ఎన్నికలు ముగిశాయి. దీంతో తీరిగ్గా ఎన్నికల ఖర్చును అభ్యర్థులు లెక్కేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎన్నికల్లో ఎవరెవరికి ఎంతెంత ఖర్చు అయ్యిందో లెక్కలు వేశారు. ఈ సందర్భంలో ఓటర్ల పేరు చెప్పి ప్రముఖ నిర్మాత , తిరుపతి నివాసి ఏకంగా రూ.5 కోట్లు నొక్కేసినట్టు గుర్తించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైంది.
మన కులపోళ్లు…మన కులపోళ్లు అనుకుంటే, తిరుపతోళ్లు ఎంత పని చేశారని సన్నిహితుల వద్ద ఆరణి ఆగ్రహిస్తున్నారని తెలిసింది. చిత్తూరు సిటింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు వైసీపీలో టికెట్ దక్కకపోవడంతో తన తిప్పలేవో పడి జనసేన తిరుపతి సీటు సాధించారు. మొదట్లో ఆయన అభ్యర్థిత్వాన్ని స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత డబ్బుతో కొందరి నోళ్లు మూయించారు. ఇదే సందర్భంలో మెగా కుటుంబం ఆదేశాలంటూ… ఒక ప్రముఖ నిర్మాత, తిరుపతి వాసైన ఒక కుల “ప్రసాదం” ఎన్నికల రంగంలోకి దిగారు.
అన్నీ తానై నడిపిస్తున్నట్టు షో చేశారు. ఆయన్ని ఆరణి నమ్మారు. నమ్మకం ఉన్న చోటే మోసం వుంటుందని ఆయనకు ఆలస్యంగా జ్ఞానోదయం అయ్యింది. చోటా నాయకులు, అలాగే కొంత మంది ఓటర్ల పేరు చెప్పి.. మొత్తానికి ఆరణి నుంచి రూ.5 కోట్లు సదరు నిర్మాత కొట్టేసినట్టు ఫైనల్ లెక్క తేలింది. అయితే ఆ నిర్మాత ఇచ్చినట్టు చెబుతున్న వారెవరూ .. తమకు డబ్బు ముట్టినట్టు చెప్పడం లేదు. దీంతో ఆరణి ఖంగుతిన్నారు.
ఎన్నికలు ముగిసి, చిత్తూరుకు వెళ్లిన తర్వాత నిర్మాత చేతిలో తాను మోసపోయానని ఆరణి గ్రహించారు. తన సన్నిహితుల వద్ద సదరు నిర్మాత మోసగించిన విధానంపై ఆవేదన, ఆగ్రహంతో కూడిన స్వరంతో చెబుతున్నారని తెలిసింది. తిరుపతిలోని తన కుల నాయకులకు ఫోన్ చేసి… రాజకీయంగా ఉపయోగపడతారని, ఎంతో నమ్మకంగా కోట్లాది రూపాయలు డబ్బు ఇచ్చానని, కానీ తనను మోసగించాడని ఆవేదనతో చెప్పడం చర్చనీయాంశమైంది.
అయితే ఆ నిర్మాత గురించి తిరుపతి సమాజానికి బాగా తెలుసని, గతంలో బావను ముంచి టికెట్ తెచ్చుకున్న ఘనుడని చావు కబురు చల్లగా ఆరణికి చెబుతున్నారు. ఇంత దుర్మార్గంగా చేస్తాడని అనుకోలేదని, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్ చెప్పారని తనకు తానుగా ఎన్నికల్లో చేయడానికి వచ్చాడని ఆరణి అంటున్నట్టు తెలిసింది. కులపోడని నెత్తికెక్కించుకుంటే, నిండా ముంచాడని ఆరణి లబోదిబోమంటున్నారని జనసేన తిరుపతి నాయకులు చెబుతున్నారు.