోరమని సుగ్రీవుడు చెప్పకపోయినా, వీళ్ల ఆకారవిశేషాలు చూసి అప్పటికప్పుడు యితడు నిర్ణయం తీసుకుని ఆ ప్రతిపాదన చేసి రాముణ్ని సంతోషపెట్టాడు.

ఇతని మాట తీరు రాముడికి నచ్చింది. లక్ష్మణుడితో ‘‘ఇతడు ఋగ్వేద వినీతుడు (మనసు అదుపులో ఉంచి అధ్యయనం చేసేవాడు), యుజర్వేద ధారి (ధారణశక్తి బాగా కలవాడు), సామవేద విదుడు (వైదుష్యం కలిగి ఊహాశక్తితో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకునేవాడు). కాకపోతే యిలా మాట్లాడలేడు. ఇతని మాటల్లో ఒక్క అపశబ్దం కూడా లేదు, వ్యాకరణం సంపూర్ణంగా అధ్యయనం చేసినట్లు కనబడుతోంది. అప్రస్తుతంగా, సందిగ్ధంగా, ఆపిఆపి మాట్లాడలేదు. హృదయం లోంచి, కంఠంలోంచి వచ్చి మధ్యమ స్వరంలో సంస్కారయుతంగా మాట్లాడుతూ వినేవారి హృదయాల్ని అలరించాడు.’’ అన్నాడు. అదీ హనుమంతుడి వాక్యవిశారదత్వం.

రామలక్ష్మణులను సుగ్రీవుడికి పరిచయం చేస్తూ ‘‘ఈయన రాముడు, మహాప్రాజ్ఞుడు, దృఢవిక్రముడు, సోదరుడైన లక్ష్మణుడితో వచ్చిన సత్యవిక్రముడు.’’ అన్నాడు. సుగ్రీవుడికి ఆ సమయానికి కావలసిన వాడు వాలితో పోరాడే శక్తి, పరాక్రమం కల్గిన స్నేహితుడు. అందుకని విక్రమ పదం అన్ని సార్లు వాడాడు. ఆ తర్వాత యిద్దరి మధ్య వేవ్ లెంగ్త్ కలపడానికి మీ యిద్దరూ ఒకే రకమైన దుస్థితిలో ఉన్నారు అని ఎత్తి చూపడానికి రాముడు భార్యావియోగ బాధలో ఉన్నాడు.. అన్నాడు. సుగ్రీవుడి భార్యను వాలి ఎత్తుకుపోయాడు కాబట్టి అతనూ బాధితుడే. వాళ్లిద్దరూ చేతులు కలిపారు, వాలి వధ జరిగింది. సుగ్రీవుడు రాజై పోయాడు. కానీ రాముడికిచ్చిన మాట మరిచి, సీతాన్వేషణను గట్టున పెట్టి మదిరాపానంలో, కామభోగాలలో మునిగిపోయాడు.

అప్పుడు హనుమ వెళ్లి ‘‘నీకు రాజ్యం ప్రాప్తించింది, కీర్తి వచ్చింది, సంపద పెరుగుతోంది. మిత్రకార్యం ఒక్కటే మిగిలిపోయింది.’’ అని గుర్తు చేశాడు. నిజానికి వాలి తర్వాత అంగదుడికి రాజ్యం రావాలి. సుగ్రీవుడికి రాజయ్యే అవకాశమే లేదు. అయినా వాలివధ తర్వాత తను రాజై, అంగదుణ్ని యువరాజుని చేశాడు. ఇదంతా రాముడు వాలిని వధించడం చేతనే దక్కింది. మొదటి మాటలో హనుమంతుడు అది గుర్తు చేశాడు. చివరి మాటలో అలాటి మిత్రుడికై చేయవలసిన పని బాకీ ఉంది సుమా అని గుర్తు చేశాడు. నువ్వు నోటిమాటగా ఆజ్ఞ యిస్తే చాలు, సీతను వెతికే పని సాధించే వానరయోధులున్నారు అంటూ సూచన కూడా చేశాడు. సుగ్రీవుడు వెంటనే పోయి వెతకండి అని ఆజ్ఞ వేసేసి, అంతటితో దాన్ని మర్చిపోయి, భోగాల్లో మునిగిపోవడంతో లక్ష్మణుడు వచ్చి ధనుష్టంకారం చేశాడు. దెబ్బకి బెదిరిపోయిన సుగ్రీవుడు హనుమంతుణ్ని సలహా అడిగాడు.

నేను చెప్తే నువ్వు విన్నావు కావు, అనుభవించు అని హనుమ అనలేదు. చేసిన ఉపకారం మర్చిపోయావు అనకుండా ‘ప్రాణాలకు తెగించి వాలిని సంహరించి, నీకు ఉపకారం చేసిన మిత్రుణ్ని నువ్వు మరవకపోవడంలో ఆశ్చర్యం ఏముంది?’ అంటూ లౌక్యంగా ప్రారంభించి, ‘రాముడింకా నిన్ను స్నేహితుడిగా భావిస్తున్నాడు కాబట్టే తను రాకుండా తమ్ముణ్ని పంపాడు. ఇప్పుడు లక్ష్మణుడు పలికే పరుష వాక్యాలు వినక తప్పదు. ప్రమత్తుడవై ప్రతిజ్ఞాకాలాన్ని మర్చిపోయావు కాబట్టి యీ అవస్థ తప్పదు.’ అంటూ మృదువుగానే మందలించాడు.

సీతను వెతుకుతూ సముద్రం దగ్గరకు వచ్చిన వానరసేన దాని విస్తృతి చూసి దిగాలు పడ్డారు. తమలో ఎనభై యోజనాలు దాటి వెళ్లగలిగేవారెవరూ లేరని గ్రహించి, వెనక్కి వెళితే సుగ్రీవుడు ప్రాణాలు తీస్తాడని భయపడి, ప్రాయోపవేశానికి ఉద్యమించారు. అప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరకి వెళ్లి నువ్వే సమర్థుడివి అని ప్రేరేపించాడు. వెళ్లడానికి ఉద్యమించిన హనుమ నేను అంతటివాణ్ని, యింతటివాణ్ని అని చెప్పుకున్నాడు. నేను సీతాదేవిని చూసి రాగలను. లంకలో వెతకడమే కాదు, లంకను పెళ్లగించి తెస్తాను కూడా అని అన్నాడు. ఎందుకింత మాట్లాడాడు అంటే నిరాశలో మునిగిన వానరవీరులు తను తిరిగి వచ్చేదాకా కూడా ఉండకుండా మరణానికి ఉద్యమిస్తారేమోనని శంకించి వారిలో ధైర్యం నింపడానికి అలా చెప్పాడు.

ఇక లంకకు వెళ్లి అశోకవనంలో సీతను చూశాడు. పిల్ల కోతి రూపంలో చెట్టు గుబురులో దాగున్నాడు. రావణుడు వచ్చి రెండు మాసాల గడువు యిచ్చి వెళ్లాడు. సీతాదేవి తన జడతో ఉరి వేసుకోబోతోంది. తను వెళ్లి వారించబోతే రావణుడో, మరో రాక్షసుడో మారువేషంలో వచ్చాడనుకోవచ్చు. అందువలన వీళ్లెవరికీ తెలియడానికి అవకాశం లేని దశరథుడి గాథ వినిపించాడు. తర్వాత సీతారాముల కథను వినిపించాడు. సీత ఆత్మహత్యాప్రయత్నం ఆపి పైకి చూసింది. హనుమ కిందకు దిగి వచ్చి నమస్కరించి ‘తల్లీ ఎవరు నీవు? రోహిణివా? అరుంధతివా? నీ పాదాలు భూమిని తాకుతున్నాయి కాబట్టి దేవతా స్త్రీవి కావు. రాచరికపు లక్షణాలు కనబడుతున్నాయి. జనస్థానంలో రావణుడు అపహరించిన జానకీదేవివి కాదు కదా’ అని అడిగాడు.

‘నువ్వు రామపత్నివి కదూ’ అంటూ మొదలుపెడితే సీతకు అనుమానం పెరిగి యితను చెప్పేది సాంతం వినకుండా ఆత్మహత్యకు ఒడిగట్టేది. పది నెలలుగా రామదూషణ వింటూ రావడంతో మతి చెడి ఆమె పూర్తిగా గందరగోళ పరిస్థితిలో పడింది. నువ్వెవరో నాకు తెలియదు అంటూ ప్రారంభించి, సంభాషణ వినే కుతూహలం కల్గంచి, తమాయించుకున్నాక చివర్లో ఫలానా కదూ అనేసరికి ఆవిడ నిదానించింది. ఆవిడకు అనుమానం పూర్తిగా నివృత్తి కావడానికి రాముడి ఉంగరం యిచ్చాడు. వారి సంభాషణ జరిగాక నా భుజస్కంధాలపై ఎక్కు. రాముడి వద్దకు చేరుస్తాను అని అతను ఆఫర్ యిచ్చినపుడు సీత ‘ఇంత చిన్న శరీరంతో నన్నెలా తీసుకెళతావు? నేను జారి సముద్రంలో పడితే నీ శ్రమ వ్యర్థం కాదూ? పైగా పరపురుషుని స్పర్శ నేనెలా ఒప్పుతాను? రావణుడి తెచ్చినపుడు నేను వివశురాలిని కాబట్టి తప్పలేదు. రాముడు వచ్చి రాక్షస సంహారం చేసి తీసుకెళ్లాలి తప్ప యిలా పిరికితనంతో పారిపోవడం నాకు నచ్చదు.’ అంది.

ఇంత చిన్న శరీరం.. అనగానే రోషం వచ్చి హనుమ వెంటనే తన విరాడ్రూపాన్ని చూపలేదు. మొదట ఆమె మాటల్లో ఔచిత్యం ఉందని, అలాగే జరగాలని అంగీకరించాడు. ఆ తర్వాత నా శక్తి గురించి సందేహం తీర్చడానికి చూపిస్తున్నాను అంటూ ఆకారాన్ని పెంచి చూపాడు. రాముడు వానరసేనతో సహా సాగరాన్ని ఎలా దాటగలడని సీత అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఆమెకు ధైర్యం చెప్పడానికి హనుమంతుడు బింకాలు పలికాడు. అప్పటికి సేతుబంధనం ఐడియా ఎవరికీ లేదు. అయినా ఆవిడకు ధైర్యం చెప్పడానికి ‘మా సేనలో భూమిని చుట్టి రాగల వీరులెందరో ఉన్నారు. అందరి కంటె అల్పుణ్ని కాబట్టి నన్ను దూతగా పంపారు.’ అని కోశాడు. నిజానికి యితనికి తప్ప వేరెవరికీ యింతదూరం ఎగరడం చేతకాదు. సముద్రానికి అవతల నిరాశతో నిద్రాహారాలు మాని చావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ యిక్కడ సీతకు మనోధైర్యం, భవిష్యత్తుపై ఆశ నూరిపోవడం ముఖ్యం తప్ప, వాస్తవాలు చెప్పడం కాదు. దానికోసం తనను తాను తగ్గించుకుని చెప్పాడు.

అశోకవనం నాశనం చేసి, ఇంద్రజిత్తు చేత బంధింపబడి రావణుడి దగ్గరకు వెళ్లాక మంత్రి ప్రహస్తుడు నువ్వెవరో చెప్పుకో అన్నాడు. హనుమంతుడు ‘నేను వానరుణ్నని తెలుస్తోంది కదా. ఇక్కడ వనాలు, ఫలాలు నన్ను ఆకర్షించాయి. అవి ఆరగించాక యీ నగరం ప్రభువును చూడాలనిపించింది. ఏదో ఒక పాడు పని చేయకపోతే దర్శనం దొరకదు కదా అని తోచింది. వనం ధ్వంసం చేశాను. మీ వాళ్లు నన్ను చంపడానికి వస్తే ఆత్మరక్షణ కోసం వాళ్లని చంపాల్సి వచ్చింది..’ అన్నాడు. తన నగరాన్ని ప్రశంసించి నందుకు రావణుడు ఆగ్రహం తగ్గింది. అప్పుడు హనుమ ‘‘నేను సుగ్రీవుని మంత్రిని, రామదూతను, మా మహారాజు పంపిన సందేశాన్ని వినిపించడానికి వచ్చాను.’’ అన్నాడు. రాముడు సీత ఎక్కడుందో కనిపెట్టి రమ్మన్నాడు తప్ప రావణుడికి సందేశం యిమ్మనలేదు. కానీ హనుమ సొంతంగా చొరవ తీసుకున్నాడు. గతంలో రావణుడు వాలి చేతిలో శృంగభంగం పొంది ఉన్నాడు. అందుకని వాలిని గుర్తు చేస్తూ ‘నీకు వాలి తెలుసు కదా! ఆయన్ను ఒక్క బాణంతో చంపినవాడు రాముడు’ అంటూ రాముణ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ తర్వాత రామసుగ్రీవ మైత్రి, సీతాన్వేషణ ప్రస్తావించి, రామపరాక్రమాన్ని వర్ణించి, రాముడికి అతని భార్యను అప్పగించు, నిన్ను ఫలానాఫలానా జాతులు నిర్జించలేవు కానీ నరవానరులైన రామసుగ్రీవులు కదిలి వస్తున్నారు జాగ్రత్త’ అంటూ సుదీర్ఘోపన్యాసం చేశాడు.

లంకాదహనానంతరం తిరిగి వస్తూ సముద్రతీరం కొద్ది దూరంలో ఉండగానే సింహగర్జన చేశాడు. భావాలన్నీ మాటల ద్వారానే చెప్పనక్కరలేదు. శబ్దాల ద్వారా కూడా వ్యక్తపరచవచ్చు.  హమ్మయ్య, నిన్న పొద్దున్న వెళ్లిన హనుమంతుడు యివాళ సాయంత్రం తిరిగి వస్తున్నాడు అని వానరులకు ధైర్యం కలిగింది. హనుమ భూమి మీదకు దిగుతూనే ‘చూశాను సీతను’ అన్నాడు. అసలేం జరిగిందంటే.. అంటూ పురాణం మొదలుపెట్టలేదు. ఉచ్చరించిన రెండు మాటల్లో కూడా ‘చూశాను’ను ముందు పెట్టాడు. ‘సీతను’ ముందుకు తెస్తే చూశాడో లేదో అని ఓ లిప్తపాటు సస్పెన్స్ ఉండేది. అది కూడా లేకుండా సందర్భశుద్ధి పాటించి వాళ్ల ఆతృత తీర్చాడు. ఆ తర్వాత తన ప్రయాణ విశేషాలు, సీతతో మాట్లాడినది వివరంగా చెప్పాడు. కానీ సీత రాముడితో చెప్పమన్న విషయాలు వీరి దగ్గర చెప్పలేదు, వీరికి అనవసరం కాబట్టి.

రాముడి దగ్గరకు వెళ్లినపుడు వీళ్ల దగ్గర చెప్పిన తన ప్రతాపగాథను చెప్పలేదు. క్లుప్తంగానే చెప్పాడు. సీత చెప్పిన కాకాసుర ఉదంతం చెప్పి, చూడామణి చేతికి యిచ్చి తను సీతను చూశాడనే విషయాన్ని రూఢి చేశాడు. రాముడికి అప్పటికి ఆసక్తి కలిగించే విషయాలు మాత్రమే చెప్పి ఊరుకున్నాడు. యుద్ధానికి బయలుదేరే ముందు రాముడు లంకా నగర విశేషాలేమిటి హనుమా? అని అడిగినప్పుడు అప్పుడు లంక కోట గురించి, దాన్ని తను ధ్వంసం చేసిన వైనం గురించి చెప్పాడు. ఎప్పటికి ఎంత అవసరమో అంతే చెప్పాలన్న యింగితం కలవాడాయన. యుద్ధానంతరం అయోధ్యకు తిరిగి వెళుతూ పుష్పకవిమానం భరద్వాజ ముని ఆశ్రమంలో ఆగినప్పుడు ఆయన ‘నువ్వు ఘనుడవయ్యా’ అని ప్రశంసిస్తే ‘మీ వంటి మహామునుల తపశ్శక్తి నన్ను తీసుకెళ్లింది తప్ప నేను స్వయంప్రతిభతో సముద్రం దాటగలవాడినా?’ అంటూ వినయాన్ని ప్రకటించాడు. ఇదీ హనుమంతుడి వ్యక్తిత్వం. మాట తీరు. ‘‘ఆదిపురుష్’’ రచయిత, దర్శకులకు దీన్ని పట్టించుకోకుండా తమ చిత్తం వచ్చినట్లు చేసి ఛీత్కరించుకో బడ్డారు.  

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?