తెలుగుదేశం పార్టీకి ఏపీలో దశాబ్దాలుగా చెక్కుచెదరని ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఏర్పడిన ఓటు బ్యాంకుతో పాటు, స్థానిక సమీకరణాలు, కులాల వారీగా తెలుగుదేశం పార్టీకి పునాదులున్నాయి. గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం అయినా.. ఏపీలో తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ ఓట్లు అయితే ఉన్నాయి.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. ఈ ఓట్లు తలకిందుల తపస్సు చేసినా మరో పార్టీ గుర్తు వైపు కూడా మొగ్గుచూపవు! ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. వీళ్లు సైకిల్ గుర్తుకే ఓటేసే టైపు! మరి ఇప్పుడు పొత్తుతో జనసేనకు ఏపీలో తెలుగుదేశం పార్టీ ఏ ఇరవై సీట్లో కేటాయించినా.. అలాంటి చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి నిరసనలు అయితే తప్పవు! ఇందులో మరో మాటకు చోటు లేదు!
తమ సీటును జనసేనకు ఇచ్చినందుకు జేజేలు కొట్టే త్యాగరాజులు ఏ నియోజకవర్గంలోనూ ఉండరు! జనసేనకు అంటే తాడూబొంంగరం లేదు, తెలుగుదేశం పార్టీకి ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా.. మాజీ ఎమ్మెల్యేలు, కనీసం ఎమ్మెల్యేగా పోటీకి దిగాలనే ఔత్సాహికులు ఒకరిద్దరు ఉండనే ఉంటారు! మరి ఇప్పుడు ఉన్నట్టుండి పాతిక సీట్ల వరకూ చంద్రబాబు నాయుడు టీడీపీని కాదని జనసేనకు కేటాయిస్తే.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా హర్ట్ అవుతారు!
ఆ జనసేన అభ్యర్థులుగా ఎవరుండాలో చంద్రబాబు డిసైడ్ చేసే పరిస్థితులు కనీసం సగం నియోజకవర్గాల వరకూ ఉండొచ్చు! ఎలాగోలా కొన్ని చోట్ల అయినా జనసేన జెండాలు పట్టే వారు పోటీ చేస్తే మాత్రం.. అక్కడ తెలుగుదేశం శ్రేణులు, వీరాభిమానుల నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహకారం అందే అవకాశాలు అయితే ఉండవు!
పొత్తు కాబట్టి.. తెలుగుదేశం పార్టీ వాళ్లు తమకు సపోర్ట్ చేస్తారనుకోవడం జనసేన తరఫున పోటీ చేసే వాళ్లు భ్రమ! గతంలో చంద్రబాబు నాయుడే తన మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లలో చాలా చోట్ల రెబల్స్ ను పోటీ చేయించడం, వీలైతే బీఫారం ఇవ్వడం కూడా చేశారు! మరి కొన్ని చోట్ల లోపాయి కారీగా మిత్రపక్షాలకు ఝలక్ లు ఇచ్చిన చరిత్ర కూడా చంద్రబాబు సొంతం!
చంద్రబాబు లెవల్లోనే అంత రాజకీయ ఉంటుంది, అలాంటిది ఏవో నాలుగు సీట్లు ఇచ్చినంత మాత్రానా అక్కడ టీడీపీ క్యాడర్ జనసేనకు సపోర్ట్ చేసి గెలిపిస్తుందనుకోవడం.. పదేళ్ల రాజకీయంలో కూడా ఇంకా పరిపక్వం చెందని జనసేన అమాయకత్వమే అనుకోవాలి!