గులాబీ గుబాళింపులు ఇప్పట్లో సాధ్యం కాదు!

తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ప్రధానంగా తలపడుతున్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల నాయకులు ఎవరికి వారు తామే అత్యధిక సీట్లు…

తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ప్రధానంగా తలపడుతున్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల నాయకులు ఎవరికి వారు తామే అత్యధిక సీట్లు గెలవబోతున్నామంటూ డప్పు కొట్టుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయి సమాచారాన్ని విశ్లేషించినప్పుడు తెలంగాణలో ప్రధానంగా ఎంపీ ఎన్నికల పోటీ అనేది కాంగ్రెస్- భారతీయ జనతా పార్టీల మధ్య మాత్రమే ఉన్నదని తెలుస్తోంది.

కాగా అసెంబ్లీ ఎన్నికలలో దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొని ఓడిపోయిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదిగో కూలుతుంది.. అదిగో కూలుతుంది.. అంటూ తమ కలలను ప్రకటిస్తూ గడుపుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని తెలుస్తోంది.

ఓటింగ్ సరళి తెలంగాణలో ఒక మోస్తరుగా నడిచింది. రాజధాని భాగ్యనగరంలో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదయింది. అయితే పోలింగ్ సరళి గురించి భారత  రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ గత ఎన్నికల కంటే ఈసారి మెరుగైన స్థానాలు సాధిస్తామని ప్రకటించడం నమ్మశక్యంగా లేదు.

గత పార్లమెంట్ ఎన్నికలలో అప్పట్లో అధికారంలో ఉన్న భారాస పది స్థానాలలో గెలుపొందింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు! అప్పట్లో పార్టీ తరఫున గెలిచిన అనేకమంది ఎంపీలు ఇప్పుడు కాంగ్రెస్ లోనూ, బిజెపి లోను అభ్యర్థులుగా పోటీపడ్డారు. భారాస కొత్త వారిని వెతుక్కోవాల్సి వచ్చింది. బలమైన అభ్యర్థులను మోహరించడంలో పార్టీ విఫలమైంది. చాలా మంది పోటీకి విముఖత చూపించారు.

మరొక వైపు కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు కూడా పది నుంచి 14 వరకు ఎంపీ సీట్లు గెలుచుకుంటామని అంటున్నాయి. నెంబర్ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఎంపీ ఎన్నికల ప్రధాన పోటీ ఆ రెండు పార్టీల మధ్యనే ఉండబోతోందనేది నిజం. అయితే కనీసం మూడు నాలుగు స్థానాల్లో అయినా విజయం దక్కుతుందో లేదో అని ప్రజలు భావిస్తున్న భారాస మాత్రం గతంలో కంటే మెరుగైన స్థానాలు గెలుస్తామని అనడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

ఫలితాలు వచ్చేదాకా ఈమాత్రపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం అవసరమేలే అనుకుంటున్నారు!