Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: జామినీ రాయ్ చిత్రాలు

ఎమ్బీయస్‍: జామినీ రాయ్ చిత్రాలు

ప్రఖ్యాత బెంగాలీ చిత్రకారుడు, ‘పద్మభూషణ్’(1955) గ్రహీత జా(యా)మినీ రాయ్ (1887-1972) నివసించిన ఆయన యింటిని దిల్లీ ఆర్ట్ గ్యాలరీ (డిఎజి) అనే ప్రయివేటు సంస్థ కొని ఆయన పెయింటింగ్స్‌తో ఆర్ట్ గ్యాలరీగా మారుస్తోందని వార్త వచ్చింది. చాలా సంతోషం వేసింది. ఆయన మంచి చిత్రకారుడు. ఆయన బొమ్మలతో మ్యూజియం పెట్టి భద్రపరచడం, భావితరాలకు ఆయన గొప్పతనాన్ని పరిచయం చేయడం సమాజం బాధ్యత. అంటే ప్రభుత్వబాధ్యత. కానీ ప్రభుత్వం ఎవరికైనా ఏదైనా చేయగానే, ‘అన్నీ ఆ కులం వారికే చేస్తున్నారు, ఆ ప్రాంతం వారికే చేస్తున్నారు, తక్కినవారికి కూడా సమాన నిష్పత్తిలో చేయాల్సిందే’ అనే డిమాండ్లు ప్రారంభమై అర్హత ఉన్నవారూ, లేనివారు జాబితాలోకి చేరిపోయి, ఆ మ్యూజియాల క్వాలిటీ పడిపోతుంది. రాష్ట్రాల నుంచి కేంద్రం దాకా యిదే తంటా. అందుకే ఎందుకొచ్చిన గొడవలని ప్రభుత్వాలు పెద్దగా ఏమీ చేయటం లేదు.

ఈ డిఎజి సంస్థ ఏమనుకుందో ఏమో, కలకత్తాలో బాలీగంజ్‌లో ఉన్న జామినీ రాయ్ ఇంటిని ఆయన వారసుల నుంచి కొనేసి అక్కడ మ్యూజియం పెట్టేస్తోంది. 2024 ఏప్రిల్‌లో తెరుస్తారట. ప్రయివేటుది కాబట్టి, ఒకే వ్యక్తి బొమ్మలతో పెడుతున్నారు కాబట్టి, ఫలానా వారిని విస్మరించారు, ఫలానా వారిని నిర్లక్ష్యం చేశారు అని ఎవరూ అనడానికి లేదు. జామినీ వేసిన బొమ్మలు అనేక మ్యూజియంలలో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారు అన్నారు. అన్నీ తేగలరో, లేక కొన్నిటి రెప్లికాలు చేయిస్తారో తెలియదు. అక్కడే ఆ బొమ్మల పోస్టుకార్డులు అమ్మి, కఫే ఒకటి పెట్టి, దాన్ని వాణిజ్యపరంగా కూడా నిలదొక్కుకునేట్లా చేస్తారుట. టిక్కెట్టు ఎలాగూ పెడతారు. మన తెలుగునాట కూడా ఎందరో చిత్రకారులున్నారు. వారి విషయంలో కూడా యిలాటి ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది.

ప్రభుత్వపరంగానో, సంస్థలపరంగానో, కార్పోరేట్ల పరంగానో మ్యూజియం పెట్టవచ్చు. కానీ దాని నిర్వహణ కొనసాగాలంటే సందర్శకులు రావాలి. రావాలంటే వారికి చిత్రాల పట్ల అవగాహన ఉండాలి. కనీసం పేర్లు తెలిసి ఉండాలి. మనం టూర్లకు వెళ్లినపుడు మ్యూజియంలో అతి తక్కువ సమయాన్ని గడుపుతాం. బొమ్మల సెక్షన్‌లో మరీ తక్కువ సేపు ఉంటాం. మోడర్న్ ఆర్ట్ సెక్షన్ అయితే తల అటూయిటూ తిప్పకుండా హాల్లోంచి సూటిగా నడుచుకుంటూ వచ్చేస్తాం. ఎవరైనా అక్కడ బెంచీ మీద కూర్చుని ఏదైనా బొమ్మ కేసి దీర్ఘంగా చూస్తూ కనబడితే, ఎండలో తిరిగి వచ్చాడు కదా, ఎసి గాలి కోసం కూర్చున్నాడనుకుంటాం తప్ప బొమ్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకోము. ఈ పరిస్థితి మారాలంటే కాస్త మనం చిత్రకళ గురించి, శిల్పకళ గురించి కొంతైనా తెలుసుకోవాలి.

నాకు కొన్ని బొమ్మల గురించి తెలుసు. అవి ఏ రకమైన శైలికి చెందినవో, దేనితో వేశారో అదీ నాకు తెలియదు, పెద్దగా పట్టించుకోను. సినిమా చూసి బాగుందనుకుంటాను తప్ప ఏ లెన్స్‌తో తీశారు, టేకింగ్‌లో ఏ కొత్త విధానాన్ని అవలంబించాడు అని ఆలోచించను. అదంతా సినిమాలు తీద్దామనుకునే వారి పని. నేను బొమ్మలు వేయలేను. నేర్చుకునే ఉద్దేశమూ లేదు. కంటికింపుగా ఉంటే, లేదా భావస్ఫోరకంగా ఉంటే గాఢంగా చూస్తాను. కొన్ని మస్తిష్కంలో గుర్తుండి పోతాయి. అలాటివి కొన్ని వరసగా చూస్తే యీ బొమ్మ యీయనది కదూ అని తోస్తుంది. కింద పేరు చూసి కన్‌ఫమ్ చేసుకుంటా అప్పుడప్పుడు. జామినీ రాయ్ బొమ్మలు నాకిష్టం. ఆయన సమకాలీనుడే ఐన నందలాల్ బోస్ బొమ్మలు లైట్ కలర్స్‌లో, చాలా క్లాసికల్‌గా అనిపిస్తాయి. జామినీవి కొట్టవచ్చినట్లు, ప్రస్ఫుటంగా ఉంటాయి. తెలంగాణ గ్రామీణ చిత్రాలు గీసిన కాపు రాజయ్యగారికి ఆయన యిన్‌స్పిరేషనేమో అనిపిస్తుంది నాకు.

జామినీ పశ్చిమ బెంగాల్‌లో పుట్టారు. కలకత్తాలోని గవర్నమెంటు కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌స్‌లో చదివారు. రవీంద్రనాథ్ ఠాగూరు అన్న కొడుకు అబ(వ)నీంద్రనాథ్ ఠాగూరు వద్ద శిష్యరికం చేశారు. ఆయన పాశ్చాత్య చిత్రకళ ప్రభావం తగ్గించడానికి మొఘల్, రాజపుత్ర కళారూపాలను ప్రోత్సహించారు. అక్కడ చదువు పూర్తయ్యాక జామిని తన సొంత శైలి కోసం వెతుక్కున్నారు. బెంగాల్ జానపద చిత్రశైలి ‘కాళీఘాట్ పట్’ శైలి తీసుకుని బోల్డ్ బ్రష్ స్ట్రోక్స్‌తో బొమ్మలు గీయసాగారు. గ్రామీణ జీవితాన్ని నేపథ్యంగా తీసుకుని పల్లీయులనే తన మోడల్స్‌గా ఎంచుకున్నారు. ఆ తర్వాత రామాయణ, భాగవత చిత్రాలు గీసినా అదే శైలిని కొనసాగించారు. ఆయన బొమ్మలు సింపుల్‌గా ఉంటాయి. నాలుగైదు బొమ్మలు వరుసగా చూస్తే ఆయన శైలి మనసులో ముద్రించుకుని పోతుంది.

ఆయన మొత్తం మీద 20 వేల బొమ్మలు వేశారట. అప్పట్లో చిత్రకారులు పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేసి హెచ్చు ధరకు జమీందార్లకు, ధనికులకు, ఉన్నతోద్యోగులకు అమ్మేవారు. కానీ జామిని మధ్యతరగతి వారు కొనుక్కునే రేంజ్‌లో బొమ్మలు అమ్మేవారట. 1940 వచ్చేసరికి భారతీయ సామాన్య జనమే కాదు, యూరోపియన్లు కూడా ఆయనకు అభిమానులయ్యారు. ఆయనకు క్లయింట్లు అయ్యారు. 1953లో లండన్‌లో ఆయన చిత్రాల ప్రదర్శన జరిగింది. విదేశాల్లో అనేక మ్యూజియంలు వాటిని ప్రదర్శిస్తున్నాయి. 1934లో వైస్రాయ్ గోల్డ్‌మెడల్ యిచ్చారు. 1955లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది.

ఆయన బొమ్మల్లో కొన్ని పైన యిచ్చాను. మొదటి బొమ్మ పేరు ‘బోటింగ్’. చూడండి, అందరి కళ్లూ చేపల్లాగానే ఉన్నాయి. చేపలే కింద బోర్డర్‌గా అమిరాయి. మగా, ఆడా అందరికీ వెండి కడియాలున్నాయి. అందరూ చక్కగా తీర్చిదిద్దినట్లుగా ఉన్నారు. కలర్స్ డార్క్‌గా ఉన్నాయి చూశారా, అదే ఆయన స్టయిల్. రెండో బొమ్మ ‘రాధాకృష్ణులు’లో కూడా అలాటి డార్క్ కలర్సే. అలాటి సిమిట్రీనే. మొదటి బొమ్మలో మొగాళ్ల లాగానే దీనిలో కృష్ణుడికి సన్నటి తలగుడ్డ ఉంది.  సిమిట్రీ కోసమో ఏమో రాధ కూడా మురళి పట్టింది. ఒంపుసొంపులు యిద్దరివీ ఒకేలా ఉన్నాయి. మూడో బొమ్మ పేరు ‘నిర్మల’. మొదటి రెండిటికి భిన్నంగా, తెలుపు డామినేషన్‌తో తక్కువ లైన్లతో ఒక సెరినిటీ తెచ్చారు. నాలుగో దాని పేరు ‘బ్రైడ్ అండ్ టూ కంపేనియన్స్’. ముగ్గురూ మీనాక్షులే! వధువు చీర నీలం రంగులో గొప్ప డేజిలింగ్‌గా అనిపిస్తుంది నాకు. వీటితో పాటు ఆయన ఫోటో, సంతకం కూడా యిచ్చాను. ఇవి నచ్చితే గూగుల్‌లో ఆయన యితర బొమ్మలు కూడా చూడండి.

చూశారుగా, చిత్రకళ గురించి నా పరిజ్ఞానం అమిత పరిమితం. మీరు కాస్త శ్రద్ధ పెట్టి చూస్తే మీకే ఎక్కువ అంశాలు తోస్తాయి. ఇలాటి సంక్షిప్త పరిచయాలు మీకు నచ్చాయంటే యింకా కొందరి గురించి రాస్తాను. ‘హంస సందేశం’ ‘మేనకా విశ్వామిత్ర’ (రవివర్మ), ‘బర్త్ ఆఫ్ వీనస్’, ‘క్రియేషన్ ఆఫ్ ఏడమ్’, ‘గుయెర్నికా’ వంటి బొమ్మల విషయంలో అయితే పౌరాణిక, చారిత్రాత్మక సందర్భం రాయడానికి కొంత ఉంటుంది. స్పందన లేకనో, యితరత్రా వ్యాపకాల చేతనో నేను యీ సీరీస్ రాయలేక పోయినా, మీరు బొమ్మల గురించి ఆసక్తి పెంచుకోండి. ఇవాళ జామినీ రాయ్ బొమ్మలతో ప్రైవేటు మ్యూజియం వంగభూమిలో పెట్టినట్లు, రేపు ఏ ఎన్నారై తెలుగు సంఘం వాళ్లో తెలుగు చిత్రకారుల బొమ్మలతో తెలుగునాట ప్రయివేటు మ్యూజియం పెడతామని ముందుకు రావచ్చు. మనం వెళ్లి చూడకపోతే త్వరలోనే మూతపడనూ వచ్చు. వెళ్లాలంటే మనకు కాస్తయినా తెలియాలి. అందుకే తెలుసుకునే ప్రయత్నం చేయమని నా కోరిక.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?