Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఒకే ఒక్క జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూ... ప్ర‌తిప‌క్షాల చిత్తు!

ఒకే ఒక్క జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూ... ప్ర‌తిప‌క్షాల చిత్తు!

ఐదేళ్ల త‌ర్వాత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తెలుగు చాన‌ల్‌కు సుదీర్ఘ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ప్ర‌ముఖ చాన‌ల్ టీవీ9కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌జెంట‌ర్ రజ‌నీకాంత్ అడిగిన అనేక ప్ర‌శ్న‌ల‌కు దీటైన సమాధానాలు ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జానీకాన్ని బ‌య‌పెట్టేలా ప్ర‌తిప‌క్షాలు దుష్ప్ర‌చారం చేస్తున్న‌ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై జ‌గ‌న్ వివ‌ర‌ణ‌... అంద‌ర్నీ సంతృప్తిప‌రిచేలా వుంది. 

అలాగే రాష్ట్రంలో అభివృద్ధి లేద‌ని ప్ర‌చారం చేస్తున్న వారి చెంప ఛెళ్లుమ‌నేలా ఆయ‌న ఆధారాల‌తో స‌హా వివ‌రించారు. త‌న‌ది కేవ‌లం సంక్షేమ పాల‌న మాత్ర‌మే కాదు, అభివృద్ధి కూడా వుంద‌ని స‌మాధానం ఇచ్చారు. అయితే దుర‌దృష్ట‌వ శాత్తు అభివృద్ధిని వ‌క్రీక‌రించి చూపే మీడియా మ‌న రాష్ట్రంలో ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఈ మీడియా తానే టీడీపీ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని తూర్పార ప‌ట్టారు. 

ఈ ఇంట‌ర్వ్యూలో త‌న ఆశయం, ఆకాంక్ష గురించి స్ప‌ష్టంగా చెప్పారు. తాను చ‌నిపోయినా ప్ర‌తి ఇంట్లో త‌న ఫొటో వుండేలా పాల‌న సాగించాల‌ని, మంచి ప‌నులు చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు జ‌గ‌న్ వివ‌రించారు. ఆ డ్రీమ్‌, ప్యాష‌న్‌తో నే పాల‌న సాగించిన‌ట్టు జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి అధికారంపై జ‌గ‌న్ ధీమా వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలోని 90 శాతం కుటుంబాల అభివృద్ధిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాత్ర వుంద‌ని ధీమాగా చెప్పారు. అందుకే మ‌రోసారి అధికారం త‌న‌దే అని చెప్ప‌డానికి న‌మ్మ‌కంగా ఆయ‌న చెప్పారు. 

అలాగే చెల్లెళ్ల‌తో  విభేదాలు, వివేకా హ‌త్య తదిత‌ర అంశాల‌పై మ‌న‌సులోని మాట‌ను నిర్మొహ‌మాటంగా జ‌గ‌న్ పంచుకోవ‌డం విశేషం. ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ ఏమ‌న్నారో తెలుసుకుందాం.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై జ‌గ‌న్ డ‌బుల్ భ‌రోసా ఇచ్చారు. ప్రైవేట్ భూమికి ప్ర‌భుత్వం గ్యారెంటీ ఇస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. భూమి అమ్మ‌కానికి సంబంధించి ఎవ‌రైనా కేసు వేస్తే, అందుకు ప్ర‌భుత్వ‌మే గ్యారెంటీ ఇస్తుంద‌ని జ‌గ‌న్ చెప్పారు. ఒక‌వేళ ఎవ‌రైనా భూమి కొన్న వ్య‌క్తి న‌ష్ట‌పోతే ప్ర‌భుత్వ‌మే న‌ష్ట‌ప‌రిహారం ఇస్తుంద‌ని సీఎం తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గొప్ప సంస్క‌ర‌ణ‌గా జ‌గ‌న్‌ చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై మోదీ, అమిత్‌షాల స‌భ‌ల్లో బాబు ఎందుకు మాట్లాడలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న వారికి ఒరిజిన‌ల్స్ ఇవ్వ‌ర‌నే ప్ర‌చారంలో నిజం లేద‌ని ఆయ‌న తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే వివాదాస్ప‌దం ఎందుక‌నే ప్ర‌శ్న‌కు... ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే త‌ప‌న ఇక్క‌డే వుంద‌న్నారు. 

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను విప‌రీతంగా టార్గెట్ చేయండ‌పైన ఆయ‌న స్పందించారు. అలాగే ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఎందుకు ప‌దేప‌దే మాట్లాడుతున్నారు? ఏదైనా ప్ర‌త్యేక కార‌ణం వుందా? అనే ప్ర‌శ్న‌కు అదిరిపోయే స‌మాధానం ఇచ్చారు. 

ఈ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ మొద‌టిసారిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరు ప్ర‌స్తావించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి తాను చాలా త‌క్కువ మాట్లాడ్తాన‌ని ఆయ‌న అన్నారు. 2014లో టీడీపీ మేనిఫెస్టోలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ భాగ‌స్తుడ‌న్నారు. బాబు ప్ర‌తిపాపంలో ప‌వ‌న్ భాగ‌స్వామి అన్నారు. 

రాజ‌కీయాల్లో ఉన్నా, లేకున్నా క్యారెక్ట‌ర్ వుండాల‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు అంద‌రూ చూస్తుంటార‌ని, కావున ఆద‌ర్శంగా ఉండాల‌ని జ‌గ‌న్ అన్నారు. ఐదేళ్ల‌కోసారి భార్య‌ల్ని మారుస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఒక సారి భార్య‌ని మారిస్తే పొర‌పాటు, రెండోసారి అదే జ‌రిగితే గ్ర‌హ‌పాటు, కానీ అది మూడు, నాలుగు, ఐదు సార్లు జ‌రిగితే అల‌వాటు అని అద్భుత‌మైన స‌మాధానం ఇచ్చారు. వైవాహిక జీవితంలో జ‌రిగిన దానికి చింతిస్తూ ప‌వ‌న్‌ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు. అలా కాకుండా ప్ర‌శ్నించిన వారిపై ఎదురు దాడికి దిగుతున్నార‌ని ఆయ‌న వాపోయారు.

ఐదేళ్ల‌కోసారి భార్య‌ల్ని మార్చే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఓటు వేసే ముందు ప్ర‌తి అక్కా చెల్లి ఆలోచించాల‌ని ఆయ‌న కోరారు. ప‌వ‌న్ మ‌న‌స్త‌త్వం తెలుసుకోవాల‌న్నారు. ఇలాంటి వ్య‌క్తి ఎమ్మెల్యేగా న్యాయం చేస్తారా? లేదా? ఆలోచించాల‌న్నారు.

వైఎస్ వివేకా హ‌త్య‌పై ...

వివేకా హ‌త్య కేసులో ఇటు వైపు చెల్లి, అటు వైపు త‌మ్ముడు ఉన్నార‌న్నారు. అవినాష్‌రెడ్డి మూడు నాలుగు ద‌ఫాలు వివిధ వేదిక‌ల‌పై నుంచి సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చాడ‌న్నారు. అవినాష్ వివ‌ర‌ణ‌ను చూసిన త‌ర్వాత ... అత‌ను చెప్పిందే స‌రైందే, స‌హేతుకంగా ఉంద‌ని భావించాన‌న్నారు. అవినాష్ వైపు ఎవ‌రైనా మాట్లాడితే వాళ్ల‌పైన కూడా అభాండాలు వేయ‌డం, ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు ధ‌ర్మం? విచార‌ణ న్యాయ‌స్థానంలో జ‌రుగుతోంద‌ని ఆయ‌న అన్నారు. త‌ప్పు ఎవ‌రు చేసినా త‌ప్పే అని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. వీళ్లు (ష‌ర్మిల‌, సునీత‌) లేవ‌నెత్తుతున్న ప్ర‌తి ప్ర‌శ్న‌కు అవినాష్  స‌మ‌గ్ర వివ‌ర‌ణ ఇచ్చార‌ని జ‌గ‌న్ తెలిపారు. 

చెల్లెళ్ల‌కు న్యాయం చేయ‌డం అంటే, మ‌రొక‌రికి అన్యాయం చేయ‌డం ధ‌ర్మం కాద‌ని జ‌గ‌న్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. వివేకా హ‌త్య కేసు విష‌యంలో తాను చెల్లెళ్ల వైపా, అవినాష్ వైపా? అంటే... ధ‌ర్మం, న్యాయం వైపు వుంటాన‌ని జ‌గ‌న్ అదిరిపోయే స‌మాధానం ఇచ్చారు.

కుటుంబ విభేదాల‌పై...

దుర‌దృష్ట‌వ‌శాత్తు బంధుత్వాల్లోకి రాజ‌కీయాలు చొర‌బ‌డ్డాయ‌ని జ‌గ‌న్ అన్నారు. అది కూడా చంద్ర‌బాబునాయుడు లాంటి కుట్ర‌దారుడు చొర‌బ‌డ్డాడని, దీంతో స‌హ‌జంగానే కుటుంబ సంబంధాల్లో ఇలాంటి ప‌రిణ‌మాలు చోటు చేసుకుంటాయని అన్నారు. రాజ‌కీయాల్లోకి తన సోద‌రి ష‌ర్మిల రావ‌ద్ద‌నేది త‌న అభిప్రాయంగా జ‌గ‌న్ చెప్పారు. ఒక‌వేళ వ‌స్తే బంధుప్రీతి, అవినీతి లాంటి ఆరోప‌ణ‌లు చేస్తార‌ని జాగ్ర‌త్త ప‌డ్డాన‌ని ఆయ‌న అన్నారు. 

కుటుంబంలో ఒకే జ‌న‌రేష‌న్ నుంచి రాజ‌కీయాల్లోకి రావ‌ద్ద‌నేది త‌న అభిప్రాయ‌మ‌ని, అదేమీ త‌ప్పు కాద‌న్నారు. కానీ అటు వైపు (ష‌ర్మిల‌కు) బ‌ల‌మైన రాజ‌కీయ ఆకాంక్ష ఉన్న‌ప్పుడు, చంద్ర‌బాబునాయుడు కుట్ర‌తో మొత్తం చెడ‌గొట్టాడ‌ని ఆయ‌న ఆరోపించారు. రాజ‌కీయంగా త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అస‌లు ఈ రాష్ట్రంలో లేద‌న్నారు. క‌నీసం నోటాకు వ‌చ్చిన‌న్ని ఓట్లు కూడా రాలేద‌న్నారు. త‌న తండ్రి వైఎస్సార్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌, అలాగే ఆమె అన్న అంటే త‌న‌ను 16 నెల‌ల పాటు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు లేద‌న్నారు. నోటాకు వ‌చ్చిన‌న్ని ఓట్లు కూడా రాని పార్టీలో ఈమెని పెట్టి రేవంత్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీని రిమోట్ కంట్రోల్‌తో చంద్ర‌బాబు ఆప‌రేట్ చేస్తూ.... త‌న‌ ఓట్ల‌లో చీలిక తీసుకురావ‌డం ద్వారా త‌మ‌ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని కుట్రతో రాజ‌కీయం చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ష‌ర్మిల‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి ఇవ‌న్నీ చేస్తున్న‌ట్టు జ‌గ‌న్ ఆరోపించారు. 

అలాగే 17 వైద్య క‌ళాశాల‌లు, నాలుగు సీ పోర్టులు, ఇత‌ర‌త్రా స‌ముద్ర ప్రాంతాల్లో నిర్మాణాల‌ను చేప‌ట్టామ‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌తో ల‌బ్ధిదారుల‌ను సోమ‌రిపోతులు చేస్తున్నార‌నేది పెత్తందారుల మ‌న‌స్త‌త్వ‌మ‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. అలాగే ముస్లింల రిజ‌ర్వేష‌న్‌కు తాను భ‌రోసా ఇస్తున్న‌ట్టు చెప్పారు. అస‌లు ఒక మతం ప్రాతిప‌దిక‌గా ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇచ్చార‌నే మాట‌ను ఆయ‌న కొట్టిపారేశారు. ఆర్థిక స్థితిని బ‌ట్టే వారికి రిజ‌ర్వేష‌న్లు ఇచ్చార‌ని, అవ‌స‌ర‌మైతే వాటిని కాపాడేందుకు న్యాయ పోరాటానికి కూడా సిద్ధ‌మ‌ని జ‌గ‌న్ భ‌రోసా ఇవ్వ‌డం విశేషం.

ఎన్నిక‌ల‌కు కేవ‌లం నాలుగు రోజుల ముందు ఇచ్చిన సుదీర్ఘ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్‌పై, అలాగే ఆయ‌న తీసుకొచ్చిన ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌పై అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేసేలా దీటైన స‌మాధానాలు ఇచ్చారు. మ‌రోసారి వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌నే ధీమా ... జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూలో క‌నిపించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?