Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: ఐవైఆర్‌ వ్యవహారం ఏమయింది?

ఐవైఆర్‌ కృష్ణారావుగారిని అవమానకరంగా బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్‌ చైర్మన్‌గిరీ నుంచి తీసేసి నెలయింది. తీసేసినపుడు ఆయనపై టిడిపి నాయకులు అనేక ఆరోపణలు చేశారు. వాటిపై విచారణ జరిపించుకోవచ్చని కృష్ణారావుగారు అన్నారు. ఇప్పటిదాకా దాని విషయంలో అడుగు ముందు పడినట్లు వార్తలేవీ రాలేదు. దీని అర్థమేమిటి? అవి ఉత్తుత్తి ఆరోపణలనా? లేక ప్రజాధనం ఎలా వ్యర్థమైనా ఫర్వాలేదనే భావనా? ఆయన స్థానంలో ఎవరూ రాలేదు, అందువలన చర్యలు తీసుకోవడం వీలుపడలేదు అనడానికి లేదు. ఆయనను తీస్తూనే వేమూరి ఆనంద సూర్య అనే టిడిపి కార్యకర్తను ఆ స్థానంలో నియమించారు.

ఈయన కృష్ణారావుగారిలా ఐఏఎస్‌, మాజీ చీఫ్‌ సెక్రటరీ, మరోటీ కాదు. వాళ్లతో తలకాయనొప్పి అనుకున్నారేమో! కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌లా, ఎస్సీఎస్టీ కార్పోరేషన్‌ చైర్మన్‌లా యించక్కా టిడిపి రాజకీయనాయకుణ్ని వేసుకుంటే ఏ పేచీ వుండదనుకుని ఈయనను వేశారు. ఈయన ఎంత సమర్థుడో ఓ ఏడాది పోయాక తేలుతుంది. ఈయన హయాంలో నిధులు ఎంత వస్తాయో, అవి ఏ కమిటీవారు చెప్పిన ప్రకారం ఖర్చు చేస్తారో, ముఖ్యమంత్రి గారి ఎపాయింట్‌మెంట్‌ ఎంత తరచుగా దొరుకుతుందో - యివన్నీ ఏడాది తర్వాత సమీక్షించుకోవాలి. 

కృష్ణారావుగారిపై వచ్చిన ఆరోపణల సంగతి చూస్తే యనమల 'కృష్ణారావు బ్రాహ్మణ కో-ఆపరేటివ్‌ సొసైటీ అని ప్రైవేటు సంస్థ ఒకటి పెట్టి దానికి అక్రమంగా రూ.30 కోట్లు నిధులు మళ్లించారు.' అన్నారు. చైర్మన్‌గా కొత్తగా వచ్చిన వేమూరి ఆనంద సూర్య 'తన బావమరిది అభిజిత్‌ను దానికి సిఇఓగా వేసుకున్నారు.' అన్నారు. దానికి కృష్ణారావు సమాధానం చెపుతూ ఆ సొసైటీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ఏర్పాటైన ప్రభుత్వ అనుబంధ సంస్థ అని ఆధారాలు చూపారు. రూ. 30 కోట్లు శాంక్షన్‌ చేసిన జిఓను చూపించారు.

ఆ అభిజిత్‌ తనకు బంధువు కాదనీ, తనెవరో తెలియదని, యీ మధ్యే ఎవరో తీసుకుని వచ్చి పరిచయం చేశారనీ చెప్పారు. ఇలా చెప్పి నెలయింది. ఇప్పటిదాకా యనమల, ఆనంద సూర్య తమ ఆరోపణలను పునరుద్ఘాటిస్తూ కానీ, కృష్ణారావుగారిని ఖండిస్తూ కానీ ప్రకటన చేయలేదు. ఇక టిడిపి గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావైతే మరీ రెచ్చిపోయారు. కృష్ణారావుకి దొనకొండలో వేలాది ఎకరాల భూమి వుందని, అందుకే రాజధాని అక్కడ పెట్టాలని వాదించారని ఆరోపించారు.

దానికి సమాధానం చెపుతూ కృష్ణారావు 'నాకు సెంటు భూమి లేదు. ముఖ్యమంత్రి గారు యీ ఆరోపణపై విచారణ జరిపించాలని, ఆరోపణ నిజమైతే నాపై చర్య తీసుకోవాలని, అబద్ధమైతే ఎంపీపై ఏ చర్య తీసుకుంటారో చెప్పాలనీ డిమాండ్‌ చేస్తున్నా' అన్నారు. రాయపాటి ఎక్కడెక్కడ ఎంత భూమి వుందో ప్రకటించలేదు. ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించనూ లేదు. అంటే ఏమనుకోవాలి? 

క్యాబినెట్‌ ర్యాంకు, రూ.2 లక్షల జీతం యిచ్చారంటూ తనపై వచ్చిన ఆరోపణలను కృష్ణారావు ఖండించారు. అసత్యారోపణలు చేసినవారు కిమ్మనలేదు. ఎందువలన? పార్టీ నాయకుల చేత ఓ నాలుగు రాళ్లు వేయించి కసి తీరిపోయిం దనుకున్నారని అనుకోవాలా? సరే యివన్నీ యితరులు చేసిన ఆరోపణలు. ఆంధ్ర ప్రభుత్వానికి సలహాదారు, చంద్రబాబు మౌత్‌పీస్‌ అయిన పరకాల ప్రభాకర్‌గారు ఏమన్నారు? 'ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే కృష్ణారావుగారిని జీఓ ఎంఎస్‌ 219 ప్రకారం ప్రభుత్వం ఆయనను తొలగించింది' అన్నారు.

ఏవిటా వ్యతిరేకం అంటే ప్రభుత్వ నిర్ణయాలను సామాజిక మాధ్యమంలో విమర్శించారట. సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టడం ఔచిత్యభంగమా? చట్టవిరుద్ధమా? అనేది ఆంధ్ర పాలకులు చెప్పవలసిన సమాధానం. ఔచిత్యభంగం కనక అయితే ఆయన్ని పిలిచి మందలించవచ్చు, సంజాయిషీ అడగవచ్చు. ఉన్నపళంగా చెప్పాపెట్టకుండా పదవీకాలానికి ఏడాదిన్నర ముందుగా తీసేయనక్కరలేదు. 

ఇక చట్టవిరుద్ధమే అయితే తీసేయడంతో వదిలిపెట్టకూడదు. కేసులు పెట్టి శిక్ష పడేట్లా చేయాలి. పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవికిరణ్‌ను అరెస్టు చేయగాలేనిది యీయన్నెందుకు అరెస్టు చేయకూడదు? అలా వదిలేస్తే రేపుమర్నాడు ఉద్యోగానికి రాజీనామా చేద్దామనుకునేవాడో, రిటైరు కావడానికి రెండు, మూడు నెలలు మాత్రమే వ్యవధి వున్నవాడో ప్రభుత్వాన్ని ట్విట్టర్‌లో ఎడాపెడా వాయించేయవచ్చు. బాబు సర్కార్‌ ఆ పని చేయలేదంటే దాని అర్థం - అది చట్టవిరుద్ధం కాదన్నమాట.

ఆయన ప్రభుత్వోద్యోగంలో వున్నంతకాలం కొన్ని నియమనిబంధనలకు లోబడి పనిచేయాలి. వాటిని అధిగమిస్తే శిక్షార్హుడవుతాడు. కానీ కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవి కాంట్రాక్టు పదవి. దానికి సర్వీసు రూల్సు వర్తించవు. అందుకే ఫలానా సెక్షన్‌ కింద నిందితుడు అనలేకపోయారు. ఇక ఔచిత్యభంగం జరిగిందా లేదా అన్నదానిపై నిర్వచనం యివ్వడం కష్టం. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది.

చరిత్ర వక్రీకరించి తీసిన శాతకర్ణికి వినోదపు పన్ను మినహాయింపు, బాహుబలికి టిక్కెట్ల పెంపు అనుమతి అనవసరం అని ఆయన ఫీలయ్యారు. చీఫ్‌ సెక్రటరీగా వుండే రోజుల్లో అయితే వాటి గురించి మాట్లాడేవారు కాదేమో! ఇప్పుడు ఆనరరీ పోస్టులోనే వున్నాం కదాని తన ఫ్రెండ్స్‌ సర్కిల్‌లో డిస్కస్‌ చేసుకున్నారు. పత్రికా సమావేశం పెట్టి చెప్పలేదు. టిడిపి బయటపెట్టేవరకు ఏ మీడియా యీ పోస్టింగుల గురించి పట్టించుకోలేదు. 

ప్రభుత్వ కార్పోరేషన్‌ చైర్మన్‌గా ఉన్నంత మాత్రాన నోరెత్తకూడదని అనగలరా? కాంగ్రెసు పార్టీ అధికారం చేసే రోజుల్లో కార్పోరేషన్‌ చైర్మన్‌గా వుంటూ, ముఖ్యమంత్రితో విభేదిస్తూ ప్రకటనలు చేసినవారు ఎందరో వున్నారు. తెలంగాణ ఉద్యమసమయంలో అటువంటి మరీ ఎక్కువగా జరిగాయి. అంతమాత్రాన వాళ్లను పదవుల్లోంచి అర్ధాంతరంగా తీసేయలేదు. పిలిచి మాట్లాడి సమాధాన పరిచేవారు. ఎందుకంటే వాళ్లూవాళ్లూ రాజకీయనాయకులు. ఇక్కడ యీయన బ్యూరోక్రాట్‌. రాజకీయబలం లేనివాడు.

పైగా బ్రాహ్మణ కార్పోరేషన్‌ చైర్మన్‌. ఇదే పని కాపు కార్పోరేషన్‌ చైర్మనో, బిసి కార్పోరేషన్‌ చైర్మనో, ఎస్సీ కార్పోరేషన్‌ చైర్మనో చేసి వుంటే యింత చులాగ్గా తీసేసేవారు కారు. ఆయన్ని తీసేసి తమ కులాన్ని అవమానపరచారని ఆ కులసంఘాలు విమర్శలు కురిపించేవి. కనీసం 'గర్జన సభలు' నిర్వహించేవి. బ్రాహ్మణులతో ఆ భయం లేదు. కృష్ణారావుగారు బ్రాహ్మణ కార్పోరేషన్‌ ద్వారా తమకు ఎంత మేలు చేసినా, ఎంత సేవ చేసినా వాళ్లు చలించలేదు. విజయవాడలో ఆయనకు మద్దతుగా బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ ఏదో జరిగిందంటే అది కూడా బాబు రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెసు మల్లాది విష్ణు, వైసీపీ రఘుపతి నిర్వహించడం బట్టే! 

రాజకీయ జోక్యం లేని సాధారణ బ్రాహ్మణ సంఘాలు స్పందించినట్లు దాఖలాలు లేవు. సంఘాలుగా స్పందించక పోయినా, వ్యక్తిగతంగా బ్రాహ్మణులు స్పందించి వుండరని అనుకోవడానికి లేదు. కృష్ణారావుగారిపై టిడిపి వారికి ఫిర్యాదులున్నాయి కానీ బ్రాహ్మణులకు ఫిర్యాదులున్నట్లు యిప్పటిదాకా ఎక్కడా తేలలేదు. ఆంధ్రలో కృష్ణారావుగారి నేతృత్వంలో, తెలంగాణలో రమణాచారిగారి నేతృత్వంలో బ్రాహ్మణ కార్పోరేషన్లు చురుగ్గానే పనిచేస్తున్నాయి. 

అసలిలాటి కార్పోరేషన్లు ఏర్పడతాయని కూడా ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో బ్రాహ్మణులు గంపగుత్తగా ఓటేయరని అందరూ నమ్ముతారు. వారి కొక నాయకత్వమూ లేదు, ఒకరి మాట యింకొకరు వినే పరిస్థితీ లేదు. స్వయంకృషితో, స్వీయప్రతిభతో మాత్రమే పైకి వస్తారు కాబట్టి ఫలానావారికి ఓటేయకపోతే మనకున్న ఫలానా సౌకర్యం పోతుందని భయపడరు. ఆ కులానికి చెందిన అభ్యర్థులు మహామహా తక్కువ కాబట్టి, ఓట్లేసి మనవాణ్ని గెలిపించుకోవాలని తపన పడే సందర్భమూ రాదు. వారిలో చాలామంది మధ్యతరగతికి చెందినవారు కాబట్టి డబ్బిచ్చి ఓట్లు కొనుక్కోవచ్చన్న ధీమా అభ్యర్థుల కుండదు.

తక్కిన రోజుల్లో పత్రికల్లో వ్యాసాలు, ఎడిటరుకి లేఖలు, బస్‌స్టాండ్లలో లెక్చర్లు దంచినా పోలింగు రోజున యిల్లు కదిలి వస్తారో లేదో కూడా తెలియదు. కదలివచ్చి ఎవరికైనా ఓటేశారంటే ఆ పార్టీ మీదో, అభ్యర్థి మీదో అభిమానం కొద్దీ వేశారనే అర్థం. యుపిలో అయితే బ్రాహ్మణ ఓటర్ల శాతం ఎక్కువ. రాజకీయాల్లో చురుగ్గా వుంటారు. అందువలన మాయావతి ఒకసారి దళిత-బ్రాహ్మణ కూటమి ఏర్పరచి ఎన్నికలలో విజయం సాధించింది. అది చూసి అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో అలాటి ప్రయత్నం చేయబోయారు కొందరు. కానీ తెలుగు బ్రాహ్మల పద్ధతి వేరు. అందుకే ఆ ప్రయత్నం టేకాఫే కాలేదు. 

ఈ కారణాల చేత తెలుగునాట ఏ పార్టీ బ్రాహ్మణుల ఓట్లు ఆకర్షించాలనే ప్రయత్నం చేయదు. తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణులకు ఒక్క టిక్కెట్టు కూడా యివ్వదు. అయినా 2014 ఎన్నికలలో బ్రాహ్మణులు టిడిపి-బిజెపి కూటమికి మూకుమ్మడిగా ఓటేశారని తోచింది. బాబు వాళ్ల కేదో చేస్తారన్న ఆశతో అనుకోవడానికి లేదు. ప్రతిపక్ష నేతగా వున్నపుడు బాబు అన్ని వర్గాల వారికీ, అన్ని కులాల వారికి ఎడాపెడా వాగ్దానాలు కురిపించారు. అవి ఆయనకే గుర్తుండి వుండవు. వాటిలో ఓ లాజిక్కూ లేదు. కాపులకు ఏటా వెయ్యికోట్లతో కార్పోరేషన్‌ అన్నారు.

బ్రాహ్మణులకు వంద కోట్లతో కార్పోరేషన్‌ అన్నారు. అంటే కాపులు బ్రాహ్మణుల కంటె పది రెట్లు జనాభా వున్నారనా? కులాల వారీ జనాభా లెక్కలు అందుబాటులో లేవు కానీ, కొన్ని అంచనాలు వేయవచ్చు. మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో బ్రాహ్మల శాతం 3-4% వుంటుందనుకుంటే, ఆంధ్రలో 4% ఉండవచ్చు. తెలంగాణలో కంటె ఆంధ్రలో, ముఖ్యంగా కోస్తా జిల్లాలలో బ్రాహ్మల జనాభా ఎక్కువ. మరి కాపులు 40% వున్నారా? అవకాశం లేదు. అయినా వెయ్యికోట్ల హామీ ఎందుకంటే గుత్తగా ఓట్లేస్తారన్న ఆశ! బ్రాహ్మల మీద ఆ నమ్మకం లేదు. సరే, హామీలు ఏ మేరకు అమలయ్యేయి అనేది వేరే చర్చ. హామీ యివ్వడంలోనే తేడాలున్నాయి, దానికి కారణం ఓటింగు స్వభావాలు అని గుర్తిస్తే చాలు.

బ్రాహ్మణుల్లో అధికశాతం ఉద్యోగులే. ఉద్యోగులకు, చంద్రబాబుకు ఉప్పు-నిప్పుగా నడిచింది. ఆ కారణం చేత కూడా వాళ్లు టిడిపికి ఓటేయవలసిన పని లేదు. అయినా, తమ కులస్వభావానికి, వర్గస్వభావానికి విరుద్ధంగా బ్రాహ్మణ సమూహం 2014లో టిడిపికి హోల్‌సేల్‌గా ఓట్లేసింది. దీనికి కారణం - అందరిలాగే పాలనాదక్షుడు బాబు కొత్త రాష్ట్రానికి ఏదో సాధించి చూపుతారన్న ఆశతో బాటు జగన్‌ అంటే విముఖత! జగన్‌ మైనారిటీలకే ప్రాధాన్యత యిచ్చి హిందువులను అణచివేస్తాడనే భయం. అందుచేతనే బ్రాహ్మలకు టిక్కెట్టిచ్చిన జగన్‌కు కాకుండా యీసారీ ఒక్క టిక్కెట్టూ యివ్వని బాబుకే ఓటేశారు.

ఇది బాబు కూడా గమనించారు. బ్రాహ్మణ సముదాయానికి ఏదైనా చేయాలనుకున్నారు. అందుకే బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్‌ను ఏర్పరచారు. వరుసగా ఏడాదికి రూ.25 కోట్లు,  రూ.35 కోట్లు, రూ. 75 కోట్లు కేటాయించారు. 2016 జనవరిలో కృష్ణారావుగారిని చైర్మన్‌గా వేశారు. చీఫ్‌ సెక్రటరీగా రిటైరైన ఆయన సేవలను వేరేలా ఉపయోగించుకుందామంటే ఆయనే నాకీ బ్రాహ్మణ కార్పోరేషన్‌ చైర్మన్‌గిరీ చాలన్నారు. జీతమక్కర లేదన్నారు. అప్పణ్నుంచి ఏదో చేయడానికి తంటాలు పడుతున్నారు. 

ఇప్పుడీ గొడవ వచ్చాక టిడిపి అనుకూల మీడియా ఆయనను 'మిస్టర్‌ నో'గా అభివర్ణించింది. తన వద్దకు ఏ ప్రతిపాదన వచ్చినా దానికి అడ్డు చెప్పడమే ఆయన అలవాటని విమర్శించింది. మరి అలాటాయనకు టిడిపి యీ కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటి? వచ్చిన అప్లికేషన్లన్నీ తిరక్కొట్టి, ప్రభుత్వానికి డబ్బు మిగిలిస్తారనా? నిజానికి ఆయన యింకా ఏదేదో చేసేయాలని పెద్ద ప్లాన్లు వేసుకుని నిధులు అడుగుతున్నారు. బాబు స్పందించకపోతే అపాయింట్‌మెంట్‌ అడిగి కన్విన్స్‌ చేద్దామనుకున్నారు. ఆరునెలలుగా ప్రయత్నించి విసిగి వేసారారు. కృష్ణారావుగారు బాబుకి వ్యక్తిగతంగా నచ్చకపోతే నచ్చకపోవచ్చు. కానీ తనకు ఓట్లేసి గెలిపించిన బ్రాహ్మణసమూహం కోసం పెట్టిన కార్పోరేషన్‌కు ఆయన చైర్మన్‌. అందుకోసమేనా గోడు వినాలి.

ఎందుకు వినలేదు అంటే కృష్ణారావు గారంటే కోపం వచ్చిందని అర్థమౌతోంది. కోపం ఎందుకు రావాలి అంటే రెండు కారణాలు - టిడిపివారు చెప్పినట్లు ఆయన వినటం లేదు. రెండు  మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు గుర్తు చేసి అర్చకుల హక్కుల గురించి అడుగుతున్నారు. దీనిలో మొదటిదే ప్రధాన కారణం. చంద్రబాబు యీసారి హయాంలో ఆయన ప్రచారప్రీతి హద్దులు దాటుతోంది. గతంలో కూడా ప్రతీదానికి ఆయన ఫోటో వేసుకుని హోర్డింగులు, బ్యానర్లు కట్టించుకునేవారు. ఈసారి తన పేరును కూడా బలంగా పుష్‌ చేసుకుంటున్నారు.

చంద్రన్న పండగ కానుకల్లాటివి గతంలో లేవు. అది గమనించి కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ కాపు భవనానికి చంద్రన్న కాపు భవన్‌ అని పేరు పెట్టారు. తక్కిన స్కీములకు చంద్రన్న స్వయం ఉపాధి, చంద్రన్న విదేశీ విద్యా దీవెన, చంద్రన్న విద్యోన్నతి... యిలాటి పేర్లు పెట్టారు. ఇక ఎస్సీ కార్పోరేషన్‌ చైర్మన్‌ కార్పోరేషన్‌ మంజూరు చేసిన ఋణాలతో కొన్న వాహనాలపై చంద్రబాబు బొమ్మ వుండాలనే నిబంధన పెట్టారు. పథకాలకు చంద్రన్న చేయూత, చంద్రన్న ఋణమేళా.. యిలాటి పేర్లు. మరి బ్రాహ్మణ కార్పోరేషన్‌ పథకాల పేర్లు ఏమిటి? గాయత్రి, వశిష్ట, ద్రోణ, చాణక్య, చరక.. బాబుకి మండిందంటే మండదూ మరి! 

కృష్ణారావు ఋణగ్రహీతలకు బాబు పేర లేఖలు రాసి సరిపెట్టారు. అది బాబుకి చాలలేదు. అందుకే కృష్ణారావు ప్రెస్‌మీట్‌లో 'పొలిటికల్‌ మైలేజ్‌ రావటం లేదని నాపై ఫిర్యాదు. ఇంతకు మించి భజన చేయలేను' అని చెప్పుకున్నారు. 'తెలంగాణలో బ్రాహ్మణ కార్పోరేషన్‌ ఏర్పాటు చేయగానే కెసియార్‌ బొమ్మలకు పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు జరిగాయని, మన దగ్గర మీకు అలాటివి జరగటం లేదంటే దానికి కృష్ణారావు వైఫల్యమే కారణమ'ని టిడిపి నాయకులు బాబుకు నూరిపోశారని వార్తలు వచ్చాయి. కృష్ణారావుకు ముందు కూడా కార్పోరేషన్‌ వుంది. అప్పుడెందుకు జరగలేదు? ఇప్పుడు ఆనందసూర్య అలాటివేమైనా ఏర్పాటు చేయబోతారేమో చూడాలి. 

జన్మభూమి కమిటీలు ఆంధ్రలో పెద్ద అంశంగా మారాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నెగ్గిన నియోజకవర్గాల్లో కూడా జన్మభూమి కమిటీలు ప్రతిదానిలో కలగచేసుకుంటున్నాయని ఆరోపణలున్నాయి. ఈ కార్పోరేషన్‌లో కూడా తాము చెప్పినవారికే ఋణాలివ్వాలని వాళ్లు పట్టుబడితే యీయన వినలేదుట. దానితో యీయన వైసిపి వాళ్లకు యిస్తున్నారనే ప్రచారం మొదలుపెట్టారు. తమకు సమాచారం యివ్వటం లేదని టిడిపి ఎమ్మెల్యేల ఫిర్యాదు. దానికి కృష్ణారావుగారు 'కార్పోరేషన్‌ సభ్యులు, సమన్వయకర్తల్లో ఎక్కువమంది టిడిపివారే. వాళ్లు సమాచారం యివ్వకపోతే ఎక్కడో సమన్వయలోపం ఉందన్నమాట. దానికి నేనేం చేయగలను?' అన్నారు. 

అంటే దీని అర్థం ఏమిటి? కార్పోరేషన్‌ నిధులు ప్రజలు కట్టిన పన్నుల్లోంచి రావాలి. ప్రచారం మాత్రం టిడిపికి రావాలి. కార్పోరేషన్‌లో పదవులు వాళ్లకే వుండాలి. అప్పులు కూడా వాళ్ల వాళ్లకే, వాళ్లు చెప్పినవాళ్లకే యివ్వాలి. కృష్ణారావుగారు ఎంతో కొంత చేసినా అది వాళ్లకు చాలలేదు. వైసిపి ఎమ్మెల్యేను కలిస్తే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందా? ఎవర్ని ఎందుకు కలవాల్సి వచ్చిందో ఆయన ప్రెస్‌మీట్‌లోనే చెప్పారు. ఆయనను పిలిచి సంజాయిషీ అడిగితే చెప్పి వుండేవాడు.

అది మనసులో పెట్టుకుని హఠాత్తుగా పదవి పీకేస్తే ఎలా? బిజెపిలో చేరతారని, వైసిపిలో చేరతారని ప్రచారం మొదలుపెట్టారు. స్వతంత్ర భారతపౌరుడు ఏదైనా చేయవచ్చు. అమరావతిలో రాజధానిని వ్యతిరేకించారని మరో ఫిర్యాదు. ఏం వ్యతిరేకించకూడదా? తన అభిప్రాయాలను వెలిబుచ్చడం ద్వారా ఆయన చట్టవిరుద్ధమైన, ఉద్యోగవిరుద్ధమైన పని చేసి వుంటే ఆయనపై చర్య తీసుకోవాల్సింది. ఈ కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టకుండా వుండాల్సింది. 

కృష్ణారావుగారి తీరు నచ్చక తీసేయడంతో సరిపెట్టలేదు టిడిపి. దాని సానుభూతిపరులు (వాళ్లను గట్టర్‌ స్థాయి మనుష్యులని గవర్నరు అన్నారట) సోషల్‌ మీడియాలో ఆయనపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. ఆయన బ్రాహ్మణుల (ఏ పార్టీ బ్రాహ్మణులో!?) మనోభావాలు దెబ్బ తీసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆనందసూర్య ధ్వజమెత్తారు. ఇదంతా చూస్తే ఒకే ఒక్కటి తేటతెల్లమౌతోంది. ప్రజల డబ్బు ఖర్చవాలి, పబ్లిసిటీ బాబుకి రావాలి. అలా డప్పుకొట్టేవాళ్లే ఆయనకు ఆత్మీయులు. డప్పు కొట్టడానికి మొహమాట పడేవాళ్లు శత్రువులు.

ఆ విషయం గ్రహించి కృష్ణారావు ముందుగానే రాజీనామా చేసి వుంటే హుందాగా వుండేది. అమరావతిలో భూసేకరణ విషయంలో, విశాఖలో ప్రభుత్వ భూములను ప్రయివేటు సంస్థలకు కేటాయించే విషయంలో అభ్యంతరాలుండి పుస్తకాలు రాద్దామనుకుంటే ముందే ప్రకటించి వుండాల్సింది. పదవి పోగానే యీ ప్రకటనలు చేయడంతో అక్కసు కొద్దీ చేస్తున్నారన్న అర్థం వచ్చింది. వచ్చే ఎన్నికలలో బ్రాహ్మణుల ఓటింగ్‌ సరళిపై కృష్ణారావు ఉదంతం ప్రభావం చూపుతుందా లేదా అన్నది యికపై కార్పోరేషన్‌ నడిచే తీరుపై ఆధారపడుతుంది. కృష్ణారావు సాధించలేకపోయిన పనులను ఆనంద సూర్య తన హయాంలో సాధిస్తే డామేజి కంట్రోలవుతుంది. పనులూ జరగక, భజన మాత్రం ఎక్కువైతే మరింత డ్యామేజి అవుతుంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com