Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జగన్‌ హావభావాలు

ఎమ్బీయస్‌: జగన్‌ హావభావాలు

రాజకీయ నాయకులకు మంచి వచోనైపుణ్యంతో బాటు హావభావ ప్రదర్శన కూడా బాగా ఉండాలి. ఆ విషయంలో తెరమీద నటీనటులకు, వారికీ భేదం లేదు. ఇద్దరూ ప్రజలు మెచ్చే పాత్రల్లోకి పరకాయప్రవేశం చేస్తారు. నటీనటులకు కెమెరా ముందు మాత్రమే నటించవలసి ఉంటుంది. రాజకీయనాయకులకు గడప దాటితే నటించాల్సిందే. మురికి మనుష్యులు చుట్టూ చేరి కంపు కొడుతున్నారని మనసులో విసుక్కున్నా, అది బయటపడకుండా వారి బాధలన్నీ ఓపిగ్గా వింటున్నట్లు మొహం పెట్టాలి. 'అవసరమైతే దిల్లీ వెళ్లయినా, సింగపూరు టూరు వేసుకునైనా మీ సమస్య పరిష్కరిస్తాన'నే హామీ ధాటీగా, అవతలివాడు నమ్మి తీరేట్లు యివ్వగలగాలి. నటుడి విషయంలో డైలాగ్‌ డెలివరీ అంటాం, నాయకుడి విషయంలో ఆ మాట అనము. ఉద్ఘాటించారు అంటాం.

నటుడికి కానీ, నాయకుడికి కానీ వాచికానికి అనుగుణంగా ఆంగికం కూడా ఉండాలి. చేతులు, తల కదిలించడంలో మొహంలో భావాలు ప్రకటించడంలో నేర్పు ఉండాలి. సన్నివేశం మూడ్‌ బట్టి నటుడు వాటిని మార్చినట్లే నాయకుడు కూడా స్థలకాలాల్ని బట్టి మారుస్తాడు. ప్రజల మధ్య ఉండగా ఒకలా, పార్టీ సమావేశంలో మరోలా, ఆంతరంగికుల గోష్టిలో యింకోలా.. యిలా ఉంటుంది. వీటన్నిటితో బాటు ప్రతిపక్షంలో ఉండగా ప్రకటించిన హావభావాలు అధికారపక్షానికి వచ్చాక మార్చుకోవలసిన అవసరం ఉంటుంది. పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో యిది ఒకలా ఉంటే ఎన్నికలలో నెగ్గి వచ్చినవారి విషయంలో మరొకలా ఉంటుంది.

జగన్‌ అనగానే నాకు ఒక విధమైన దీనవదనమే కళ్లకు కడుతుంది, చంద్రబాబు అనగానే కనుబొమలు ముడివేసి, చికాగ్గా ఉన్న మొహం గుర్తుకు వస్తుంది. హాయిగా చిరునవ్వు నవ్వితే వీళ్ల సొమ్మేమైనా పోతుందా అనిపిస్తుంది. ఎంపీగా ఉండగా జగన్‌కు పెద్దగా కవరేజి ఉండేది కాదు, అందువలన అప్పటి ఫోటోలేవీ మనసులో హత్తుకోలేదు. వైయస్‌ పోయిన దగ్గర్నుంచే జగన్‌ వెలుగులోకి వచ్చాడు. ఇక అప్పణ్నుంచి 'ఓదార్పు' మొహమే. తండ్రి పోయాక తనను ముఖ్యమంత్రి చేసి తీరాలని సోనియా వద్ద వాదించినప్పుడు మొహం ఎలా పెట్టాడో మనకు బయటకు ఫోటోలు రాలేదు కానీ వైయస్‌ మృతి వార్త విని చనిపోయినవారిని ఓదార్చడానికి వెళ్లినప్పటి యిమేజే మనసులో ముద్రించుకు పోయింది. ఓదార్పు యాత్రకు వెళతానని యీయనా, వెళ్లడానికి వీల్లేదని సోనియా గొడవ పడడం దృశ్యరూపంగా రాని భాగోతం.

అవతల ప్రత్యర్థిగా ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి, చంద్రబాబులు కూడా రసవత్తరంగా మాట్లాడగలిగే వక్తలు కాకపోవడం చేత, నవ్వు చిందించే మొహాలు పెట్టకపోవడం చేత జగన్‌ను ఎత్తి చూపడానికి లేకపోయింది. వైయస్‌ మంచి వక్త, మాట్లాడుతూంటే వినబుద్ధయ్యేది. మాటలు సహజంగా దొర్లినట్లు ఉండేవి. 'అసెంబ్లీలో బాబుని యిరకాటంలో నెట్టే సందర్భంగా వైయస్‌ హావభావాలు వెకిలిగా ఉండేవి కావు. ఆయన నవ్వు కూడా రాజసంగా ఉండేది.' ఈ మాటలు నావి కావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజా వ్యాసంలోనివి. ఇప్పటి నాయకుల్లో కెసియార్‌ మంచి వక్త. నవరసాలతో ఉపన్యాసాన్ని రక్తి కట్టించగలరు. యాస వాడిన చోట కూడా రమ్యంగా వాడగలరు. పవన్‌ కళ్యాణ్‌ మంచి నటుడు కాబట్టి, పబ్లిక్‌ వేదికలపై మంచి వక్తగా రాణించి ఉండాలి. కానీ ఆయన భావజాలపు వలలో పడి, ఆవేశంలో కొట్టుకుపోయి, ప్రజలను చేరలేకపోయాడు. మర్నాడు పేపర్లో ఫోటోలు బాగానే వచ్చేవి కానీ, ఉపన్యాసం మాత్రం ఉత్తేజకరంగా ఉండేది కాదు.

నిజానికి ఆయన పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ఘోరంగా ఓడిపోయింది. పార్టీ నాయకులందరూ గోడ దూకేస్తున్నారు. మిగిలినవాళ్లు తమలో తాము కొట్టుకు ఛస్తున్నారు. ఎవరు ఎప్పుడు టాటా చెపుతారో తెలియదు. అయినా ఆయన చలిస్తున్నట్లు, పార్టీ భవిష్యత్తు గురించి మథన పడుతున్నట్లు అనిపించటం లేదు. ఈయన ఉప్పూకారం తినే మనిషా? భావోద్వేగాలు లేని మరమనిషా? అని ఆశ్చర్యపడేలా ఉన్నారు. 'ఏది ఏమైనా నేనింతే, మారే ప్రశ్న లేదు' అనే భావమే ఆయన ఆంగికంలో ప్రతిఫలిస్తోంది.

మన తెలుగు నాయకులు చాలామంది ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడరు. కొంతమంది మాటలకు తడుముకుంటారు, మరి కొంతమంది చిన్న వాక్యాలను కూడా చాలా ఎంఫటిక్‌గా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. జగన్‌ చాలా కంఫర్టబుల్‌గా ఇంగ్లీషు మాట్లాడడం నాకు నచ్చింది. జాతీయ స్థాయిలో దీనికి ప్రయోజనం ఉంటుంది. జగన్‌ గతంలో కూడా జాతీయ మీడియాతో మాట్లాడినప్పుడు చాలా సౌకర్యంగానే మాట్లాడాడు. అవేళ్టి ఐఏఎస్‌ మీటింగులో అంతా బాగానే ఉన్నా నా కంటికి రెండు తప్పులు కనబడ్డాయి. 'రిసీట్‌' అనే బదులు 'రిసీప్ట్‌' అన్నాడు. ఒక మాలప్రాపిజం (మాట దగ్గరగా ఉంటుంది కానీ అర్థం వేరే ఉంటుంది, ఇన్‌ఫ్లుయెన్స్‌, ఇన్‌ఫ్లుయెన్జా..లా అన్నమాట) దొర్లింది కూడా.

మొత్తం మీద అధికారులను యింప్రెస్‌ చేసే విధంగానే మాట్లాడాడు అనిపించింది. ఎందుకంటే అధికారులకు రాజకీయ నాయకులంటే లోలోన చిన్నచూపు ఉంటుంది. జగన్‌కు యిప్పటిదాకా ఉన్న యిమేజి ఏ మాత్రం గొప్పగా లేదు కాబట్టి, యితని గురించి విశేషంగా అనుకోవడానికి ఏమీ లేదు. ఆ రోజు ఉపన్యాసం, బాబు పద్ధతికి భిన్నంగా, మనమంతా కలిసి పని చేద్దాం అనే ధోరణిలోనే సాగింది. చాలా అంశాల పట్ల అవగాహన ఉంది అని అనిపించేట్లా సాగింది ఆ ప్రసంగం. జగన్‌ హావభావాలు ఆ నాటి వాతావరణానికి చక్కగా కుదిరాయి.

ఆ నాయకుడు యీ రోజు పరాజితుడై కేవలం 23 సీట్లతో మిగిలాడు. కొడుకుని కూడా గెలిపించుకోలేక పోయాడు. జాతీయ స్వర్గానికి ఎగరబోయి రాష్ట్రస్థాయి ఉట్టిని కూడా అందుకోలేక పోయాడు. ఇప్పుడు దిల్లీ, లఖ్‌నవ్‌ వెళితే పలకరించే దిక్కు లేదు. రాహుల్‌ తోక పట్టుకుని యమున యీదబోతే, రాహులే తోక కత్తిరించుకుని పారిపోయాడు. అమరావతి, పోలవరం, సింగపూరు, జపాన్‌ కబుర్లు హాస్యాస్పదంగా మిగిలాయి. అత్యంత ఆత్మీయంగా మెలగిన పత్రికలే యీనాడు ఆయన పాలనలో అవినీతి గురించి ఉపదేశాలు దంచుతున్నాయి. అవతల తెలంగాణలో పార్టీ చిరునామా గల్లంతయ్యింది. ఇక్కడ ఆంధ్రలో 39% మంది ఓటర్లు తన నాయకత్వాన్ని నమ్మినా, నాయకులు మాత్రం నమ్మకం లేక అటు దూకేస్తున్నారు. బిజెపి ముఖ్యంగా కమ్మల మీదే కన్నేసి, టిడిపి కబళిద్దామని చూస్తోందన్న వార్తలు గట్టిగా వినవస్తున్నాయి. అధికార దుర్వినియోగంపై వైసిపి వేసిన కమిటీలు ఏం తేలుస్తాయోనన్న దిగులు ఒకటి ఎలాగూ ఉంది. మీడియా సపోర్టు గతంలోలా ఉంటుందో లేదో ప్రశ్నార్థకం. ఇలా బాబు జీవితంలో ప్రస్తుతం కాళరాత్రి నడుస్తోంది.

ఈ సినారియోను జగన్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లు కనబడుతోంది. అసెంబ్లీలో బాబు యిబ్బంది పడినప్పుడల్లా జగన్‌ పగలబడి నవ్వుతున్నారు. దాన్ని టిడిపి అభిమానులు 'వెకిలి నవ్వులు'గా అంటే అనవచ్చు కానీ, తటస్థులకు మాత్రం 'అంతొద్దు, ముసిముసి నవ్వులు చాలు' అనిపిస్తుంది. ఎందుకు నవ్వకూడదు? టిడిపి వాళ్లు అధికారంలో ఉండగా జగన్‌తో ఒక మాదిరిగా ఆటాడుకున్నారా? దానితో పోలిస్తే యిదెంత? అని అడగవచ్చు.  కానీ ప్రజల మెంటాలిటీ విచిత్రంగా ఉంటుంది. తప్పు చేసినవాడిపై అనవసరమైన జాలి చూపిస్తారు. అదీ తన పట్ల తప్పు చేసినవాడిపై కాదు, మరొకడి పట్ల చేసినవాడిపై...! తన దగ్గరకు వస్తే చంపేయాలి, డొక్క చీరేయాలి అంటారు. అదే అవతలివాడికి చెప్పేటప్పుడు 'పోనిద్దురూ, వాడి పాపాన వాడే పోతాడు' అని ఉచితంగా సలహా లిస్తారు. రాజకీయాల్లో యిలాటిది మరీ కనబడుతుంది. పాత పాలకులపై విచారణ లోతుగా జరిపే కొద్దీ వారిపై సానుభూతి పెరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే పాతవి తవ్వడానికి చాలామంది భయపడతారు.

అసెంబ్లీలో జగన్‌ ఆవేశకావేషాలకు లోనవుతున్నట్లు కూడా స్పష్టంగా కనబడుతోంది. నిజానికి చెప్పాలంటే యీ అసెంబ్లీ సమావేశాలు యిప్పటివరకు టిడిపి హయాం వాటి కంటె చాలా, చాలా మెరుగు. పెర్‌ఫెక్ట్‌ అని చెప్పలేం కానీ ఎట్‌లీస్ట్‌ ఎవరేం మాట్లాడుతున్నారో తెలుస్తోంది. స్పీకరుగా తమ్మినేని సీతారాం హెడ్‌మాస్టారి పాత్ర చక్కగా పోషిస్తున్నారు. ప్రతిపక్షానికి పూర్తి అవకాశం కల్పిస్తున్నారు, అవసరమైతే అధికార పార్టీ వాళ్లను సైతం అదిలిస్తున్నారు. అంతా బాగా నడిస్తే వైసిపికి పేరు వచ్చేస్తుంది. అది తమకు హాని కాబట్టి టిడిపి సభ సవ్యంగా నడవకుండా చూస్తుంది, పోట్లాటకై కవ్విస్తుంది. అది తెలిసి, వైసిపి మరింత సంయమనంతో వ్యవహరించాలి.  ఒకప్పుడు తాము ఆడింది ఆట, పాడింది పాటగా నడిచిన సభలో యీ రోజు బిక్కమొహంతో కూర్చోవడం టిడిపికి రుచించదు. అసెంబ్లీ సెషన్‌ పూర్తయేలోగా, చిన్న సాకు చూపించి, 'ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది' అని ఆరోపిస్తూ సభను బహిష్కరించడానికే ఎక్కువ ఛాన్సుంది. వాళ్లు అలా ఆరోపించడానికి అవకాశం యివ్వకపోవడంలోనే వైసిపి నైపుణ్యముంది.

అసెంబ్లీ సాక్షిగా ఆయన అబద్ధాలు చెప్పేస్తూ ఉంటే తలాడిస్తూ కూర్చోవాలా అని జగన్‌ అనుకోవచ్చు. కూర్చోనక్కరలేదు, ఆయనకు మంచి సైన్యం ఉంది. బుగ్గన వంటి ప్రతిభావంతుడు, మర్యాదస్తుడు 'బాబుగారిని ఫోకస్‌డ్‌గా మాట్లాడమనండి అధ్యక్షా, ఈ పాయింటుకి ఎస్‌ ఆర్‌ నో ఒక్కటీ చెప్తే చాలు' అంటూ క్లుప్తంగా మాట్లాడడం మోర్‌ ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది. 'నువ్విలా చేశావ్‌, అలా చేశావ్‌' అని బాబు పురాణం ఏకరువు పెట్టడం వ్యర్థం. పాదయాత్రలో అవన్నీ జనాలు వినేశారు. ఈనాడు మళ్లీ కొత్తగా చెప్పేదేముంది? వినేదేముంది? సున్నా వడ్డీ పథకం విషయంలో వైసిపి తప్పటడుగులు వేసింది. కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలోనే అది ప్రారంభమైనపుడు తాము కొత్తగా ప్రవేశపెట్టినట్లు చెప్పుకుని ఉండకూడదు. మధ్యలో టిడిపి ఆపేసింది కాబట్టి కొత్తగా పెట్టినట్లే అని వాదిద్దామన్నా, టిడిపి కేటాయించిన దానిలో 5% నిధులు విడుదల చేసిందని అంతిమంగా జగన్‌ చెప్పవలసి వచ్చింది. అలాటప్పుడు ఒక్క పైసా కూడా యివ్వలేదు, కావాలంటే రికార్డులు తెప్పిస్తాను అని జగన్‌ ధాటీగా మాట్లాడడం దేనికి? 5% అంటే 5%, 0% అంటే 0%. 5 యిస్తే అయిదే యిచ్చారని చెప్పాలి కానీ అస్సలివ్వలేదనకూడదు.

చిన్నపుడు చందమామ కథొకటి చదివాను. రాజు పన్నులు వేయవలసి వచ్చినపుడు మంత్రుల చేత వేయిస్తాడట. దానిలో రాయితీలు ప్రకటించేటప్పుడు తను ముందుకు వస్తాడట. ఆ విధంగా ప్రజలకు మంత్రులపై ఆగ్రహం కలుగుతుంది తప్ప రాజుపై కలగదు. అదే విధంగా టిడిపి ఎమ్మెల్యేలను అడ్డుకునే పని వైసిపి ఎమ్మెల్యేలే, మహా అయితే మంత్రులే చేయాలి తప్ప సాక్షాత్తూ ముఖ్యమంత్రి రంగంలోకి దిగకూడదు. 'మీ కంటె దాదాపు ఐదు రెట్లు ఎక్కువమంది ఉన్నాం, తలచుకుంటే మీరు సభలో ఉండలేరు' వంటివి తను అనకూడదు. చంద్రబాబును ఉద్దేశించి 'ఆయనకు బుద్ధీ, జ్ఞానం లేదు' వంటి మాటలు వాడకూడదు. బాబు ఎంత తెలివితక్కువగా మాట్లాడినా జగన్‌ యిలా అనగానే 'అదేమిటండి, తండ్రి వయసువాణ్ని పట్టుకుని అలా అనేశాడు' అంటారు జనాలు. మన సమాజంలో వయసుకి అనవసరంగా తెగ మర్యాద యిచ్చేస్తూంటారు. వయసు వచ్చినంత మాత్రాన జ్ఞానం రావాలని రూలేమీ లేదు. సీనియర్‌ సిటిజన్లకు ప్రభుత్వం యిప్పటికే చాలా రాయితీలు యిస్తోంది. అవి చాలు. 'పెద్దముండావాడు, వదిలేయండి' అనడం అనవసరం. కానీ సమాజం అలా అంటుంది. దాన్ని జగన్‌ గుర్తెరిగి మాటల్లో కటుత్వాన్ని తగ్గించాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?