ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 18, బ్రేవ్‌హార్ట్‌

''బ్రేవ్‌హార్ట్‌'' సినిమా 1995లో వచ్చింది. స్థూలంగా దాని కథ యిలా సాగుతుంది – 1280లో స్కాట్లండ్‌ రాజు మూడో అలెగ్జాండరు చనిపోయాడు. వారసులు ఎవరూ లేరు. ఇంగ్లండ్‌ రాజు ఎడ్వర్డ్‌ స్కాట్లండ్‌పై దండెత్త దలచి…

''బ్రేవ్‌హార్ట్‌'' సినిమా 1995లో వచ్చింది. స్థూలంగా దాని కథ యిలా సాగుతుంది – 1280లో స్కాట్లండ్‌ రాజు మూడో అలెగ్జాండరు చనిపోయాడు. వారసులు ఎవరూ లేరు. ఇంగ్లండ్‌ రాజు ఎడ్వర్డ్‌ స్కాట్లండ్‌పై దండెత్త దలచి ముందుగా శాంతి చర్చలంటూ స్కాట్‌ సామంతరాజులను ఆహ్వానించాడు. వచ్చిన వారిని మోసంతో ఉరి తీయించాడు. అక్కడకు వాలెస్‌ తన తండ్రి, అన్నలతో వెళ్లాడు. ఆ భీకరదృశ్యం చూసి చలించిపోయాడు. ఆ సంఘటన  తర్వాత స్కాట్‌ యోధులందరూ కలిసి సమావేశమై ఇంగ్లండుపై యుద్ధం చేసి తీరాలని నిశ్చయించారు. దానిలో వాలెస్‌ తండ్రి, అన్న పాల్గొన్నారు. వాలెస్‌ కూడా యుద్ధానికి వస్తానన్నా నువ్వు యింటి వద్దే వుండి పొలాల్ని చూసుకో అని చెప్పి తండ్రి, అన్న యుద్ధానికి వెళ్లారు. వాలెస్‌ స్నేహితుడైన హమీష్‌ తండ్రి క్యాంప్‌బెల్‌ కూడా వారితో వెళ్లాడు. కొన్ని రోజులకు క్యాంప్‌బెల్‌ తిరిగి వచ్చి యుద్ధంలో విలియం వాలెస్‌ తండ్రి, అన్న చనిపోయారని చెప్పాడు. 

తండ్రి అంత్యక్రియల తర్వాత అతని పినతండ్రి ఆర్గీల్‌ అతన్ని యూరోప్‌కు తీసుకెళ్లి కత్తిసాము, విలువిద్య, యితర విద్యాభ్యాసం చేయించాడు. పది సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి తన తండ్రి పొలాలు చూసుకోసాగాడు. తన బాల్యస్నేహితుడు హమీష్‌తో కలిసి తిరగసాగాడు. ఒకనాడు ఒక పెళ్లిలో వింత ఆచారాన్ని గమనించాడు. ఎడ్వర్డ్‌ స్కాట్లండ్‌లో తను నెలకొల్పిన బ్రిటిషు సామంతరాజులకు, జమీందార్లకు అనేక హక్కులు ప్రసాదించాడు. వాటిల్లో తమ పౌరులకు వివాహమైన రాత్రి వారి నవవధువును వీరు అనుభవించే హక్కు ఒకటి. ఆ విధంగా బ్రిటిషు సంతతిని స్కాట్లండ్‌లో పెంచాలని అతని ఐడియా. దీన్ని వాలెస్‌ అసహ్యించుకున్నాడు.

అతను బాల్యస్నేహితురాలు మురాన్‌తో ప్రేమలో పడ్డాడు. బహిరంగంగా పెళ్లాడితే తొలిరాత్రి స్థానిక జమీందారుకి అప్పగించాల్సి వస్తుందన్న భయంతో రహస్యంగా పెళ్లాడాడు. ఎడ్వర్డు కౄరపాలన సాగుతున్నా తను రైతుగా స్థిరపడి తన పనేదో తను చూసుకుందా మనుకున్నాడు. కానీ అతని భార్యను ఇంగ్లీషు సైనికులు బలాత్కరించబోయారు. వాళ్లను తరిమివేశాడు. సైనికులతో గొడవలెందుకని భార్యతో సహా పారిపోదామనుకున్నాడు. కానీ గ్రామాధికారి వాళ్లను బంధించాడు. బహిరంగ విచారణ జరిపి 'రాజు సైనికులపై దాడి చేస్తే రాజుపైనే దాడి చేసినట్లు లెక్క' అని ప్రకటించి శిక్షగా ఆమె కంఠాన్ని ఉత్తరించేశాడు.   ప్రతీకారంతో రగిలిన వాలెస్‌ ఊరి ప్రజలతో కలిసి ఇంగ్లీషు పటాలంపై దాడి చేశాడు. తన భార్యను చంపిన అధికారిని అదే తరహాలో వధించాడు. దీని తర్వాత ప్రజలందరూ తమ మాతృభూమిని ఇంగ్లీషు వారిని తరిమివేసే పని చేపట్టమని వాలెస్‌ను కోరారు. వాలెస్‌ నాయకత్వం వహించవలసి వచ్చింది. అతని విజయాలు రగిలించిన ఉత్సాహంతో సామాన్యప్రజలు దళాలుగా ఏర్పడి ఇంగ్లీషు వారిని ఎదిరించసాగారు. వాలెస్‌ విప్లవం ప్రాచుర్యం పొందిన కొద్దీ అనేకమంది స్కాట్‌లు అతని పక్షాన చేయసాగారు.

వాలెస్‌కు బుద్ధి చెప్పే పని ఎడ్వర్డ్‌ తన కొడుకు, యువరాజు ఐన రెండో ఎడ్వర్డుకి అప్పగించాడు. అయినా అతను వాలెస్‌ను అడ్డుకోలేక పోయాడు. స్టిర్లింగ్‌ వద్ద యుద్ధంలో గెలిచాక వాలెస్‌,  యార్క్‌పై దాడి చేసి ఆ నగరాధిపతియైన రాజు మేనల్లుణ్ని చంపి అతని తల ఖండించి రాజుకి పంపాడు. కుష్ఠు రోగంతో బాధపడే పెద్ద రాబర్ట్‌ ద బ్రూస్‌ (తర్వాతి రోజుల్లో స్కాట్లండ్‌ రాజైన బ్రూస్‌ తండ్రి) తన కొడుకు చిన్న బ్రూస్‌కు స్కాట్లండ్‌ రాజ్యం యిప్పించాలనే కోరికతో ఇంగ్లీషువారికి తను దాసోహమంటూ, కొడుకుపై ఒత్తిడి తెస్తున్నాడు. కానీ అతను వాలెస్‌కు సన్నిహితుడు. 

తన కొడుకు వాలెస్‌ను అరికట్టలేకపోయాడు కాబట్టి అతని కంటె తెలివైనదైన తన కోడలు, ఫ్రెంచ్‌ రాజు కూతురు అయిన ఇసబెల్లాను రంగంలోకి దింపుదామనుకున్నాడు. రాజీ చర్చల పేరుతో ఆమెను వాలెస్‌ వద్దకు పంపాడు. ఆమె గడుసరి కాబట్టి వాలెస్‌ను మాటల్లో గెలవగలదని, ఒకవేళ చర్చలు విఫలమై వాలెస్‌కు కోపం వచ్చి ఆమెను చంపివేస్తే అప్పుడు ఫ్రాన్సు రాజే అతనిపై పగ సాధిస్తాడని లెక్క ప్లాను వేశాడు. తన మాట వింటే ఎడ్వర్డు అతనికి పెట్టెడు బంగారం, సామంతరాజ పదవి, పెద్ద ఎస్టేటు యిస్తానన్నాడని ఇసబెల్లా వాలెస్‌కు ఆఫర్‌ చేసింది. అవేమీ అక్కరలేదన్నాడు వాలెస్‌. ఇసబెల్లా 'నువ్వు పడుతున్న బాధ నాకు తెలుసు. నీ భార్య మరణం గురించి కూడా విన్నాను' అని సానుభూతి కనబరచింది. చర్చలు విఫలమయ్యాయి కాబట్టి ఎడ్వర్డ్‌ పెద్ద సైన్యంతో దండెత్తి రాబోతున్నాడని ఇసబెల్లా చెప్పేసింది.

ఇంగ్లీషు సైన్యాలతో యుద్ధం చేయక తప్పదని వాలెస్‌ స్కాట్‌ జమీందార్లకు నచ్చచెప్పాలని ప్రయత్నించినా వారు వినలేదు. ఓటమి తప్పదని, ఓడిపోయిన తర్వాత పరిస్థితి మరింత హీనమవుతుందని వారి భయం. ఇంగ్లండు నుంచి ముడుతున్న డబ్బుతో హాయిగా సాగిపోతున్న బతుకులు కష్టాలపాలవుతాయని బెదురు వేరే. కానీ చిన్న బ్రూస్‌ మాత్రం ఎటూ తేల్చుకోలేక యిబ్బంది పడుతున్నాడు. ఒకవైపు ప్రజల పట్ల తన బాధ్యత, మరో వైపు రాజు వైపు పోరాడమని తండ్రి ఆజ్ఞ.

ఎడ్వర్డ్‌ భారీ సైన్యంతో వచ్చినపుడు యిద్దరు సామంతరాజులు వాలెస్‌ ఎక్కడున్నాడో రాజుకి చెప్పేశారు. ఎడ్వర్డ్‌ తరఫున మంచి ధనుర్ధారులు వుండడంతో స్కాట్స్‌ ఓడిపోయారు. భంగపడిన వాలెస్‌ మహావేశంతో ఎడ్వర్డుపైకి దూసుకెళ్లాడు. కానీ ఒక అంగరక్షకుడు అడ్డుకున్నాడు. ఇద్దరూ తలపడ్డారు. వాలెస్‌ అంగరక్షకుణ్ని చంపబోతూ శిరస్త్రాణం తొలగించి చూశాడు. అతను వేరెవరో కాదు, చిన్న బ్రూసే! అతన్ని చంపడానికి వాలెస్‌కు చేతులు రాలేదు. చిన్న బ్రూస్‌ కూడా ఆ తర్వాత పశ్చాత్తాపంతో వాలెస్‌ను రక్షించి  ఇంగ్లీషు సైన్యాలకు దూరంగా తీసుకుపోయాడు. 

వాలెస్‌ ఆ తర్వాత ఇంగ్లీషు సైన్యంపై ఏడేళ్లపాటు గెరిల్లా యుద్ధం చేశాడు. తనకు ద్రోహం చేసిన సామంతరాజులను భీకరంగా చంపివేశాడు. వాలెస్‌తో ఏదో ఒక రకంగా ఒప్పందానికి రాకపోతే కుదరదనుకున్న రాజు కోడల్ని మళ్లీ పంపాడు. అతని ఆశయాలను చూసి ముచ్చటపడిన ఇసబెల్లా అతనికి సాయపడసాగింది. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఆమె గర్భవతి అయింది. 

చిన్న బ్రూస్‌ తన సైన్యంతో సహా వాలెస్‌తో చేతులు కలుపుదామని  అనుకుని ఆ విషయాన్ని ప్రకటించడానికి ఎడింబరాలో కలుద్దామన్నాడు. సామంతరాజులంటే నమ్మకం లేకపోయినా, కొంతమంది మంచివాళ్లు కూడా వుంటారని నమ్మిన వాలెస్‌ ఆ సమావేశానికి వచ్చాడు. కానీ పెద్ద బ్రూస్‌ యితర సామంతరాజులతో చేతులు కలిపి వాలెస్‌ను ఇంగ్లీషువారికి అప్పగించాలనుకున్నాడు. వాలెస్‌ రాగానే అందరూ కలిసి చావగొట్టి స్పృహ తప్పించి ఇంగ్లీషు సైన్యాలకు పట్టిచ్చాడు. తనను రాజును చేయడానికే యిదంతా జరిగిందని తెలియగానే చిన్న బ్రూస్‌ తన తండ్రిని అసహ్యించుకున్నాడు, అతనితో సంబంధం లేదని ప్రకటించాడు. 

వాలెస్‌పై ఇంగ్లండులో రాజద్రోహ నేరంపై విచారణ జరిగింది. ఉరి తీసి, చిత్రవధ చేసి శిరచ్ఛేదం చేయాలని శిక్ష వేశారు. చిత్రవధ సమయంలో బాధ ఓర్చుకోవడానికి శక్తి నివ్వమని వాలెస్‌ దేవుణ్ని ప్రార్థించాడు. నొప్పి తగ్గించడానికి ఇసబెల్లా మందు యివ్వబోతే వద్దన్నాడు. తీర్పు విని మండిపడిన ఇసబెల్లా తన మావగారి వద్దకు వెళ్లి వాలెస్‌కు క్షమాభిక్ష పెట్టమని అడిగింది. రోగగ్రస్తుడైన మావగారికి అప్పటికే మాట పోయింది. అతని తరఫున అతని కొడుకు 'వాలెస్‌ మరణమే రాజుగారు కోరుకుంటున్నాడు'  అన్నాడు. ఇసబెల్లా మొగుణ్ని, మావగారిని తిట్టిపోసింది. ఆ తర్వాత మావగారితో విడిగా ''నా కడుపులో పెరుగుతున్న బిడ్డ వాలెస్‌ వలన కలిగినవాడు. ఆ విధంగా నీ వంశం నీ కొడుకుతోనే సమాప్తం. ఇక ముందు రాజ్యం చేయబోయేది వాలెస్‌ వంశీకులే'' అని చెప్పింది. ఆ విషయాన్ని ఎడ్వర్డు తన కొడుక్కి చెప్దామంటే నోరు పెగలలేదు.

వాలెస్‌ను ఉరి తీయబోయేముందు చుట్టూ వున్న జనం అతన్ని విడిచి పెట్టమని కేకలు వేశారు. శిక్ష అమలు చేసే అధికారి 'దయ చూపమ'ని అభ్యర్థిస్తే చిత్రవధ లేకుండా చేస్తానని' అన్నాడు. జవాబుగా వాలెస్‌ ''స్వేచ్ఛ'' అని అరిచాడు. వాలెస్‌ను అతన్ని చిత్రవధ చేశారు. చనిపోయేముందు ప్రజల మధ్యలో నిలబడిన తన భార్య తనను చూసి చిరునవ్వు నవ్వినట్లుగా వాలెస్‌కు గోచరించింది.

భరతవాక్యం – వాలెస్‌ మరణించిన 9 సంవత్సరాల తర్వాత, 1314లో చిన్న బ్రూస్‌ స్కాట్లండ్‌ రాజు అయ్యాడు. రెండవ ఎడ్వర్డ్‌ ఇంగ్లండు రాజయ్యాడు. స్కాట్లండ్‌కు కూడా రాజుగా నన్ను అంగీకరించాలని అని షరతు విధించాడు. వాలెస్‌ను పట్టివ్వడంలో తన పాత్ర గురించి అపరాధభావనతో బాధపడుతూన్న బ్రూస్‌కు ఒక ఐడియా వచ్చింది. సరేనని అంగీకరించి ఇంగ్లీషు సైన్యాలను రప్పించాడు. ఆ ఉత్సవంలో అతను తన సేనలను ఉద్దేశించి  మాట్లాడుతూ వాలెస్‌ను గుర్తు చేసుకుని, అతని స్ఫూర్తితో ఇంగ్లీషువారితో పోరాడుదాం రండి అన్నాడు. ఈ హఠాత్పరిణామంతో ఇంగ్లీషువారు విస్తుపోయారు. బ్రూస్‌ వారిని ఓడించి స్కాట్లండుకు స్వాతంత్య్రం సంపాదించాడు.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015) 

[email protected]