మీడియా విచారణను ఎగ్గొట్టాలని అనుకుంటే.. సింపుల్ గా ఒక మెయిల్ పెట్టి, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయి అని పేర్కొన్నా కూడా సరిపోతుంది.
సీబీఐ తలచినప్పుడెల్లా, పిలిచినప్పుడెల్లా, వారు చిటికేస్తే రావడానికి ఆయనేమీ దారినపోయే దానయ్య కాదు. పొద్దస్తమానమూ గోళ్లు గిల్లుకుంటూ ఖాళీగా కూర్చున్న వ్యక్తి కాదు! ప్రజాప్రతినిధి, ఎంపీ! ఆయనకు ముందుగా ఫిక్సయిన కార్యక్రమాలు ఉండడం ఆశ్చర్యకరం కాదు. –ఈసంగతిని ప్రధానంగా గమనించాలి.
సీబీఐ విచారణకు పిలిచిన తర్వాత.. ఎంతకాలం ఆయన దానిని వెనక్కు నెట్టగలడు? ఒకవేళ కార్యక్రమాలు ఉన్నాయంటూ ఆయన చెబుతున్న మాట సాకులే అయితే గనుక.. రెండు మూడు రోజులు వాయిదా తప్ప.. విచారణను తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు కదా? ఆయన కూడా అలా తప్పించుకోవడం లేదు కదా? తేదీ మార్పు అడిగినాసరే, ప్రతిసారీ విచారణకు హాజరవుతూనే ఉన్నారు. –ఈ సంగతిని కూడా ద్వితీయ ప్రాధాన్యంతో గుర్తుంచుకోవాలి.
ఇలాంటి నేపథ్యంలో విచారణకు హాజరవడానికే బయల్దేరిన వ్యక్తి, తల్లికి గుండెపోటు వచ్చినట్టు ఫోన్ రావడంతో మార్గమధ్యంలోనే తల్లి వద్దకు వెళ్లడానికి ప్రయత్నించడంలో తప్పు ఏముంది?
అవినాష్ రెడ్డి మీద కారుకూతలు కూస్తున్న, నానా చెత్త రాస్తున్న మీడియా మహానుభావులు అందరూ కూడా.. అవినాష్ వెంట తాము కెమెరాలతో పరుగులుతీస్తున్న సమయంలో తన తల్లికి గుండెపోటు అని ఫోన్ వస్తే ఏం చేస్తారు? తల్లి ఎలా చస్తే ఏముందిలే.. అవినాష్ వీడియో తీయడమే మనకు ముఖ్యం అనుకుని.. వారి వెంటపడుతూనే ఉంటారా?
విచారణను తప్పించుకోవడం ఎటూ సాధ్యం కాదు.. జస్ట్ కొన్ని రోజులు ముందుకు నెట్టడానికి తల్లికి గుండెపోటు అంశాన్ని డ్రామా కింద అభివర్ణించడం ఎంత నీచమైన వ్యవహారం.
అవినాష్ వ్యతిరేక ప్రచారంలో , జగన్ వ్యతిరేక ప్రచారంలో రెచ్చిపోతున్న పచ్చమీడియా నీచమైన వ్యవహార సరళికి తాజా ఉదంతం పెద్ద ఉదాహరణ.
అటూ ఇటూ రెండు వైపులా కూడా మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు బాకాలు ఊదేలా, కరపత్రాల్లా తయారైపోయిన వైనం మనకు అలవాటు అయిపోయింది. అయితే మాత్రం.. మరీ ఇంత నీచంగా చేస్తారా? తల్లి గుండెపోటును కూడా డ్రామా అంటారా? ఎంత బాధాకరమైన విషయం అది!
ఒకవేళ అది నిజంగానే డ్రామా అయినా సరే.. అంతటి నీచమైన డ్రామా ఆడినందుకు అవినాష్ మీద జాలిపడి, దానిమీద చిలవలు పలవలు రాయకుండా మీడియా సంయమనం పాటించాలి. ఆ తల్లికి (ఎవరికైనా తల్లే కదా) అలా గౌరవం ఇవ్వాలి.
ఆమెను అంబులెన్సులో ఎక్కిస్తుండగా కూడా ఫోటోలు, వీడియోలు తీయాలనుకునే కక్కుర్తిని ఎలా అర్థం చేసుకోవాలి. అంటే ఆమె గుండెపోటు ఒక డ్రామా అని చిత్రించే ప్రయత్నం కదా ఇది!
ఇలాంటి నీచమైన పోకడల్ని మానుకుంటే మీడియా తమ గౌరవాన్ని తాము కాపాడుకున్నట్టు అవుతుంది.