Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ఆంధ్రా రేవంత్‌గా లోకేశ్!?

ఎమ్బీయస్‍: ఆంధ్రా రేవంత్‌గా లోకేశ్!?

లోకేశ్ పాదయాత్ర అర్ధాంతర ముగింపు సందర్భంగా పెద్ద సభ పెట్టి చేసిన ఆర్భాటం చూస్తే లోకేశ్‌ను ఆంధ్రా రేవంత్‌గా చూపబోతున్నారా? అనే సందేహం కలుగుతోంది. పాదయాత్ర పూర్తిగా చేసినా దాని వలన ధీరుడూ, శూరుడూ అయిపోరు. జనతా పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన చంద్రశేఖర్ ఆ పార్టీకి 1980లో అధికారం పోవడంతో, పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి 1983లో ‘‘భారత్ జోడో’’ పేర 4460 కి.మీ.ల పాదయాత్ర చేశాడు. 1984లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో మొత్తం 516 సీట్లలో ఆ పార్టీకి 10 వచ్చాయి. రాహుల్ మొన్ననే 3500 కి.మీ.ల ‘‘భారత్ జోడో’’ యాత్ర చేశాడు. పూర్తయిన వెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వాలను పోగొట్టుకుంది. 2018లో గెలిచి, ఫిరాయింపులతో పోగొట్టుకున్న మధ్యప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి రాలేకపోయింది. తెలంగాణలో మాత్రం బొటాబొటీ మెజారిటీతో గెలిచింది.

అందువలన పాదయాత్ర చేసినంత మాత్రాన విజయం సిద్ధించేసినట్లు కాదు, సిద్ధిస్తుందన్న గ్యారంటీ లభించినట్లూ కాదు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు అనేక పాదయాత్రలు చేశారు, కానీ అధికారం సిద్ధించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు, ఆంధ్రలో గత నాలుగన్నరేళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నారు. 2019లో జగన్ నెగ్గడానికి దానికి ఏడాది క్రితం చేసిన పాదయాత్రే కారణమని అనడానికి లేదు. జగన్‌కు వచ్చిన జనసందోహం చూసి అప్పట్లో అధికారంలో ఉన్న టిడిపి చెదరలేదు, బెదరలేదు. 70-80% ప్రజల ఆమోదం మాకుంది, జగన్‌కు మళ్లీ ఓటమి తప్పదు అంటూనే వచ్చారు. జగన్ గెలిచిన తర్వాత ‘ఒక్క ఛాన్స్ అంటూ దేబిరించినందుకు ప్రజలు ఛాన్సిచ్చారు. అతనిచ్చిన అబద్ధపు హామీలు నమ్మి బోల్తా పడ్డారు’ అన్నారు తప్ప పాదయాత్రే జగన్‌ను గద్దె వైపు నడిపించింది అనలేదు.

పాదయాత్రలు ఆ యాత్రికుడికి లాభిస్తాయి. ప్రజల కష్టనష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం వస్తుంది కాబట్టి ఒకవేళ అధికారం చేతికి వస్తే వాళ్ల కోసం ఏం చేయాలో ఒక ఐడియా వస్తుంది. కానీ దానివలన రాజకీయ లబ్ధి చేకూరుతుందని, ఆ యాత్రికుడు వీరుడు అయిపోయాడని ప్రజలు అనుకుంటారని కానీ ఏ రుజువూ లేదు. అయినా లోకేశ్ పాదయాత్రకు స్వస్తి చెప్పగానే, ఏదో పెద్ద విజయం సాధించేసినట్లు, టిడిపి అధికారంలోకి వచ్చేసినట్లు బిల్డప్ యిచ్చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రకారం – ‘ఈ పాదయాత్ర ద్వారా లోకేశ్ తన నాయకత్వ లక్షణాలపై ఉన్న అపోహలను తొలగించుకో గలిగారు, పరిణతి చెందిన నాయకుడిగా పార్టీ శ్రేణుల నుంచి ప్రశంసలు అందుకున్నారు, చంద్రబాబు తర్వాత పరిస్థితి ఏమిటి అని అనుకునేవారికి ఆశాకిరణంలా అవతరించారు, తనను తాను రుజువు చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు.’

4 వేల కిమీలు నడుస్తానని చెప్పి, 3130 కిమీల దగ్గరే ఆగిపోతే ‘ఆరంభించి పరిత్యజింతురు మధ్యముల్..’ పద్యం గుర్తుకు వస్తుందనుకున్నాను కానీ యిన్ని ప్రయోజనాలు కలిగాయని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాను. తక్కిన 900 కూడా నడిచేసి ఉంటే యింకెన్ని కలిగేవో! మొత్తం 175లో 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే యాత్ర సాగింది. 57% సీట్లకే యింత ధీరుడ నిపించుకుంటే తక్కిన 43% కూడా నడిచేస్తే రాష్ట్రం పట్టనంత నాయకుడు అయిపోయేవాడు కదా అనుకున్నాను. బాబు నడిచినప్పుడు కూడా యింత ప్రొజెక్షన్ జరగలేదు. లోకేశ్ విషయంలో మాత్రం పాదయాత్రకు ముందు, తర్వాత అని రెండు ఫోటోలు చూపించినంత హంగు చేస్తున్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లంటేషన్‌ ముందు, తర్వాత అని రెండు ఫోటోలు పెడతారు. రెండో ఫోటోలోని వ్యక్తిని గుర్తు పట్టలేము. ఇప్పుడు లోకేశ్‌దీ దాదాపు అదే పరిస్థితి.

చంద్రబాబు అరెస్టు అయినపుడు లోకేశ్ రాష్ట్రంలో టిడిపి క్యాడర్‌ను కదిలించి, నిరసనగా ప్రదర్శనలు చేస్తూ ప్రతి ఊరు నుంచి రోజుకో వంద మంది చొప్పున అరెస్టు అయ్యేలా చేస్తూ, భూకంపం సృష్టిస్తారేమోనని చూస్తే యీయన పోయి దిల్లీలో కూర్చున్నాడు. బాబుకి అనుకూలంగా లాబీయింగు చేస్తున్నాడని చెప్పినా అదో వారం రోజుల పని అంతే. ఓ సారి వెళ్లి కలిసి వచ్చేస్తే, తర్వాత ఫోన్లో గుర్తు చేస్తే సరిపోయేది. ఇక కేసుని ఎలా నడపాలో వ్యూహం రచించారను కుందామా, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నాక, వారు యితని మార్గదర్శకత్వం కోసం ఎదురు చూశారని చెపితే నమ్మలేం. బాబు అరెస్టుకి నిరసనగా బయటి రాష్ట్రాలలో, బయటి దేశాల్లో ప్రదర్శనలు జరిగాయి తప్ప అసలు హడావుడి జరగాల్సిన ఆంధ్రలో హల్‌చల్ లేకుండా పోయింది.

మొన్న లోకేశ్ పాదయాత్ర ముగింపు సభకు లక్షలాది జనం వచ్చారు కదా, వారిలో వెయ్యో వంతు మందైనా నిరసన సభలు ఏర్పాటు చేసి, కావాలంటే అరెస్టు చేసుకోండి అని ఉంటే ఎంత ఎఫెక్టివ్‌గా వుండేది! లోకేశ్ లోపల ఉండి, బాబు బయట ఉండి ఉంటే అలాటివి జరిగి వుండేవి. మొన్న సభ కూడా విజయవంతం కావడానికి బాబు పడిన శ్రమ చూడండి. ధనసమీకరణ, జనసమీకరణ సరే, పవన్ రానంటే స్వయంగా ఆయన యింటికి వెళ్లి, మాట్లాడి లాక్కుని వచ్చారు. బాబు అరెస్టు సమయంలో లోకేశ్ తను రంగంలో లేకుండా, తల్లిని, కొన్నాళ్లు భార్యను ముందుకు నెట్టడం నాయకత్వ లక్షణం కాదని టిడిపి వారే వాపోయారు.

బాబు 52 రోజుల పాటు జైల్లో ఉండి అక్టోబరు 31న బయటకు వచ్చారు. ఆ సమయంలో లోకేశ్ ఒక ఫైటర్‌గా తనను తాను చూపుకోలేదు. తండ్రి విడుదల కోసం (అలా అనడం కంటె తండ్రిపై కేసు సాంతం లేకుండా చేయడం కోసం అంటే సబబు) లాబీయింగు చేసే తనయుడిగా మాత్రమే చూపించుకున్నారు. దానిలోనూ సఫలీకృతుడు కాలేదు. బాబు అనారోగ్య కారణాలు చూపించి, బెయిలు మీద బయటకు రావలసి వచ్చింది. తర్వాత కూడా సహజమైన రీతిలో బెయిలు వచ్చింది తప్ప, కేసు కొట్టేయ బడలేదు. గవర్నరు అనుమతి అవసరమా, కాదా అనే విషయంపై సుప్రీం కోర్టు యింకా ఏదీ తేల్చలేదు. తండ్రి బయటకు వచ్చిన నాలుగు వారాలకు లోకేశ్ పాదయాత్ర పునఃప్రారంభించి, ఓ మూడు వారాల పాటు నడిచి మంగళం పాడేశారు. ఇక స్తుతిపాఠాలు మొదలయ్యాయి. లోకేశ్ పోరాటానికి ప్రతిరూపం, తన నాయకత్వ పటిమ చూపుకున్నాడు.. అంటూ. అక్టోబరు నెలాఖరు నుంచి డిసెంబరు మూడోవారం లోపున యింతటి పెనుమార్పు వచ్చేసింది.

ఎందుకిలా? అంటే యీ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాలు వచ్చాయి. మిజోరాం తప్ప తక్కిన ప్రతి చోటా వృద్ధ ముఖ్యమంత్రులు ఓడిపోయారు. నెగ్గిన 64 ఏళ్ల ‘మామా’ శివరాజ్ చౌహాన్‌ను బిజెపి పక్కన పెట్టేసి 58 ఏళ్ల మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా తీసుకుంది. చత్తీస్‌గఢ్‌లో 71 ఏళ్ల రమణ్ సింగ్‌ను పక్కన పెట్టి 54 ఏళ్ల విష్ణు దేవ్ సాయిని తీసుకుంది. రాజస్థాన్‌లో 70 ఏళ్ల వసుంధరను పక్కన పెట్టి 56 ఏళ్ల భజన్‌లాల్ శర్మను ఎంచుకుంది. తెలంగాణలో 69 ఏళ్ల కెసియార్‌ను ఓడించి 54 ఏళ్ల రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెసుకు ఎన్నికలయ్యాక గానీ బుద్ధి రాలేదు. 77 ఏళ్ల కమల్ నాథ్‌ను, 72 ఏళ్ల అశోక్ గెహ్‌లోత్‌ను పక్కన పడేసి, 46 ఏళ్ల సచిన్ పైలట్‌కు ప్రాధాన్యత యివ్వసాగింది. ఇవన్నీ చూసి టిడిపికి 51 ఏళ్ల జగన్‌ను ఢీ కొట్టడానికి 73 ఏళ్ల బాబు కంటె 40 ఏళ్ల లోకేశ్‌ను ప్రొజెక్టు చేస్తే బెటరు అనే ఐడియా వచ్చి ఉండవచ్చు.

తెరాస లాగానే వైసిపి కూడా అధికారం పోగొట్టుకుంటుందా అనే చర్చ వచ్చినపుడు రామ్‌గోపాల వర్మ ఒక వ్యాఖ్య చేశారు. ‘తెలంగాణలో కెసియార్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన రేవంత్ పాలనకు కొత్తవాడు. ఆంధ్రలో అయితే జగన్‌కు ప్రత్యామ్నాయంగా వస్తున్న బాబు పాలనను ఆంధ్రులు యిప్పటికే చవి చూసేశారు.’ అని. బాబు పాలనను తిరస్కరించి జగన్‌కు పట్టం కట్టిన ఆంధ్రులు, మళ్లీ బాబే అంటే ఉత్సాహ పడకపోవచ్చు. అందువలన బాబుకి బదులు లోకేశ్‌ను జగన్‌కు ప్రత్యర్థిగా చూపితే కొత్తదనం వస్తుంది అనే ఆలోచన టిడిపి నాయకత్వంలో కలిగి ఉండవచ్చు. స్వాతంత్ర్యం వచ్చిన కాంగ్రెసు పాలిస్తూ రావడంతో 1967 వచ్చేసరికి అదంటే ప్రజలకు మొహం మొత్తేసింది. చాలా రాష్ట్రాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు నెగ్గాయి. 1966 నుంచి కాంగ్రెసు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ అది గ్రహించింది.

కానీ ప్రజలకు కొత్తదనం అందించాలంటే కాంగ్రెసు కంటె భిన్నమైన పార్టీని స్థాపించి, నెగ్గుకు రావడం సాధ్యం కాదు. అందుకని కాంగ్రెసుకే కొత్త లుక్ యిచ్చింది. కాంగ్రెసులో తనతో విరోధించేవారిని సంస్థాగత కాంగ్రెసు వర్గంగా, ప్రజల కోసం సామ్యవాదం అవలంబించే తన వర్గాన్ని కాంగ్రెసు కొత్త ముఖంగా ప్రొజెక్టు చేసుకుంది. ప్రజలు కాంగ్రెసును పాత, కొత్తలుగా విభజించి చూడడం మొదలుపెట్టారు. అంతకుముందున్న రెండు దశాబ్దాల పాపాలను పాత కాంగ్రెసుకు అంటగట్టేసి, ఇందిర సారథ్యంలోని కొత్త కాంగ్రెసును కొత్త పార్టీగా తలచి, ఆదరించారు. ఇందిరది పై చేయి కావడంతో, ఆమె కాంగ్రెసు ఆర్గనైజేషన్‌ను, ఆస్తిపాస్తులను, దశాబ్దాలుగా ఉన్న క్యాడర్‌ను మొత్తాన్ని కైవసం చేసుకుంది. కొత్త పార్టీ అనుకుంటూనే ప్రజలు పాత పార్టీనే గెలిపించారు.

ఇప్పుడు లోకేశ్‌ కూడా అదే పంథా బాట పట్టవచ్చు. ఇప్పటికే అతను ‘మా నాన్న విధానాలకు, నా విధానాలకు చాలా తేడా ఉంది. ఆయన మెతక మనిషి, అనుచరులను కాపాడుకోవడంలో మొహమాటస్తుడు, పార్టీ కంటె ప్రభుత్వానికే ఎక్కువ ప్రాధాన్యం యిచ్చే వ్యక్తి. మరి నేనలా కాదు, మొండివాణ్ని, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను, నాకు పార్టీయే ముఖ్యం. పోరాటం చేస్తాను, తటపటాయింపు లేకుండా మూర్ఖంగా ముందుకు వెళ్లిపోతాను.’ అని చెప్పుకుంటున్నాడు. ‘జగన్ లాటి చండప్రచండుణ్ని ఢీ కొట్టాలంటే బాబులా మర్యాదలు పాటిస్తూ, వెనక్కాల ఎత్తుకు పైయెత్తులు వేస్తూ కూర్చుంటే పనికి రాదు. దెబ్బకు దెబ్బ అంటూ తలపడే లోకేశ్ వంటి రాష్ మనిషే వంటి తగినవాడు’ అని టిడిపి క్యాడర్‌ మాత్రమే కాదు, జగన్ వ్యతిరేక ఓటర్లందరూ అనుకోవాలంటే లోకేశ్ నెంబర్ టూ స్థానాన్నుంచి, నెంబర్ ఒన్ స్థానానికి వచ్చేయాలి.

కాంగ్రెసు విషయంలో ఇందిర తనను కొత్తగా చూపించుకుని, పార్టీలో తన ప్రత్యర్థులను ఓడించింది. ఇక్కడ బాబు, లోకేశ్ యిద్దరూ ఒక యింట్లో వారే, యిద్దరి మధ్య స్పర్ధ లేదు. ఇదంతా బాబు ప్లాను ప్రకారమే జరుగుతూండవచ్చు. ఇప్పటిదాకా లోకేశ్‌ది తండ్రి చాటు బిడ్డ యిమేజి మాత్రమే, అతన్ని సిఎం అభ్యర్థిగా చూపిస్తే లాభదాయకం అని ఏ మార్చి నాటికో తేలితే, అప్పుడు ‘దాదాపు ఐదు దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారం, హుందాగా రాజకీయాలు చేసుకుంటూ వచ్చాను. భ్రష్టు పట్టిపోయిన ఈనాటి రాజకీయ వాతావరణంలో యిమడలేక పోతున్నాను. వైసిపి గూండాయిజానికి దీటైన సమాధానం చెప్పగలిగేవాడు లోకేశ్ మాత్రమే! నేను మెంటార్‌గా మాత్రమే ఉంటాను.’ వంటి స్టేటుమెంటు యిచ్చి ఆయన తప్పుకుని, లోకేశ్‌ను ముందుకు తోయవచ్చు.    

లోకేశ్‌ను ముందుకు తోయాలన్న ఆశ బాబుకి ఎప్పణ్నుంచో ఉంది. యుపిలో అఖిలేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు బాబు చిరునవ్వు నవ్వుతూ ‘యుపిలో సైకిల్ వచ్చింది, ఎపిలోనూ సైకిల్ వస్తుందంటున్నారు. అక్కడ అఖిలేశ్, యిక్కడ లోకేశ్!’ అంటూ మురుస్తూ చెప్పారు. నిజానికి బాబు వెనక్కి తగ్గడం పార్టీకి లాభదాయకమే. బాబుకి గత పరిపాలన బర్డెన్ ఉంది. దాదాపు ఏడేళ్ల ఎన్టీయార్ పాలనలో ఆయన వెనక నుండి చక్రం తిప్పాడు, తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఐదేళ్లు ఆంధ్రకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ కాలంలో ఆంధ్రకు చేసినదేమిటి? అనే ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదు. ఎంతసేపూ హైదరాబాదు కట్టా, దానికి యింత చేశా, అంత చేశా అంటాడు.

ఈ ముక్కలు తెలంగాణలో చెప్తే హర్షిస్తారేమో కానీ ఆంధ్రలో చెపితే ‘అంతా తెలంగాణకే కట్టబెట్టి, యిప్పుడు ఆంధ్ర అనాథలా ఉంది అని అంగలారిస్తే లాభమేమిటి?’ అని విసుక్కుంటారు. జగన్ వచ్చిన మర్నాటి నుంచి రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు అంటూ టిడిపి హోరెత్తిస్తూనే ఉంది. తన ఐదేళ్ల పాలనలో బాబు రోడ్లు వేయించి ఉంటే జగన్ వస్తూనే రోడ్లన్నీ తవ్వించేశాడా? బాబు వేయించలేదు, జగనూ వేయించలేదు. అందుకే ఏళ్లు గడుస్తున్నకొద్దీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నమైంది. మౌలిక సదుపాయాలు బాబు సమకూర్చి ఉంటే, జగన్ అవన్నీ పీకించేశాడా? బాబు ప్లాన్లు, డిజైనింగు అంటూ సమయం వృథా చేశారు. జగన్‌కు అటువైపు దృష్టే లేదు. ఇలా జగన్ వైపు ఒక వేలు చూపిస్తే, మూడు వేళ్లు బాబువైపు తిరుగుతున్నాయి. లోకేశ్ విషయంలో ఆ యిబ్బంది లేదు. ‘నీ హయాంలో నువ్వేం చేశావ్?’ అని అడిగే ఆస్కారం లేదు.

రేవంత్ విషయం చూడండి. కాంగ్రెసు పురాతనమైన పార్టీ. ఉత్తమ్, కోమటిరెడ్డి, పొన్నం, భట్టి అన్నీ పాత మొహాలే. కానీ రేవంత్ అనే కొత్త సీసాలో పాత సరుకుని పోసేటప్పటికి ప్రజలు ఆకర్షింప బడ్డారు. పార్టీ పాతది కాబట్టి ఆర్గనైజేషనల్ ఎడ్వాంటేజి తోడైంది. కెసియార్ అహంభావం, అవినీతితో విసిగినవారు ‘ఇతనికి కరక్టు మొగుడు రేవంతే’ అనుకుని ఓటేశారు. 1982 నాటికి కాంగ్రెసు పాలనతో ప్రజలు విసిగి ఉన్నారు. సరిగ్గా అప్పుడే ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యామ్నాయంగా కనిపించడంతో ఆదరించారు. నిజానికి ఎన్టీయార్ తన ప్రసంగాల్లో చెప్పినవన్నీ గతంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు, జనతా వాళ్లు చెప్పినవే. కొత్తది ఏమీ లేదు కానీ తన హావభావాలతో, నటనా చాతుర్యంతో చెప్పేటప్పటికి ఓటర్ల మనసుకు హత్తుకుంది. పాత విషయాలే అయినా కొత్త మొహం ద్వారా వినడంతో ప్రభావితులయ్యారు. కాంగ్రెసును గద్దె దించారు.

పాత బ్యాగేజి లేని రేవంత్ కెసియార్‌పై విరుచుకు పడడంతో మంచి ఎఫెక్ట్ కలిగింది. అవే విమర్శలు కోమటిరెడ్డి బ్రదర్శ్ చేసి ఉంటే ఆ ఎఫెక్ట్ ఉండేది కాదు. ఇవన్నీ గమనించిన టిడిపి లోకేశ్‌ను రేవంత్‌ మూసలో పోతపోయడానికి చూస్తోందని నా అభిప్రాయం. కానీ అది అంత సులభమైన పని కాదు. రేవంత్ రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి, క్రింది స్థాయి నుంచి పోరాడుతూ పైకి వచ్చాడు. లోకేశ్‌ నోట్లో వెండి చెంచాతో పుట్టాడు. దేని కోసం తపించవలసిన అవసరం పడలేదు. ఇప్పుడు రేవంత్ తరహాలో జగన్‌కు దీటైన యోధుణ్నని చూపించుకోవడం కష్టమైన పనే. పాదయాత్ర చేసినంత మాత్రాన జగన్ హీరో అయిపోలేదు. తండ్రి బతికుండగా అతను ఎంపీ అయినా, పెద్ద నాయకుడని ఎవరూ అనుకోలేదు. వైయస్ మరణం తర్వాత పార్టీ హైకమాండ్‌ను ఎదిరించడం, కేసులు ఎదుర్కోవడం, జైలుకి వెళ్లడం, రికార్డు స్థాయిలో ఎంపీగా గెలవడం.. యివన్నీ జరిగాయి.

రాష్ట్రం ఏర్పడ్డాక దశాబ్దాల చరిత్ర ఉన్న టిడిపి, బిజెపిలు గ్లామరు పుష్కలంగా ఉన్న పవన్‌ను కూడా కలుపుకుని వచ్చినా వారి కంటె కేవలం 2% కంటె తక్కువ తేడాతో ఓట్లు తెచ్చుకున్నాడు. 38% సీట్లు తెచ్చుకున్నాడు. లోకేశ్‌కు యీ రికార్డు లేదు కదా! ఎమ్మెల్సీ పదవి, మంత్రి పదవి అనాయాసంగా వచ్చాయి. అమరావతి ప్రాంతంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓటమి ఎదురైంది. పార్టీ ఆర్థిక వ్యవహారాల్లో దిట్టే కానీ, నిర్వహణా సామర్థ్యంలో తండ్రి వైపు చూడాల్సిందే అనే ప్రచారం ఉంది. పార్టీ సీనియర్లలో ఎందరు అతని సామర్థ్యం పట్ల భరోసాగా ఉన్నారో తెలియదు. ఒంటరైనప్పుడు తన సామర్థ్యం ఎటువంటిదో చూపుకోవడానికి బాబు కారాగారవాసం రూపంలో అవకాశం వచ్చినపుడు లోకేశ్ దాన్ని ఉపయోగించు కోలేదు.

ఇప్పుడు అవన్నీ సవరించుకోవడానికే తనను యోధుడిగా, పోరాటవీరుడిగా చూపుకోవడానికి లోకేశ్ పాదయాత్ర ముగింపు సభను ఉపయోగించుకున్నారు. ఆయన అనుకూల మీడియా కూడా విపరీతంగా హైప్ నిచ్చింది. బిల్డప్ బాగానే ఉంది కానీ క్రమేపీ చేయాలి, పైగా ఆచరణలో కూడా ఆ శూరత్వం చూపాలి. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పాలి. ఆయనా తన గురించి చెప్పుకునేటప్పుడు కాస్త తమాయించుకోవాలి. జగన్ ఫ్యాక్షనిజంలో పుడితే తను విప్లవంలో పుట్టాడని చెప్పుకుంటాడు. జగన్ తాత ఫ్యాక్షనిస్టు కానీ, తండ్రి కాదు, మెడిసిన్ చదివి ప్రాక్టీసు చేసిన డాక్టరు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా చేశాడు. జగన్ కాలేజీ స్థాయి దాకా చదివి డిగ్రీ తీసుకున్నాడు. ఇక పవన్ విప్లవంలో పుట్టడమేమిటి? తండ్రి ప్రభుత్వోద్యోగి. అన్నలు సినిమా నటులు. ఇక విప్లవం చేసే అవకాశం ఎక్కడ? తుపాకీ పట్టుకుని అడవుల్లోకి వెళ్లాడా? ఉద్యమాలు చేసి జైలుకి వెళ్లాడా?

కనీసం సాంస్కృతిక విప్లవంలో భాగస్వామి కూడా కాదు, ఆఫ్‌బీట్, పారలల్ సినిమాల్లోనైనా వేయలేదు. అన్నీ కమ్మర్షియల్సే! సినిమాల్లో రోజుకి రెండు కోట్లు సంపాదిస్తూ ఆస్తులు కూడబెట్టినవాడు చేగువేరా టీ షర్టు వేసుకున్నంత మాత్రాన విప్లవకారుడు అయిపోతాడా? దీనితో పాటు ‘నేను చిన్నప్పుడు కష్టాలు పడ్డాను’ అని చెప్పుకోవడం ఒకటి. తల్లీ, తండ్రీ, అన్నలు, అక్కలు ఉన్నారు. తండ్రి ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఆరేడేళ్లు వచ్చేసరికి పెద్దన్న గారు సినిమా నటుడయ్యాడు. స్కూలు చదువు ప్రారంభించేనాటికి పెద్ద హీరో అయిపోయాడు. ఇక పవన్‌కు బాలకార్మికుడిగానో, వ్యవసాయ కూలీగానో పని చేసే అగత్యం ఎందుకు వస్తుంది? చిరంజీవి, చరణ్, పవన్ పాల్గొన్న టీవీ యింటర్వ్యూ చూశాను. చరణ్ పాకెట్‌మనీ నుంచి పవన్ అప్పు తీసుకునేవాట్ట. అది వింటూనే చిరంజీవి ‘అన్నీ యింట్లోంచి అమరుస్తూ ఉంటే వాడి దగ్గర అప్పు పుచ్చుకునే అవసరం ఏమిట్రా?’ అని పవన్‌ను అడిగారు. ‘ఉంటాయిలే అన్నయ్యా, కొన్ని అవసరాలు..’ అంటూ పవన్ మాట నాన్చాడు. కష్టాలంటే అప్పు కోసం వెతికే అలాటి కష్టాలేమో!

ఎన్నికల్లో నిలబడితే పోరాటం అనాలి, విప్లవం అనరు. ఆ పోరాటం కూడా ఎప్పుడోగాని జరగలేదు. 2014లో బరిలోకి దిగలేదు. తెలంగాణలో దిగుతా దిగుతా అనడమే తప్ప 2023 దాకా దిగనే లేదు. దిగితే ఏమైందో ఆ ఫలితాల సంగతి చూశాం. ఇక ఆంధ్రలో 2019లో దిగితే అదీ చూశాం. ఈ సారి ఒంటరి పోరాటం చేస్తే ఆత్మహత్యాసదృశమే అని బహిరంగంగా చెప్పేవాడు విప్లవకారుడు, పోరాటవీరుడు ఎలా అవుతాడు?  రేపు జగన్ ఓడిపోతే ఆ ఘనత బాబుకే పోతుంది, పవన్‌ది ‘నేను సైతం..’ పాత్ర మాత్రమే! ఇలాటివాడు పోరాటం, విప్లవం అంటూ మాట్లాడకుండా ‘నేను స్థయిర్యం కలవాణ్ని. పదేళ్ల పాటు నా సినిమాలు ఆడకపోయినా, నేను దర్శకత్వం వహించిన సినిమాలు మట్టి కరిచినా కృంగిపోలేదు. యువతీయువకులారా, మీరూ నిరాశకు లొంగవద్దు, ఆశాభావంతో ఉండండి. నేను ఫలానాఫలానా పనులు చేసి మీ భవిష్యత్తు చక్కదిద్దుతాను’ అంటే చాలు.

రేవంత్‌ మోడల్లో భావి ముఖ్యమంత్రిగా లోకేశ్‌ను మేకోవర్ చేయించడానికే ప్రశాంత్ కిశోర్‌ను సంప్రదిస్తున్నారని నా థియరీ. దానిపై వివరంగా  ‘‘పికెతో పనేముంది?’’ అనే వ్యాసంలో చర్చిస్తాను. దానితో బాటు లోకేశ్ గురించి యితర అంశాలపై కూడా చర్చిస్తాను. ఈలోగా పాఠకులకు వచ్చే ఒక సందేహానికి దీనిలోనే సమాధాన మిచ్చేస్తాను. ‘మా కూటమి తరఫున నాన్నగారే ముఖ్యమంత్రి’ అని లోకేశ్ స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా బాబు కాదు, లోకేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఎలా అంటున్నారు? అని మీరడగవచ్చు. నేననుకునే దేమిటంటే యీ స్టేటుమెంటూ ‘..175టిలో మేం 150టిలో పోటీ చేస్తాం, తక్కినవాటిలోనే కూటమి భాగస్వాములు సర్దుకోవాలి..’ అనే మరో స్టేటుమెంటూ లోకేశ్ యిచ్చినది టిడిపి హార్డ్‌కోర్ అభిమానులను ఉద్దేశించినది అని.

పవన్ 50 సీట్ల దాకా అడుగుతున్నారని, ఆయన అభిమానులు కొద్దికాలానికైనా ముఖ్యమంత్రిగా ఆయన్ను చూడాలనుకుంటున్నారని అందరూ అనుకుంటున్నదే. అలా యిస్తే, టిడిపి హార్డ్‌కోర్ వాళ్లు హర్టవుతారు. పవన్‌ను సిఎం చేయడానికి మేమెందుకు సహకరించాలి? అసలు తెలంగాణలో జనసేన పర్‌ఫామెన్స్ చూశాక, దానికి యిక్కడ 10, 15 కంటె ఎక్కువ యివ్వడం అవసరమా? అనే భావనలో వాళ్లున్నారు. లక్ష్యం ఒకటే అయినా వేర్వేరు మార్గాల్లో డీల్ చేసే గుడ్ కాప్, బ్యాడ్ కాప్ థియరీ వినే వుంటారు. దాన్ని బాబు, లోకేశ్ టిడిపిలో అమలు చేస్తున్నారు. బాబు పవన్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ జనసేన దూరం కాకుండా చూస్తున్నారు. లోకేశ్ బ్యాడ్ కాప్ తరహాలో జనసేన పట్ల కటువుగా మాట్లాడుతూ, టిడిపి వర్గాలు చేజారకుండా వాళ్లని హ్యూమర్ చేస్తున్నారు.

ఇందిరా గాంధీ పాత కాంగ్రెసు వాళ్లను అదుపు చేయడానికి సిపిఐ వారి సాయం తీసుకుంది. తను బలపడ్డాక వాళ్లను వదుల్చుకుందా మనుకుంది. దానికి సంజయ్ గాంధీని ప్రయోగించింది. సంజయ్ కమ్యూనిస్టులు దేశద్రోహులు అంటూ ఒంటి కాలిపై లేస్తూండేవాడు. సిపిఐ వారు వచ్చి ఫిర్యాదు చేస్తే ఇందిర కిమ్మనేది కాదు. ఇలాటి టెక్నిక్కే యిక్కడా నడుస్తూండవచ్చు. ప్రస్తుతానికి జనసేన ఆశలను అదుపు చేయడానికి లోకేశ్ ‘బాబే సిఎం’ అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ మార్గదర్శకత్వంలో మేకోవర్ పూర్తయి, లోకేశ్ ‘ఓటర్లకు ఆమోదయోగ్యుడైన ముఖ్యమంత్రి అభ్యర్థి’ అనే ధైర్యం వచ్చాక అప్పుడు బాబు త్యాగం చేసి ‘ఈనాటి తరానికి కావలసినది లోకేశ్ నాయకత్వమే’ అని అతన్ని ముందుకు తోయవచ్చు. నిరుద్యోగం, ఉపాధికల్పన, కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతీయువకులు.. యిలాటి అంశాలు పరిగణనలోకి వచ్చినపుడు 40 ఏళ్ల లోకేశ్ ఆకర్షణీయంగా కనిపించడంలో వింత లేదు. పరిణతి, అనుభవం లేవు అనేవే నెగటివ్ పాయింట్లు. అన్నీ ఉన్న తండ్రి వెనక్కాల నుంచి మెంటారింగ్ చేస్తారుగా! అనే ఒక్క సమాధానంతో వాటిని ఎగరగొట్టాలని చూస్తారు. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?