Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: కర్ణాటక ఎన్నికల ముఖచిత్రం

ఎమ్బీయస్‍: కర్ణాటక ఎన్నికల ముఖచిత్రం

కర్ణాటకలో రేపు (మే 10) పోలింగు. ఎన్నికలపై మనకున్న ఆసక్తిని గమనించి, జాతీయ మీడియాతో బాటు తెలుగు మీడియా బాగా కవర్ చేస్తూ వస్తోంది. ఆసక్తి ఎందుకంటే అది మన పొరుగు రాష్ట్రమనే కాదు, దక్షిణాదిన బిజెపి పాలిత ఏకైక రాష్ట్రం. అక్కడ అధికారం పొందుతూ, పోగొట్టుకుంటూ, ఫిరాయింపులతో మళ్లీ తెచ్చుకుంటూ, ముఖ్యమంత్రులను మారుస్తూ అవస్థలు పడుతోంది కాబట్టి, యీసారైనా పూర్తి మెజారిటీతో గెలుస్తుందా లేదా అనేది చూడాలనే కుతూహలం. దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే బిజెపి గెలిస్తే పెద్ద న్యూస్ కాదు, ఓడిపోతేనే న్యూస్. కాంగ్రెస్ ఓడితే పెద్ద వార్త కాదు, గెలిస్తేనే వార్త. కర్ణాటకలో బిజెపి ఓడుతుంది, కాంగ్రెసు గెలుస్తుంది అని సర్వేలు చెపుతూండడంతో ఔనా? నిజంగా అలా జరుగుతుందా? అనే ఆశ్చర్యం ఒకటి తోడవుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అధికార పార్టీ సంపూర్ణ మెజారిటీతో మళ్లీ గెలవలేదు. గెలిచి చూపించాలని బిజెపి లక్ష్యం.

2018 ఎన్నికలలో బిజెపికి 104 కాంగ్రెసుకు 80, జెడిఎస్‌కు 37 వచ్చాయి. ఫిరాయింపుల తర్వాత ప్రస్తుతం 113, 74, 27 ఉన్నాయి. ఈ సారి గెలుపు కాంగ్రెసు వంతు అని కొందరి అంచనా. తాజా సర్వేలు చూస్తే లోక్‌పోల్ సర్వే ప్రకారం ఈసారి కాంగ్రెసుకు 129-134, బిజెపికి 59-65, జెడిఎస్‌కి 23-28 వస్తాయి. ఎబిపి న్యూస్ - సి ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెసుకు 110-122, బిజెపికి 73-85, జెడిఎస్‌కి 21-29, ఇండియా టివి-సిఎన్‌ఎక్స్ ప్రకారం కాంగ్రెసుకు 105, బిజెపికి 85, జెడిఎస్‌కి 32. టివి 9-సి ఓటరు ప్రకారం కాంగ్రెసుకు 106-116, బిజెపికి 79-89, జెడిఎస్‌కి 24-34. ఏసియా నెట్ సువర్ణ టివి ప్రకారం బిజెపికి 98-109, కాంగ్రెసుకు 89-97 వస్తాయి.

ఇండియా టుడే మార్చిలో నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే కర్ణాటకలో జనవరిలో ఎన్నికలు జరిగి ఉంటే 28 పార్లమెంటు సీట్లలో కాంగ్రెసు 17 దక్కించుకునేది అంది. 2019లో అది 1 మాత్రమే గెల్చుకోగలిగింది. బిజెపికి 25 వచ్చాయి. 2024 నాటి పార్లమెంటు ఎన్నికలలో కూడా కర్ణాటక కీలకమైనదే. దేశం మొత్తం మీద ఉన్న 534 పార్లమెంటు స్థానాల్లో 130 స్థానాలు దక్షిణాదిన ఉన్నాయి. వీటిలో బిజెపి 2014లో 21, 2019లో 29 తెచ్చుకుంది. 2024 నాటికి యిది మరింత పెంచుకోవాలంటే కర్ణాటక అసెంబ్లీలో గెలిచి తీరాలి.

కర్ణాటక ఆంధ్ర, తెలంగాణ రెండిటికీ సరిహద్దు రాష్ట్రమే. కర్ణాటకలో బిజెపి మళ్లీ గెలిస్తే, బండి సంజయ్ అట్టహాసానికి పట్టపగ్గాలుండవు. దక్షిణాదిన బిజెపి రథయాత్ర రెండో మజిలి తెలంగాణాయే అంటుంది. అక్కడ ప్రయోగిస్తున్న మతోన్మాదమనే చిట్కాను యిక్కడ ప్రచారంలోనూ ఉపయోగిస్తారు. తెలంగాణలోని ఉర్దూ పేర్లకు ప్రత్యామ్నాయాలు పుట్టిస్తారు, అడుగడుగునా ఆంజనేయుడి విగ్రహాలు పెడతామంటారు. పాకిస్తాన్‌లో ఓ హైదరాబాదు ఉంది కాబట్టి దీని పేరు భాగ్యనగరంగా మారుస్తామంటారు. ముస్లిం రిజర్వేషన్స్‌కు గండికొడతామని అమిత్ షా యిప్పటికే చెప్పేశారు. ఒకవేళ కర్ణాటకలో బిజెపి ఓడిపోయిందనుకోండి, ఇక్కడి బిజెపి అక్కడి పరిస్థితులకు, యిక్కడి పరిస్థితులకు పోలిక లేదని చెప్పేస్తుంది. కాంగ్రెసు ఓడితే దానికి కారణం నువ్వంటే నువ్వని సిద్ధరామయ్య, శివకుమార్ నిందించుకుంటారు. గెలిస్తే గాంధీ కుటుంబం కారణంగానే నెగ్గామంటూ కీర్తనలు అందుకుంటారు. వామనుడి వంటి రాహుల్ పాదయాత్ర తర్వాత త్రివిక్రముడై పోయాడని, దిల్లీ సింహాసనంపై కాలు మోపడమొకటే తరువాయి అని జాతీయస్థాయిలో భజన మొదలవుతుంది.

ఇన్నాళ్లుగా మీడియా కవర్ చేస్తూ వచ్చినదాన్ని సారాంశాన్ని మూడు వ్యాసాల్లో మీకు అందిద్దామని నా ప్రయత్నం. ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారో తెలుసుకోవాలనే దానిపై నాకంతగా ఉత్సాహం లేదు. ‘‘ఆకలిరాజ్యం’’ సినిమాలో ఓ జోక్ ఉంది. ‘‘మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అధికార పక్షమా? ప్రతిపక్షమా?’’ అని ఒకతన్ని అడిగితే ‘‘ఎప్పుడూ అధికార పక్షమే. ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాన్లో దూరతాడు.’’ అని వస్తుంది జవాబు. అలా ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా అంతిమంగా బిజెపి మాయ చేసి అధికారంలోకి వచ్చేస్తుంది. గతంలో కాంగ్రెసు చేసిన తరహాలోనే రాజకీయం పేరుతో విలువల గురించి పట్టించుకోకుండా అధికారం పొందడమే లక్ష్యంగా ఆ పార్టీ పని చేస్తోంది. ఎటొచ్చీ కాంగ్రెసు నీతిసూత్రాలు వల్లించేది కాదు, యిప్పటి బిజెపి వల్లిస్తోంది. అదీ తేడా! పైగా తాము భారతీయ సంస్కృతిని కాపాడుతున్నామని, తమ వలననే హిందూమతం బతికి బట్టకట్టిందనే బిల్డప్ ఒకటి. ఫిరాయింపులతో బిజెపియో, కాంగ్రెసో గద్దె కెక్కకుండా ఉండాలంటే త్రిశంకు సభ ఏర్పడకూడదు. ఏదో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ రావాలి. ఎవరికీ అది వచ్చేట్లు కనబడటం లేదు.

కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 224 మెజారిటీ రావాలంటే ఏదైనా పార్టీకి 113 రావాలి. కాంగ్రెసు, బిజెపి రెండిటికీ అన్ని రావని, అధికారం అందుకోవడానికి తమపై ఆధారపడక తప్పదని, తాము కింగ్‌మేకర్ పాత్ర పోషిస్తామని 1999లో ఆవిర్భవించిన జెడిఎస్ ఆశ పెట్టుకుని ఉంది. తక్కువ సీట్లు తెచ్చుకున్నా 2006లో బిజెపితో 20 నెలలు, 2018లో కాంగ్రెసుతో కలిసి 14 నెలలు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుంది. పాత మైసూరు ప్రాంతంలో, వొక్కళిగ కులస్తులలో దానికున్న ప్రాబల్యంతో యీసారి మిషన్ 123 అనే స్లోగన్‌తో అది ప్రధాన ప్రత్యర్థి ఐన కాంగ్రెసుకు దడ పుట్టిస్తోంది. కర్ణాటకలో తక్కిన ప్రాంతాలలో పట్టు సాధించి, రాష్ట్రం మొత్తం మీద 104 సీట్లు తెచ్చుకున్న బిజెపికి పాత మైసూరు మాత్రం దుర్గమంగానే ఉంది.

అక్కడున్న 59 స్థానాల్లో 2018లో 6 మాత్రమే వచ్చాయి. తర్వాత ఆపరేషన్ కమలం పేరుతో వాళ్లు జెడిఎస్ నుంచి లాక్కున్న 10 మంది ఎమ్మెల్యేలు యీ ప్రాంతం వారే. వారిని ఉపయెన్నికలలో గెలిపించుకున్నారు కూడా. వారి మద్దతుతో యీ ప్రాంతంలో జెడిఎస్ బలాన్ని క్షీణింప చేయాలని, వొక్కళిగ ఓటును దాని నుంచి లాక్కుని కాంగ్రెసుకు చెక్ పెట్టాలని బిజెపి శతథా ప్రయత్నిస్తోంది. అది సఫలమై గతంలో రాష్ట్రం మొత్తం మీద 37 సీట్లు తెచ్చుకున్న జెడిఎస్‌ను ఏ 20 సీట్లకో పరిమితం చేయగలిగితే, కర్ణాటక పోరు బిజెపి-కాంగ్రెసుల మధ్య ముఖాముఖీ జరుగుతుంది. త్రికోణ పోటీల్లో కాంగ్రెసు స్ట్రయిక్ రేటు బాగుంటోంది కానీ ముఖాముఖీ పోటీల్లో బిజెపి స్ట్రయిక్ రేటే (పోటీ చేసిన స్థానాల్లో గెలిచిన వాటి నిష్పత్తి) మిన్నగా ఉంది.  

ముఖాముఖీలు బాగా ఉంటే అప్పుడు నిర్ణయాత్మకంగా తీర్పు వస్తుంది, ఫిరాయింపులకు అవకాశం ఉండదు. 35-40 మధ్య సీట్లు వస్తాయని ఆశిస్తున్న జెడిఎస్‌కు సీట్లు పెరిగిన కొద్దీ బేరసారాల ప్రభుత్వం తప్పదు. అలాటి ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే ఫిరాయింపులతో పడి పోవచ్చు కూడా. ఫిరాయింపులను కర్ణాటకలో ప్రతి పార్టీ ప్రోత్సహిస్తోంది. బిజెపి మరీ ప్రోత్సహిస్తోంది. 2018 ఎన్నికలలో దాని తరఫున నిలబడిన 222 మందిలో 58 మంది (26%) ఫిరాయించి వచ్చినవారే. కాంగ్రెసు తరఫున అలాటి వాళ్లు 20 మంది (9%) ఉన్నారు.

2018 ఎన్నికలలో బిజెపికి 104 సీట్లు వచ్చి ఆగిపోయాయి. దాంతో 80 సీట్ల కాంగ్రెసు, 37 సీట్ల జెడిఎస్ ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వం కుమారస్వామి సిఎంగా ఏర్పడింది. కానీ ఆపరేషన్ కమలం-2 ద్వారా 16 మంది ఎమ్మెల్యేలను బిజెపి తనవైపు తిప్పుకోవడంతో 14 నెలలకే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. బిజెపి తరఫున యెడియూరప్ప ముఖ్యమంత్రి అయినా, రెండేళ్లకే దిగిపోయి, బసవరాజ్ బొమ్మయికి ఆ పదవి కట్టబెట్టవలసి వచ్చింది. ఈసారి కాంగ్రెసు, జెడిఎస్ ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని ఉంటే బిజెపిని సులభంగా ఓడించేవారేమో! కానీ కాంగ్రెసు జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు జెడిఎస్ అంటే పడదు. 2004లో 65 సీట్ల కాంగ్రెసు - 58 సీట్ల జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఖర్గేకు ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చింది. కానీ దేవెగౌడ అభ్యంతర పెట్టడంతో ఖర్గేకు బదులు ధరంసింగ్ సిఎం అయ్యారు. ఏడాదిన్నరకే దేవెగౌడ ఆ ప్రభుత్వాన్ని కూలదోసి, 79 సీట్ల బిజెపితో చేతులు కలిపి తన కొడుకుని ముఖ్యమంత్రిగా చేశాడు. ఇలాటి నమ్మకద్రోహి జెడిఎస్‌తో యీ ఎన్నికల అనంతరం కూడా  కలవం అని ఖర్గే చెప్తున్నాడు.

కర్ణాటకలో డబుల్ యింజన్ సర్కార్ (కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బిజెపి ప్రభుత్వమే) నడిచినా తాము సాధించినది యిది అని బిజెపి చెప్పుకోలేక పోతోంది. తమ ప్రభుత్వం అద్భుతంగా నడిచింది అని బిజెపి ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవచ్చు. కానీ అది ఏటికి ఎదురీదుతోంది అని స్పష్టంగా తెలుస్తోంది. 75 మంది కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చారు. అంటేనే బిజెపి ప్రతినిథులపై ప్రజలకు అంత మంచి అభిప్రాయం లేదని అర్థమౌతోంది కదా! ప్రస్తుత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిధులతో చేపట్టే ఏ పనికైనా 40% కమిషన్ యివ్వాల్సి వస్తోందని రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం ఆరోపించాక, బిజెపి ప్రభుత్వాన్ని 40% కమిషన్ సర్కార్ అని పిలుస్తున్నారు. ఆధారాలతో కోర్టుకి వెళ్లి కేసు పెట్టినట్లు చూడలేదు మరి.

కర్ణాటకలో మొత్తం ఓటర్లు 5.24 కోట్లు. 10 న పోలింగు. 13న ఫలితాలు. కాంగ్రెసు నాయకులు 99 బహిరంగ సభలు, 33 రోడ్‌ షోలు చేయగా ప్రధాని మోదీ ఏప్రిల్ 29 నుంచి మే 7 వరకు 18 బహిరంగ సభలు, 6 రోడ్ షోలలో పాల్గొన్నారు. ఇతర జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి 206 బహిరంగ సభలు, 90 రోడ్ షోలు చేశారు. దీన్ని బట్టి బిజెపి దీన్ని ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమౌతోంది. కర్ణాటకలో బిజెపి గెలిస్తే ఆ ఘనతను మోదీకే కట్టబెట్టాలి. మోదీ తప్ప బిజెపికి మరో నాయకుడు లేడనీ ఒప్పుకోవాలి. ఎందుకంటే మోదీ పర్యటన విజయం తర్వాతనే కర్ణాటక బిజెపికి ఆత్మవిశ్వాసం పెరిగింది.

కాంగ్రెసుకు అన్ని ప్రాంతాల్లోనూ బలమైన క్యాడర్ ఉంది. నాయకులకు ఆర్థిక స్తోమత కూడా ఉంది. కానీ కాంగ్రెసు పార్టీ స్ట్రాటజీ సరిగ్గా వర్కవుట్ కావటం లేదు. గత 4 ఎన్నికలలో ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నా, సీట్లు ఆ నిష్పత్తిలో రావటం లేదు. 2018 ఎన్నికలలో బిజెపి కంటె 2.8% ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నా 24 సీట్లు తక్కువ తెచ్చుకుంది. అంటే దాని బలం కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి ఎక్కువగా ఉందని, మరి కొన్ని చోట్ల తక్కువ ఉందని అర్థమౌతోంది. తొలిసారి ఓటు హక్కు వచ్చినవారు గత ఏడాదితో పోలిస్తే 9.17 లక్షలున్నారు. వారిని ఆకట్టుకోవడానికి కాంగ్రెసు నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి యిస్తానంది. దానితో పాటు గృహిణులకు నెలకు రూ.2 వేలు,  దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవారికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఉన్నాయి.

దానికి పోటీగా బిజెపి దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నవారికి నెలకు రూ.3వేలు, మహిళా వ్యవసాయ కూలీలకు నెలకు రూ.1000తో పాటు 30 లక్షల మంది మహిళలకు, 8 లక్షల మంది విద్యార్థినులకు ఉచిత బస్ పాస్ హామీ లిచ్చింది. బిజెపి విధానపరంగా సంక్షేమ పథకాలను యీసడిస్తూనే ఉంటుంది. కానీ అనేక రాష్ట్రాలలో అమలు చేస్తూనే ఉంటుంది. కర్ణాటకకు వచ్చేసరికి ఎలాగైనా నెగ్గాలన్న పట్టుదలతో విపరీతమైన హామీలు గుప్పిస్తోంది. వాటిలో దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు రోజుకి అర లీటరు పాలు, నెలకు 5 కిలోల బియ్యం, ఏడాదికి మూడు గ్యాస్ సిలండర్లు ఉచితంగా యివ్వడం వచ్చి చేరాయి.  యుపి ఎన్నికలలో యిచ్చిన రెండు ఉచిత గ్యాస్ సిలండర్ల హామీని అమలు చేయలేదు కానీ, యిక్కడ మూడంటున్నారు అని కాంగ్రెసు ఎద్దేవా చేసింది.

జెడిఎస్ పూర్తిగా కుటుంబ పార్టీ. ఒక ప్రాంతానికే పరిమితమైన పార్టీ. సొంతంగా అధికారంలోకి ఎన్నడూ రాలేదు. దేవెగౌడ 89 ఏళ్ల వయసులో కూడా ప్రచారం చేస్తున్నారు. ఆయన రెండో కొడుకు కుమారస్వామి ఆధ్వర్యంలో పార్టీ నడుస్తోంది. దేవెగౌడ కుటుంబీకులు 8 మందికి టిక్కెట్లు యిచ్చుకున్నారు. పెద్ద కొడుకు రేవణ్ణ, అతని యిద్దరు కొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తన భార్య భవానీకి కూడా హాసన్ టిక్కెట్టు యివ్వమని, లేకపోతే తనూ, భార్యా స్వతంత్రులుగా పోటీ చేస్తామని రేవణ్ణ బెదిరించాడు. కానీ కుమారస్వామి ఆమెకు కాదని సామాన్య కార్యకర్తకు యిచ్చాడు. కుమారస్వామి భార్య అనిత తన కొడుకు నిఖిల్ కోసం రామనగర్ సీటు ఖాళీ చేసి యిచ్చింది. పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో, రైతుల్లో మంచి పేరుంది. ఎవరినైనా నెగ్గించాక యితర పార్టీల్లోకి ఫిరాయిస్తారనే భయం ఓటర్లకు ఉంది. గత ఎన్నికలలో బియస్పీతో పొత్తు పెట్టుకున్న జెడిఎస్ యీసారి మజ్లిస్‌తో పెట్టుకుంది.

గతంలో గుజరాత్ మోడల్, అభివృద్ధి వగైరాలు వల్లించిన బిజెపి యిప్పుడు కర్ణాటకలో పూర్తిగా హిందూత్వనే నమ్ముకుంది. హిజాబ్ నిషేధించాం, ముస్లిం రిజర్వేషన్ ఎత్తి వేశాం, అని చెప్పుకుంటూ మానిఫెస్టోలో కామన్ సివిల్ కోడ్, ఎన్నార్సీ (సిటిజన్ రిజిస్టర్) అమలు చేస్తాం వగైరాలే చెప్పుకుంటోంది. హింసాత్మక ఘటనల కేసులు అనేకం ఎదుర్కుంటున్న బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెసు ఎన్నికల హామీ యిస్తే వెంటనే బజరంగ్ దళ్‌కు బజరంగ్ బలీ (హనుమాన్)కు ముడిపెట్టి కాంగ్రెసు వారు హనుమంతుణ్ని తరిమివేస్తున్నారని మోదీ దగ్గర్నుంచి ప్రచారం చేయసాగారు. మీటింగుల్లో బజరంగ్ బలీ నినాదాలు యిస్తున్నారు, హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు. కేరళలోని కొందరు హిందూ యువతులు ఐసిస్ వలలో పడడం కథాంశంగా తీసిన ‘‘కేరళ స్టోరీ’’ సినిమాను హిందూ యువతులకు చూపిస్తున్నారు. అసాం ముఖ్యమంత్రి శర్మ వచ్చి రాష్ట్రంలోని అన్ని మదరసాలను మూయించేస్తామన్నారు.

ఇలా పరిపాలనాంశాలు పక్కన పడేసి మతం చుట్టూనే ప్రచారాన్ని తిప్పుతున్నారు. ఆ విధంగా హిందువుల్లో కులపరమైన చీలికను నివారించవచ్చని బిజెపి ఆశ. అలా అని కులపరమైన సమీకరణాలను విస్మరించటం లేదు. దాన్ని వేరే వ్యాసాల్లో వివరిస్తాను. కాంగ్రెసు అధికారంలోకి వస్తే మతకల్లోలాలు ప్రారంభమౌతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. గతంలో కాంగ్రెసు పాలించి నప్పుడైతే లేవు. ఈసారి బిజెపి ఓడితే మాత్రం రాక తప్పవని హెచ్చరికేమో! బిజెపి పాలిస్తున్న మణిపూరు రాష్ట్రంలో అంతర్యుద్ధం జరుగుతూ, అక్కడున్న తమవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారని అన్ని రాష్ట్రాలూ ఆందోళన చెందుతున్నాయి. ప్రధాని, హోం మంత్రి యీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు.

ప్రాంతాల వారీగా చూస్తే - బీదర్, కలబురిగి, యాద్గిర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలలో కూడిన హైదరాబాదు-కర్ణాటకగా మనందరికీ తెలిసిన కల్యాణ కర్ణాటకలో మొత్తం 40 సీట్లున్నాయి. వీటిలో 2018లో కాంగ్రెసుకు 21, బిజెపికి 15, జెడిఎస్‌కు 4 వచ్చాయి. ఇది బాగా వెనకబడిన ప్రాంతం. ఆర్టికల్ 371 జి ప్రకారం విద్య, ఉద్యోగాల్లో యీ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఉన్నా ఒరిగిందేమీ లేదు. అతివృష్టి కారణంగా పంటనష్టం జరిగిందని బిజెపి హెక్టారుకు రూ. 10 వేల పరిహారం ప్రకటించింది కానీ యిప్పటివరకు అందలేదు. ఇక్కడ ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, లింగాయతులు కలిపి 50% కు పైగా ఉన్నారు. దళితుడు, కాంగ్రెసు అధ్యక్షుడు అయిన మల్లికార్జున ఖర్గేది యీ ప్రాంతమే. అతని కుమారుడు పోటీ చేస్తున్నాడు కూడా. ఆ కారణాల చేత కాంగ్రెసు ఆశలు పెట్టుకుంది. అయితే యిక్కడ 4-5 సీట్ల కంటె ఎప్పుడూ ఎక్కువ తెచ్చుకోని జెడిఎస్, కాంగ్రెసు, బిజెపిల నుంచి నాయకులను ఆకర్షించి, బలపడ్డానని అనుకుంటోంది. బిజెపి వ్యతిరేక ఓట్లను అది చీల్చగలిగితే కాంగ్రెసు సీట్లు తగ్గవచ్చు.

బెంగుళూరులో 28 సీట్లున్నాయి. 2018లో కాంగ్రెసుకు 15, బిజెపికి 11, జెడిఎస్‌కు 2 వచ్చాయి. ఫిరాయింపుల తర్వాత బిజెపికి 15, కాంగ్రెసుకు 11 అయ్యాయి. నగర జనాభాలో 44% మంది కన్నడిగులు, 56% యితరులు. వీరిలో ఉత్తరాది వారు 11-12%. తెలుగువారు 25-30 లక్షలు, తమిళులు 16-17 లక్షలు, మలయాళీలు 4-5 లక్షలు ఉన్నారు. 15-20% మంది ఓటర్లు కులమతాలకు అతీతంగా ఓటేస్తారని ప్రతీతి. బెంగుళూరులో ఓటింగు 2013లో 55% ఉంటే 2018కి 48% అయింది. తటస్థ ఓటర్లే కీలకం. కర్ణాటకలో బిజెపి అమలు చేస్తున్న తీవ్ర హిందూత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మానవహక్కుల సంఘాలు, సెక్యులర్ సంఘాలు కలిసి జాగృత కర్ణాటక పేర ఉద్యమం సాగిస్తూ బిజెపిని ఓడించాలని ఓటర్లలో ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రభావం యీ నగరవాసులపై ఎంత ఉంటుందో పోలింగు బూత్ వరకు వచ్చి ఎంతమంది తమ అభిప్రాయం వెలిబుచ్చుతారో వేచి చూడాలి.

దావణగెరె, శివమొగ్గ, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాలున్న సెంట్రల్ కర్ణాటకలో 32 స్థానాలున్నాయి. లింగాయతులు అధిక సంఖ్యలో ఉన్న యిది బిజెపికి గట్టి పట్టున్న ప్రాంతం. లింగాయతుల తర్వాత ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో 8 రిజర్వ్‌డ్ స్థానాలు. 2018లో బిజెపికి 21, కాంగ్రెసుకు 7, జెడిఎస్‌కు 4 (అన్నీ తుమకూరులోనే) సీట్లు వచ్చాయి. బిజెపికి లింగాయతుల మద్దతు ఉన్నా ఎస్సీ వర్గీకరణ అంశం ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. కర్ణాటకలో గణనీయంగా ఉన్న దళితుల ఓట్లలో చాలా భాగం కాంగ్రెసుకు వెళుతూన్నట్లు గమనించిన బిజెపి వాళ్లను ఆకర్షించడానికి ఎస్సీల రిజర్వేషన్‌ను 15% నుంచి 17%కు, ఎస్టీల రిజర్వేషన్ 3% నుంచి 7%కి పెంచింది. ఎస్సీలను చీల్చడానికి దళిత వర్గీకరణ ప్రతిపాదించింది. ఉమ్మడి ఆం.ప్ర.లో దళిత వర్గీకరణకై మాదిగల ఆందోళన, వర్గీకరణను కేంద్రం ఆమోదించక పోవడం అన్నీ చూశాం. ప్రతి రాష్ట్రంలోను రిజర్వేషన్లను ఒక ప్రధాన వర్గం చేజిక్కించుకుంటోందని తక్కిన వర్గాలు ఆరోపిస్తున్నాయి. అందువలన యీ తేనెతుట్టెను కదిపేందుకు ఏ కేంద్ర ప్రభుత్వమూ సాహసించటం లేదు. అందువలన యీ ప్రతిపాదన అమలు కాకపోయినా ఆశ్చర్యం లేదు.

దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలున్న కరావళి కర్ణాటకలో 13 స్థానాలున్నాయి. హిజాబ్, హలాల్ వివాదాలు, శ్రీరామసేన దాడులకు ఆటపట్టయిన యీ ప్రాంతంలో 2018లో బిజెపి 12 గెలుచుకుంది. కానీ ఆరుగురికి మళ్లీ సీట్లు యివ్వలేదు. శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్‌కు టిక్కెట్టిచ్చింది. హిందూత్వ ప్రభావం పని చేస్తే కాంగ్రెసుకి గతంలో వచ్చిన ఒక్క సీటూ రాదు. ఐదారు తెచ్చుకుంటే మాత్రం బిజెపి తీవ్రత తగ్గించుకోవాల్సిందే. బొంబాయి-కర్ణాటకగా మనకు తెలిసిన కిత్తూరు కర్ణాటకలో బెళగావి, ధార్వాడ్, విజయపుర, హావేరీ, గదగ్, బాగల్‌కోటే, ఉత్తర కన్నడ జిల్లాలలో 50 సీట్లున్నాయి. లింగాయతుల ప్రాబల్యం ఎక్కువున్న యీ ప్రాంతంలో 2018లో బిజెపి 30, కాంగ్రెసు 17, జెడిఎస్ 1 గెలుచుకున్నాయి.

బిజెపి, కాంగ్రెసు పార్టీలు లింగాయత్ ఓట్ల కోసం ఎలా పాకులాడుతున్నాయో, నాయకుల మధ్య కుమ్ములాటలు ఎలా ఉన్నాయో కర్ణాటకలో ఇంటిపోరు వ్యాసంలో వివరిస్తాను.

ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2023)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?