ఎమ్బీయస్‌ : ఆంధ్రలో బలాబలాలు – 4

ఒక వివరణ – రెండో భాగంలో రెడ్ల ప్రస్తావన తెచ్చి ఆ వెంటనే రఘువీరారెడ్డిని అధ్యకక్షుడిగా పెట్టి కాంగ్రెస్‌ ఏమైనా బావుకుందా అని రాయడంతో ఆయన రెడ్డి అని నేను అనుకున్నట్టు అర్థం వచ్చింది.…

ఒక వివరణ – రెండో భాగంలో రెడ్ల ప్రస్తావన తెచ్చి ఆ వెంటనే రఘువీరారెడ్డిని అధ్యకక్షుడిగా పెట్టి కాంగ్రెస్‌ ఏమైనా బావుకుందా అని రాయడంతో ఆయన రెడ్డి అని నేను అనుకున్నట్టు అర్థం వచ్చింది. ఆయన బిసి అని నాకు తెలుసు. ఇరుప్రాంతాల్లో బిసిలకు అధ్యక్షపదవి కట్టబెట్టి కాంగ్రెస్‌ ఏమీ బావుకోలేదని నా భావం.

తెలంగాణలో కంటె ఆంధ్రలో పోరు రసవత్తరంగా సాగుతున్నట్టు కనబడుతోంది. ధనప్రవాహం ఒకటే కాదు, హైదరాబాదు నుండి వెళ్లి మరీ ఓట్లు వేస్తున్నారట చాలామంది. అక్కడ ఓటు వేయడానికి యిక్కడి ఓటు దాచుకున్నారట. హైదరాబాదు ఓటింగు శాతం తగ్గడానికి యిది ఒక కారణం కావచ్చు. వీళ్లు వెళ్లి ఎవరికి ఓటేస్తారు? విభజనచేసి తమ బతుకులను అయోమయం చేసిన పార్టీలపై కసి తీర్చుకుంటారా? అలా అయితే వాళ్లు నోటాకు వేయాలి లేదా కిరణ్‌ సమైక్యపార్టీకే ఓటేయాలి. వేస్తారా? ఈ ఎన్నికలలో తక్కిన పార్టీలన్నీ భవిష్యత్తులో అది చేస్తాం యిది చేస్తాం అని ఉత్తుత్తి హామీలు గుప్పిస్తున్నారు. వర్తమానం, సమీప భవిష్యత్తు ఎంత ఘోరంగా వుందో కిరణ్‌ ఒక్కరే చెపుతున్నారు. విభజన వలన తెలంగాణకు కూడా నష్టమే అని ఆయన చేసిన వాదనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన పార్టీ అభ్యర్థి మా నియోజకవర్గంలో వుండి వుంటే నేను ఓటేసేవాణ్ని. లేకపోవడం చేతనే నోటాకు వేశాను. 'సమైక్యవాదం కోర్టులో కూడా వీగిపోయింది. అది గతజల సేతుబంధనం' అని అనుకోవచ్చు. కోర్టు కేసు కాదు, కలిసి వుండాలనే స్పిరిట్‌ ముఖ్యం. రెండు రాష్ట్రాలు ఒకరితో మరొకరు సహకరించుకుంటూ కాన్ఫెడరేషన్‌లా వుండాలి. అది లేకపోతే ఎన్నో గొడవలు జరుగుతాయి. కెసియార్‌ సిఎం అవుతాడంటున్నారు. తన వైఫల్యాలన్నిటికీ ఆంధ్రులనే బాధ్యులను చేస్తాడాయన. దీనికి అక్కడ ప్రతిక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా తెలంగాణలో వున్న ఆంధ్రుల గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇటీవల వచ్చిన గణాంకాలు చూస్తే వేలమంది తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థులు ఆంధ్రలో వున్నారని తెలుస్తోంది. మామూలు పౌరులు కూడా చాలామంది వుండవచ్చు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు గ్రామస్థాయి నుండి ఆంధ్రమూలాలున్న ఉద్యోగులు వెళ్లిపోవాలని పట్టుబడుతున్నారు. టి-బిల్లు రాష్ట్రస్థాయి ఉద్యోగుల గురించే చెపుతోందని కేంద్ర కమిటీ అంటోంది. అడుగడుగునా పేచీలు వస్తాయి.

హైదరాబాదు ఆదాయంలో వాటా యివ్వలేదు కాబట్టి ఆంధ్ర పరిస్థితి దయనీయంగా వుంటుంది. అన్నీ గాలిబుడగల్లాటి వాగ్దానాలే. ఏదీ అమలు చేయలేరు. రుణాల మాఫీ అన్నది అర్థం లేని మాట. అంటే రుణం పుచ్చుకోనివాడు, సక్రమంగా చెల్లించినవాడు వెర్రివాడన్నమాట. ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుంది. ఎవడూ అప్పు తీర్చడు. తీర్చడేమోనన్న సందేహంతో అప్పు యిచ్చేవాడు యివ్వడు. ఎలాగైనా అధికారంలోకి రావాలని వీళ్లు హామీలు యిస్తున్నారు. అవి తీరనిరోజున సమాజంలో అశాంతి తప్పదు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని ఎవరూ చెప్పలేకుండా వున్నారు. కేంద్రమే అస్తవ్యస్తంగా వుంటే ఆంధ్ర నిరుద్యోగులను ఆదుకునేవారెవరు? కంటికి ఎదురుగా ఉపాధి అవకాశాలతో హైదరాబాదు కనబడుతోంది. ఇక అక్కడకు వచ్చి జబర్దస్తీ చేయడమో, లేక అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడమో జరుగుతుంది. విభజించేయండి అంటూ హడావుడి చేసినవారెవరూ యివన్నీ కక్షుణ్ణంగా పరిశీలించలేదు. ఎన్నో గొడవల్ని అపరిష్కృతంగా వదిలేశారు. ఈ నేరంలో పాలు పంచుకున్నవారందరినీ శిక్షించకుండా వదిలేయకూడదనే నా భావన. వదిలేస్తే 'వీళ్లను ఏం చేసినా ఫర్వాలేదు, ఏవో నిధులు విదిలిస్తామని హామీలు చూపితే చాలు తోక వూపుకుంటూ ఓట్లేస్తారు' అనే అభిప్రాయానికి వచ్చేస్తారు.  రేపు యింకో రాష్ట్రాన్ని యిదే పద్ధతిలో చీలుస్తారు. తెలుగువారందరూ తమ కసిని ఓట్ల ద్వారా చూపలేకపోతే నోటా ద్వారానైనా చూపాలని నా ఆశ. కిరణ్‌ సమైక్యపార్టీ వీటన్నిటి గురించి మాట్లాడుతోంది. కానీ కిరణ్‌ నాయకత్వంపై తక్కిన నాయకులెవరికీ నమ్మకం లేకపోవడం వలన దానికి ఆదరణ లేకుండా పోయింది. ప్రజలైనా ఆదరిస్తారని మీడియా చెప్పడం లేదు.

కానీ కిరణ్‌ పార్టీ కొన్నయినా ఓట్లను తప్పక చీలుస్తుందని నా అభిప్రాయం. అలాగే కాంగ్రెసు కూడా. టిడిపి, వైకాపా అభిమానులు ఎదుటి పార్టీకి బలం వుందని అంగీకరిస్తూనే తమ పార్టీకి 100కు పైగా వస్తాయని, ఎదుటివాళ్లకు 60 చిల్లర వస్తాయని అంటున్నారు. అంటే కాంగ్రెస్‌, జెయస్పీ, లెఫ్ట్‌, బిజెపి, యిండిపెండెంట్స్‌, రెబెల్స్‌ వీళ్లందరికీ కలిపి పదిలోపే వస్తాయా? అది తర్కబద్ధంగా లేదు. నా దృష్టిలో వాటన్నిటికి 15-20 సీట్లు తప్పకుండా పోతాయనుకుంటున్నాను. తక్కిన 155-160 సీట్లు వైకాపా, టిడిపిలు పంచుకోవాలి. ఒకరికి 100 వస్తే తక్కినవాళ్లకు 55-60. 90-95 వస్తే 65-70. మరి ఏ పార్టీకి ఛాన్సుంది? ప్రాంతీయాభిమానం బట్టి చెప్పాలంటే బాబు, జగన్‌ యిద్దరూ రాయలసీమ వారే. కానీ రాయలసీమ గురించి జగన్‌ మాట్లాడినంతగా బాబు మాట్లాడరు. రాజధాని సీమకు, కోస్తాకు మధ్య పెడతానని, పేరులో రెండు పేర్లు కలిసి వచ్చేట్లు పెడతాననీ జగన్‌ బహిరంగంగా అనేశారు. బాబు మరో సింగపూర్‌ అంటారు కానీ అది ఎక్కడ కడతారో చెప్పరు. ఎందుకంటే జగన్‌లా రాయలసీమను ఫేవర్‌ చేస్తూ మాట్లాడితే ఆయనకు పట్టు బాగా వున్న విజయవాడ-గుంటూరు బెల్టు ఆగ్రహిస్తుందేమోనని భయం. 1953లోనే తమకు రాజధాని వచ్చి వుండాల్సిందని, యిప్పుడు వచ్చి తీరాలని ఆ ప్రాంతవాసులకు స్ట్రాంగ్‌ ఫీలింగు వుంది. గుంటూరుకు హైకోర్టు యిచ్చి సరిపెట్టి, రాయలసీమవైపుకి రాజధాని యిస్తారేమోనన్న భయమూ వుంది. ఇది గ్రహించిన బాబు యిక్కడ కూడా రెండు కళ్ల సిద్ధాంతం అమలు చేసి, మౌనం పాటిస్తున్నారు. లౌక్యం అన్ని చోట్లా పనికి రాదు.

పైగా బాబు కంటె వైయస్సే రాయలసీమ గురించి ఎక్కువ మాట్లాడుతూ వచ్చారు. బాబు చిత్తూరుకి చేసినదాని కంటె, వైయస్‌ కడపకు చేసినది చాలా ఎక్కువ. అందువలన రాయలసీమ వాసులు బాబు కంటె జగన్‌నే ఎక్కువ ఆదరిస్తారని అనిపిస్తోంది. రాయలసీమలో జగన్‌కు వున్న ఎడ్జ్‌ కోస్తాలో బాబుకి వుందా లేదా అన్నది చూడాలి. వైజాగ్‌లో విజయమ్మను నిలబెట్టి జగన్‌ ఉత్తరాంధ్రలో వైకాపా కార్యకర్తలకు ఉత్సాహం తెచ్చిపెట్టారు. ఆమెకు దీటుగా ఏ పురంధరేశ్వరో నిలబడితే పోటీ రంజుగా వుండేది. కానీ బిజెపి తరఫున హరిబాబు వంటి వీక్‌ కాండిడేట్‌ను నిలబెట్టారు. 2009 ఎన్నికలలోనే ఉత్తరాంధ్ర టిడిపి చేజారింది. వైయస్‌ను ఆదరించింది. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా కూడా..! ఇప్పుడు అదే అభిమానం జగన్‌పై చూపితే వైకాపాకు లాభమే. టిడిపి కాంగ్రెస్‌ నుండి ఫిరాయింపుదారులను తెచ్చుకుని, బిజెపితో పొత్తు పెట్టుకుని, తన అవకాశాలను దెబ్బ తీసుకుందనే నా అనుమానం. ఇలా లెక్కవేసి చూస్తే వైకాపాకు 100 సీట్లు వస్తాయని అనిపిస్తుంది.

కానీ యిక్కడో ఫ్యాక్టర్‌ వుంది. వైకాపా అనిల్‌ ద్వారా మతమార్పిళ్లు బాగా చేయించి, క్రైస్తవులను తన ఓటుబ్యాంకుగా చేసుకుంటోందని, పాస్టర్లను చేరదీస్తోందని, వాళ్లను రాజకీయాల లబ్ధికి ఉపయోగించుకుంటోందని ప్రజలు నమ్ముతున్నారు. జగన్‌ తిరుపతి గుడిలో సంతకం పెట్టడానికి తిరస్కరించడం వంటివి దానికి తోడయ్యాయి. ఆయన క్రైస్తవుడని జగానికంతా తెలుసు. అయినా గుడికి వచ్చాడంటే సంతోషమే. అక్కడ సంతకం పెట్టడం నియమం, మర్యాద, ధర్మం. పెట్టనని మొరాయించడం గుడి నియమాల పట్ల నిరాదరణ, హిందువులను బాధించే చర్య. ఈ క్రైస్తవ పునరుత్థానానికి అడ్డుకట్ట వేయకపోతే హిందూమతం ప్రమాదంలో పడుతుందని హిందూ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. వాటికి బిజెపి, మోదీ తోడయ్యారు. హిందువుల్లో, మధ్యతరగతి ప్రజల్లో యీ భావం రగిలితే మాత్రం జగన్‌ వ్యతిరేక ఓట్లు పెరుగుతాయి. అంతేకాదు, పవన్‌ బాగా హైలైట్‌ చేయడం వలన కెసియార్‌తో జగన్‌ కుమ్మక్కయ్యాడని కూడా జనాలు నమ్ముతున్నారు. తమ పట్ల విషం చిమ్ముతున్న కెసియార్‌ను పన్నెత్తి ఒక్క మాట పలకని జగన్‌ పట్ల ఆంధ్రులు అంత ఉదారంగా వుండకపోవచ్చు. ఈ కారణాల చేత వైకాపా ఏ 90 దగ్గరో అటూయిటూగా ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. మోదీ మ్యాజిక్‌ నిజంగా పనిచేసి మధ్యతరగతి ప్రజలు బిజెపి-టిడిపికి యిబ్బడిముబ్బడిగా ఓట్లు వేస్తే మాత్రం యీ అంకెలు టిడిపికి వస్తాయి! కానీ బాబు చేసిన పొరబాట్ల వలన, తెలంగాణ కాంగ్రెస్‌ తరహాలో టిడిపికి వెన్నుపోట్లు తగిలి యీ అంకె చేరకపోవడానికే ఛాన్సుంది. (సమాప్తం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2014)