పోలింగ్ దాదాపు ముగిసింది. వేరే రాష్ట్రాల నుంచి జనం వెల్లువలా వచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి బస్సలు పదుల సంఖ్యలో ఏర్పాటు చేసారు. ఓటింగ్ రాత్రి ఎనిమిది దాటినా కొనసాగుతోంది చాలా చోట్ల. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రతి సారీ మాస్ ఓటింగ్ ఎక్కువ. క్లాస్ ఓటింగ్ తక్కువ వుంటుంది. కానీ ఈసారి మాస్ ఓటింగ్ తో సమానంగా క్లాస్ ఓటింగ్ కూడా జరిగింది. ఇలా జరగడం ఇదే తొలిసారి. అంతే కాదు ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం దగ్గర దగ్గర ఎనభై శాతం వరకు పోలింగ్ జరిగింది. ఈసారి దాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది.
ఏటేటా హైదరాబాద్ లో వుండే ఆంధ్ర జనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంత మాత్రం చేత ఓటు వేయడానికి వచ్చేవారి సంఖ్య ఆ రేంజ్ లో పెరగలేదు. కానీ ఈసారి మాత్రం ఊహలకు అతీతంగా పెరిగింది. సంక్రాంతి పండుగకు వచ్చే వారి కన్నా ఓట్ల పండుగకు ఎక్కువ మంది వచ్చారు. చాలా మంది అభ్యర్ధులు హైదరాబాద్ నుంచి ఫ్రీ బస్ లు నడిపారు. అదనపు రైళ్లు, అదనపు ఆర్టీసీ బస్ లు నడిపారు.
ఊళ్ల నుంచి వచ్చిన వారంతా అదే రోజు తిరిగి వెళ్లాలి కనుక ఉదయాన్నే బూత్ ల దగ్గర బార్లు తీరారు. లోకల్ జనాలు మధ్యాహ్నం తరువాత బూత్ లకు వచ్చారు. ఎప్పుడయితే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఉదయాన్నే బారులు తీరారో, పోలింగ్ మీద అంచనాలు, తెలుగుదేశం కూటమి విజయం మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
కానీ అవే అంచనాలు సాయంత్రం వేళకు కొంత తగ్గాయి. దానికి కారణం లోకల్ జనాలు ఓట్లు కాస్త వైకాపాకు అనుకూలంగా పడడం వల్ల. దాంతో క్లారిటీ మిస్ అయింది. కూటమి అధికారంలోకి వస్తోంది అన్న ధీమా కనిపిస్తోంది. ఆ మేరకు బెట్టింగ్ లు కనిపిస్తున్నాయి. కానీ ఇంకా పూర్తి ధీమా చిక్కలేదు. మరోపక్క వైకాపా జనాలు తాము అధికారంలోకి వస్తాము అంటున్నారు కానీ, బెట్టింగ్ లకు ముందుకు రావడం లేదు.
చానెళ్లు కుస్తీ పడుతున్నాయి లెక్కలతో, ఎటు అయినా సరే కూటమి 100 సీట్లకు కాస్త అటు ఇటుగా అధికారంలోకి వస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. 90 నుంచి 100 సీట్లతో వైకాపా అధికారంలోకి వస్తుందనీ అక్కడక్కడ వినిపిస్తోంది.
కానీ ఇక్కడ ఏ పార్టీ గొంతు కూడా బలంగా వినిపించడం లేదు. బహుశా ఇంకా లెక్కలు కడుతూ వుండడమే దీనికి కారణం కావచ్చు. రేపటికి పూర్తి క్లారిటీ వస్తుంది అనుకోవాలేమో?