Advertisement

Advertisement


Home > Politics - Andhra

జోస్యం చెప్పే కోయదొరల కంటె చిత్రంగా పవన్ కల్యాణ్!

జోస్యం చెప్పే కోయదొరల కంటె చిత్రంగా పవన్ కల్యాణ్!

‘జరిగింది చెబుతాను.. జరగబోయేది చెబుతాను.. కొండదేవర మీద ఆన..’ అంటూ రాగయుక్తంగా ఆకట్టుకునేలా మాట్లాడుతూ.. జోస్యం చెప్పే కోయదొరల వద్ద ఖచ్చితంగా ఒక ఫోటో ఆల్బం ఉంటుంది. గతంలో తాము ఏయే సెలబ్రిటీలకు కోయజోస్యం చెప్పామో.. వివరిస్తూ.. వాళ్లందరితో కలిసి దిగిన ఫోటోలను కోయదొర ప్రతి క్లయింటుకూ చూపించుకుంటూ బతికేస్తుంటాడు. ఒక రకంగా చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే తరహా అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పరిస్థితి.. సదరు కోయదొరల కంటె చిత్రంగా, ఘోరంగా కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్ ఏ సభలో మాట్లాడినా సరే.. ‘ప్రధాని నరేంద్రమోడీ తన జేబులో మనిషి’ అనడం ఒక్కటే తక్కువ. ఆయనతో తనకు చాలా చాలా క్లోజ్ పరిచయం ఉన్నదని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడూ ఆయన తనకు మిత్రుడు అనే పదం కూడా వాడుతుంటారు. ఇలాంటి కబుర్లు చెబుతూ ఉంటే ప్రజలు తనను చూసి నవ్వుతారనే భయం కూడా పవన్ కల్యాణ్ కు ఉన్నట్టుగా లేదు. అందుకే ప్రతి సభలోనూ మోడీతో తన దగ్గరితనం గురించి డప్పు కొడతారు. తాజాగా అదే పనిచేశారాయన.

ఏలేశ్వరంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ రొటీన్ గా జగన్ మీద చేసే విమర్శల రికార్డు మొత్తం వినిపించారు. దానికి అదనంగా ‘‘ప్రధాని దగ్గర నేను ధైర్యంగా మాట్లాడగలను. మోదీ దగ్గర ఏదైనా మాట్లాడాలంటే జగన్ కు భయం.’’ అంటూ పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అవునా నిజమేనా అని జనం ముక్కున వేలేసుకునే ముందు పవన్ మరికొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పాలి.

‘‘తమరు ప్రధాని నరేంద్రమోడీతో ధైర్యంగా మాట్లాడగలను అంటున్నారు. జగన్ కు అంత ధైర్యం లేదు.. భయం ఎక్కువ అంటున్నారు కదా పవన్ జీ.. తమరు చెబుతున్నది నిజమే అనుకుందాం. మరి తమరు ప్రధానితో ధైర్యంగా మాట్లాడి రాష్ట్రం కోసం ఏం సాధించారు?’’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కు గురించి ఆందోళన చేస్తున్న వారికి కల్లబొల్లి హామీలు ఇచ్చిన పవన్ కల్యాణ్ వారి బాధ గురించి కేంద్రానికి కనీసం మాటమాత్రంగా కూడా చెప్పలేకపోయారు.

అయినా పవన్ బాబూ.. తమరికి ప్రధాని అంత క్లోజ్ అయితే.. ఆయనకు ధైర్యంగా విషయం చెప్పి, మనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి, రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురండి. పవన్ అడగడం వల్లనే హోదా ఇచ్చినట్టు ఆయనతో ప్రకటన కూడా చేయించండి.. మిమ్మల్ని మా నెత్తిన పెట్టి పూజించుకుంటాం. నిర్దిష్టంగా రాష్ట్రం కోసం చేసిందేమీ లేకపోగా.. తెలుగుదేశంతో పొత్తు కుదర్చడానికి తప్ప.. పవన్ బిజెపితో అంటకాగి సాధించిందేమీ లేదు. ఇంత చేతగాని నాయకుడు, ప్రగల్భాల నాయకుడు మరొకరు ఉండరని ప్రజలు అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?