ఆన్‌లైన్ విరాళాలు పోగుచేసి, వాటిని తన వెబ్‌సైట్‌లో పెట్టే అరుదైన విలక్షణమైన రాజకీయ పార్టీ ఆప్. పార్టీకి ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా దాని అభిమానులు తమ మద్దతును రూపాయల ద్వారా తెలియపరచేవారు. మార్చినెలలో అరవింద్ గుజరాత్‌లో అరెస్టు కాగానే అప్పటిదాకా రోజుకి 7 లక్షలు వచ్చే విరాళాలు సడన్‌గా 24 లక్షలకు పెరిగాయి. నరేంద్ర మోదీని వారణాశిలో ఢీ కొంటానని మార్చి 25 న ప్రకటించగానే అంతకు ముందు రోజు 48 లక్షలు వచ్చినది, ఆ రోజు కోటి వచ్చి పడింది. ఏప్రిల్ 4 న, ఢిల్లీలో అరవింద్‌ను ఒకతను లెంపకాయ కొట్టగానే ముందు రోజు 48 లక్షలు వచ్చినది, ఆ రోజు 1.46 కోట్లు వచ్చాయి. ఎన్నికలు ప్రకటించాక 20 కోట్ల రూ.ల నిధుల కోసం విజ్ఞప్తి చేస్తే రోజూ లక్షలాది రూపాయలు వచ్చిపడేవి. ఏప్రిల్ నెలలో సరాసరిన రోజుకి 30 లక్షలు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు 22 లక్షలు వచ్చాయి.
ఇక ఆ తర్వాత కుళాయిధార చిక్కిపోయింది. ఆగస్టు 1 న 10,043 రూ.లు వచ్చాయి. ఇటీవలి కాలంలో సంకటం వచ్చినా అభిమానులు చలించడం లేదు. నితిన్ గడ్కరీ కేసులో అరవింద్ జైలుకి వెళ్లిన మే 21 న 7.42 లక్షలు వచ్చాయి. మర్నాటికల్లా కలక్షన్ 58 వేలకు పడిపోయింది. అరవింద్ ఉపన్యాసాలకే తప్ప చేతలకు పనికి రాడని శాంతి భూషణ్ అనగానే అరవింద్‌పై సానుభూతి పెల్లుబికి రూ. 3.60 లక్షలు వచ్చాయి. మర్నాటికల్లా అది 1.50 లక్షలకు పడిపోయింది. ఇటీవల జంతర్ మంతర్ వద్ద సభ ఏర్పాటు చేసి విరాళాల కోసం డబ్బాలు చేతపట్టి తిరిగితే 30 మంది దాతల నుండి రూ. 66,368 దక్కాయి. ఢిల్లీ ఎన్నికలు మళ్లీ జరపాలంటూ ఉద్యమిస్తున్న ఆప్‌కు యీసారి నిధుల కొరత వేధిస్తుందేమో చూడాలి.
-ఎమ్బీయస్ ప్రసాద్