Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: కూటమిలో బిజెపి?

ఎమ్బీయస్‍: కూటమిలో బిజెపి?

ఫిబ్రవరి 07                   ఎమ్బీయస్‍: కూటమిలో బిజెపి?

 

ఆంధ్రలో ప్రతిపక్ష కూటమిలోకి బిజెపి వస్తుందా రాదా అనే విషయంపై ఎన్నో ఏళ్లగా సాగుతున్న సస్పెన్స్ యీ సాయంత్రంతో విడిపోతుందని అనిపిస్తోంది. టిడిపి వర్గాలైతే ‘ఎన్నాళ్లో వేచిన యీ సాయంత్రం’ అని పాట పాడే మూడ్‌లో ఉన్నాయి. టిడిపి ఎన్‌డిఏ కూటమిలో చేరి కేంద్ర ప్రభుత్వ కాబినెట్‌లో రెండు మంత్రి పదవులు దక్కించుకుంటుందని రెండేళ్లగా ఆంధ్రజ్యోతి ఊదరగొడుతూ వచ్చింది. తమ టీవీ చర్చలకు వచ్చిన బిజెపి ప్రతినిథులను ‘ఈ అరాచక వైసిపి ప్రభుత్వానికి మీరెంత కాలం మద్దతిస్తారు? కూటమిలో చేరే విషయంలో చప్పున నిర్ణయం ఎందుకు తీసుకోరు?’ అని ఉతికేస్తూ ఉంటారు. ఇలా ఉతికించుకోవడానికి వాళ్లెందుకు వస్తారో నాకు అర్థం కాదు. పోనీ వాళ్లేమైనా చెప్తారా అంటే అదీ లేదు. ‘మాది జాతీయ పార్టీ. దేశవ్యాప్తంగా అన్ని విషయాలూ ఆలోచించుకుని, నిర్ణయం తీసుకోవాలి. మా అధిష్టానానికి అన్నీ తెలుసు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది.’ అని మాట నానుస్తారు. ‘అదే ఆ సరైన సమయం ఎప్పుడని అడుగుతున్నాం?’ అని యాంకర్ రొక్కిస్తాడు. వాళ్లు జవాబు చెప్పలేక యికిలిస్తారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకై మీరు కూటమిలోకి రావడం అత్యావశ్యకం అని నొక్కి చెపుతూనే యింకో పక్క ‘ఆంధ్రలో రాజకీయంగా మీరు నస్మరంతి గాళ్లు. ఒక శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేని దుస్థితిలో ఉన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయకపోగా దుష్ట జగన్‌కు అప్పులపై అప్పులిస్తూ అతన్ని నిలబెడుతున్నారని ఆంధ్రులంతా అసహ్యించు కుంటున్నారు.’ అని తిట్టిపోస్తారు. ఇలాటి గుడ్డిగవ్వ కూటమిలో ఉంటే ఎంత? ఉండకపోతే ఎంత? అని ఊరుకోవచ్చుగా! అబ్బే, వాళ్లు కూటమిలోకి రావాలి. వాళ్లంతట వాళ్లే నీవు తప్ప నితఃపరం బెరుంగ అని టిడిపిని వేడుకుంటూ రావాలి. అప్పుడు గాని టెర్మ్‌స్ బాబు డిక్టేట్ చేయలేరు.

నిజానికి బిజెపితో పొత్తుకై వెంపర్లాడుతున్నది బాబు. వైసిపిని ఓడించడానికి టిడిపి-జనసేన పొత్తు చాలదని, బిజెపి వచ్చి చేరితే ఓట్ల పరంగా కాకపోయినా ఎమోషనల్‌గా టిడిపి కార్యకర్తలకు ఊపు వస్తుందని బాబు అంచనా. బిజెపి విడిగా పోటీ చేస్తే టిడిపి ఓటు బ్యాంకులో మధ్యతరగతి వర్గాలు, అగ్రవర్ణాలు కొంత గందరగోళానికి గురవుతాయని గత వ్యాసంలో రాశాను. దీనితో పాటు ఎన్నికల వేళ కేంద్ర మద్దతు కీలకం కాబట్టి బిజెపి కూటమిలో ఉండడం ఆవశ్యకం అనే భావన కూడా బాబులో ఉంది. బిజెపి అంత ఉత్సాహమేమీ చూపటం లేదు. నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. పేకాటలో తన కార్డులు చూపించటకుండా, ఛాతీకి అంటిపెట్టుకుని ఉంచుకుంది. దాని భావం ఎవరికీ తెలియటం లేదు. కానీ బిజెపియే ఆంధ్రలో తన మనుగడ కోసం టిడిపితో పొత్తు కోసం వెంపర్లాడుతోందనే యింప్రెషన్ యివ్వడానికి టిడిపి అనుకూల మీడియా తెగ ప్రయత్నిస్తోంది.

అందుకే ఏళ్ల తరబడి ఎన్‌డిఏలో టిడిపి చేరిక పై కథనాలు వండి వార్చడాలు. స్థానిక బిజెపి నాయకులు టిడిపితో కలవకపోతే మన పని మటాష్ అంటూ తీర్మానాలు చేసి పంపారని యీ మీడియాలో వస్తాయి. బిజెపి స్థానిక నాయకత్వం దీనిపై ఔననీ కాదనీ ఏమీ మాట్లాడదు. అసలు తీర్మానం పంపారో లేదో కూడా చెప్పదు. టిడిపి అనుకూల మీడియా ఆ తీర్మానం కాపీల ఫోటోలు సంపాదించి చూపించదు. జస్ట్ వార్త వదలుతుందంతే! అది చూసి తక్కిన మీడియా వాళ్లు స్థానిక బిజెపి వారిని టిడిపితో పొత్తుందా అని అడుగుతారు. ఉప్పుందా? అని అడిగితే చింతపండుంది అని చెప్పే షావుకారులా వాళ్లు ‘జనసేనతో ఉంది’ అంటారు. ‘టిడిపి గురించి అడుగుతున్నాం...’ అంటూ రొక్కిస్తే అధిష్టానం చూసుకుంటుంది అనే స్టాక్ రిప్లయి వస్తుంది. బిజెపి విషయంలో అధిష్టానం అంటే అధ్యక్షుడు నడ్డా కూడా కాదు, అమిత్ షాయే!

అందుకని యిన్నాళ్లకు అమితే మంగళవారం బాబుకి ఫోన్ చేసి, ‘బుధవారం దిల్లీకి రండి, మాట్లాడుకుందాం’ అని పిలవడంతో యింత ప్రాధాన్యత వచ్చింది. ఇది అమిత్ ట్వీట్ చేశారో లేదో తెలియదు. స్థానిక అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రకటనేదీ విడుదల చేయలేదు. పొత్తు విషయం మాట్లాడేటప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిని కూడా కూర్చోబెట్టాలని అమిత్‌కు ఎందుకు తోచలేదో మరి! టిడిపి-జనసేన పొత్తు చర్చలు హోరాహోరీగా జరుగుతున్నాయి. దానిలో కూడా టిడిపి జాతీయ అధ్యక్షుడు బాబు ఉన్నారు తప్ప, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నట్టు లేరు. టిడిపిలో ద్వితీయ స్థానంలో ఉండి, కూటమి భాగస్వాములందరికీ కలిపి ఏడో వంతు, అనగా 25 మాత్రమే అని ఏకపక్ష ప్రకటన చేసిన లోకేశ్‌ను కూడా కూర్చోబెట్టలేదు.

అదే పద్ధతి అమిత్ కూడా పాటిస్తున్నారా? ఆయన యివాళ బాబుతో మాట్లాడతారట, రేపు పవన్‌ను పిలిపించి మాట్లాడతారట. ఇక పురంధరేశ్వరి గారికి ఏ పాత్రా లేదా? బిజెపికి యివ్వాల్సిన సీట్ల సంఖ్య యిది అని స్థూలంగా ఓ మాట అనేసుకుని, ఏ యే స్థానాల్లో ఎవరెవరో అనేవి మీరూమీరూ తేల్చుకోండి అని వదిలేస్తారా? ఇవాళ్టి సమావేశం తర్వాత ఏదైనా ప్రకటన వచ్చేవరకూ యీ విషయంలో స్పష్టత రాదు. గతంలో ఓ సారి అమిత్, బాబు భేటీ అయ్యాక ఏ ప్రకటనా రాలేదు. ఏవో వేరే విషయాలపై మాట్లాడి ఉంటారు అనుకున్నారు. అవేమిటో అమిత్ ట్వీట్ కూడా చేయలేదు. బాబూ చెప్పలేదు. బహుశా యివాళ్టి సమావేశం జరిగిన వెంటనే పొత్తు గురించి ప్రకటన రాకపోవచ్చు. కూటమిలో మూడో భాగస్వామి ఐన పవన్‌ను పిలిపించి, ఆయన్తో కూడా ఓ మాట చెప్పి అప్పుడు రేపు ప్రకటించవచ్చు. లేకపోతే ఆయనకు గౌరవం యిచ్చినట్లు కనబడదు కదా!

ఈ భేటీ యింతకు ముందే ఎందుకు జరగలేదనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. రాజ్యసభ ఎన్నికల తర్వాత కానీ భేటీ ఉండదని చెప్తూ వచ్చినవారు, ఎన్నికలకు ముందే ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నకూ సమాధానం చెప్పలేరు. బిజెపి ధోరణి ఏమిటో తెలియటం లేదు అని అందరూ విశ్లేషకులు చెప్తూ వచ్చారు. జర్నలిస్టు వైఎన్నార్ (ఈహా టీవీ) ‘బిజెపి అంచనా యిదే..’ అంటూ నిన్న అప్‌లోడ్ చేసిన వీడియోలో చేసిన విశ్లేషణ నాకు తార్కికంగా తోచి, నిజమేమో అనిపించింది. కూటమిలో చేరడానికి బిజెపికి అభ్యంతరం లేదు అంటూ దిల్లీలోని బిజెపి వర్గాల ద్వారా నాకు అందిన సమాచారం అంటూ ఆయన కొన్ని సంగతులు చెప్పారు.

కూటమిలో చేరి టిడిపికి జవసత్త్వాలు కలగచేయడం వలన బిజెపి నష్టపోతుందని, 2029 నాటికి కూడా టిడిపి, వైసిపిల తర్వాత తృతీయ స్థానంలోనే ఉంటుందని, అంతకంటె టిడిపికి దూరంగా ఉండి, దాన్ని మరింత బలహీనపరచి, ఎన్నికల తర్వాత దాని క్యాడర్‌ను తను ఆకర్షించి, దాని స్థానంలో తను ఎదిగి 2029 నాటికి ద్వితీయ స్థానానికి వచ్చే ప్రయత్నం చేస్తుందని చాలామంది విశ్లేషకులు చెప్తూ వచ్చారు. నేనూ ఆ వాదన కరక్టనే అనుకుంటూ వచ్చాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తూ ఉంటారు - జివిఎల్ నరసింహారావు తనకిచ్చిన యింటర్వ్యూలో ‘ప్రాంతీయ పార్టీలలో దేన్నయినా పని గట్టుకుని బలోపేతం చేయవలసిన పని మాకేముంది? రెండిటికీ సమానదూరం పాటించి, వారిలో ఎవరు బలహీనపడితే వారి స్థానంలోకి మేం రావడానికి చూస్తాం.’ అన్నారట.

తెలంగాణలో అదే చేశారు. విడిగా పోటీ చేసి గతంలో కంటె 8 రెట్లు ఎక్కువ స్థానాలు తెచ్చుకున్నారు. కాంగ్రెసు ముఖ్యమంత్రి రేవంత్, తెరాస మీదనే తన బాణాలన్నీ ఎక్కుపెట్టారు. అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ, పార్లమెంటు ఎన్నికలలో వారికి అతి తక్కువ సీట్లు వచ్చేట్లు చేద్దామని చూస్తున్నారు. ఆ ఎన్నికలలో బిజెపికి ఎలాగూ చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు వస్తాయి. ఎన్నికల తర్వాత తెరాస బలహీనపడితే ఆ స్థానంలో రావడానికి ప్రయత్నిస్తుంది. అదే రీతిలో ఆంధ్రలోనూ ఉంటుందని అనుకోవడంలో ఆశ్చర్యమేముంది? అయితే బిజెపి అధిష్టానం ఆంధ్రలో మాకు జనసేనతో తప్ప వేరే ఎవరితోనూ పొత్తు ఉండదు, జనసేన టిడిపితో పొత్తు పెట్టుకుంటే మాతో పొత్తులో లేనట్లే పరిగణిస్తాం అని విస్పష్టమైన ప్రకటన చేయటం లేదు. జనసేన, టిడిపి పొత్తు చర్చలు ఓ పక్క జరిగిపోతున్నా బిజెపి పెదవి విప్పకుండా కూర్చుంది. ఇవాళ్టి భేటీ పొత్తుల గురించే అయితే స్ట్రాటజీ మారిందనుకోవాలా?

ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ వీడియోలో బిజెపితో పొత్తు పెట్టుకున్న ఎన్‌డిఏ భాగస్వామి పక్షాలు ఎలా కృంగి, కృశించి పోయాయో చెప్పుకొచ్చారు. అకాలీ దళ్, శివసేన, జెడియు యివన్నీ ఒకప్పుడు ఎలా ఉండేవి? ఇప్పుడెలా అయిపోయాయి? వాటి సొంత తప్పిదాలు కొన్ని ఉండవచ్చు. కానీ బిజెపి కూడా తన వంతు పాత్ర తను పోషిస్తుంది. మిత్రపక్షమైనా సరే చీల్చడానికి వెనకాడదు. 2020 బిహార్ ఎన్నికలలో నీతీశ్‌తో పొత్తు పెట్టుకుని కూడా పాశ్వాన్ కొడుకుని ప్రోత్సహించి, అతని స్థానాలు తగ్గేట్లు చేసింది. ఇక దానితో అతను బిజెపి, ఆర్‌జెడి స్తంభాల మధ్య తిరుగుతూ ప్రస్తుతానికి బిజెపి స్తంభాన్ని వాటేసుకుని నిలబడ్డాడు. ఈ క్రమంలో పరువు పూర్తిగా అడుగంటింది. ఇవే నా ఆఖరి ఎన్నికలు అంటూ 2020లో చెప్పిన మాట నిలబెట్టుకుని నీతీశ్ రిటైరైతే పతనం యింతటితో ఆగుతుంది.

బిజెపి దీర్ఘ లక్ష్యం 2029కైనా ఆంధ్రలో ద్వితీయ స్థానంలోకి రావడం అనుకుంటే, టిడిపిని బలహీనపరచడమే దాని హ్రస్వలక్ష్యం కావాలి. టార్గెట్ టిడిపియే ఎందుకు, వైసిపి ఎందుకు కాదు? అనే ప్రశ్న సహజంగా వస్తుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే వైసిపి నుంచి టిడిపి కూటమికి 30-35 సీట్లు బదిలీ అవుతాయని చాలా సర్వేలు చెపుతున్నాయి. వీటి మాట ఎలా ఉన్నా బిజెపి జనవరి మధ్యలో ఒక సర్వే ప్రత్యేకంగా చేయించుకుందని వైయన్నార్ చెప్పారు. దానిలో వైసిపియే మళ్లీ అధికారంలోకి వస్తుందని తేలిందట. (ఎన్ని సీట్లో ఆయన చెప్పలేదు) అందువలన వైసిపితో చెడగొట్టుకోవడం ఎందుకని బిజెపి అనుకుంటోందిట. అలా అని టిడిపితో పొత్తు పెట్టుకోకూడదనీ అనుకోవటం లేదట. ఎందుకంటే టిడిపి కూటమిలో చేరినా బిజెపితో వైసిపి కయ్యం పెట్టుకోదని వారికి తెలుసు. ఈ మాటకు పార్లమెంటులో విజయసాయి రెడ్డి ప్రసంగం ఊతం యిస్తోంది. మాకు కాంగ్రెసే ప్రధాన శత్రువు అని చెప్పడం ద్వారా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోము అని ఆయన స్పష్టం చేసినట్లయింది.

వైయన్నార్ అనేదేమిటంటే టిడిపితో పొత్తు పట్ల బిజెపి ఏ నిర్ణయమూ తీసుకోలేదు. సుముఖతా లేదు, విముఖతా లేదు. అందుకనే పవన్ టిడిపితోతన పొత్తు అని ప్రకటించినా ఏమీ స్పందించకుండా ఊరుకున్నారు. వాళ్లు వచ్చి అడిగితే అప్పుడే ఆలోచిద్దాం అనుకుంటున్నారట. ఇప్పటిదాకా టిడిపి కానీ, జనసేన కానీ బిజెపి అధ్యక్షుడితో నేరుగా పొత్తు ప్రతిపాదన చేయలేదని వైయన్నార్ కున్న సమాచారం. పొత్తు అడావుడంతా బిజెపిలో ఉన్న టిడిపి మనుషులు సుజనా చౌదరి, సిఎం రమేశ్‌లదే అనుకోవాలి. బాబు ఎంతసేపూ వీళ్ల ద్వారానే రాయబారాలు పంపుతున్నారు. నడ్డా, అమిత్‌లు ఔనని కాదనీ అనకుండా కాలక్షేపం చేస్తున్నారు. బాబు నుంచి బహిరంగ ప్రతిపాదన వచ్చినప్పుడే చూదాం అని వాళ్ల బెట్టు. బహిరంగంగా అడిగినదాకా ఉండి, వాళ్లు ఔననకపోతే తన పరువు పోతుందని బాబుకి బెంగ. అందువలన మీడియా ద్వారా స్థానిక బిజెపిపై, వాళ్ల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెప్పించుకుని అటు నుంచి పిలుపు తెప్పించుకోవాలని ఆయన ప్రయత్నం. ఇలా ఇగో సమస్యతో యిప్పటివరకు ప్రతిష్టంభన జరిగింది అని వైయన్నార్ భావం.

రాజకీయాల్లో యిలాటివి ఉండవు కదా, నిన్నటిదాకా తనను తిట్టినవాణ్ని కూడా యివాళ దరి చేర్చుకుంటారు కదా, దీని విషయంలో ఎందుకింత బెట్టు అంటే దానికి కారణం సీట్ల బేరం! బిజెపికి దక్షిణాది నుంచి కూడా పార్లమెంటు సీట్లు కావాలి. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం కొందరు ఎంపీలు ఉండాలని వారి లక్ష్యం. ఆంధ్రలో ఒకటి కూడా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి టిడిపితో పొత్తు పెట్టుకుంటే వ్రతం చెడ్డా ఫలం దక్కాలన్నట్లు కనీసం ఒక 5-10 ఎంపీ టిక్కెట్లు అడుగుతారని కొందరంటున్నారు. టిడిపి 2కి మించి యిచ్చేట్లు లేదు. ఎబిఎన్‌లో ఓ మూడు స్థానాల పేర్లు చెప్పి, వాటిలో రెండు యిస్తే బిజెపి తృప్తి పడుతుంది అని యాంకర్ చెప్పారు. బిజెపిని తన దగ్గరకు రప్పించుకుంటే రెండిచ్చి సరిపుచ్చవచ్చని బాబు ఆలోచనైతే, టిడిపియే తన దగ్గరకు వస్తే 5 అడగవచ్చని బిజెపి అనుకుంటూండవచ్చు. ఇలా కాలయాపన జరుగుతూ వచ్చింది.

ఇన్నాళ్లకు అమిత్ స్వయంగా పిలిచారంటే యీ ప్రతిష్టంభన తొలగిపోయి, పొత్తుకు మార్గం సుగమం చేసినట్లే. ఇవాళ మధ్యాహ్నం బాబు దిల్లీ వెళ్లారు కూడా. ఈ వెళ్లడం కూడా అమిత్ స్వయంగా ఫోన్ చేసి పిలిచారు కాబట్టే బాబు కదిలారు కానీ, లేకపోతేనా.. అన్న బిల్డప్ తెలుగు మీడియా యిచ్చింది. ఇది స్థానిక బిజెపి నాయకులకు రుచించినట్లు లేదు. సాయంత్రం టీవీ చర్చలకు వచ్చిన బిజెపి నాయకులు ఏమో ఏం జరుగుతోందో మాకేమీ సమాచారం లేదు అని చెప్పారు. ఎబిఎన్‌కి వచ్చిన బిజెపి ఆయన ‘ఈ మీటింగు గురించి మాకెవరూ చెప్పలేదు. సమావేశం తర్వాత వచ్చిన వార్తల బట్టే మాకు వివరాలు తెలుస్తాయి.’ అంటూ కమిట్ కాకుండా తప్పుకున్నాడు. సాక్షి టీవీకి వచ్చిన బిజెపి ప్రతినిథి ‘నేను దిల్లీలో ఉన్న మా పార్టీ వారిని అడిగితే అసలు అమిత్ ఎపాయింట్‌మెంటే లేదన్నారు. మరి యీ ప్రచారమేమిటో అర్థం కాకుండా ఉంది.’ అనేశారు.

8 గంటలకు మీటింగు ప్రారంభం కావలసి ఉంది. 8 గంటలు దగ్గర పడుతున్న కొద్దీ ఎబిఎన్‌ యాంకర్ కంఠంలో మార్పు రాసాగింది. పక్కన అమిత్ షా నుంచి ఫోన్ అని స్క్రోలింగ్ వస్తూనే ఉంది. ఈయన ‘అమిత్ షాయో,ఆయన ఆఫీసు నుంచో ఫోన్ వచ్చిందట..’ అని సవరించడం మొదలుపెట్టాడు. అంతలో సిపిఎం ప్రతినిథి వచ్చాడు. బిజెపితో పొత్తు కుదరకపోతే తమతో కుదుర్చుకుంటా రేమోనని గుంట దగ్గర నక్కలా కూర్చున్నారు లెఫ్ట్ వారు. ఇప్పుడు బిజెపితో పొత్తు అనగానే ఆయన టిడిపిపై విరుచుకు పడ్డాడు- ఎబిఎన్‌లో కూర్చున్నా నన్నమాట మర్చిపోయి! ప్రత్యేక హోదా కోసం 2018లో అంత కొట్లాడిన బాబు యిప్పుడు వెళ్లి ప్రత్యేక హోదా ఊసే లేదని బాహాటంగా చెప్పిన బిజెపితో వెళ్లి ఎలా కలుస్తారు? అంటూ ఆక్రోశించారు.

ఇప్పుడు రాత్రి పది అయింది. అమిత్ షాతో బాబు సమావేశం అయినట్లు ఏ ఛానెలూ చెప్పలేదు. సాక్షిలో బిజెపి ప్రతినిథి చెప్పినట్లు యివాళ బాబుకి అమిత్ ఎపాయింట్‌మెంటే లేదన్నమాట! ఎబిఎన్ కొత్త పాట మొదలుపెట్టింది. పవన్ యివాళ దిల్లీ వెళుతున్నారు. రేపు బిజెపి నాయకులతో సమావేశమౌతున్నారు అని. బాబుకి రేపు అమిత్‌తో భేటీ అంది. మరో టిడిపి అనుకూల ఛానెల్ టివి5 మాత్రం ‘రేపు బాబు అమిత్‌తో సమావేశమయ్యే అవకాశం’ అని ఊరుకుంది. జాతీయ ఛానెల్ టైమ్స్ నౌలో ‘టిడిపి జాయినింగ్ ఎన్‌డిఏ?’ అని స్క్రోలింగ్ యిచ్చింది. ఇవాళ్టి టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో బాబు అమిత్‌ను యివాళ కలవబోతున్నారని వచ్చింది. టిడిపి ఎన్‌డిఏలో చేరబోతోందా? అని కూడా చేర్చారు. వాళ్లూ టిడిపి మీడియాని అనుసరిస్తున్నట్లుఁది.

ఇవాళ సమావేశం జరగలేదని తేలింది కాబట్టి యీ సస్పెన్సు రేపు కూడా కొనసాగుతుంది. రేపు సమావేశం ఉంటుందని కచ్చితంగా చెప్తున్నది ఎబిఎన్ ఒక్కటే. టీవీ5 కలిసే అవకాశం ఉందని అంటోంది. టైమ్స్ వాళ్లు ఎన్‌డిఏలో కలుస్తుందా అంటూ ప్రశ్నార్థకాలు పెడుతున్నారు. జనసేనతో పొత్తు చర్చలు చేస్తున్న యీ కీలక సమయంలో రాంగ్ సిగ్నల్‌తో దిల్లీ రప్పించి ఎపాయింట్‌మెంట్ యివ్వకుండా తనను యిలా వెయిట్ చేయబెట్టడం బాబుకి దుస్సహంగా ఉండి ఉంటుంది. భాగస్వామి పక్షాలను వెయిట్ చేయించడమే ఆయనకు యిన్నాళ్లూ తెలిసిన విద్య. ఆయన యితరులకు పట్టించిన చేదుమందును యిప్పుడు బిజెపి ఆయన చేతనే తాగిస్తున్నట్లుగా ఉంది. కానీ ఆయన ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడం కూటమికి శ్రేయస్కరం కాదని బిజెపి గ్రహించాలి. అది జాతీయ స్థాయిలో పెద్ద పార్టీ కావచ్చు కానీ ఆంధ్రలో మాత్రం అది బాబు మోకాలి వరకు కూడా రాదు. యుపిఏ పొత్తుదారులతో గౌరవంగా ప్రవర్తించకనే కాంగ్రెసు నష్టపోయింది, ..పోతోంది. అందుకే ఇండియా కూటమి విచ్ఛిన్నమౌతోంది. ఆ పొరపాటు చేయకుండా బిజెపి జాగ్రత్తపడాలి.  

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2024)

 

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?