Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: జెపి గారి మజ్‌బూరీ

ఎమ్బీయస్‍: జెపి గారి మజ్‌బూరీ

జెపి గారి తాజా స్టేటుమెంటు వింటే ‘అవసరమా యిది ఆయనకు?’ అనిపిస్తోంది. తటస్థంగా ఉంటూ అందరి మీద అక్షింతలు వేస్తూ ఉంటే అదో దారి. ‘ఏదో పెద్దాయన ఆవేదన పడుతున్నాడు, నీతికీ నిజాయితీకి నిలబడి, ఆదర్శవాదిగా ఏదో చేద్దామనుకుని, యీ రాజకీయ వ్యవస్థలో యిమడలేక ఆచరణలో విఫలమయ్యాడు. అయినా ప్రజల కష్టాల పట్ల స్పందించే హృదయం ఉంది కాబట్టి, పరిస్థితి గాడి తప్పినప్పుడు సలహాలు యిస్తూ ఉంటాడు, ఆయన చెప్పినదానిలో తప్పు పట్టడానికి ఏమీ ఉండదని అంటూనే నాయకులెవరూ వాటిని పట్టించుకోక పోవడం దురదృష్టం.’ అని నిట్టూరుస్తూంటారు మామూలు ప్రజలు. ఈ యిమేజిని అలాగే కొనసాగిస్తే పోయుండేది. ఇప్పుడు హఠాత్తుగా కొన్ని పార్టీలకు మద్దతిస్తూ ప్రకటన చేయడంతో ప్రజలు ఆయన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ పార్టీల పాపాలకు యీయన సమాధానం చెప్పవలసిన పరిస్థితిని తెచ్చుకున్నారు. ఎందుకిలా తెచ్చుకున్నారు అని ఆలోచిస్తే ఆయన మజ్‌బూరీ (నిస్సహాయాత) ఏమిటో కాస్త అర్థమౌతుంది.

ముందుగా ఆయన ప్రకటనలోని విషయాల గురించి – ‘‘ఆంధ్రజ్యోతి’’లో వచ్చిన దాన్ని బట్టి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు, ఉపాధి లేవన్నారు. 20% ఉండాల్సిన అప్పులు 43%కు పెరిగాయన్నారు. ఉద్యోగుల బకాయిలు కలిపితే 50% అవుతాయన్నారు. అప్పులు తెచ్చి సగం జీతభత్యాలకు, మరి కొంత కైంకర్యం చేసి (ఆధారాలుంటే యీయన లోకసత్తా ద్వారా కేసులు వేయలేదేం? అనిపించింది. ఇలాటివి మీకూనాకూ కొత్త కానీ ఆయనకి కాదు కదా), కొంత దుబారా చేసి, మిగిలిన నిధులను సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారన్నారు. సంక్షేమానికి పరిమితి ఉండాలని, పాలకులు ప్రజల సొమ్మును తమ సొమ్ముగా భావిస్తున్నారని మండిపడ్డారు.

ఔను, ఆంధ్రలో సంక్షేమం ఎక్కువ, అప్పులూ ఎక్కువనేది నిజమే. అది జగన్ పాలనలో మాత్రమే జరుగుతోందా? చంద్రబాబు కిటికీలు తెరిస్తే, జగన్ తలుపులు తెరిచారు. ఇప్పుడు జగన్ సంక్షేమానికి ఖర్చు పెట్టే సొమ్ములో ఓ 10% తక్కువగా బాబు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మళ్లీ అధికారం అప్పగిస్తే యిప్పటి కంటె ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటున్నారు. ఇప్పుడిచ్చేదానికి ఎక్కువ యిస్తానంటున్నారు, కొత్త పథకాలు పెడతానంటున్నారు. బాబు హయాంలోనూ అప్పులు దండిగా ఉన్నాయి. ఇప్పుడు వేగం పెరిగిందంతే. బాబు రాగానే సంపద సృష్టించబడదు కదా! లక్ష్మీదేవి ధనవృష్టి కురిపించదు కదా! జెపి చెప్పినట్లు అప్పులు 20% లోపునే ఉంచుతారా? ఆ మేరకు మానిఫెస్టోలో ప్రకటించారా? వీటి గురించి జెపి బాబు దగ్గర్నుండి ప్రయివేటుగా హామీలేమైనా తీసుకుని ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారా?

అప్పులు, సంక్షేమం గురించి మాట్లాడవలసి వస్తే కేంద్రం చేస్తున్నదాని గురించి కూడా ప్రశ్నించవచ్చు. జెపి నివాసముంటున్న తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గురించి కూడా మాట్లాడవచ్చు. తెరాస యిచ్చే సంక్షేమం కంటె ఎక్కువగా 6 హామీలిచ్చి కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. ‘ఎల్లకాలం పుచ్చుకోవడం కాకుండా, సంపాదించుకోవడం అలవాటు చేసుకోవాల’ని యిప్పుడు ఆంధ్ర ప్రజలకు హితవు చెప్తున్న జెపి గారు అప్పుడు తెలంగాణ ప్రజలను ఏమీ హెచ్చరించలేదు. కేంద్ర ప్రభుత్వం అప్పులు విపరీతంగా చేస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు. మోదీ అంటే అమిత అభిమానం కురిపించే జెపి దానిపై వ్యాఖ్యానించటం లేదు. కులవివక్షత గురించి విలవిలలాడే ఆయన కేంద్రపు మత వివక్షత గురించి కిమ్మనటం లేదు. దేని మీద వ్యాఖ్యానించాలో, మానాలో ఆయన యిష్టం. ఇప్పుడు మాట్లాడుతున్నారు, అప్పుడు మౌనంగా ఉన్నారేం అని కూడా మనం అడగడానికి వీల్లేదనే నా నమ్మకం. ఆయన యిష్టం ఆయనది.

ఇప్పుడైనా ఆయన కూటమికి నా మద్దతు అని, ‘కూటమి విజయంతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది’ అని అనకుండా సంక్షేమాన్ని, అభివృద్ధిని బాలన్స్ చేయాలని, అప్పులు మితి మీరకూడదని అని జనరల్‌గా అనేసి, ఎటూ కమిట్ కాకుండా ఉంటే చిక్కు లేకపోయేది. కానీ ఆయన పూర్తిగా కూటమి వైపు, ముఖ్యంగా చంద్రబాబు వైపు నిలబడడంతో కూటమి ఏ విధంగా మెరుగో వివరించ వలసిన అవసరం ఆయనపై పడుతోంది. ఐదు నెలల క్రితం వైసిపి విద్య, వైద్యం విషయంలో చేసిన కృషిని ఆయన ప్రశంసించారని వైసిపి వాళ్లు ఎత్తి చూపుతున్నారు. అది అప్పటి మాట.  అభిప్రాయం మార్చుకునే స్వేచ్ఛ ఆయనకుంది. ఇప్పుడాయన ‘రాష్ట్రంలో బాబు చేసిన అభివృద్ధిని వైసిపి నిర్వీర్యం చేసింది. ఈసారి కూటమి గెలిస్తే సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలకు అవకాశం కల్పిస్తారన్న నమ్మకం నాకుంది.’ అని డిక్లేర్ చేశారు.

2014-19 మధ్య యిదే కూటమి అధికారంలో ఉంది. అప్పుడు ఎడాపెడా అభివృద్ధి చేసేసి ఉంటే అదంతా ఎక్కడకు పోయింది? కట్టిన ఆకాశహర్మ్యాలు, వేసిన రోడ్లు భూకంపాలు వచ్చి కూలిపోయాయా? పట్టుకొచ్చిన పరిశ్రమలు హూష్‌కాకీ అయిపోయాయా? ఉద్యోగాలు ఊడిపోయాయా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, జనజీవితాలను అతలాకుతలం చేసిన కరోనా తర్వాతి కాలంలో వచ్చింది కానీ అప్పట్లో రాలేదు కదా! నిజంగా అంత అద్భుతంగా పాలించి ఉంటే ప్రజలు 23 సీట్లిచ్చి (13%) ఊరుకోబెట్టారేం? టిడిపి వాళ్ల నడిగితే ఇవిఎమ్‌ల మోసం, ‘ఒక్క ఛాన్స్’ అని జగన్ ప్రాధేయపడడం వంటి కారణాలు చెప్తారు. జెపి అలా చెప్పలేరు కదా, శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించి, తన యిమేజికి తగ్గట్టుగా మాట్లాడాలి కదా! రాబోయే రోజుల్లోనైనా టిడిపి, వైసిపి పాలనల మధ్య వ్యత్యాసాన్ని గణాంకాలతో పోల్చి చెప్తారని ఆశిస్తాను. అవన్నీ చెప్పాక, ఫలానా కారణంగా నేను కూటమిని బలపరుస్తున్నాను అని ఉంటే సబబుగా ఉండేది. ముందే కూటమికి జై అనేశారు.

అంటే అన్నారు కానీ యిప్పటికైనా వైసిపి వాళ్లు టిడిపి కంటె మేం సాధించినదిది అంటూ చూపుతున్న అంకెలను ఆయన తిప్పి కొట్టాలి. చర్చావేదికలు ఆయనకు కొత్త కాదు. మంచి హోమ్‌వర్క్ చేసుకుని వచ్చి తను కూటమిని ఎందుకు సమర్థిస్తున్నారో చెప్పుకోగల సత్తా ఆయనకుంది. ఇప్పుడాయన ‘ప్రజలు, మేధావులు, రైతులు ఆలోచించి రాష్ట్రానికి, పిల్లలకు మంచి భవిష్యత్తును చూపించే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని’ చేసిన విజ్ఞప్తికి వెయిటేజి పెరుగుతుంది. గోడ మీద కూర్చుని అందరి మీదా రాళ్లు విసరడం యీజీ పని. కానీ ఒక సైడ్ తీసుకుని, వాళ్లు చేసిన ప్రతి పనీ సమర్థించుకుంటూ రావడం కష్టం. ఆయన లాటి సమర్థుడు కష్టమైన, క్లిష్టమైన ఆ పని సైతం చేయగలగవచ్చు. కానీ అంత కష్టమైన పనిని ఆయన తన నెత్తికి ఎందుకెత్తుకున్నారే సందేహం కలుగుతుంది.

30-35 ఏళ్ల వయసున్నవారిలో జెపి గారి ప్రస్థానం ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. క్లుప్తంగా చెప్తాను. ఆయన మెడిసిన్ చేసి, ఐఏఎస్‌కు వెళ్లారు. చాలా కీలకమైన పదవుల్లో పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి, లోకసత్తా పేర సామాజిక సంస్థ పెట్టారు. సమాజంలో అవినీతిని, అసమర్థతను కడిగేస్తున్నాను, ప్రజాస్వామ్యం గురించి సాధారణ జనాల్లో అవగాహన కల్పిస్తున్నాను అంటూ చాలా హడావుడే చేశారు.  సమాజంలో ఆయన లాటి మేధావులు, నీతిపరులు చాలామంది ఉండవచ్చు కానీ, యీయన్ని ప్రత్యేకంగా నిలబెట్టినది మాత్రం ‘‘ఈనాడు’’! తన పేపర్లో యీయన చేత వ్యాసాలు రాయించి, టీవీలో యీయన చేత చర్చావేదికలు నిర్వహింప చేసి, లోకసత్తా కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించి, ఆయనను బాగా ప్రొజెక్టు చేసింది.

మీడియా చాలా బలమైనది. ఎవరినైనా సరే, ఆకాశానికి ఎత్తేయగలదు, పాతాళానికి పడేయనూ గలదు. మీడియా చేత ప్రభావితమయ్యే మన బోటి మధ్యతరగతి జనాలు అదంతా నమ్ముతాం. జెపి గురించి పెద్దగా తెలియనివారు తర్వాత వచ్చిన జెడి గారి గురించి గుర్తు చేసుకుంటే సరిపోతుంది. జగన్‌పై కేసులు నడిపే రోజుల్లో ఆయన్ను హీరోగా చేసింది మీడియా. ఊళ్లలో పెద్దపెద్ద కటౌట్లు, వాటికి పాలాభిషేకాలు నడిచాయి. అప్పటిదాకా సిబిఐలో జాయింట్ డైరక్టరు అనే పదవి ఉంటుందని తెలియని మన బోటి వాళ్లందరికీ అదెంత పవర్‌ఫుల్లో తెలియవచ్చింది. జెడి అనేది ఆయన యింటిపేరు అయిపోయింది. లక్షలాది మంది ఆయన్ను ఆరాధించారు. కొంతకాలానికి మీడియాకు ఆయనతో అవసరం తీరిపోయింది. బుడగకు బెజ్జం పెట్టేశారు. దాని సైజు తగ్గిపోసాగింది.

అది గమనించని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అదీ తన కులస్తులు ఎక్కువగా ఉన్న జనసేనలోకి! 2019లో ఆయన వైజాగ్ నుంచి నిలబడితే 2.89 లక్షల మంది ఓటేశారు. ఐదేళ్లు పోయాక మళ్లీ నిలబడితే ఆయనకు యీసారి అన్ని ఓట్లు వస్తాయో లేదో తెలియదు. పార్టీ ఏదో పెట్టానన్నారు. దాని అభ్యర్థుల జాబితా బయటకు వచ్చిందో లేదో కూడా తెలియదు. జడ శ్రవణ్ ఐనా వీడియోలు చేస్తూ నేను 200 మంది బి ఫామ్స్ యిస్తాను అంటున్నారు. ఈయన అదీ చేస్తున్నట్లు లేరు. ఒకప్పుడు మీడియాలో వెలిగిన జెడికి, యిప్పటి జెడికి పోలిక ఉందా? జెపి కథా అలాటిదే! అప్పట్లో ఆయన ఉద్యమం నడిపినప్పుడు కులం, ప్రాంతాలతో సంబంధం లేకుండా మధ్యతరగతి వాళ్లందరూ ఆయన్ని ఆరాధించారు. మీడియా ఆయన్ని ఆ స్థానానికి తీసుకెళ్లింది. తర్వాతి సంఘటనలు చూస్తే అది ఒక పథకం ప్రకారం జరిగిందని అర్థమైంది.

2004లో టిడిపి ఓడిపోయింది. 2006 నాటికి వైయస్సార్ బలంగా కనబడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా ఆ లాభం టిడిపికి కలుగుతుందనే నమ్మకం టిడిపి హితైషులకు కలగలేదు. కాంగ్రెసు, టిడిపి రెండూ నచ్చని వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించడానికి లోకసత్తాను పార్టీగా మార్పించి ఎన్నికల్లోకి దింపాలనుకున్నారు వాళ్లు. ఎన్నికల అనంతరం మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువైతే జనసత్తా సర్దుతుంది అనుకున్నారు. ఇది అర్థం కావాలంటే పదేళ్ల తర్వాత 2019లో జరిగినది గమనించాలి. కావాలంటే బాబు పవన్‌తో బాహాటంగా పొత్తు పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మొత్తం వైసిపికి వెళ్లకుండా జనసేన చీల్చి, కొన్ని సీట్లు గెలుచుకుంటుందని, ఎన్నికల అనంతరం టిడిపికి మెజారిటీ రాని పక్షంలో జనసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని బాబు అనుకున్నారు. ఇలా బాబు నాతో చెప్పారు అని ఒక టిడిపి నాయకుడు ఎన్నికల అనంతరం బహిరంగంగా చెప్పేశారు.

జనసేన తరఫున పోటీ చేసినవాళ్లకూ యీ విషయం తెలుసు. పవన్ కింగ్, కింగ్ అని అభిమానులు మీటింగుల్లో అరిచినా, ‘మేం కనీసం 20-25 గెలుస్తాం, మా నాయకుడు కింగ్‌మేకర్ అవుతాడు. మాలో కొందరికి మంత్రి పదవులు వస్తాయి.’ అని వాళ్లు అంచనా వేసుకున్నారు. వైసిపి సునామీలో యీ లెక్కలన్నీ కొట్టుకుపోయాయి. 2009 ఎన్నికలలో టిడిపి యిలాటి ప్లాను లోకసత్తాతో వేసింది. చిరంజీవి పార్టీ పెడతానని ప్రకటించినప్పుడు వైయస్ హమ్మయ్య అనుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, తమకు లాభమనుకున్నారు. కానీ ఆ కాలిక్యులేషన్ తప్పని, ఎందుకంటే కాంగ్రెసుకు రెడ్డి, కాపు సపోర్టు ఉండేదని, కాపులు విడిపోయి చిరంజీవికి వేస్తే కాంగ్రెసుకు రెడ్లు మాత్రమే మిగులుతారని, కానీ టిడిపికి బిసి, కమ్మ సపోర్టు చెదరకుండా ఉంటుందని టిడిపి అనుకుంది. కానీ చిరంజీవి రంగం మీదకు వచ్చాక టిడిపి, కాంగ్రెసు యిద్దరి ఓట్లకూ గండి కొట్టేట్టు కనబడ్డారు.

ఇక లోకసత్తా చిరంజీవిపై అస్త్రాలు సంధించ నారంభించింది. ప్రజారాజ్యం మీటింగు అయిపోయాక లోకసత్తా కార్యకర్తలు వెళ్లి అక్కడి వాటర్ బాటిల్స్ ఏరి, చిరంజీవికి పర్యావరణ స్పృహ లేదని ఎద్దేవా చేయడం లాటివి చేశారు. ఈ వరస జెపి అభిమానులకు నచ్చడం మానేసింది. లోకసత్తా ఉద్యమాన్ని పార్టీగా మార్చినపుడు ఆయన ఎవరినీ సంప్రదించ లేదని అనేక మంది కార్యకర్తలకు కోపం వచ్చింది. ఉద్యమంలో కానీ, పార్టీలో కానీ, ప్రచారంలో కానీ ఆయనకు తప్ప వేరెవరికీ ప్రాముఖ్యత లేకపోవడంతో ‘సంస్థలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లిచ్చే ఆయన చేస్తున్నదేమిటి?’ అనసాగారు అందరూ. అభ్యర్థుల విద్యార్హతలు, గుణగణాలు, సేవాదృక్పథం వగైరాలు పరిగణనలోకి తీసుకునే టిక్కెట్లిస్తాం అని ప్రకటించిన జెపి, పార్టీలో అప్పటికప్పుడు చేరినవారికీ టిక్కెట్లిచ్చేశారు.

నిజానికి అప్పటికే జెపిపై భ్రమలు తొలగిపోవడం ప్రారంభం కావడంతో చాలామంది ఆ పార్టీ టిక్కెట్లు అడగలేదు. చివరకు చూస్తే ఆయనను నమ్మి వచ్చినవారిలో ఆయన కులస్తులే ఎక్కువగా తేలారు. కులరహిత సమాజం గురించి కలవరించే లోకసత్తాకు యిది ఒక అభాసం. అభ్యర్థులే కాదు, ఓటర్లలో కూడా ప్రధానంగా ఆయన కులస్తులే ఆయన పార్టీకి ఓటేశారు. ఆ కులం ప్రబలంగా ఉన్న ప్రాంతాలలోనే లోకసత్తాకు ఓట్లు బాగా పడ్డాయి. టిడిపికి వెళ్లాల్సిన ఆ ఓట్లన్నీ యీయనకు పడడంతో టిడిపి నష్టపోయింది. ఇటు లోకసత్తా కూడా లాభపడలేదు. రాష్ట్రం మొత్తం మీద జెపి ఒక్కరే నెగ్గారు. తమకు వస్తాయనుకున్న ఓట్లలో చిరంజీవి కొన్ని కొట్టుకుపోగా, జెపి కొన్ని పట్టుకుపోవడంతో బాబుకి ఒళ్లు మండిపోయింది. ‘పిఆర్‌పి, లోకసత్తా లాటి నాన్-సీరియస్ పార్టీలను ఎన్నికలలో అనుమతించ కూడదు’ అంటూ రోషంగా మాట్లాడారు.

ఇదంతా ఎన్నికల అనంతరం కథ. ఎన్నికలకు సిద్ధమవుతూండగా మాత్రం లోకసత్తాకు విదేశాల నుంచి విపరీతమైన మద్దతు వచ్చేది. ఎంతోమంది విరాళాలు పంపుతూండేవారు. నేను 2009 నుంచే యీ కాలమ్ మొదలుపెట్టాను. జెపికి అనుకూలంగా నేనేమీ రాయకపోవడంతో (అప్పటి నా వ్యాసాలు ఎమ్బీయస్ బ్లాగ్‌లో చూడవచ్చు) లోకసత్తా అభిమానులు నన్ను తిట్టిపోసేవారు. లోకసత్తాకు ఓటేయమని కాన్వాస్ చేయకపోతే, జెపిని ఆకాశానికి ఎత్తకపోతే నేను అవినీతిపరుడి కిందే లెక్క అని మెయిల్స్ రాసేవారు. (అప్పట్లో కామెంట్ సెక్షన్ ఉండేది కాదు). కానీ వాళ్లకు తెలియదు, నేను అప్పటికే యీ తరహా నాయకుల్ని చూసిచూసి స్కెప్టికల్ అయిపోయి ఉన్నానని. చంద్రశేఖర్, విపి సింగ్, యిలా ఎందరో..! 12 ఏళ్ల క్రితం అరవింద్ కేజ్రీవాల్ యిమేజి ఏమిటి? ఈనాటి యిమేజ్ ఏమిటి? వయసు వస్తున్న కొద్దీ ఆవేశం తగ్గుతుంది, అనుమానాలు పెరుగుతాయి.

2009లో లోకసత్తా పరాజయం తర్వాత, టిడిపి వారు దూరం పెట్టనారంభించాక జెపి ప్రభ తగ్గసాగింది. 2014 ఎన్నికలలో మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం నుంచి టిడిపి అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ చేస్తే నాలుగో స్థానం వచ్చింది. 10% కంటె తక్కువ ఓట్లు వచ్చాయి. టిడిపి మీడియా జెపికి ప్రాధాన్యత తగ్గించేసింది. దాంతో యికపై ఎన్నికలలో పోటీ చేయం అంటూ 2016లో జెపి ప్రకటించారు. లోకసత్తాకు విరాళాలు కూడా తగ్గిపోయినట్లున్నాయి.

2009లో నన్ను తిట్టినవాళ్లలో చాలామంది తర్వాత అనవసరంగా ఆవేశపడ్డాం అని నాకు మెయిల్స్ రాశారు. జెపి గారు రాజకీయాల్లోకి దిగకుండా, (నాకు తెలిసినంత వరకు) ఎవర్నీ సపోర్టు చేయకుండా (మోదీగారిని మెచ్చుకుంటున్నారనుకోండి, కానీ స్థానిక బిజెపికి ఓటేమయని కాన్వాస్ చేయటం లేదు), టీవీల్లో హితోక్తులు చెప్తూ, తన ఆలోచనలు జనాలతో పంచుకుంటూ కాలక్షేపం చేస్తూ వస్తున్నారు. ‘ఏదో చాదస్తుడు, సూక్తులు చెప్పి సమాజాన్ని మారుద్దామని తాపత్రయ పడుతున్నాడు పాపం’ అనుకుని గౌరవం చూపుతూనే జనాలు ఆయన జోలికి పోకుండా, ఆయన చెప్పేవి ఆచరించకుండా దూరం నుంచే నమస్కారం పెట్టి తప్పించుకుంటున్నారు.

అలాటిది యిప్పుడు ఎందుకీయన హఠాత్తుగా కూటమికి వత్తాసు పలుకుతూ ప్రకటన చేశారు? ఆయన కుండే మజ్‌బూరీ అలాటిది. 2009 తర్వాత టిడిపిని అభిమానించే వాళ్లలో కొందరు ఆయనకు ఆర్థికంగా, హార్దికంగా దన్నుగా నిలబడ్డారు. ఇప్పుడు వాళ్లందరూ కూటమి గెలుస్తుందా లేదాని కళవెళ పడుతున్నారు. వైసిపికి యీ ఎన్నికలలో ఓటమి సంభవించినా, జగన్ వయసు రీత్యా పార్టీ నిలదొక్కుకుంటుంది. 2014 తర్వాత టిడిపి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను పట్టుకుపోయినా 5గురు ఎంపీలతో, 40 ప్లస్ ఎమ్మెల్యేలతో పార్టీ నిలబడి ఐదేళ్ల తర్వాత ఒంటరిగా 22, 151 గెలుచుకుంది. టిడిపి పరిస్థితి అలా లేదు. వైసిపిని ఓడించాలంటే యింకో రెండు పార్టీల దన్ను తెచ్చుకోవాల్సి వచ్చింది. అయినా భారమంతా బాబు మీదే ఉంది. జనసేనలో కాని, ఆంధ్ర బిజెపిలో కాని, టిడిపిలో ద్వితీయ శ్రేణిలో కానీ నాయకులెవరూ కానరావటం లేదు. ఈ సారి ఓడితే టిడిపి సమర్థకులైన వ్యాపారవర్గాలన్నీ బిజెపి వైపు దూకేస్తాయేమోనన్న భయం కనబడుతోంది.

అందుకే బాబు సమర్థకులందరూ దీన్ని ‘డూ ఆర్ డై’ బ్యాటిల్‌గా చూస్తున్నారు. అమెరికాలోని మా బంధుమిత్రులు చెప్తున్నారు, ఏడెనిమిది నెలల క్రితమే వాళ్లకు తారసపడిన టిడిపి అభిమానులు విరాళాలు అడగ నారంభించారట. సర్వశక్తులూ మోహరించి, యీసారి జగన్‌ను యింటికి పంపాలనే ప్రయత్నంలో దే ఆర్ లీవింగ్ నో స్టోన్ అన్‌టర్న్‌డ్. అలాటప్పుడు జెపి వంటి ఓ పాటి కొండను వదులుకుంటారా? ఆయన చెప్తే నమ్మేవాళ్లు ఆంధ్రలో లక్షల్లో ఉంటారు. అందువలన ఆయనను మొహమాట పెట్టి ఉంటారు. ఈయన మొహమాటస్తుడని మార్గదర్శి విషయంలో గతంలో రుజువైంది. ఉండవల్లి మార్గదర్శి ఫైనాన్స్ అవకతవకలను ప్రశ్నిస్తున్నపుడు జెపి గారు ‘అవన్నీ ఆర్‌బిఐ చూసుకుంటుంది, మీకెందుకు?’ అని ఉండవల్లిని బహిరంగంగా ప్రశ్నించారు. అప్పుడు శ్రీరమణ ‘పెట్రోలు బంకుల్లో కల్తీ జరిగిందో లేదో చూడడానికి సంబంధిత ప్రభుత్వ శాఖలున్నాయి. మీ లోకసత్తా వాలంటీర్లు వెళ్లి పరీక్షించ నేల?’ అని కడిగి పారేశారు.

ఉండవల్లి ‘మీతో చర్చకు సిద్ధం’ అని ప్రకటించారు. వెంటనే జెపి ‘నాకు ఆర్థిక నిబంధనలపై పెద్ద అవగాహన లేదు’ అంటూ తప్పించుకున్నారు. ఆస్ట్రేలియాలో పంచాయితీ వ్యవస్థ, అంటార్కిటికాలో నీటి సమస్య గురించి కూడా ధారాళంగా మాట్లాడగలిగిన జెపికి ఆర్‌బిఐ రూల్సు గురించి తెలుసుకోవడం ఓ బ్రహ్మవిద్యా? ఓ వారం రోజులు బాసింపట్టు వేసుకుని కూర్చుంటే అంతా నోటికి వచ్చేస్తుంది. కానీ ఆయనా పని చేయదలచ లేదంతే! అప్పుడే కాదు, యిప్పటికీ చేయదలచుకోరు. ప్రస్తుతం మార్గదర్శి చిట్స్ నిబంధనల ఉల్లంఘన గురించి ఆంధ్ర ప్రభుత్వం కేసులు పెడుతోంది. సంక్షేమం ఎంత శాతం ఉండాలో చెప్పే యీయన, అయిపోయిన చిట్స్ ఏం చేయాలో చెప్పలేరా? చెప్పరు. ఎందుకంటే అవతల ఉన్నది రామోజీ! తనను యింతవాణ్ని చేసిన రామోజీ! అలాటి మొహమాటస్తుడని తెలుసు కాబట్టే జెపిపై టిడిపి అభిమానులు ప్రెషర్ తెచ్చి ఉంటారని నా ఊహ.

పథకం బాగానే ఉంది కానీ టైమింగ్ రాంగ్ అనిపిస్తోంది. వివరిస్తాను. నేను చాలాకాలంగా ‘‘ఈనాడు’’, ‘‘ఆంధ్రజ్యోతి’’లలో వ్యాసాలు రాసే మేధావులను గమనిస్తున్నాను. వాళ్లు సమాజంలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపి అందర్నీ విమర్శిస్తూ ఉంటారు. అలా ఎన్నికల దాకా తీసుకుని వచ్చి, చివర్లో ‘అందరిలోనూ లోపాలున్నాయి కానీ, ఉన్నవాళ్లలో చంద్రబాబే కాస్త మెరుగు, లెస్సర్ ఈవిల్ ప్రాతిపదికపై ఆయనే మళ్లీ గెలిస్తే బాగుంటుంది’ అని రాస్తారు. ఈ టెక్నిక్కు నేను నార్త్‌లో చూశాను.

1979లో దిల్లీ నుంచి హైదరాబాదుకి రైల్లో స్లీపర్ కోచ్‌లో వస్తున్నాను. నార్త్‌లో రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్ పట్టింపులు పెద్దగా ఉండవు కాబట్టి ప్రతి స్టేషన్లో ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు, దిగేవాళ్లు దిగుతున్నారు. ఆగ్రాలో అనుకుంటా, ఒకతను రైలెక్కాడు. పెద్ద గొంతుక. పక్కవాళ్లతో కబుర్లు చెపుతున్నట్లు ప్రారంభించి, క్రమేపీ బోగీలో సగభాగానికి వినబడేట్లు ఛలోక్తులు వేస్తూ మాట్లాడసాగాడు. చాలా హాస్యస్ఫోరకంగా ఉండడంతో నేనూ చెవి ఒగ్గి వింటున్నాను. ఓ అరగంట పోయేసరికి, తన ప్రసంగాన్ని రాజకీయాల వైపుకి తిప్పాడు. అన్ని పార్టీల నాయకులనూ తిట్టిపోశాడు.  

అది అంతర్గత కలహాలతో జనతా పార్టీ విచ్ఛిన్నమైన కాలం.  ఎమర్జన్సీలో ఇందిర పాలనను అసహ్యించుకుని ఐదు పార్టీల కూటమి ఐన జనతాను గెలిపిస్తే వాళ్లు తమలో తాము కొట్టుకుని చచ్చి రెండేళ్లలోనే ప్రభుత్వాన్ని కూల్చుకున్నారు. ఏ పార్టీని నమ్మాలో తెలియక జనం గందరగోళంలో ఉన్నారు. అందుకని యీ ప్రసంగానికి మంచి రెస్పాన్సు వచ్చింది. ఇతను ‘అసలీ ప్రజాస్వామ్యం, గాడిదగుడ్డూ కంటే పాతకాలపు రాజులే బాగా పాలించారు. రాజరికం మళ్లీ వస్తే బాగుండును.’ అని కాస్సేపు చెప్పుకొచ్చాడు. జనమంతా ఔనౌనన్నారు. ఇలా గంటా, గంటన్నర సాగింది. ఇంతా చెప్పి, ముక్తాయింపుగా ‘రాజులందరూ పోయారు, రాజరికం మళ్లీ రాదు, ఉన్నంతలో జనసంఘ్ లీడరు వాజపేయి గారు మంచివాడు. ఆయన రాజ్యంలోకి వస్తే బాగుంటుంది.’ అని అన్నాడతను. జనమంతా నిజం, నిజం అన్నారు.

జనతాలో భాగస్వామిగా ఉన్న జనసంఘ్ దరిమిలా 1980లో బిజెపిగా ఏర్పడింది. అప్పణ్నుంచి ఎదుగుతూనే వచ్చింది. జనతాలో తక్కిన పార్టీలన్నీ నీరసించి, కొన్ని గాయబ్ అయ్యాయి, కొన్ని ప్రాంతీయ పార్టీలుగా మారాయి. ఆ రోజు ప్రజలను తెలివిగా జనసంఘ్ (బిజెపి) వైపు డ్రైవ్ చేసిన ఆ వ్యక్తి, ఆరెస్సెస్ కార్యకర్త అయి వుండవచ్చు, ఆ సంస్థ చేత తర్ఫీదు పొంది ఉండవచ్చు అనుకున్నాను. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీని మెచ్చుకున్నాను. ‘‘కుండబద్దలు’’ పేరుతో సుబ్బారావు అనే ఆయన యిలాగే నాయకులందర్నీ విమర్శిస్తూ ప్రారంభించి, అన్ని వర్గాల ప్రజలనూ ఆకర్షించారు. క్రమేపీ ముసుగు తీసేసి టిడిపి సమర్థకుడిగా అవతారమెత్తారు. కుండను వైసిపి నెత్తి మీద మాత్రమే బద్దలు కొట్టారు.

జెపి గార్ని ఉపయోగించు కోవడంలో కూడా టిడిపి హితైషులు కాస్త నిదానించ వలసింది. ఈలోగా ఆయన వైసిపి, కూటమిలలోని మంచిచెడులు రెగ్యులర్‌గా విశ్లేషిస్తూ వచ్చి ఎన్నికలు ఒక వారం ఉండగా ‘చూడగాచూడగా కూటమే బెస్టనిపిస్తోంది. దానికే వేయండి.’ అని తురఫు ముక్క వాడి ఉంటే ఎఫెక్టివ్‌గా ఉండేది. ప్రస్తుతానికి కూటమి అభ్యర్థుల గోలే తేలలేదు. వాళ్ల మధ్య సయోధ్య ఏ మేరకు ఉంటుందో తెలియరావటం లేదు. అప్పుడే యీయన యీ ప్రకటన చేసేసి తొందరపడిన కోయిల అనిపించుకున్నారు. ఈ ప్రకటనలో ‘ఆంధ్రలో స్వేచ్ఛగా ఓట్లు వేసే అవకాశం ఉంటుందా? అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది.’ అన్నారు. ఆ పాయింటే పట్టుకుని లోకసత్తా వాలంటీర్ల ద్వారా అశ్లీల ప్రయోగాలు పరిహరించాలని, బెదిరింపులు మాన్పించాలని, గూండాలను మూసేయించాలని యిలాటి పిల్స్ వేస్తూ పోయి, చివర్లో ‘యీ వైసిపి ప్రభుత్వం ఉండగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లదు, కూటమి పాలనే శరణ్యం’ అని ఉంటే సరైన బిల్డప్ ఉండి ఉండేది.

 ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2024)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?