Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: తాము హిందువులం కామంటున్న లింగాయతులు

లింగాయతులు తెలుగునాట కూడా వున్నారు కానీ ప్రధానంగా కర్ణాటక వారే. ఆ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందువరుసలో వుండే వాళ్లు యిప్పుడు శిఖ్కుల వలె  మైనారిటీ హోదా కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు. అది అక్కడి పాలకులను యిబ్బందిలోకి నెడుతోంది. జనాభాలో 10%, వీరశైవులతో కలిపి 17% వుండి, దాదాపు 100 నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్ణయించగల స్థానంలో వున్న లింగాయతులను ఎన్నికల వేళ కాదనడానికి ఎవరికీ సాహసం చాలటం లేదు. లింగాయతు మఠాలు అనేక విద్యాసంస్థలను నడుపుతూ వుంటాయి. ఇప్పుడు మైనారిటీ హోదాలభిస్తే వారి విద్యాసంస్థలను వారిష్టం వచ్చినట్లు నడుపుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదిస్తుంది. నిజానికి యీ డిమాండు యిప్పటిది కాదు, 40 ఏళ్లగా నడుస్తోంది. ఇప్పుడు బలంగా ముందుకు వచ్చింది. దీనిలో మరొక తిరకాసు వచ్చి చేరింది. వీరశైవులు తాము కూడా లింగాయతులమే, తమకకూ ఆ హోదా కావాలి అంటున్నారు. వారు వేరే, మేము వేరే అంటున్నారు లింగాయతులు. వారి నేపథ్యం తెలుసుకుంటే కాస్త స్పష్టత వస్తుంది.

లింగాయత సిద్ధాంతాన్ని స్థాపించినవాడు బసవణ్ణ. ఆయన క్రీ.శ.1105లో ఉత్తర కర్ణాటకలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. అతనికి పిల్లనిచ్చిన మేనమామ అప్పటి రాజు బిజ్జలదేవుడి మహామంత్రి. బసవణ్ణ ఆయన ద్వారా ఆస్థానంలో చేరి, క్రమేపీ మహామంత్రి అయ్యాడు. హిందూ మతాచారాల వలన సమాజంలో ఏర్పడిన దురాచారాలను చూసి ఉద్యమం నడిపాడు. వేదాలను, వర్ణవ్యవస్థను తిరస్కరించాడు, తాను యజ్ఞోపవీతాన్ని విసర్జించాడు. 'అనుభవ మంటపం' అని ఒకవేదిక ఏర్పరచి, సర్వజాతులకు సమాన ప్రాధాన్యత యిచ్చాడు. విగ్రహారాధన లేకుండా, నిరాకారుడైన శివుడొక్కడే దైవమని ప్రబోధించాడు. అందరూ ఇష్టలింగం పేర లింగాన్ని మెడలో వేసుకోవాలని, యితర దైవాలను కొలవనక్కరలేదని, చేసే పని ద్వారానే దైవాన్ని చేరతామని (కాయకేవ కైలాస) ప్రబోధించాడు. బహిష్టు వంటి ఆచారాలు పాటించనక్కరలేదని, వితంతువులు పునర్వివాహం చేసుకోవచ్చని, పురుషులతో సమానస్థాయిలో స్త్రీలు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని చెప్పాడు. 

లింగాయతులలో పెద్దకులం, చిన్నకులం అనేవిలేవు. పుట్టుకతో అందరూ సమానమే. లింగాయతుల్లో గురువులే ముఖ్యం. వారికి మఠాలుంటాయి. మఠాధిపతులే మార్గనిర్దేశనం చేస్తారు. బసవణ్ణ వచనాలనే పేర తన సిద్ధాంతాలను ప్రజానీకానికి అర్థమయ్యే కన్నడ భాషలోనే రాసి, ప్రచారం చేశాడు. ఇది ఎంతోమందిని ఆకర్షించింది. బసవణ్ణకు సాధారణ ప్రజల నుంచి రాజుల వరకు అనుయాయులు ఏర్పడ్డారు. వీరిని లింగాయతులుగా పేర్కొంటారు. వీరు హిందూమత విధానాలను తిరస్కరించడంతో ఆగలేదు. అప్పటిలో కర్ణాటకలో బలంగా వున్న బౌద్ధం, జైనంపై దాడులు చేశారు. బసవణ్ణ తర్వాత ఎందరో గురువులు వచ్చారు. అనేక మఠాలు ఏర్పడ్డాయి. బనజిగ లింగాయత్‌, పంచమశాలి లింగాయత్‌, గణిగ లింగాయత్‌, గౌడ లింగాయత్‌ వంటి 42 ఉపశాఖలూ ఏర్పడ్డాయి. అవి విద్యాసంస్థలతో బాటు, అనేక సంస్థలు నిర్వహిస్తూ ఆర్థికంగా, సామాజికంగా బలంగా వున్నాయి. అయినా 5% రిజర్వేషన్‌ పొందగల బిసి 3-బి కేటగిరీలో మొదట 23 లింగాయతు శాఖలను, 2010లో మరో 19 శాఖలనూ చేర్చారు. ప్రస్తుతం హిందువులుగానే పరిగణించబడుతున్నారు. 

ఇప్పుడు చర్చకు వస్తున్నదేమిటంటే - లింగాయతులది ఆర్యసమాజం వంటి సంస్కరణోద్యమమా? లేక హైందవానికి భిన్నమైన మతమా అని. కొందరు వారు హిందువుల్లో ద్వైతం, అద్వైతం వంటి ఒక శాఖకు చెందినవారు అని వాదిస్తారు. ఇతర దేవీదేవతలను పూజించకపోయినా హిందువుల దేవుళ్లలో ఒకడైన శివుణ్ని పూజిస్తున్నారుగా అంటారు. కానీ మరి కొందరు విభేదిస్తారు. హిందూమతానికి మౌలికమైన వేదప్రమాణం, వర్ణవ్యవస్థలను నిరాకరించినవారు హిందువులు కాజాలరు అంటారు. బౌద్ధులు, జైనులు, శిఖ్కులు గురువునే అనుసరించినట్లు తామూ గురువులనే అనుసరిస్తామనీ, కాబట్టి తమను కూడా వారి లాగే మైనారిటీలుగా గుర్తించాలని కోరుతున్నారు. వీరికి వీరశైవులు తోడయ్యారు. వాళ్లు తాము, లింగాయతులు వేర్వేరు కాదని, ఒకటే సమూహమని, తమందరినీ మైనారిటీలుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అఖిల భారత వీరశైవ మహాసభ పేర ఒక సదస్సు నిర్వహించి జులై 15 న ముఖ్యమంత్రికి ఒక అభ్యర్థన అందజేశారు. లింగాయతులు జులై 20న బీదర్‌లో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి బిజెపి, కాంగ్రెసులను ఆశ్చర్యపరిచారు. పక్కనున్న మహారాష్ట్రలో జరుగుతున్న మరాఠా ఆందోళనలా తయారవదు కదాని పాలకులకు భయం వేసింది.

వీరశైవులు తమను లింగాయతులుగా చెప్పుకోవడం కొందరు లింగాయతులకు నచ్చటం లేదు. నిజానికి వీరశైవం బసవణ్ణ కంటె ముందు నుంచీ వుంది. హిందూమతంలో శాఖే అది. అయితే శివుణ్ని తప్ప విష్ణువుని కొలవరు వాళ్లు. సాక్షాత్తూ శివుడే యీ మార్గాన్ని 60 వేల సం.ల క్రితం స్థాపించాడని చెప్పుకుంటారు. జగద్గురు రేణుకాచార్యుల వారు అగస్త్యమునికి దీన్ని ఉపదేశించాడంటారు. ఈ శాఖ వారికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐదుగురు ఆచార్యులున్నారు. వీరశైవులు కర్ణాటకలోనే కాక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రలలో చాలామంది వున్నారు. తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, గుజరాత్‌లలో  కూడా వున్నారు. వీరిలో చాలా ఉపశాఖలు కూడా వున్నాయి. పాశుపత, సోమ, దక్షిణ, కాలముఖ..యిలా. వీరందరూ కాశీ మఠం, రామేశ్వర మఠం, ఉజ్జయినీ మఠం, రంభాపుర మఠం, శ్రీశైల మఠం అనే ఐదు మఠాల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటారు. మాంసాహారం తినేవాళ్లను క్షత్రియ శైవులని, శాకాహారం తినేవాళ్లను బ్రాహ్మణ శైవులని అంటారు. వీరూ లింగాయతులూ యిద్దరూ శివుణ్నే ఆరాధించినా, యిద్దరి మధ్య చాలా తేడాలున్నాయి. వీరశైవులు హిందూ పురాణాల్లో కనబడే శివుణ్ని కొలుస్తారు. బలులిస్తారు. బసవణ్ణ తన వచనాల్లో ఎక్కడా హిందూ శివుణ్ని గురించి ప్రస్తావించలేదు. ఇష్టలింగాన్ని పూజిస్తే చాలన్నాడు. పూజాపునస్కారాలను, బలులను నిరసించాడు. వీరశైవులు వైదికకర్మలను, ఆగమ శాస్త్రాన్ని ఆచరిస్తారు. లింగాయతులు తిరస్కరిస్తారు. లింగాయతులు మెడలో లింగాన్ని ధరిస్తారు. బిడ్డ గర్భంలో వుండగానే ఏడవ నెలలో తల్లి ఇష్టలింగ దీక్ష యిచ్చి అతని లింగాన్ని తన మెడలో లింగానికి తోడుగా వేసుకుంటుంది. అతను పుట్టాక అతనిచే లింగధారణ చేయిస్తుంది. 12-15 ఏళ్ల వయసు వచ్చాక గురువు ఇష్టలింగ దీక్ష యిస్తాడు. వీరశైవులు లింగధారణ పట్టించుకోవటం లేదు. 

ఇలా తమ మధ్య తేడాలున్నా, వీరశైవులు ఆధిపత్య ధోరణితో తామిద్దరూ ఒకటే అని ప్రచారం చేస్తూ, పంచమఠాల ద్వారా బసవణ్ణ వచనాల పేర తమ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారని కొందరు లింగాయతులు ఆరోపిస్తున్నారు. ఈ అభ్యంతరాలు పట్టించుకోకుండా అఖిల భారత వీరశైవ మహాసభ ఆగస్టు 2 న బెంగుళూరులో యిద్దరూ వేర్వేరు కాదని, ఒకటే అని ప్రకటన చేసింది. లింగాయతుల్లో తొలి మహిళా పీఠాధిపతి, బసవ ధర్మపీఠ అధినేత్రి మాతే మహాదేవి దీన్ని బహిరంగంగా ఖండించారు. విగ్రహారాధన హిందువులకు ప్రధానమని, తమలో విగ్రహారాధన లేదని ఎత్తి చూపారు. అనేక లింగాయత్‌ సంస్థలు తమను వీరశైవుల్లో కలిపి లెక్క వేయవద్దని, తమకు మైనారిటీ హోదా యిచ్చి తీరాలని కోరుతూ రాష్ట్రంలో అనేక చోట్ల ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ బిజెపికి యిబ్బందిగా మారింది. ఎందుకంటే యీ రెండు వర్గాలు బిజెపికి మద్దతు నిచ్చి అది 2008లో అధికారంలోకి రావడానికి సాయపడ్డాయి. 

కర్ణాటకలో లింగాయతులు రాజకీయంగా కూడా ప్రముఖంగా వున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 15 ఏళ్లపాటు లింగాయతులే ముఖ్యమంత్రులుగా వున్నారు (నిజలింగప్ప, బిడి జత్తి, ఎస్‌ఆర్‌ కాంతి, వీరేంద్ర పాటిల్‌) మన రాష్ట్రంలో రెడ్డి ప్రాబల్యాన్ని అరికట్టడానికి ముఖ్యమంత్రిని మార్చేసినట్లే ఇందిరా గాంధీ 1971లో అక్కడ లింగాయత్‌ కాని దేవరాజ్‌ అరసును సిఎంగా కూర్చోబెట్టింది. తర్వాతి రోజుల్లో కూడా ఎస్‌ ఆర్‌ బొమ్మయ్‌, జె ఎచ్‌ పాటిల్‌, యడియూరప్ప వంటి లింగాయతులు ముఖ్యమంత్రు లయ్యారు. యడియూరప్ప లింగాయతులను బిజెపికి మద్దతుదార్లగా కూడగట్టాడు. 2008 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా ఏలాడు. 2013 నాటికి అతను విడిగా వెళ్లి పార్టీ పెట్టడంతో లింగాయతుల ఓట్లు ఆ పార్టీకి, బిజెపికి మధ్య చీలిపోయి, కాంగ్రెసు గెలిచింది. ఇప్పుడు అతను మళ్లీ బిజెపిలోకి వచ్చాడు. 2018మేలో మళ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో లింగాయతులకు కోపం తెప్పించడం విజ్ఞత కాదు. కానీ వాళ్లను హిందూమతంలోంచి బయటకు వెళ్లిపోనివ్వడమంటే హిందూ సమాజాన్ని బలహీనపరచడమే. అన్ని వర్గాల హిందువులను ఐక్యం చేద్దామని ఒక పక్క ప్రయత్నిస్తూ, మరో పక్క లింగాయతులను హిందువులు కాదని, మైనారిటీలని అనడం ఎలా? ఇదీ బిజెపి సమస్య. దీన్ని అధిగమించాలంటే మైనారిటీల కుండే హక్కులన్నీ యిస్తాం కానీ హిందూమతం లోంచి వెళ్లిపోకండి అని వాళ్లతో బేరమాడాలి. దానికి కేంద్రం ఒప్పుకోవాలి. ఇక్కడ వీళ్లకు ఒప్పుకుంటే యిలాటి డిమాండ్లు వేరే చోట్ల నుంచి ఎన్ని వచ్చిపడతాయోనన్న భయం ఉంటుంది సహజంగా. 

ఎటూ తేల్చుకోలేని స్థితిలో బిజెపి యిదంతా కాంగ్రెసు కుట్ర, వాళ్లు లింగాయతులను విడగొడుతున్నారు అని ఆరోపించింది. యడియూరప్ప గతంలో లింగాయతులకు మైనారిటీ హోదా కావాలని వాదించినవాడే. ఇప్పుడు మాటమార్చాడు 'వీరశైవులు, లింగాయతులకు మధ్య తేడా ఏమీ లేదు. ఇద్దరూ హిందువులే.' అంటున్నాడు. కాంగ్రెసు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ''ఈ పేచీ మేమేదో ప్రారంభించామనడం పొరపాటు. రాష్ట్రస్థాయిలో మేం చేయగలిగేది ఏమీ లేదు. లింగాయతుల సమస్య గురించి యడియూరప్ప కేంద్రంలో తన పలుకుబడి ఉపయోగించి పరిష్కరిస్తే బాగుంటుంది. ఈ మతపరమైన విషయంలో మా కెలాటి అభిప్రాయమూ లేదు. ఈ మధ్య వాళ్లు విడివిడిగా వచ్చి అభ్యర్థనలు యిచ్చినపుడు 'లింగాయతులు, వీరశైవులు యిద్దరూ కలిసి ఉమ్మడి ప్రతిపాదన చేస్తే కేంద్రానికి సిఫార్సు చేస్తాను' అని చెప్పాను.'' అన్నాడు. అందువలన వీరశైవులు, లింగాయతుల మధ్య సయోధ్య కుదిర్చే పని, లింగాయతుల మైనారిటీ హోదా తేల్చే పనీ స్వయంగా లింగాయతుడైన యడియూరప్ప మీదే పడింది. మోదీకి ఆప్తుడు కాబట్టి అతనే దీన్ని సాధించి తీరాలని లింగాయతు ఉద్యమకారులు అంటున్నారు. ఇది సరిగ్గా పరిష్కరించ లేకపోతే  దాని ఫలితం కూడా అతని మీదే పడుతుంది. (ఫోటోలు - బసవ ధర్మ పీఠాధిపతి మాతే మహాదేవి, లింగాయత్‌ ఉద్యమం, 'లింగాయత - ఒందు ప్రత్యేక ధర్మ' అని నినదిస్తున్న లింగాయత్‌ పీఠాధిపతులు) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2017) 
mbsprasad@gmail.com