కర్ణాటక రాజకీయాల్లో బిజెపికి, కాంగ్రెసుకు రెండింటికి యింటిపోరు ఉంది. బిజెపిలో యెడియూరప్ప, అతని పోటీదారుల మధ్య కలహం కాగా, కాంగ్రెసులో సిద్ధరామయ్య, శివకుమార్ల మధ్య వైరం నడుస్తోంది. లింగాయతులలో మూడింట రెండు వంతుల మంది తన వైపు ఉండడంతో యెడియూరప్ప బిజెపిని ఆడిస్తున్నాడు. జనాభాలో లింగాయతులది 17%, (అంత లేరని కొందరంటారు). 1.5 కోట్లమంది ఉన్నారంటారు కానీ కులపరమైన జనగణన జరగనిదే యితమిత్థంగా చెప్పలేం. ఉత్తర కర్ణాటకలోని 22 జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ, 100-120 స్థానాల్లో ప్రభావం చూపించగలరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ల లాగానే కర్ణాటకలో లింగాయతులు రాజకీయాల్లో ఎప్పుడూ ముందంజలో ఉంటారు. జనాభా నిష్పత్తి కంటె ఎంతో ఎక్కువగా ఎమ్మెల్యే, ఎంపీలుగా నెగ్గారు. 1952 నుంచి లింగాయత్ ముఖ్యమంత్రులు పదిమంది ఉన్నారు. ఆర్థికంగా కూడా చాలా బలవంతులైనా కలిసికట్టుగా ఉంటూ, మూకుమ్మడిగా ఓటేస్తారు.
1956లో కర్ణాటక ఏర్పడ్డాక రెండేళ్ల పాటు మొదటి ముఖ్యమంత్రిగా చేసిన నిజలింగప్ప లింగాయతుడే. జాతీయ స్థాయి కాంగ్రెసు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి వెళ్లినపుడు మరో లింగాయత్ జత్తికి ముఖ్యమంత్రి బాధ్యత అప్పగించాడు. అతని తర్వాత వచ్చిన ఎస్ఆర్ కాంతి కూడా లింగాయతే. నిజలింగప్ప 1962లో రాష్ట్ర రాజకీయాలకు తిరిగి వచ్చి ముఖ్యమంత్రి అయి 1968 దాకా ఉన్నాడు. సిండికేటు సభ్యుల్లో ఒకడు. ఇందిరా గాంధీ పైకి వస్తున్న రోజుల్లో యీయన మొరార్జీ పక్షం వహించి కాంగ్రెసు (ఆర్గనైజేషన్)లో ఉండిపోయి, ప్రాభవం కోల్పోయి, రాజకీయంగా కనుమరుగయ్యాడు. ఈయన 1968లో ఈయన జాతీయ రాజకీయాలకు వెళ్లినపుడు తన శిష్యుడు, లింగాయతుడు అయిన వీరేంద్ర పాటిల్‌ను ముఖ్యమంత్రిగా చేశాడు. వీరేంద్ర తన పాలనలో లింగాయతుల పట్ల పక్షపాతం చూపించాడని పేరుబడ్డాడు. నిజలింగప్పతో బాటు కాంగ్రెస్ (ఓ)లో ఉండిపోయి, 1971లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఇందిరా కాంగ్రెసు చేతిలో ఓడిపోయి పదవి పోగొట్టుకున్నాడు.
1977లో జనతా పార్టీ ఏర్పడినప్పుడు దానిలో చేరి, నాయకుడిగా ఎదిగి, 1978లో చిక్కమగళూరు పార్లమెంటు ఉపయెన్నికలో ఇందిరా గాంధీతో తలపడి ఓడిపోయాడు. తర్వాత జనతా పార్టీలో రామకృష్ణ హెగ్గడే, వొక్కళిగ నాయకుడైన దేవెగౌడతో పోటీ పడలేక, ఇందిరా కాంగ్రెసులో చేరిపోయి, కేంద్రమంత్రి అయ్యాడు. 1978-80 మధ్య ఇందిరా కాంగ్రెసు పక్షాన ముఖ్యమంత్రిగా చేసిన దేవరాజ్ అరసు భూసంస్కరణలు అమలు చేయడంతో ప్రధానంగా భూస్వాములైన లింగాయతులు కాంగ్రెసుపై కోపగించుకుని జనతా పార్టీని ఆదరించారు. 1983 నుంచి 1989 వరకు జనతా పార్టీ పాలించింది. 1989 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వీరేంద్ర పాటిల్ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ 178 సీట్లతో అంటే 79% సీట్లతో ఘనవిజయాన్ని సాధించింది. అది యిప్పటికీ రికార్డే.
వీరేంద్ర పదవిలోకి వస్తూనే లిక్కర్ లాబీకి ముకుతాడు వేయడానికి ఎక్స్‌పోర్ట్ డ్యూటీని 2% నుంచి 20% కు పెంచాడు. అతనిపై పగబట్టిన లిక్కర్ లాబీ రాష్ట్రంలో మతఘర్షణలను ప్రేరేపించింది. వాటిని అదుపు చేస్తూండగానే 1990 అక్టోబరులో వీరేంద్ర పక్షవాతం బారిన పడ్డాడు. పది నెలల క్రితమే ప్రధాని పదవి పోగొట్టుకున్న రాజీవ్ గాంధీ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన్ని పలకరించడానికి యింటికి వెళ్లి, అక్కణ్నుంచి దిల్లీ తిరిగి వెళుతూ ఎయిర్‌పోర్టులో వీరేంద్ర స్థానంలో బిసి నాయకుడైన ఎస్ బంగారప్పను ముఖ్యమంత్రిగా ప్రకటించి వెళ్లిపోయాడు. అహంకారపూరితమైన యీ చర్య, ఒక సీనియర్ నాయకుణ్ని అమానవీయంగా అవమానించిన తీరు అందర్నీ నివ్వెర పరిచింది. ఆ ప్రకటనేదో వీరేంద్ర ద్వారానే చేయిస్తే పోయేది. ఘనవిజయాన్ని కట్టబెట్టిన లీడరు పక్షవాతం బారిన పడితే కొద్దికాలమైనా ఆగకుండా వారం తిరక్కుండా నిర్దాక్షిణ్యంగా తీసి పారేసిన రాజీవ్‌ను అందరూ ఏవగించుకున్నారు. వీరేంద్ర అనారోగ్యం నుంచి కోలుకోలేదు. 1997లో మరణించాడు.
వీరేంద్రకు జరిగిన అవమానాన్ని లింగాయతులలో చాలామంది ఎప్పటికీ మర్చిపోలేదు. 1989 ఎన్నికలలో మొత్తం 63 మంది లింగాయతు ఎమ్మెల్యేలలో 41 మంది కాంగ్రెసు పక్షాన గెలిచారు. ఆ తర్వాతి నుంచి కాంగ్రెసు పట్ల విముఖులై పోయారు. 1957 నుంచి లింగాయతు ఎమ్మెల్యేల సంఖ్య 70 దరిదాపుల్లో ఉంటూ వచ్చింది. 1967లో 90కి వెళ్లింది. 2013లో లింగాయతులు యెడియూరప్ప పార్టీకి, బిజెపికి మధ్య చీలిపోవడంతో 48కి పడిపోయింది. ప్రస్తుతం 58 దగ్గర ఆగింది. వీరేంద్ర పాటిల్‌కు జరిగిన అవమానం గురించి ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పనిలో పనిగా నిజలింగప్పను కూడా కలిపేశారు కానీ నిజలింగప్పకు కాంగ్రెసు చేసిన అవమానమేమీ లేదు. ఆయన ఇందిరను ఎదిరించి నష్టపోయాడంతే!
వీరేంద్ర పదవీచ్యుతి తర్వాత జరిగిన 1994 ఎన్నికలలో లింగాయతులు కాంగ్రెసుకు ప్రత్యామ్నాయాలు వెతికారు. ఆ ఎన్నికలలో 71 మంది లింగాయతులు ఎన్నికైతే 13 మంది కాంగ్రెసు ద్వారా, 35 మంది జనతా దళ్ ద్వారా నెగ్గారు. బిజెపి ద్వారా 12 మంది నెగ్గారు. ఆ ఘనత యెడియూరప్పదే. కాంగ్రెసు, జనతాలతో నిరాశ పడిన లింగాయతులను బిజెపి వైపు క్రమంగా మళ్లించాడు. 1989లో బిజెపికి ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో యెడియూరప్ప ఏకైక లింగాయత్. 1994లో 40 మంది బిజెపి తరఫున నెగ్గితే వారిలో 12 మంది లింగాయతులు. 1999లో నెగ్గిన 44 మంది బిజెపి ఎమ్మెల్యేలలో 16 మంది లింగాయతులు. 2004లో 79 మంది బిజెపి వారు నెగ్గితే వారిలో 34 మంది లింగాయతులు. బిజెపి, యెడియూరప్ప, లింగాయతులు ఒకే తాటిపై నడిచారన్నదానికి యిది నిదర్శనం.
వీరేంద్ర పాటిల్ ఉదంతం, బంగారప్ప అధ్వాన్నపాలన కారణంగా 1990లో 179 స్థానాలు గెలిచిన కాంగ్రెసుకు 1994 వచ్చేసరికి 34 మాత్రమే వచ్చాయి. ఆడ్వాణీ రథయాత్రకు దక్షిణాదిన కర్ణాటకలో స్పందన రావడం, హిందూత్వ ఓటు బ్యాంకు ఏర్పడడం, లింగాయతులు యెడియూరప్ప నాయకత్వాన్ని సమర్థించడం యివన్నీ కలిసిరావడంతో కర్ణాటకలో బిజెపి ప్రభవించ నారంభించింది. 2004 నాటికి అత్యధికంగా 79 సీట్లు తెచ్చుకుంది. కానీ బిజెపికి అధికారం దక్కకుండా కాంగ్రెసు, జెడిఎస్ పొత్తు పెట్టుకుని, కాంగ్రెసు ముఖ్యమంత్రిగా ధరం సింగ్ అవతరించాడు. అయితే జెడిఎస్ 2006 జనవరిలో కాంగ్రెసుతో తెంపుకుని బిజెపితో చేతులు కలిపింది. కుమారస్వామి ముఖ్యమంత్రి కాగా, యెడియూరప్ప ఉపముఖ్యమంత్రి అయ్యాడు. కొన్నాళ్ల తర్వాత ముఖ్యమంత్రి కావలసినవాడే కానీ కుమారస్వామి నమ్మకద్రోహం చేశాడు.
ఆ సానుభూతితో 2008 ఎన్నికలలో బిజెపి ఏకంగా 110 సీట్లు గెలుచుకుని, అధికారం అంచుదాకా వచ్చింది. కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేల సాయంతో యెడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ అవినీతిలో కూరుకుపోయి, మైనింగ్ స్కామ్‌లో లోకాయుక్త అభిశంసనకు గురై, జైలుకి వెళ్లి, చివరకు పార్టీలోంచే పంపించి వేయబడ్డాడు. అతను వేరు కుంపటి పెట్టుకుని, కెజెపి అనే పార్టీ పెట్టినపుడు 2013 ఎన్నికలలో 10% లింగాయతుల ఓట్లు చీల్చగలిగాడు. అతని పార్టీకి 10శాతం ఓట్లు, 6 సీట్లు వచ్చాయి. ఇటు బిజెపికి 40 సీట్లు మాత్రమే వచ్చాయి. వారిలో 11 మందే లింగాయతులు. విడిపోయి యిద్దరూ నష్టపోయారని గ్రహించిన మోదీ చేతికి పార్టీ పగ్గాలు వచ్చాక 2014లో యెడియూరప్పకు బిజెపిలో పునరావాసం కల్పించాడు. 2016లో బిజెపి అధ్యక్షుణ్ని చేశారు. 2019లో ఫిరాయింపులతో జెడిఎస్ ప్రభుత్వాన్ని కూలదోశాక ముఖ్యమంత్రిని చేశారు. తను తప్ప పార్టీలో వేరే నాయకుడెవరూ లేకుండా చేయడంతో అతని సహచరులు, ప్రత్యర్థులు అతనంటే మండిపడ సాగారు. చివరకు రెండేళ్ల పాలన తర్వాత అధిష్టానం అతన్ని తీసేసి, అతను సూచించిన మరో లింగాయత్ బొమ్మయ్‌కు 2021 జులైలో పదవీబాధ్యతలు అప్పగించింది. ఈ 22 నెలల్లో అతని పట్ల లింగాయతులకు నమ్మకం చిక్కటం లేదు. పాలనలో కూడా విఫలమయ్యాడు.
ప్రస్తుతం లింగాయతు ఎమ్మెల్యేలు 58 మంది ఉన్నారు. వారిలో 38 మంది బిజెపిలోనే ఉన్నారు. సిద్ధరామయ్య కాంగ్రెసు సిఎంగా ఉండగా ప్రభుత్వ కార్యాలయాల్లో లింగాయతులకు ఆరాధ్యదైవమైన బసవేశ్వరుడి ఫోటో పెట్టాలని ఆదేశించాడు. తమను మతపరమైన మైనారిటీలుగా గుర్తించాలన్న లింగాయతుల డిమాండును సమర్థించాడు. లింగాయతుల్లో 87 ఉపకులాలున్నాయి. అయినా యించుమించు కలిసే ఉంటారు. వాళ్లని విడగొట్టడానికి కాంగ్రెసు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లింగాయతులు బిజెపినే ఆదరించారు. 2018 ఎన్నికలలో కాంగ్రెసు తరఫున నిలబడిన ప్రముఖ లింగాయత్ నాయకులు ఓడిపోయారు. 43 మందికి టిక్కెట్లిస్తే నెగ్గినవాళ్లు 16 మాత్రమే! లింగాయతులు బిజెపినే ఆదరించడంతో యెడియూరప్ప ప్రభ మళ్లీ వెలిగింది.
ఇప్పుడు ఎన్నికల సమయంలో యెడియూరప్ప ప్రాధాన్యం కొట్టవచ్చినట్లు కనబడుతోంది. అతనికి పార్టీ పూర్తిగా అప్పగించలేరు, అలా అని తప్పించలేరు. అతన్ని అదుపు చేయలేక, ప్రత్యామ్నాయం దొరక్క బిజెపి అధిష్టానం చాలా అవస్థలు పడుతోంది. అతన్ని తప్పించి, వేరే వాళ్లని ముఖ్యమంత్రులుగా పెట్టినా ప్రయోజనం లేకుండా పోతోంది. లింగాయతులకు 500కు పైగా మఠాలున్నాయి. వీటిలో చాలా వాటి మద్దతు యెడియూరప్పకే. కర్ణాటక బ్రాహ్మణుడు, జాతీయస్థాయి బిజెపి నాయకుడు ఐన బిఎల్ సంతోష్ యెడియూరప్పకు కళ్లాలు వేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడనే వార్తలున్నాయి. మరో బ్రాహ్మణుడైన ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రిగా చేద్దామని బిజెపి ప్రయత్నిస్తోందని కుమారస్వామి ఆరోపించాడు. ఆ విధంగా లింగాయతులను బిజెపికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాడు. అందువలన బిజెపి అధిష్టానం ఒక పక్క యెడియూరప్పను దువ్వుతూనే అతన్ని నియంత్రించడానికి తంటాలు పడుతోంది.
ఈసారి యెడియూరప్ప పోటీ చేయటం లేదు. యెడియూరప్ప ఒక కొడుకు ఎంపీ కాగా, మరో కొడుకు విజయేంద్ర పోటీ చేస్తున్నాడు. అతను ఫలానా చోటి నుంచి పోటీ చేస్తాడని అధిష్టానాన్ని సంప్రదించకుండా యెడియూరప్పే ప్రకటించడం వివాదాస్పదమైంది. అయినా అధిష్టానం కోపాన్ని దిగమింగుకుని కొడుక్కి ఉప ముఖ్యమంత్రి పదవి యిస్తామని అమిత్ షా యెడియూరప్పకు హామీ యిచ్చినట్లు వార్త. ఈ ఏడాది యెడియూరప్ప 80వ జన్మదినం నాడు అతని సొంత జిల్లా శివమొగ్గలో ఎయిర్‌పోర్టు ప్రారంభించడానికి వచ్చిన మోదీ అతనింటికి వెళ్లి అభినందించాడు. అందువలన ముఖ్యమంత్రి పదవికి ఫలానా వారికి అని బిజెపి ప్రకటించలేక పోయింది. మోదీని చూసే ఓటేయండి అంటోంది.
నెగ్గడానికి లింగాయతుల మద్దతు చాలటం లేదని గ్రహించిన బిజెపి రెండో ముఖ్యకులమైన వొక్కళిగలను కొత్తగా దువ్వుతూనే లింగాయతులను వదులుకోవడం లేదు. జనాభాలో 17% ఉన్న వారికి సీట్లలో 30% అంటే 68 టిక్కెట్లు యిచ్చింది. ముస్లింల 4% రిజర్వేషన్ రద్దు చేసి వారిని ఇడబ్ల్యుఎస్ (ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణులు) కోటాకు మార్చేసి, ఈ 4% ను లింగాయతులకు, వొక్కళిగలకు చెరో 2% యిచ్చేసింది. బిజెపి టిక్కెట్లివ్వని మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టార్, మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవడి వంటి లింగాయత్ నాయకులను కాంగ్రెసు తన అక్కున చేర్చుకుంది. మొత్తం 46 మంది లింగాయతులకు సీట్లిచ్చింది. అంటే 20.5%. ఇవాళ వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో ఇండియా టుడే సర్వేలో కాంగ్రెసుకు లింగాయతుల ఓటు షేరు కొద్దిగా పెరిగి 26% మంది వచ్చిందని చెప్పారు. బిజెపికి గతసారి లాగే 64% లింగాయతులు ఓటేశారని, వారి మద్దతు తగ్గలేదని అన్నారు. లింగాయతుల్లో 10% జెడిఎస్‌కు, 6% ఇతరులకు వేశారట.
సీనియర్లకు ఉద్వాసన పలికి యువతరానికి టిక్కెట్లు యిద్దామని బిజెపి వేసిన ప్రణాళిక అందరికీ ఆమోదం కాలేదు. అనేక నియోజకవర్గాల్లో రెబెల్ కాండిడేట్లు ఉన్నారు. కాంగ్రెసుకూ యీ బాధ ఉంది. కర్ణాటకలో విన్నింగ్ మార్జిన్స్ తక్కువ. కొద్ది తేడాతో అటువి యిటు అవుతాయి. 2018లో 16 స్థానాల్లో విజేతలు 3 వేల కంటె తక్కువ మెజారిటీతో గెలిచారు. 63 స్థానాల్లో 5% కంటె తక్కువ మార్జిన్‌తో గెలిచారు. దీనికి తోడు యీసారి ఆప్, మజ్లిస్, గాలి జనార్దన రెడ్డి కెఆర్‌పిపి వంటి అనేక చిన్న పార్టీలు కూడా ఎన్నికల బరిలో ఉన్నాయి. వీటి కారణంగా అంచనాలు తారుమారు కావచ్చు. దీనికి తోడు 224టిలో కేవలం 60 సీట్లు మాత్రం సేఫ్ సీట్లుగా చెప్పుకోవాలి. అంటే మూడు దఫాలుగా ఒకే పార్టీని గెలిపిస్తున్నాయవి. అలాటివి కాంగ్రెసుకు 27, బిజెపికి 23, జెడిఎస్‌కు 10 ఉన్నాయి. ఇక పోతే 77 స్వింగ్ సీట్లు ఉన్నాయి. వాటిలో బిజెపి 2018లో 56 గెలిచింది. అందుకే అత్యధిక స్థానాలు వచ్చాయి.
ఇక కాంగ్రెసు పార్టీలో అంతర్యుద్ధం గురించి చెప్పాలంటే – జాతీయ స్థాయిలో పార్టీ ఎలా ఏడ్చినా, అనేక రాష్ట్రాలలో యీసురోమంటూ ఉన్నా కర్ణాటకలో మాత్రం స్థానిక నాయకులు కాడి పారేయకుండా, జాతీయనాయకుల కటాక్షవీక్షణాలకై పాకులాడకుండా బిజెపితో పోరాడుతున్నారు. కాంగ్రెసుకు ఎక్కడా లేనట్లు యిక్కడ 70 లక్షల మంది రిజిస్టర్డ్ సభ్యులున్నారట. కాంగ్రెసుకు నెగ్గే అవకాశాలున్నాయని గత ఏడాదిగా అనుకుంటూండడంతో ముఖ్యమంత్రి ఆశావహులు పెరిగిపోయారు. డికె, సిద్ధరామయ్య పేర్లు ప్రధానంగా చెప్పుకోవాలి. వీరిలో సిద్ధరామయ్య అత్యాశను ప్రదర్శిస్తున్నాడు. వొక్కళిగల పార్టీగా పేరు బడిన జెడిఎస్‌లో కురుబ కులస్తుడైన సిద్ధరామయ్య ప్రముఖ నాయకుడిగా వెలిగాడు. జనాభాలో కురుబలు 7% మాత్రమే ఉంటారు. అతను సోషలిస్టుగా, పేదల పక్షపాతిగా బాగా పేరు తెచ్చుకున్నాడు.
2005లో జెడిఎస్ నాయకుడిగా ఉంటూ సిద్ధరామయ్య అహింద (అల్పసంఖ్యాక వర్గాలు, హిందూ వెనకబడిన తరగతులు, దళితులు) సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది వొక్కళిగలకు నచ్చకపోవడంతో జెడిఎస్ అతన్ని మందలించింది. దేవెగౌడ తనకు బదులుగా కొడుకు కుమారస్వామిని తన వారసుడిగా ప్రొజెక్టు చేయడంతో సిద్ధరామయ్య భగ్గుమన్నాడు. వెళ్లి కాంగ్రెసులో చేరి దాని ద్వారా 2013లో ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇది కాంగ్రెసు నాయకులకు అసూయకు కారణమైంది. డా. జి. పరమేశ్వర అనే కాంగ్రెసు దళిత నాయకుడు 2013లో తను ఓడిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని అనుమానిస్తూ ఉంటాడు. ఇలాటి అసూయ, అనుమానాలతో అంతర్గత కుట్రలతో సిద్ధరామయ్యను 2018లో ఒక చోట పూర్తిగా, మరో చోట దాదాపుగా ఓడించారనే పుకార్లు ఉన్నాయి. ఆ భయంతో యీసారీ రెండు చోట్ల పోటీ చేస్తానని సిద్ధరామయ్య పట్టుబడితే కాంగ్రెసు అధిష్టానం ఒప్పుకోలేదు. వరుణ నుంచి మీ అబ్బాయిని తప్పించి, అతనికి బదులు పోటీ చేయి చాలు అంది.
ముస్లిములను నెత్తిన పెట్టుకుంటాడనే యిమేజి ఉండడంతో దాని కారణంగా హిందూ ఓట్లు బిజెపి వెనుక సంఘటితమౌతాయన్న భయమున్న కాంగ్రెసు నాయకులు యితన్ని వ్యతిరేకిస్తారు. గత 45 సంవత్సరాలుగా పూర్తి టెర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక వ్యక్తి సిద్ధరామయ్య. అతని పాలన ఫర్వాలేదనిపించినా, లింగాయతులను చీల్చాలన్న అతని ప్రణాళిక అతన్ని, పార్టీని దారుణంగా దెబ్బ తీసింది. 2018లో చాముండేశ్వరి నుంచి పోటీ చేస్తే దేవెగౌడ కుటుంబపాలన గురించి యితను తరచుగా చేసే విమర్శతో కోపగించిన వొక్కళిగలు యితన్ని ఓడించారు. బాదామి నుంచి కూడా పోటీ చేసి కేవలం 1700 ఓట్ల తేడాతో గెలిచాడు. అయినా తనే ముఖ్యనాయకుణ్నని చూపించుకోవడానికి అతను విజయ సేతుపతి హీరోగా, సత్యరత్నం దర్శకుడిగా తన బయోపిక్‌ను ‘‘లీడర్ రామయ్య’’ పేర రెండు భాగాలుగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తీయించు కుంటున్నాడు. తన పుట్టిన రోజు ఆగస్టు 3న రిలీజ్ అవుతోందంటూ ఎన్నికలకు ముందే మార్చి 30న పోస్టరు విడుదల చేయించుకున్నాడు.
సిద్ధరామయ్యని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపిస్తే వొక్కళిగ ఓట్లు పడవేమోనని సందేహించిన కాంగ్రెసు పాత మైసూరు ప్రాంతానికి చెందిన వొక్కళిగ కులస్తుడైన డికె శివకుమార్‌ను పిసిసి అధ్యక్షుడిగా చేసి ముఖ్యమంత్రి రేసులో నిలిపింది. అతని వయసు 60. సిద్ధరామయ్య కంటె 15 ఏళ్లు చిన్న. ఆర్థికంగా బాగా ఉన్నవాడు. తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ.1358 కోట్ల ఆస్తి ఉందని చెప్పుకున్నాడు. మంచి ఆర్గనైజర్. 2002లో మహారాష్ట్రలో విలాసరావు దేశ్‌ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడడానికి, 2017లో గుజరాత్ కాంగ్రెసు వాళ్లని రక్షించడానికి క్యాంప్ రాజకీయాలు నడిపాడు. మోదీ, అమిత్ షాలు పగకు గురైన అహ్మద్ పటేల్‌ను రాజ్యసభకు గెలిపించడానికి సర్వశక్తులు వినియోగించాడు. మోదీ, అమిత్ ద్వయానికి యితనంటె మంట. క్యాంప్‌లు నిర్వహించిన ఫామ్‌హౌస్‌లపై దాడులు జరిపించారు. 2018లో కర్ణాటకలో బిజెపికి అధికారం దక్కకుండా కాంగ్రెసు-జెడిఎస్ కూటమి ఏర్పరచినందుకు శిక్షగా 2019లో మనీలాండరింగ్ కేసు పెట్టి తిహార్ జైలుకి పంపారు.
డికె సాహసి. తన ప్రాంతీయులు, కులస్తులు దేవుడిలా కొలిచే దేవెగౌడతో తన 23 వ ఏట 1985లో ఎన్నికలలో సాతనూరులో తలపడ్డాడు. అప్పట్లో అవిభక్త జనతా పార్టీ లీడరుగా వెలుగుతున్న దేవెగౌడ చేతిలో ఓడిపోయాడు. 1989 వచ్చేసరికి అక్కడే నెగ్గాడు. అప్పణ్నుంచి ఏ ఎన్నికా ఓడిపోలేదు. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 30 ఏళ్ల వయసులో బంగారప్ప కాబినెట్‌లో జైళ్ల శాఖ మంత్రి అయ్యాడు. 1995-2004 వరకు నడిచిన ఎస్ఎమ్ కృష్ణ కాబినెట్‌లో అర్బన్ డెవలప్‌మెంట్, కోఆపరేషన్ శాఖల మంత్రిగా చాలా పేరు తెచ్చుకున్నాడు. 2004లో దేవెగౌడ కనకపుర పార్లమెంటరీ సీటుకై పోటీ చేసినప్పుడు డికె, టీవీ జర్నలిస్టు తేజస్వినిని ప్రత్యర్థిగా నిలబెట్టి దేవెగౌడను ఓడించాడు. అదే సంవత్సరం కర్ణాటకలో ధరం సింగ్ నాయకత్వంలో కాంగ్రెసు-జెడిఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు డికెకు మంత్రి పదవి యివ్వడానికి దేవెగౌడ అడ్డుపడడానికి కారణం యిదే!
2019 పార్లమెంటు ఎన్నికలలో కర్ణాటకలో బిజెపి 25 సీట్లు గెలవగా, కాంగ్రెసు ఒక్క సీటు మాత్రమే గెలిచింది. అది డికె సోదరుడు సురేష్‌ది. ఇదీ డికె సత్తా. ఇతని బలాన్ని ఎలాగైనా కుదించాలని బిజెపి యితనిపై పలురకాల దాడులు చేయిస్తూ వచ్చింది. అయినా ప్రజల్లో, కాంగ్రెసు కార్యకర్తల్లో యితనికి ఆదరణ తగ్గలేదు. తిహార్ జైల్లో 50 రోజులుండి బయటకు వచ్చినపుడు ఎయిర్‌పోర్టు నుంచి ఓపెన్ టాప్ కారులో అనేక మంది ప్రజల మధ్య ఊరేగింపుగా తన నియోజకవర్గానికి వచ్చి ‘నాపై కక్ష సాధింపులో భాగంగానే జైలుకి పంపారని ప్రజలు అర్థం చేసుకున్నారు’ అని ప్రకటించాడు. ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా రెండు, మూడు ప్రమాదాలను తృటిలో తప్పించుకుని అదృష్టవంతు డనిపించుకున్నాడు.
సిద్ధరామయ్య, డికె యిద్దరూ జెడిఎస్‌తో వైరం ఉన్నవారే. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక అత్యధిక సీట్లు తెచ్చుకున్న బిజెపిని దూరంగా ఉంచడానికి, డికె కాంగ్రెసు-జెడిఎస్‌ల మధ్య సఖ్యత కుదిర్చి, తక్కువ సీట్లున్న కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పరచాడు. పాత కలహాల కంటె ప్రస్తుత అవసరాలు ముఖ్యమన్న రాజనీతి పాటించాడు. కానీ జెడిఎస్‌ను వదిలి వచ్చిన సిద్ధరామయ్యకు యిది నచ్చలేదు. అందుకే ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెసు తరఫున పరమేశ్వరను చేశారు. రాజకీయ అవసరాల కంటె పాత కక్షలే ముఖ్యమనుకున్న సిద్ధరామయ్య ఎలాగైనా కుమారస్వామిని పదవీచ్యుతుణ్ని చేయాలనే లక్ష్యంతో బిజెపితో లాలూచీ పడి తను అనుకున్నది సాధించాడంటారు. ఎందుకంటే కాంగ్రెసు నుంచి బిజెపిలోకి ఫిరాయించిన వారిలో చాలామంది సిద్ధరామయ్య క్యాంప్‌కు చెందినవారే!
ఇది జరగడానికి కొన్ని నెలల క్రితమే సిద్ధరామయ్య యీ సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదు అని వ్యాఖ్యానించిన వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటికి కూడా సిద్ధరామయ్య, జెడిఎస్ ఒకరినొకరు విమర్శించుకుంటూనే ఉంటారు. డికె, సిద్ధరామయ్యల స్వభావాల్లో తేడాను యిది ఎత్తి చూపుతోంది. సిద్ధరామయ్య డర్టీ పాలిటిక్స్ ఆడతాడని కాంగ్రెసులో కొంతమందికి అనుమానం. 2019 పార్లమెంటు ఎన్నికలలో తను ఓడిపోవడానికి సిద్ధరామయ్య అనుచరుడే కారణమని మాజీ కేంద్ర మంత్రి మునియప్ప సందేహం. తను ముఖ్యమంత్రి కావాలని సిద్ధరామయ్య చేసే పబ్లిసిటీ ప్రయత్నాలు పైన రాశాను. డికె తను ముఖ్యమంత్రి అయ్యేదాకా గడ్డం గీయనని ప్రతిజ్ఞ చేశాడు తప్ప బయోపిక్‌ల జోలికి వెళ్లలేదు.
లింగాయతులు ఎటూ బిజెపితో ఉన్నారు కాబట్టి, వారి తర్వాత బలమైన కులం వొక్కళిగలు కాబట్టి, జెడిఎస్ బలం పాత మైసూరు ప్రాంతానికే పరిమితం కాబట్టి, వొక్కళిగలకు తను రాష్ట్రస్థాయి నాయకుణ్నని ప్రొజెక్టు చేసుకోవడానికి డికె ప్రయత్నిస్తున్నాడు. అందుకే కితం ఏడాది అతను వొక్కళిగలు ఎక్కువున్న మైసూరు ప్రాంతంలో నీటికోసం పాదయాత్ర అంటూ చేశాడు. కాబోయే ముఖ్యమంత్రి తనే అన్న సంకేతాలు యిచ్చాడు. వెంటనే ఆగస్టులో సిద్ధరామయ్య తన 75వ జన్మదినం అంటూ దావణగెరెలో పెద్ద సభ ఏర్పాటు చేశాడు. సిద్ధరామయ్య, డికెల మధ్య సయోధ్య కుదర్చడానికి రాహుల్ చాలా సార్లు యిద్దర్నీ పిలిపించి మాట్లాడవలసి వచ్చింది. సిద్ధరామయ్య, డికెలకు వేర్వేరు ఓటు బ్యాంకులున్నాయి కాబట్టి ఎవరు ముఖ్యమంత్రో తేల్చకుండా కథ నడపాల్సి వచ్చింది.
జనాభాలో 7% ఉన్న కురుబలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతాడనే ఆశతో కాబోలు గతంలో కంటె 10% ఎక్కువగా 88% మంది కాంగ్రెసుకు ఓటేశారని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ చెప్తోంది. డికె వొక్కళిగ కాబట్టి కాబోలు, 24% వొక్కళిగలు కాంగ్రెసుకు, 25% మంది బిజెపికి వేశారట. జెడిఎస్‌కు గతంలో కంటె 8% తక్కువగా 46% మంది వేశారట. కర్ణాటకలో కాంగ్రెసుకు పూర్తి మెజారిటీ వస్తే మల్లికార్జున ఖర్గే అలంకారప్రాయమైన కాంగ్రెసు అధ్యక్ష పదవి వదిలేసి కర్ణాటక ముఖ్యమంత్రి కావడానికి సిద్ధపడవచ్చు. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎస్సీ ఓట్లు కాంగ్రెసుకు విపరీతంగా పడ్డాయట. అందువలన దళితుడైన ఖర్గేను ముఖ్యమంత్రిని చేయడం కాంగ్రెసుకు యితర రాష్ట్రాలలో కూడా మేలు చేయవచ్చు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిత్వాన్ని వ్యతిరేకిస్తున్న డికె, 80 ఏళ్ల ఖర్గే తమకు నాయకుడైతే అభ్యంతరం లేదని బహిరంగ ప్రకటన చేశాడు.
కాంగ్రెసుకు కొద్దిగా సీట్లు తగ్గి జెడిఎస్ సాయం తీసుకోవలసి వస్తే మాత్రం తమ బద్ధశత్రువైన సిద్ధరామయ్యను జెడిఎస్ ఆమోదించదు. వొక్కళిగుడు, ఐదేళ్ల క్రితం తమకు ముఖ్యమంత్రి పదవి యిప్పించిన శివకుమార్ వైపే మొగ్గు చూపుతుంది. ముఖ్యమంత్రి ఎవరో నెగ్గిన ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారంటూ కాంగ్రెసు ఎవరి పేరూ చెప్పటం లేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసే ఉంటారు. బిజెపి కచ్చితంగా నెగ్గుతుందని ఒకటి, రెండు సర్వేలు మాత్రం చెప్పాయి. ఎక్కువ సర్వేలు కాంగ్రెసుకు 100కు తగ్గకుండా వస్తాయంటున్నాయి. అదే జరిగితే కప్పల తక్కెడ రాజకీయాలు తప్పవు. సిద్ధరామయ్య, శివకుమార్‌ల సిగపట్లు తప్పవు. కర్ణాటకలో కులపరమైన రిజర్వేషన్లు, వొక్కళిగలను ఆకర్షించి జెడిఎస్‌ను బలహీన పర్చడానికి బిజెపి చేసిన ప్రయత్నాల గురించి ‘‘కర్ణాటకలో వొక్కళిగ ఓట్లు’’ అనే వ్యాసంలో రాస్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2023)