ఎమ్బీయస్‌ : బుడగలమ్ముతున్నారు..3

స్మార్ట్‌ సిటీలుగా మార్చే ప్రణాళిక చేపట్టి రాబోయే పదేళ్లలో అమలు చేస్తే, ఆ నగరాల్లో కూడా పెట్రోలు వాడకం పెరిగి దేశం మొత్తం మీద ఏడాదికి పెట్రోలు వినియోగం ఏటా 15% చొప్పున పెరుగుతుంది.…

స్మార్ట్‌ సిటీలుగా మార్చే ప్రణాళిక చేపట్టి రాబోయే పదేళ్లలో అమలు చేస్తే, ఆ నగరాల్లో కూడా పెట్రోలు వాడకం పెరిగి దేశం మొత్తం మీద ఏడాదికి పెట్రోలు వినియోగం ఏటా 15% చొప్పున పెరుగుతుంది. కరెన్సీ ఎక్కువ కావాలంటే నోట్లు ముద్రించవచ్చు. కానీ ఇంధనం అలా తయారవదు. వేల ఏళ్లు పడుతుంది. అందుకే సంప్రదాయేతర యింధనం, తిరిగి వాడగలిగే యింధనం (నాన్‌ కన్వెన్షనల్‌ ఎనర్జీ, రెన్యూవబుల్‌ ఎనర్జీ) అంటూ సౌర విద్యుత్‌, పవన విద్యుత్‌, బయోగ్యాస్‌ యిటువంటి గురించి ప్రభుత్వం మాట్లాడుతూ వుంటుంది. కానీ సరైన ప్రోత్సాహకాలు యివ్వటం లేదు. ఆ పరిశ్రమలన్నీ కుంటుకుంటూ నడుస్తున్నాయి. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా సులభంగా అందుతోంది కదాని పెట్రోలు, బొగ్గు తెగ వాడేస్తున్నాం. 

భారతదేశపు శిలాజ యింధనపు అవసరాలలో 60%ను బొగ్గు తీరుస్తోంది. ప్రపంచంలోని బొగ్గు నిల్వల్లో మన దేశపు బొగ్గు గనులది ఐదో స్థానం. అయినా మనకు సరిపోవడం లేదు. మన అవసరాల్లో 21%ను దిగుమతి చేసుకుంటున్నాం. కొత్త బొగ్గుగనులు తెరుద్దామంటే అవి అడవుల్లో వున్నాయి. వాటికోసం అడవులను కొట్టేస్తే అది మళ్లీ పర్యావరణ సమస్యకు దారితీస్తుంది. అందుకే యితర దేశాలలో బొగ్గు గనులు కొని లేదా లీజుకి తీసుకుని అక్కడ నుండి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు. ఇక పెట్రోలు, గ్యాసు గురించి చూడబోతే మన ఉత్పత్తి చాలా తక్కువగా వుండటంతో దిగుమతి చేసుకుంటున్నాం. ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. పెట్రోలు తయారయ్యే మధ్యప్రాచ్యంలో రాజకీయసంక్షోభం కొనసాగి ఉత్పత్తి పడిపోతోంది. అక్కడ శాంతి నెలకొనకపోతే ప్రస్తుతం బ్యారెల్‌కు 110-150 డాలర్లు పెరిగిన రేటు ఇంకా పెరుగుతుందేమో తెలియదు. దీనికి పరిష్కారంగా దేశంలోనే ఉత్పత్తి చేద్దామంటే గత పదేళ్లగా ఏటా 85 ఎంబిడిల ఉత్పత్తి దగ్గర ఆగిపోయాం. అంతకంటె ఎక్కువ పిండలేకపోతున్నాం.   డిమాండ్‌ చూస్తే రోజురోజుకీ పెరుగుతోంది. పెట్రోలు వాడకం తగ్గించి బొగ్గుతో పని కానిద్దామా అంటే వాతావరణం కలుషిత మయిపోతుంది. 

పర్యావరణ పరిరక్షణ ఏ స్థాయిలో వుందో తెలుసుకోవడానికి కార్బన్‌ ఎమిషన్స్‌ (కర్బన ఉద్గారాలు అని తెలుగులో అంటున్నారు) లెక్కిస్తారు. ఇండియాలో తలసరి కార్బన్‌ ఎమిషన్‌ ఏడాదికి 1.5 టన్నులుంటోంది. బంగ్లాదేశ్‌, కంబోడియా, లావోస్‌ దేశాల్లో యిది మనలో ఐదో వంతు మాత్రమే! ఇదెలా సాధ్యం అంటే వాళ్ల ఎనర్జీ అవసరాలలో శిలాజ యింధనాల పాత్ర 25-30% మాత్రమే, అంటే మన కంటె 40-50% తక్కువన్నమాట. మన దేశంలో కంటె అక్కడ నగరీకరణ తక్కువ కావడం చేత ఇంధన వాడకం తక్కువగా వుంటోంది. మొత్తం యింధనపు ఉత్పత్తిలో నగరాల వంతు 5% మాత్రమే కానీ ఖర్చు పెట్టడంలో మాత్రం 75% పాత్ర వాటిదే. అందుచేత సింగపూరు వంటి నగరాలు, ప్రపంచ పర్యాటకులు ముక్కున వేలు వేసుకునే నగరాలు, హైదరాబాదుకి పదింతల పెద్ద నగరాలు, ప్రతీ జిల్లాకు ఒక హైదరాబాదు.. వంటి ఆలోచనలు కట్టిపెట్టి గ్రామీణ ప్రాంతాలను వృద్ధి చేస్తేనే మన యింధన  వ్యయం తగ్గి, అవసరాలు తీరతాయి. మామూలుగా గమనించినా గ్రామాల్లో, పట్టణాల్లో దూరాలు తక్కువ కాబట్టి చాలామంది నడుస్తూంటారు. లేదా సైకిళ్లు వాడుతూంటారు. ట్రాఫిక్‌ జామ్‌లు అతి తక్కువ. సిటీ అనేసరికి విపరీతమైన కార్లు, ఒన్‌వేలు, ట్రాఫిక్‌ జామ్‌లు, సిగ్నల్స్‌ వద్ద వేచి వుండడాలు, ఆఫీసుకి దూరంగా యిళ్లు – ఎలా చూసినా యింధనం వృథా అవుతూ వుంటుంది. 

ఇక్కడ యింకో విషయం కూడా నిపుణులు గమనించారు. నగరాలు పెరిగి, యింధన అవసరాలు పెరిగి, దేశంలోని డబ్బంతా పెట్రోలు కొనడానికో, బొగ్గు తెప్పించుకోవడానికో ఖర్చయి, దేశ అభివృద్ధి తగ్గిపోయి పేదరికం పెరుగుతోంది. మల్డీ డైమన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ (ఎంపిఐ) ప్రకారం చూస్తే ఇండియాలో సగం మంది పేదరికంలో వున్నారు. శ్రీలంకలో 5% మందే పేదలు. అయినా కార్బన్‌ ఎమిషన్స్‌ మన కంటె 60% తక్కువ (0.6 టన్నులు). ఎందువలన యిలా అంటే పర్యావరణం, యింధన వినిమయం, దారిద్య్రం, నగరీకరణ – అన్నీ ముడిపడి వున్నాయి. శ్రీలంకలో మహా నగరాల కంటె పల్లె ప్రాంతాలే ఎక్కువని గమనించాలి. 

శిలాజ యింధనాన్ని వెలికితీయడం (బొగ్గుగనులు తవ్వడం, పెట్రోలు బావులను తోడడం), రవాణా చేయడం యివన్నీ భారీ ఖర్చుతో కూడుకున్న పనులు. ప్రభుత్వమో, రిలయన్సు వంటి పెద్ద కంపెనీయో చేపట్టగలదు. ఆ ఖరీదు రాబట్టడానికి వాళ్లు ధరలు పెంచేస్తున్నారు. శిలాజ యింధనం కాకుండా వేరే రకాల యింధనాలపై (సౌర, పవన, బయో…) దృష్టి మరలిస్తే అవి తక్కువ పెట్టుబడితో మామూలు పౌరులు కూడా చేపట్టగలరు. ఇవి పల్లెటూరి వాళ్లకు, బీదవాళ్లకు కూడా అందుబాటులోకి వచ్చి వారి స్థితిగతులు మెరుగుపడతాయి. గత రెండు థాబ్దాలుగా మన దేశంలో ధనికులకు, బీదలకు మధ్య వ్యత్యాసం పెరుగుతూ వచ్చింది. దీన్ని జిని యిండెక్స్‌ ద్వారా సూచిస్తారు. 0 అంటే యిద్దరూ సమానమన్నమాట. మన దేశంలో యిది 20 ఏళ్ల క్రితం 0.32 వుండేది, యిప్పుడు 0.38 అయింది. జిడిపి పెంచుతాం అంటూ పాట పాడుతున్న మన పాలకులు, పెరిగిన సంపద ఫలితాలు అందరికీ సమానంగా కాకపోయినా కొద్దిపాటి హెచ్చుతగ్గులతో నైనా అందుతున్నాయా లేదా అని పట్టించుకోవటం లేదు. అందుకే ధనికులు మరింత ధనికులవుతున్నారు.  (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)