ఎమ్బీయస్‌ : ఆంధ్రలో బలాబలాలు – 1

ఆంధ్రలో ప్రచారం ముగిసింది. ఇప్పటిదాకా వున్న పరిస్థితిని బేరీజు వేసే ప్రయత్నమిది. నేను ఏ సర్వే చేయించలేదు. దీనిలో అంకెల కంటె చర్చే ఎక్కువ కనబడుతుంది. క్షేత్రస్థాయిలో వున్నవారే పరిస్థితి అంచనా వేయడం కష్టం…

ఆంధ్రలో ప్రచారం ముగిసింది. ఇప్పటిదాకా వున్న పరిస్థితిని బేరీజు వేసే ప్రయత్నమిది. నేను ఏ సర్వే చేయించలేదు. దీనిలో అంకెల కంటె చర్చే ఎక్కువ కనబడుతుంది. క్షేత్రస్థాయిలో వున్నవారే పరిస్థితి అంచనా వేయడం కష్టం అనుకుంటే మీడియా మరీ గందరగోళ పరుస్తోంది. ఎప్పటికప్పుడు టిడిపి భలే పుంజుకుంటోంది అని రాస్తున్నారు. టీవీ ఛానెల్స్‌లో చెపుతున్నారు. గత జులై విభజన ప్రకటన తర్వాత నుండి టిడిపి దూసుకుపోతోంది అని రాస్తూ వచ్చారు – బాబు నోట సమైక్యం అనే మాట అసెంబ్లీలో రాకపోయినా. ఇక పార్లమెంటులో బిల్లు పాసయ్యాక చెప్పనే అక్కరలేదు. 'విభజన ఎలాగూ అయిపోయింది. నవనిర్మాణానికి బాబే సమర్థుడని అందరికీ అర్థమైంది. ఇప్పటిదాకా వైకాపా పట్ల చూపిన మొగ్గు యిప్పుడు యిటు తిరిగింది' అని రాశారు. కాంగ్రెసు నాయకులందరూ  టిడిపికి క్యూలు కట్టడంతో అది నిజం కాబోలు అనిపించింది. వారి రాక వలన టిడిపిలో ఏర్పడ్డ విభేదాలు త్వరలోనే సమసిపోయాయని మీడియా మనకు ధైర్యం చెప్పింది. 

అంతలో బిజెపితో పొత్తు విషయం వచ్చిపడింది. కలహాలు బయటపడ్డాయి. 'అయినా సర్దుకున్నాయి. పొత్తు అద్భుతంగా నడుస్తోంది' అని మళ్లీ రాశారు. ఆ తర్వాత 'మోదీ-పవన్‌-బాబు సభలు అద్భుతంగా జరగడంతో వైకాపా వైపు వున్న ఓటర్లు యిటువైపు తిరిగిపోయారు' అని రాశారు. ఈ రాతల్లో, టీవీ కార్యక్రమాల్లో 'ప్రస్తుతం వైకాపా బలంగా వుంది' అని ఎన్నడూ చెప్పలేదు. అది గతించింది అనుకున్నాక 'ఇప్పుడు బలహీనపడింది' అని మాత్రమే చెప్తూ వచ్చారు. వైకాపా బలాన్ని గుర్తించడానికి మీడియా నిరాకరిస్తోందని అర్థమైంది. 

ఉన్నదున్నట్టు చెప్పడమనేది మీడియా ఎప్పుడో మర్చిపోయిందని తిట్టుకుంటూ అక్కడున్న స్నేహితులను అడిగితే – ''టిడిపిది మీడియాలో ప్రచారం, వైకాపాది ప్రజల్లో ప్రచారం. వైకాపాను తీసిపారేయడానికి లేదు. క్రైస్తవులను బాగా పోగేశారు. కాంగ్రెసు నుండి దళితులను కూడా బాగా గుంజుకున్నారు. వైయస్‌ పట్ల అభిమానం కొన్ని వర్గాల్లో యింకా పోలేదు. కాంగ్రెసు వైయస్‌ను వదిలేసుకుంది. దాని ఓట్లు ఎవరికి పోతాయో చూడాలి. మధ్యతరగతి ప్రజల్లో టిడిపి, బిజెపి పట్ల అభిమానం వుంది. కేసుల కారణంగా జగన్‌ పట్ల వ్యతిరేకత కూడా బలంగానే వుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైకాపాకు బలం వుంది. పట్టణాలలో టిడిపికి వుంది.'' అంటున్నారు. లగడపాటి అన్నారు కదా – 70% ఓటింగు దాటిందంటే టిడిపికి గెలుపని. మధ్యతరగతివాళ్లు కదలి వచ్చి ఓటేస్తే అవి టిడిపికి పడతాయని తాత్పర్యం. తెలంగాణలో సరాసరి 70% దాటినా, హైదరాబాదులో 53% దాటలేదు. అదే పరిస్థితి అక్కడా వస్తే, వైకాపాకు బలం వున్న గ్రామాల్లో 78% పడి, పట్టణాల్లో 62% పడితే, అప్పుడు టిడిపికి గెలుపు అని చెప్పలేం కదా! పైగా వీళ్లు యింకో విషయం మర్చిపోతున్నారు. హైదరాబాదు 53% శాతంలో నాలాగ 'నోటా' నొక్కినవాళ్లు ఎందరో తెలియదు. విభజన అకృత్యంలో అందరూ పాపులే అనే థియరీతో అక్కడి నాలాటి మధ్యతరగతి ప్రజలు, విద్యావంతులు 'నోటా' నొక్కితే టిడిపికి కాని, మరొకరికి కానీ ఏం లాభం?

తెలంగాణ ఎన్నికలలో కంటె ఆంధ్ర ఎన్నికలలో డబ్బు, మద్యం ఏరులై పారుతోందని వింటున్నాం. జగన్‌ అక్రమార్జన డబ్బే దీనికంతా కారణం అనే ప్రచారం విరివిగా సాగుతోంది. ఇక్కడ గమనించ వలసినదేమిటంటే – ఒకే పార్టీ డబ్బు ఖర్చు పెట్టడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎదుటివాళ్లు డబ్బుతో గెలుస్తున్నారు అనుకున్నపుడే వీళ్లూ పోటాపోటీగా ఖర్చు పెడతారు. ఓటరుకూడా వాళ్లు 500 యిస్తున్నారు, మీరు 750 యివ్వండి, వెయ్యి యివ్వండి అని బేరమాడతాడు. వైకాపా, కాంగ్రెసు, టిడిపి – మూడిట్లో కాంగ్రెసు కాడి పారేసినట్టే వుంది. తెలంగాణలో ఖర్చు పెట్టి వుండవచ్చేమో కానీ, ఆంధ్రలో రూపాయి పెట్టినా వేస్టు అనే అభిప్రాయానికి హై కమాండ్‌ వచ్చి వుంటుంది. సోనియా, రాహుల్‌ ఎంత మొక్కుబడిగా వచ్చారో చూశాం. 

ఇక టిడిపి, వైకాపా రెండూ విరివిగా ఖర్చు పెడుతూండవచ్చు. తేడా అంటే ఉన్నీస్‌బీస్‌ అనుకోవచ్చు. అక్కడున్న అభ్యర్థి మోజు, సత్తా బట్టి ఒక చోట ఒకరిది ఎక్కువ కావచ్చు, మరొక చోట యింకోరిది కావచ్చు. ఇలా ఖర్చు పెడుతున్నది అక్రమంగా సంపాదించినది లేదా అక్రమార్జనకు పెట్టుబడి అనుకోవడం తప్పేమీ కాదు. ఇలాటివారు ఎవరు నెగ్గినా వారు పదవులను ఉపయోగించి అవినీతికి పాల్పడతారని వూహించవచ్చు. ఈ అభ్యర్థులలో చాలామంది మొన్నటిదాకా పదవులు అనుభవించినవారే కదా. ఈ డబ్బు, మధ్యం ఎఫెక్టు ఎంతవరకు పనిచేస్తుందో తెలియటం లేదు. 2009లో కూడా చూశాం అభ్యర్థులందరూ డబ్బు తగలేసినా నెగ్గేవాడు ఒకడే. అంటే ఓటర్లు అందరి దగ్గరా డబ్బు తీసుకుని తమకు యిష్టమైనవాడికి ఓటేస్తున్నారన్నమాట. ఇలాటి పరిస్థితుల్లో డబ్బెందుకు ఖర్చు పెడుతున్నారో పెట్టేవారికే తెలియాలి. 

ఈ ఫ్యాక్టర్‌ పక్కన పెట్టి ఆలోచిస్తేనే కథ ముందుకు సాగుతుంది. వైకాపా గ్రాఫ్‌ స్టడీగా వుంది. గ్రామీణప్రజలు, క్రైస్తవులు, ముస్లిములలో కొందరు, వైయస్‌ అభిమానులు దానికి పునాదిగా వున్నారు. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో జగన్‌కు ఓటేయకూడదని భీష్మించుకుని వున్న ఓటర్లూ వున్నారు. టిడిపికి హికప్స్‌ వున్నాయి. అవకాశాలు వస్తున్నాయి, పోతున్నాయి. గతంలో జరిగిన ఉపయెన్నికలలో కాంగ్రెసు, టిడిపి, వైకాపా ముక్కోణపు పోటీలో వైకాపా అమితంగా లాభపడింది. ఇప్పుడు కాంగ్రెసు ఓటు బ్యాంకు చీలుతోంది. ఆ ఓట్లలో కొన్నయినా టిడిపివైపు మళ్లుతాయి కాబట్టి టిడిపి బలపడింది. కానీ బాబు రాజకీయంగా వేస్తున్న అడుగులు సవ్యమైన ఫలితాలను యివ్వడం లేదు. తెలంగాణలో ఏదో బావుకుంటామనుకుని విభజనకు వంతపాడారు. ఇప్పుడు అక్కడేం జరిగింది? తెరాసయా, కాంగ్రెసా అంటున్నారు. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే తెరాసకు బిజెపి మద్దతు యిచ్చినా యివ్వవచ్చు –  తెరాసకు మొత్తం టిడిపి కంటె ఎక్కువ పార్లమెంటు సీట్లు వస్తే! విభజనకు వంతపాడి బాబు పోగొట్టుకున్నదే ఎక్కువని తేల్తోంది. (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2014)

[email protected]