నిన్నటి తరం వేరు. రేపటి తరం వేరు. ఆకాశానికి భూమికి వున్నంత తేడా వుంది. సూపర్ స్టార్ కృష్ణ తనయగా మంజులకు కూడా సినిమాల మీద ఆసక్తి. రచన, నిర్మాణంతో పాటు నటన మీద కూడా. కానీ ఆ రోజులు వేరు. అభిమానుల ఆలోచనల మేరకు హీరోలు నడుచుకునే రోజులు.
మంజుల సినిమాల్లో హీరోయిన్ గా వస్తారు అన్న వార్త జస్ట్ అలా లేశమాత్రంగా వచ్చిందో లేదో అభిమానులు భగ్గుమన్నారు. అసంతృప్తి వెళ్లగక్కారు. ససేమిరా వద్దన్నారు. అంతే. కృష్ణ ఆ ఆలోచన విరమించుకున్నారు. మంజుల కూడా తండ్రి మాట కాదనలేదు. కేవలం రచన, నిర్మాణం వైపు మొగ్గు చూపారు.
కట్ చేస్తే ఇది ఇన్ స్టా జనరేషన్. పట్టుమని పదేళ్లు రాకముందు నుంచే సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో పాపులర్ కావడం మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ కానీ, ఆయన భార్య నమ్రత కానీ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. పదేళ్లకే మాంచి డ్యాన్సర్ గా ప్రూవ్ చేసుకుంటూ, బ్రాండ్ అంబాసిడర్ గా మారారు సితార. ఇక తరువాత డెస్టినేషన్ సినిమానే అని అర్థం అవుతూనే వుంది. కానీ క్లారిటీ రావాలి కదా. అదే అడిగింది మీడియా నేరుగా.
అస్సలు తడుముకోకుండా అదే తన డెస్టినేషన్ అన్నట్లు సమాధానం ఇచ్చేసారు సితార. తల్లి నమ్రత కూడా తామేమీ ఫోర్స్ చేయమని, వారి ఇష్టం ఎలా అయితే అలా అని క్లారిటీ ఇచ్చారు. అంటే కూతురు సరదా అదే. తల్లి ఆలోచన కూడా అదే. అయితే కనీసం ఇంకో అయిదారేళ్ల సమయం అయితే పక్కాగా పడుతుంది. ఇప్పటికే ప్రిన్సెస్ అనే బిరుదుతో ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటున్న సితార సినిమాల్లోకి రావడానికి.