బాహుబలిలో కథ చాల్లేదని నేను రాసిన దానిపై కొందరు ప్రేక్షకులు విరుచుకుపడ్డారు. వ్యాసం నచ్చినవారికి నమోవాకాలు చెపుతూ, ఆ విమర్శలకు నా సమాధానం యిస్తున్నాను. ముందుగా కొన్ని సందేహాలను నివృత్తి చేస్తున్నాను. ఆంధ్రలో కొన్ని ప్రాంతాల్లో నిషేధించబడుతూన్న ఎన్‌టివి వారు నా వ్యాసంలోని భావాన్ని ఉపయోగించుకుంటూ ఆదివారం సాయంత్రం ఒక కార్యక్రమం చేశారనీ, దీనిలో ఏదో గూడుపుఠాణీ వుందని కొందరు అభిప్రాయపడ్డారు. ఎన్‌టివితో నాకు ఏ సంబంధమూ లేదు. సమాచారం నచ్చితే ఎవరైనా వాడుకుంటారు. కొన్ని పదబంధాలు కూడా. ఆ మధ్య 'ఆపసోపాంధ్ర' అని కాప్షన్ పెడితే అది కూడా వాళ్లు వాడుకున్నారు. 'ఎన్టీయార్‌కు నైతిక విలువలు లేవు' అంటూ చంద్రబాబు ఇండియా టుడేకు యిచ్చిన యింటర్వ్యూను నేను స్కాన్ చేసి నా కాలమ్‌లో పెడితే, యిటీవలి కాలంలో బాబు ఎన్టీయార్ పేరు చెప్పుకుని ఓట్లడగడాన్ని విమర్శిస్తూ వైసిపి నాయకులు ఆ సమాచారాన్ని వాడుకున్నారు. నేను కూడా నాకు ఉపయోగపడే సమాచారాన్ని వేరే చోట నుండి తీసుకుంటాను కదా. అంతమాత్రం చేత దీనిలో కుట్ర కోణం వుందనకూడదు. గ్రేట్ ఆంధ్రలో సినిమా సమీక్షలకు, నాకు ముడిపెట్టి కొందరు రాశారు. వాటికి, నాకు ఏ సంబంధమూ లేదు. ఒకాయన నేను రివ్యూ ద్వారా 20% విషమూ, యీ వ్యాసం ద్వారా 80% విషమూ కక్కానని రాశారు. రివ్యూ చేసినది గణేశ్ రావూరి అనే ఆయన. పాఠకుడు గమనించాలి. తమిళుల ఉచ్చారణ గురించి ఒకాయన అడిగారు. పదం మొదట్లో వచ్చిన పరుషం (క,చ,ట,త,ప) అలాగే వుంటుంది. ఉదాహరణ – కరుణానిధి. మధ్యలో వచ్చిన పరుషం సరళంగా (గ,జ,డ,ద,బ) పలికేస్తారు. ఉదాహరణ – మరకదమణి. దీనికి వ్యాకరణసూత్రం ఏమీ లేదు. తెలుగులో అలా మారడానికి ముందు పదం దృతం (న్‌తో అంతమయ్యే పదం) అయి వుండాలి.
నేను పైరేటెడ్ సిడి చూసి రాసి వుంటానని ఒకాయన వూహించేశారు. నేను పైరేటెడ్ సిడిలు చూడను. అది అధర్మం అని నా భావన. కొన్ని సినిమాలు హాల్లో చూద్దామనుకుంటూండగానే వెళ్లిపోతాయి. వాటి విషయంలో కూడా అఫీషియల్‌గా సిడిలు వచ్చేవరకూ వెయిట్ చేస్తాను తప్ప పైరేటెడ్ చూడను. అది సినిమా పరిశ్రమను దెబ్బ తీయడమే అని నేను నమ్ముతాను. ఈ సినిమా విషయంలో ప్రభుత్వం రెండు వారాల వరకు పైరెటెడ్ సిడీ మార్కెట్లోకి రాకుండా కాపు కాసిందని విన్నాను. అన్ని సినిమాలకూ అదే చేసి, ప్రభుత్వాదాయాన్ని పెంచాలని నా ఆశ. పైరసీని అరికడుతూనే టిక్కెట్ల బ్లాక్‌మార్కెటింగును ఉపేక్షించిందని విన్నాను. అది నిజమైతే ప్రజలకు ద్రోహం చేసినట్లే. ఎందుకంటే ప్రేక్షకుడు యిచ్చిన డబ్బుపై ప్రభుత్వానికి పన్ను వస్తుంది. అది వదులుకోవడం, బ్లాక్ మనీని ప్రోత్సహించడం నేరం. ఏ సినిమా ఐనా సాధ్యమైనంతవరకు థియేటర్లో చూడాలనే నా కోరిక. ఎందుకంటే సినిమా తీసినతను పెద్ద స్క్రీన్‌మీద చూసేందుకు అనువుగానే ప్లాన్ చేసి తీస్తాడు. టీవీ సీరియల్ తీసినతను టీవీ స్క్రీన్‌పై చూడాలని కోరుకుంటాడు. అలా చూస్తేనే అందం. మొబైల్‌లో సినిమా చూసేసి, చూసేశా అనుకోవడం సినీస్రష్టను అవమానించినట్లే. అలాగే సినిమా పాటలు ముందుగా రిలీజైనా వినను. వాటిని దృశ్యంతో కలిపి చూడమనే దర్శకుడి భావం. మొదటిసారి అలాగే చూడాలి. విడిగా వినేసి, దృశ్యాన్ని మనం ఏదేదో వూహించేసుకుని, తెరమీద అలా కనబడకపోతే నిరాశపడి… ఎందుకొచ్చిన రొష్టు! నాకు సినిమాలు చూడడం రాదని కొందరు తీర్మానించారు. వేలాది సినిమాలు చూసినా, యిప్పటికీ చూస్తున్నా, సినిమాల గురించి రాసినా, నందీ ఎవార్డు తెచ్చుకునే స్థాయిలో వాటిపై పరిశోధనాత్మక ఫీచర్ చేసినా యింకా చూడడం రాకపోవడం జాలిపడాల్సిన విషయమే. కానీ ప్రేక్షకుల్లో నాలాటి వర్గం కూడా ఒకటి వుంటుందని దర్శకులు గమనించి సినిమాలు తీస్తే మంచిది. 'నా బోటి నిశానీ గాళ్లకోసం సినిమా తీస్తున్నా' అని కెవి రెడ్డిగారు చెప్పుకునే వారట. అలాగ కథకోసం వెతికే నా బోటి సన్నాసులు యింకా వున్నారని సినీజనాలు గుర్తించాలి.
నా బోటి సన్నాసులు సినిమా పుట్టినప్పటినుంచీ వున్నారు. మొదట్లో కదిలే బొమ్మలు చూపిస్తే చాలనుకున్నారు నిర్మాతలు. రైలు స్టేషన్‌లోకి రావడం, సముద్రం పొంగడం యిలాటి దృశ్యాలు హ్రస్వచిత్రాలుగా తీసి చూపేవారు. కొత్త మోజు కొద్దిరోజుల్లోనే తీరిపోయింది జనాలకు. కథేదీ? అని అడగసాగారు. ఇదొకటా అనుకుని అప్పుడు కథలు అల్లసాగారు – చిన్నదో, పెద్దదో ఏదో ఒకటి. చాప్లిన్ తీసిన మూకీ హ్రస్వచిత్రాలు చూడండి. పార్కుకి రావడం, అక్కడేదో సంఘటన జరగడం యిలాటివి చూపించేవారు. తర్వాత తర్వాత పూర్తికథతో పెద్దనిడివి సినిమాలు తీశారు. నిజానికి తోలుబొమ్మలాటలో కూడా కథ వుంటుంది. బొమ్మలు మాట్లాడలేవు కాబట్టి, వెనక్కాల నుంచి కథ చెప్తారు. ఆ బొమ్మ వేసుకున్న రంగురంగు దుస్తులు చూసి, తాళ్లు కనబడకుండా మాయ చేసిన టెక్నాలజీ చూసి సరిపెట్టుకో అనలేదు. అమ్మాయి బాగుంది అనాలంటే మొహం, ఫీచర్స్ బాగుండాలి. ఆమె వేలి వుంగరం బాగుంది, కాళ్ల గజ్జెలు బాగున్నాయి అన్నారంటే మొహం నామొహంలా వుందన్నమాట! ''రాజేశ్వరీ కాఫీవిలాస్ క్లబ్'' షూటింగప్పుడు అసిస్టెంటు డైరక్టరు మురారి మెట్ల మీద తిరగబడిన ఒక మువ్వను సరిచేయబోతే చక్రపాణి అన్నారట – ''ప్రేక్షకుడు మెట్లు దిగి వస్తూన్న హీరోను కాకుండా ఆ మువ్వను పట్టించుకున్నాడంటే యిక సినిమా ఆడినట్లే..'' అని. ప్రేక్షకుడు కథలో లీనం అయినప్పుడు మెట్లమీద ఏ రంగు కార్పెట్ వేశారు, ఎలాటి మువ్వలు పెట్టారు అని చూడడు. లీనం కాలేనప్పుడే యివన్నీ నోటీసులోకి వస్తాయి. బాహుబలిలో వాటర్ ఫాల్స్ బాగున్నాయి, యుద్ధం సీన్లు బాగున్నాయి అని చెప్పుకోవడంలోనే సినిమా అసమగ్రత బయటపడుతోంది. సినిమా ఎలా వుంది అని అడిగితే బ్రహ్మాండంగా వుంది అనకుండా విజువల్స్ బాగున్నాయి అని క్వాలిఫై చేస్తున్నారు. అక్కడే లోపం తెలుస్తోంది.
తక్కిన హంగులపై దృష్టి ఎక్కువ పెట్టి కథను నిర్లక్ష్యం చేయడంపై రమణగారు ''గిరీశం లెక్చర్లు''లో వెటకరించారు. – ''వాటీజినే సినిమాస్టోరీ! కథంటూవుంటే అడ్డమైనవాడూ దాన్ని దుయ్యబెడతాడు. అంచేత మనకొద్దు…. జనం పాటలూ, డాన్సులూ అంటే చెవికోసుకుంటారు. పద్యాలు కూడా తోసేసి రెండు చెవులూ కోసుకోమనండి. ఇన్ని ఉన్నాక ఇంక కథా కాకరకాయ కూడా పెడితే మొహం మొత్తిపోతుంది.'' అని. రాజమౌళి ''బాహుబలి'' విషయంలో యిలాగే ఫీలై వుంటారు. విజువల్స్, సెట్టింగులు పెట్టాక కథ కూడా పెడితే మొహం మొత్తిపోతుందని! కథ, విజువల్ రెండిటికీ తూకం కుదరాలి. ''అనగనగా ఒక ధీరుడు'' సినిమా వాల్ట్ డిస్నీ వాళ్లు తీశారు. కన్నుల పండుగగా వుంది. కానీ కథ చాలక ఆడలేదు. ''కర్ణ'' సినిమా వుంది. ''సీతారామ కళ్యాణం'', ''శ్రీకృష్ణ పాండవీయం'' వంటి ఎన్టీయార్ సొంత సినిమాలతో పోలిస్తే టెక్నిక్కు చాలా నాసిగా వుంది. అయినా స్నేహం సెంటిమెంటు, కులవివక్షత కారణంగా ప్రతిభావంతుడు నష్టపోవడం సెంటిమెంటు పండాయి. డైలాగులు పేలాయి. 25 వారాలు ఆడించారు. దారాలు కనబడ్డాయని చూడడం మానేయలేదు. ఇదంతా 'నీ బోటి పాతకాలం మనుష్యుల గాథ. నేటి ప్రేక్షకులకు కథ అక్కరలేదు, టెక్నాలజీ చాలు' అనేవాళ్లు ''ఐ'', ''కొచ్చాడియన్'' ఎందుకు ఆడలేదో చెప్పాలి. రమణగారి ఫోటో యీ సినిమా మొదట్లో చూపించారు కదా, ఆయన్ని ఓసారి అడిగాను – ''మీ సినిమాలు కొన్ని ఫెయిలయ్యాయి కదా, రిలీజుకు ముందే ఆత్మీయులకు చూపించి తప్పులు దిద్దుకుంటే బాగుండేది కదా'' అని. ''చూపించినా లాభం లేదండీ, కథ ఎలా వుంది, దాన్ని తెరపై ఎలా చెప్పాం అది చూడు చాలు అంటే అది చూడరు. మూడో రీల్లో లైటు గ్లేరు కొట్టిందని, ఎనిమిదో రీలులో సెట్టింగు 'గాడీ'గా వుందని యిలాటి కామెంట్స్ చేస్తారు. అందుకే అడగడం మానేశాం'' అన్నారు. ఆయనా కథ, కథనం నచ్చిందా లేదా అనే వర్రీ అయ్యేవారు.(సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)