అనగనగా షెందరబాబు లాంటి మగానుబావుడు మల్లీ మల్లీ మనకు దొరకతాడా ఏటీ? ఆయనెంత మగానుబావుడంటే.. మనగురించి ఎంత గనంగా పట్టించుకుంతన్నాడూ… ఎవులైనా గమనిత్తన్నారా లేదా?
రూపాయికీ పావలాకీ సారాయికీ క్వార్టరు బాటిలుకీ కక్కుర్తి పడి ఓట్లేసే మనబోటి ఎదవలకి ఈ షెందరబాబు దేవుళ్లాటోడు గాదా ఏటీ? అదేంటదీ.. దేవతల్దగ్గర చెట్టులాగుంటాదీ.. కోరిందెల్లా ఇచ్చేత్తంటాదీ.. అద్దద్దే.. కలపతరువు లాంటోడు గాదా ఏటీ..! ఇప్పుడిట్టా.. ఎలచ్చన్లొచ్చినాయా.. ఓరి బాబులూ… మీకందరికీ పుక్కడ్‌గా సారాయి తాపిస్తాం రండ్రా అంటూ ఓట్లేయించుకునే నాయకులందరూ మన సుట్టూ గిరికీలు కొట్టీస్తున్నారు గాదా ఏటీ…? మరైతే వోళ్లు అంతగా మన కాళ్లు పట్టీసుకుని బతిమాల్తాంటే.. మనం ఒప్పీసుకోవాలా వొద్దా..? మడిసి మడిసికీ వోడి వోడి బ్రాండు సారాయి తెచ్చి తాపించాలంటే ఈళ్ల వల్లవదు గానీ.. ఆళ్లిచ్చిన బ్రాండే మనం పుచ్చీసుకోవాలా? అయితే మాత్రం.. షెందరబాబు.. సారా తాపిచ్చడంలో నెంబర్ వన్ను పొజీషన్లో ఉన్న మగానుబావుడు.. ఆ సామికి షెయ్యెత్తి మొక్కాల.
ఎందుకంటావేటీ.. ఆల్ల మామ సారాయిన్నషేధించీసి పోతే.. మనోడొచ్చి.. ఎంచక్కా మళ్లీ సారాయి అంగళ్లు తెరిపించినాడా లేదా? యిప్పుడు మాత్తరం ఈ ఎన్నికల సంగపోల్లు.. దొరికినన్ని పట్టుకుంటా ఉంటే.. అందరి కంటె జాస్తిగా దొరికిపోయిన సీసాలు షెందరబాబువే కాదా ఏటీ?
మరోకందుగ్గూడా షెందరబాబుకు మొక్కాల. ఆ జగన్ బాబు పార్టీవోళ్లు పోయించిన సారాలో కలితీ ఉండాదీ.. దాన్ని తాగొద్దూ అని బాబు మన ఆరోగ్యేలు గమనించుకోని ఎచ్చరిస్తన్నాడు గాదేటీ. అంతటితో మనల్ని వొదిలీసినాడా.. ఎన్నికల సంగమోల్ల భన్వరయ్య దగ్గరకు బొయ్యి.. ఆ జగన్ పార్టీ వోళ్లు కలితీ సారా పోస్తన్నారూ.. జనం అది తాగకుండా జూడండీ అని కూడా రిక్వెష్టు జేసినాడంట గాదేటీ? నామట్టుకేమో… పన్లో పనిగా.. మేం నికార్సయిన సారా బోయిస్తామూ.. మా సారానే తాగాల్సిందిగా సిఫరాసు జెయ్యండి సారూ అని గూడా అడిగే ఉంటాడని నాకు బలె అనుమానంగా ఉండాది. మరి ఇంతలేసి జాగర్తలు మనకోసం తీసుకుంటా ఉంటే.. మన సారా కోసం , మంచి సారా మనకు పోయించడం కోసం ఆయన అంతగా పాటుపడతా ఉంటే.. మనం మరిసిపోతే ఎట్టా? అప్పుజేసైనా సరే నిప్పులాంటి సారా దాగాలంటారు గదా.. మరి మనకు నిప్పులాంటి సారా తాపించాలనుకుంటున్న షెందరబాబును మరిసిపోతే ఎట్టా?
ఏటంటారు షెందరబాబూ గోరూ.. మీరు మా దేవుడు.. మిమ్మల్ని మరిసిపోతామా ఎట్టా? మీరు నిప్పులాంటి సారా ఇప్పించినారు.. మాకు సిగదాకా నిషా ఎక్కినాది.. అయినా సరే.. మిమ్ముల్ని మాత్తరం మరవం.. మీ పార్టీ గురుతు ఫ్యాను బొమ్మే గదా.. కచ్చితంగా గుద్దుతాం.. యింక సెలవా మరి!!
– కపిలముని