అది చాలనట్టు యీ బిసి రంధి పట్టుకుంది. ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ అధినేతలు ఉత్తరభారతంలోని ఫార్ములాలను యిక్కడ అమలు చేయబోయి దెబ్బతింటారు. వాళ్ల కులాల సమీకరణలు వేరు. బిసిలకు, సోషలిస్టు ఉద్యమానికి లింకు వుంది. ఇక్కడ సోషలిస్టు ఉద్యమం బలపడలేదు. సోషలిస్టు ఉద్యమం నడిచిన ఉత్తరప్రదేశ్, బిహార్లలోనే బిసిలు రాజకీయంగా బలపడ్డారు. ఆ ఉద్యమం లేని బెంగాల్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్ వంటి అనేక రాష్ట్రాలలో బిసిలకు రాజ్యాధికారం దక్కలేదు కదా! కులరహిత సమాజం పేరుతో ద్రవిడ ఉద్యమం కూడా బిసిలనే ఫోకస్ చేసింది కాబట్టి తమిళనాడులో, నారాయణగురు వంటి సామాజిక ఉద్యమకార్యకర్తల కారణంగా కేరళలో బిసిలకు అధికారం సిద్ధించింది. తెలుగునాట అవేమీ లేవు. బిసిలకు రిజర్వేషన్లు ప్రతిపాదించిన మురళీధరరావు కమిషన్ రిపోర్టును ఎన్టీయార్ అమలు చేస్తానని ప్రకటించిన సభలో నేనున్నాను. ఆయన చాలా ఆర్భాటంగా దేవుడు ప్రత్యక్షమై వరం యిచ్చినంత హంగామాతో నాటకీయంగా ఎనౌన్సు చేశాడు. సభలో చప్పట్లు మోగలేదు. సాధారణ ప్రజలెవరికీ ఆ కమిషన్ గురించి ఏమీ తెలియదు. ఇదీ యిక్కడి రాజకీయ చైతన్యం!
ఉత్తరప్రదేశ్‌లో బియస్పీ ఆ మధ్య ఎన్నికలలో బ్రాహ్మణ, దళిత కాంబినేషన్‌తో ఎన్నికలు గెలిచింది. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో బియస్పీ శాఖను యాక్టివైజ్ చేసి అదే సమీకరణంతో ఎన్నికలలో పోటీ చేస్తామని హంగు చేశారు. మాయావతిని రప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణుల సంఖ్యాబలం, ఆర్థికబలం, రాజకీయబలం యిక్కడికి తీసుకురాలేరు కదా. అందుకనే దానికి పురిట్లోనే సంధి కొట్టింది. ఇప్పుడు కాంగ్రెసు పెద్దలు ఏవేవో లెక్కలు వేసి రాష్ట్ర విభజన చేసేసినట్టే, కాంగ్రెసుకి రెండు ప్రాంతాల్లోనూ బిసి అధ్యకక్షుల్ని పెట్టేశారు. పొన్నాలకు ముఖ్యపదవి కట్టబెట్టడంతో తెలంగాణ కాంగ్రెసులో రెడ్లు తిరగబడ్డారని, తెరాస ద్వారా వెలమ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికై వైకాపాకు ఓట్లేశారనీ వార్తలు వస్తున్నాయి. ఫలితాలు వచ్చాక అసలు సంగతి తెలుస్తుంది. ఇక ఆంధ్రలో కాంగ్రెసుకు సాంప్రదాయికంగా ఓట్లేసే రెడ్లు ఎలా ఫీలవుతున్నారో చూడాలి. రఘువీరా రెడ్డికి అధ్యక్షపదవి కట్టబెట్టినందు వలన కాంగ్రెసుకు ఏమైనా మేలు చేకూరిందా? అంతెందుకు 2009 ఎన్నికలలో చిరంజీవి బిసి, బిసి అన్నారు, సామాజిక తెలంగాణ అన్నారు. ఏమైనా లాభపడ్డారా?
అదేమీ ఎనలైజ్ చేయకుండా బాబు కృష్ణయ్యగార్ని ఆఖరి నిమిషంలో పార్టీలో చేర్చుకుని తెలంగాణకు బిసి సిఎం అని ప్రకటించారు. ఆ అభ్యర్థే గెలుస్తాడో లేదో తెలియదు. తెరాస సిఎం కాండిడేట్ కెసియార్‌తో ఆయన్ని పోల్చి చూడండి. తూగుతాడా? తెలంగాణలో ఆ ప్రకటన వలన టిడిపి బావుకున్నదేముంది? ఏమీ లేదు. అలాటిది యిప్పుడు ఆంధ్రలో కూడా బిసి, కాపు ఉపముఖ్యమంత్రులు అంటూ బాబు కొత్త ఆఫర్. మ్యేనిఫెస్టోలో లేనివి కొత్తగా చేరుస్తున్నారంటే ఏమిటర్థం? ఎన్నికలలో వైకాపాను ఎదుర్కోవడానికి బలం చాలటం లేదు, కొత్త స్ట్రాటజీ వర్కవుట్ చేయాలి, కొత్త హామీలు యివ్వాలని అనుకున్నారనే కదా! వైకాపాకు మైనారిటీల బలం వుంది, దానితో పోటీ పడాలంటే హిందువులను సంఘటితం చేయాలి అనుకుంటే – కమ్మ సిఎం కాబట్టి రెడ్డి డిప్యూటీ సిఎం అంటే తూకం సరిపోయేది. కాపు ప్లస్ బిసి ఎందుకు?
విభజన తర్వాత టిడిపి అభిమానులందరూ చెప్తూ వచ్చినదేమిటంటే – 'ఇన్నాళ్లూ సమైక్యరాష్ట్రంలో రెడ్లు సంఖ్యాపరంగా ఎక్కువగా వుండి అధికారం చలాయించారు. ఇప్పుడు విడిపోయింది కాబట్టి ఆంధ్రలో కమ్మ రెడ్డి సమానమవుతారు. కమ్మలు, కాపులతో కలిసి పోటీ చేసి రెడ్లను చెక్‌లో పెడతారు' అని. ఏ కులమైనా, మరో కులంతో కలిసి నడిస్తే మంచిదే. కులాల మధ్య సంకులసమరం నడవాలని ఎవరూ కోరుకోరు. అయితే కమ్మ, కాపు కలుస్తారా? అన్నదే ప్రశ్న. రెండు, మూడు జిల్లాలలో వాళ్లు సమానస్థాయిలో అన్ని రంగాలలో పోరాడతారు. 2009 ఎన్నికలలో చిరంజీవి పార్టీ పెట్టినపుడు కొందరు టిడిపి అభిమానులు నాకు మెయిల్స్ రాశారు – 'ఇన్నాళ్లూ కాపులు కాంగ్రెసుకు ఓట్లేస్తూ వచ్చారు. ఇప్పుడు చిరంజీవి పార్టీ పెట్టాడు కాబట్టి, వాళ్లంతా పిఆర్పీకి ఓట్లేస్తారు. కాపుల ఓట్లు కోల్పోయిన కాంగ్రెసు బలహీనపడుతుంది. కమ్మ, బిసిల ఓట్లు చెక్కుచెదరకుండా టిడిపికి పడతాయి కాబట్టి మహాకూటమిదే గెలుపు' అని. ఈ లెక్కలన్నీ ఎటు పోయాయో కానీ, ఫలితాలు వచ్చాక పీఆర్పీ వలననే టిడిపి ఓడిపోయింది అంటూ వాళ్లే వాపోయారు. కాపులందరూ చిరంజీవికి వేశారా, కాపులే వేశారా అన్నది కూడా నాకు బోధపడలేదు.
సెఫాలజిస్టులు కూడా కులాల వారీగా గణాంకాలతో విశ్లేషించడానికి యిష్టపడతారు. కానీ అన్నదమ్ములు, భార్యాభర్తలు వేర్వేరు పార్టీలకు ఓటేయడం గమనిస్తూ వచ్చిన నాకు ఒక కులం వారందరూ ఒకే పార్టీకి ఓటేస్తారంటే నమ్మబుద్ధి కాదు. ఈ ఫీలింగు నాయకుల్లోనే వుంటుందేమో! అసలు మనుష్యుల ఆలోచనాసరళే వింతగా వుంటుంది. కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లోనే గమనించాను – నువ్వు ఫలానావాడికి ఎందుకు ఓటేశావ్? అని అడిగితే, 'అందరికంటె ముందు వాడు వచ్చి అడిగాడు కాబట్టి…' అని చాలామంది చెప్పేవారు. చదువుకున్నవాడివి నీకు యిదేం లాజిక్? అని అడిగితే 'నా యిష్టం' అనేవాడు. మా కజిన్ కాలేజీలో 'బండి యెనక బండి కట్టి..' పాట అద్భుతంగా పాడినందుకు ఒకతనికి ఓట్లు గుద్దేశారు. గెలిచేవాడికే ఓటేయాలనే సిద్ధాంతం చాలామందికి వుంటుంది. 'మనకు బాగా తెలిసున్నవాళ్లకు తెలుసు, రేపేదైనా అవసరం పడితే పలుకుతాడు' అని యింకా బోల్డుమందికి లెక్క వుంటుంది. ఇలాటి క్లిష్టమైన మ్యాట్రిక్స్లో ఒక కులం ఓట్లన్నీ ఒకరికే ఎలా పడతాయి? చదువుకోనివారిలో, సామాజికంగా నిమ్నకులాలలో కట్టు వుండవచ్చు. కానీ చదువు పెరిగినకొద్దీ, వ్యక్తిగత అభిప్రాయాలు ఏర్పరచుకున్న కొద్దీ యింకోడు చెప్పినవాడికి నేనెందుకు వేయాలి? అనే పౌరుషం వుంటుంది. తండ్రి మాట ఏ విషయంలోనూ వినని పిల్లలు యీ విషయంలో మాత్రం వింటారా? తండ్రిదీ, పిల్లలదీ ఒకే కులం అయినా వేర్వేరు పార్టీలకు ఓటేయవచ్చు కదా!
కులం, మతం ఏమీ లేదు, మా మంత్రం అభివృద్ధి మాత్రమే అంటూన్న నాయకులే మళ్లీ యీ కులాల వారీ పదవులు ప్రకటిస్తారు. కాంగ్రెసు హయాంలో డిప్యూటీ సిఎంలు వున్నారు కానీ టిడిపిలో ఎప్పుడూ లేరు. తను కో-పైలట్ అని నాదెండ్ల భాస్కరరావు చెప్పుకున్నందుకే ఎన్టీయార్‌కు చచ్చేటంత కోపం వచ్చింది. టిడిపిలో అధినాయకుడి మాటే ఫైనల్. వేరే అధికారకేంద్రం సహించరు. నందమూరి వంశస్తులు కాబినెట్‌లోకి వస్తే ఆ ప్రమాదం వుందని గ్రహించే బాబు హరికృష్ణను త్వరలోనే తప్పించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి కూడా త్వరలోనే ఉద్వాసన పలికారు. పార్టీ అధ్యక్షపదవి, ముఖ్యమంత్రి కూడా ఒకరే వుండే సంప్రదాయం టిడిపిది. ఇటువంటి గతం వున్న బాబు యిప్పుడు ఒకరు కారు, యిద్దరు డిప్యూటీ సిఎంలు భరిస్తారంటే వింతగానే వుంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2014)