పైగా కాపులను బిసిలలో చేర్చేందుకు కమిషన్ వేస్తారట. అంటే ఆ కమిషన్ ఏం చెప్పాలో కూడా ముందే చెప్పేశారన్నమాట! కాపుల్ని బిసిల్లో చేర్చడం గురించి థాబ్దాలుగా వింటున్నాను. దీనివలన కాపులు సంతోషిస్తారో లేదో తెలియదు కానీ బిసిలకు ఒళ్లు మండడం ఖాయం. వాళ్ల రిజర్వేషన్లు ఆ మేరకు దెబ్బ తింటాయి కదా. పైగా బిసిల కంటె కాపులకు ఆర్థికంగా, రాజకీయంగా బలవంతులు. రిజర్వేషన్ ఫలితాలను వాళ్లే ఎక్కువగా పొందవచ్చు. అయినా కాపుల్నీ బిసిల్లో చేర్చాక, యిద్దరు బిసి డిప్యూటీ సిఎంలు అవుతారు కదా. అది ఎబ్బెట్టుగా వుండదా? సరే ఇదంతా భవిష్యత్తులో జరగాల్సిన కార్యక్రమం. ప్రస్తుతానికి దీనివలన ఓట్లు రాల్తాయా లేదా అన్నది చూడాలి. ఒక కులస్తులే ఒక పార్టీకి ఓటేస్తారో లేదో అని సందేహించే పరిస్థితి. బిసిల్లో వందకు పైగా కులాలున్నాయి. వాళ్లల్లో వాళ్లకు ఎక్కువతక్కువ ఫీలింగులు వుంటాయని ఎబిసిడి.. అనడంతోనే తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మాత్రం మనమంతా సమానం అనుకుంటూ అందరూ కట్టకట్టుకుని ఒకే పార్టీకి ఓటేస్తారా!? నమ్మశక్యంగా లేదు. తెలంగాణలో కమ్మ ఫ్యాక్టర్ పెద్దగా లేదు కాబట్టి బిసిలకు ప్రాధాన్యత యిచ్చినా నడిచింది. ఆంధ్రలో కమ్మవారి జనాభా ఎక్కువ కదా. అక్కడ వారిని పక్కన పెట్టి బిసిలకు పెద్దపీట వేస్తామంటే సహిస్తారా?
జగన్ మైనారిటీ ఓట్లు ఎదుర్కోవడానికి కాబోలు ఎన్నడూ లేనట్లుగా యీ కులపంచాయితీకి ప్రాధాన్యత పెంచారు. అదే సమయంలో మైనారిటీలు చేజారి పోకుండా చూసుకోవడానికే జగన్ గురించి మైనారిటీలకు బాబు ఫిర్యాదు చేశారు. తన కేసుల రీత్యా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వారికి జగన్ మద్దతు యిస్తారని అందరికీ తెలుసు. ఎటొచ్చీ ఆయన ఆ మాట చెప్పకుండా రాష్ట్రసంక్షేమం కోసం.. అంటున్నాడు. 'మోదీయో, ఎల్లయ్యో ఎవరు వచ్చినా మద్దతు యిచ్చి నిధులు తెస్తా' అంటున్నాడు – మోదీకున్న గ్లామర్ తనకు విఘాతం కలగకుండా చూడడానికి కాబోలు! పార్లమెంటు ఎన్నికలలో ఒక పార్టీకి, అసెంబ్లీ ఎన్నికలలో మరో పార్టీకి వేయడం (క్రాస్ ఓటింగ్ అంటున్నారు) యిటీవల బాగా గమనించాం. 2009 ఎన్నికలలో అసెంబ్లీకి టిడిపికి, పార్లమెంటుకి కాంగ్రెసుకు ఓట్లు వేయడం చేతనే కాంగ్రెస్ ఎంపీలు 33 మంది ఎన్నికయ్యారు. అది మన్‌మోహన్‌కు అప్పుడున్న గ్లామర్. ఆ నిష్పత్తిలో వైయస్‌కు అసెంబ్లీ సీట్లు రాలలేదు. 2014 తెలంగాణ ఎన్నికలలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగిందని అందరూ చెప్తున్నారు. అలా చేయడంలో కొందరు తడబడటం చేత తమ పార్టీకి నష్టం వాటిల్లింది అని కూడా కొందరు చెప్పుకుంటున్నారు.
'మోదీకి ప్రధానిగా చూద్దామనుకుంటే చూడండి, కానీ అసెంబ్లీ వరకు నాకే ఓటేయండి, బాబుకి కాదు' అని చెప్పడానికై జగన్ మోదీని ప్రధాని చేయడానికి నాకు అభ్యంతరం లేదు, రాష్ట్రానికి మేలు చేస్తే చాలు.. అన్నట్లు చెప్పారు. టిడిపి పొత్తు వున్నా బిజెపి జగన్ మద్దతును కాదనదు కూడా. ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యర్థులైన ఎస్పీ, బియస్పీ యిద్దరూ యుపిఏకు మద్దతు యిచ్చిన సందర్భాలున్నాయి. మోదీ కోసం బాబుకు ఓట్లేయనక్కరలేదని జగన్ తాత్పర్యం. బాబు దాన్ని తప్పు పట్టారు. మైనారిటీల్లారా, బిజెపి మతతత్వ పార్టీ అంటూ వచ్చిన జగన్ దాన్ని మద్దతుకు అర్హమైనదిగా ఎలా భావిస్తున్నారు? అని గుర్తు చేయబోయారు, తను ఏకంగా పొత్తు పెట్టుకున్న విషయాన్ని విస్మరించారు. తమాషా ఏమిటంటే అందరికీ మైనారిటీల ఓట్లూ కావాలి, మోదీ గ్లామర్‌ను ఎన్‌క్యాష్ చేసుకోవడమూ కావాలి.
ఇంతకీ మోదీకి ఆంధ్రలో గ్లామరుందా? సభల్లో పవన్ లేకుండా వట్టి మోదీ, బాబులే మాట్లాడితే జనం ఎలా వచ్చేవారో మరి. మోదీ హిందీ ఉపన్యాసం తెలుగు ప్రజలకు ఎక్కిందా? వెంకయ్య నాయుడు అనువాదం బాగానే వుంది కానీ, ఆయన స్వంతంగా మాట్లాడితే వాడే చమత్కారం అనువాదాల్లో ఉపయోగించలేడు కదా. మోదీ గుజరాత్‌లో రేగిస్తాన్ కచ్ గురించి మాట్లాడితే మనవాళ్లు కనక్ట్ అయ్యారా? స్థానిక సమస్యల గురించి ఆయన పెద్దగా మాట్లాడలేదు. గుజరాత్ రండి, మా గొప్ప చూడండి, మీరూ నేర్చుకోండి అనే ధోరణే సాగింది. ఇక పవన్‌కు అభిమానుల కేరింతలు బాగానే వచ్చాయి. అతని మాటల్లో నిజాయితీ లేకపోవడం బయటవాళ్లకు కనబడుతోంది. మోదీ వలన తెలంగాణ వచ్చిందని యిక్కడ చెప్పి, వైయస్ అక్రమాల వలన వచ్చిందని అక్కడ చెపితే ఎలా? విభజన నిర్ణయం తప్పో రైటో యిప్పటిదాకా పవన్ తేల్చలేదు. తనే గందరగోళంలో వున్నట్టు కనబడుతున్నాడు. తెలంగాణలో కాంగ్రెసును, తెరాసను తిట్టాడు. ఆంధ్రకు వచ్చేసరికి తెరాస లేదు కానీ, కాంగ్రెసు వుంది కదా, దాన్ని తిట్టడం అనవసరం అనుకున్నాడు. టిడిపి-బిజెపి కూటమికి ప్రధాన ప్రత్యర్థి జగన్ కాబట్టి జగన్నే తిట్టాడు. గతంలో తను టిడిపిని పెద్దగా ఏమీ అనలేదని చెప్పుకుంటున్నాడు కానీ శుబ్భరంగా తిట్టాడని. ప్రత్యర్థుల పట్ల చిరంజీవి తన ప్రసంగాల్లో పాటించిన మర్యాద పవన్ పాటించలేదని మనందరికీ గుర్తుంది. టిడిపి అంత గొప్ప పార్టీయే అయితే 2009 ఎన్నికలలో ప్రజారాజ్యానికి మద్దతు యిచ్చేబదులు టిడిపికే యివ్వలేకపోయాడా!?
డైలాగులకు చప్పట్లు పడినంత మాత్రాన ఓట్లు పడవని 2009 జూనియర్ ఎన్నికల సభల్లోనే తేలిపోయింది. చిరంజీవి కూడా అదరగొడతారని, కాపుల ఓట్లు కొల్లగొడతాడనీ అన్నారు. పార్టీ పెట్టడానికి ఏడాది ముందు నుండీ హంగు చేశారు. చాలామంది మేధావులు ఆయన పార్టీలో చేరారు. పార్టీ పెట్టిన కొన్ని నెలలకు ఎన్నికలు వచ్చాయి. అంతటి మెగాస్టార్ సైతం ఏ మేరకు ప్రభావం చూపించారో కళ్లారా చూశాం. ఇప్పుడీ పవన్ – చిరంజీవంతటి స్టార్ కాదు, జనసేన పార్టీకై ప్రజలను సన్నిద్ధం చేయలేదు, వెంట ఎవరూ మేధావులు, ఆలోచనాపరులు లేరు. ఒంటికాయ సొంటికొమ్ములా తిరుగుతున్నారు. స్పష్టమైన విధానాలు ప్రకటించలేదు. తననెప్పుడూ కాపుగా చూపించుకోలేదు, కాపులకంటూ ప్రత్యేకంగా చేసినది లేదు. టిక్కెట్టు కొనుక్కుని వస్తేనే కాపునైనా, మరొకరినైనా అలరించాడు. కొనకపోతే కాపులకోసం బెనిఫిట్ షోలు ఆర్గనైజ్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో పవన్ వచ్చి చెపితే కాపులందరూ టిడిపి-బిజెపి కూటమికి ఓట్లేసేస్తారని ఎలా అనుకోగలం? యువతలో ఆయనకు ఫాలోయింగ్ వుంది కాబట్టి యువకులను కొంతమేరకు ప్రభావితం చేయగలడు అని అనుకోవచ్చు. అంతకు మించి చెప్పడం అతిశయోక్తియే. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2014)