Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : దలైలామా తవాంగ్‌ పర్యటన చిచ్చు

ఏప్రిల్‌ 4 నుంచి 13 వరకు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ను పర్యటించాలని దలైలామా నిశ్చయించడం భారత్‌-చైనా సంబంధాలలో మరో సమిధను చేర్చింది. తమ పొరుగు రాజ్యమైన తిబత్‌ను చైనా 1959 లో ఆక్రమించింది. తిబత్‌ ప్రజలు దైవసమానుడిగా ఆరాధించే దలైలామా వ్యవస్థపై విరుచుకుపడింది. దాంతో 14 వ దలైలామా (పేరు టెంజిన్‌ గ్యాట్సో) చైనాపై తిరుగుబాటు చేసి అది విఫలమైతే కొందరు అనుచరులతో 1959లో లాసాను వదిలి వదలి పారిపోయి వచ్చి ఇండియాలో శరణు కోరాడు. తిబత్‌ శరణార్థులకు ఇండియా ఆశ్రయం యిచ్చింది. అనేక చోట్ల స్థలాలు యిచ్చి నివసించమంది. దలైలామా హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివసిస్తూ ప్రవాస తిబెత్‌ ప్రభుత్వం నడుపుతూంటాడు. కర్ణాటకలోని కూర్గు (కొడగు) జిల్లాలో కుశాల్‌ నగర్‌ వద్ద తిబత్‌వారికి ఆశ్రయం యివ్వగా అక్కడ పెద్ద బౌద్ధారామం కట్టుకున్నారు. ప్రవాసంలో వుంటూనే దలైలామా ప్రపంచమంతా పర్యటిస్తూ తమకు జరిగిన అన్యాయాన్ని అందరికీ వినిపిస్తూంటాడు. అందరూ విన్నారే కానీ చైనాకు బుద్ధి చెప్పినవారెవరూ లేరు. పైగా తిబత్‌ సమస్యను శాంతియుతంగా డీల్‌ చేస్తున్నందుకు మెచ్చుకుంటున్నామంటూ 1989లో నోబెల్‌ శాంతి బహుమతిని ప్రసాదించారు. 

తిబత్‌ సంస్కృతిని నాశనం చేసి, తమ సంస్కృతిని అక్కడ నెలకొల్పడానికి చైనా శతథా ప్రయత్నిస్తోంది. దానికి వ్యతిరేకంగా కొందరు తిబత్‌ వారు తిరగబడుతూనే వున్నారు. 2008 చైనా ఒలింపిక్స్‌ సమయంలో తిబత్‌వారు ప్రదర్శనలు నిర్వహించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించారు. వీటన్నిటి వెనుక దలైలామా వున్నాడని చైనా భావిస్తుంది. అందుకే అతను సన్యాసి కాదు, రాజకీయనాయకుడు. సన్యాసి దుస్తులు ధరించిన తోడేలు అంటుంది. ఇటీవల జాన్‌ ఆలివర్‌ నిర్వహించే అమెరికా టీవీ కార్యక్రమంలో దలైలామా మాట్లాడుతూ చైనాలోని అతివాదులు (హార్డ్‌లైనర్స్‌)కు మెదడులో కొంత భాగం పనిచేయదని వ్యాఖ్యానించాడు. వెంటనే చైనా స్పందించింది - చైనా వ్యతిరేకులను ప్రోత్సహించే టక్కరి దలైలామా అంటూ. ఇద్దరి మధ్య బంధాలు యింత సొగసుగా వుండగా యిప్పుడు దలైలామా తవాంగ్‌లోని భారతదేశంలోనే అతి పెద్దదైన బౌద్ధారామం (మొనాస్టరీ) వారి ఆహ్వానంపై అక్కడకు వెళతానంటున్నాడు. అది తమదే అని చైనా భారత్‌తో వివాదం వేసుకుని వుంది. తమ ప్రాంతంలోకి తమ శత్రువు ప్రవేశిస్తే ఎలా? అనేది చైనా ప్రశ్న. 

ఏప్రిల్‌ 4 మంగళవారం నాడు పొద్దున్న తవాంగ్‌లో వున్న బౌద్ధారామాన్ని దర్శించి, కొత్తగా కట్టిన తారా ఆలయాన్ని ప్రారంభించి, 5 వ తారీకు నుంచి 7 వ తారీకు వరకు అక్కడ మతబోధనలు చేసి దిరాంగ్‌కు వెళ్లి అక్కడ 10 నుంచి బోధనలు చేసి చివరకు ఈటానగర్‌కు 12 న చేరి అక్కడా బోధనలు చేసి వస్తారు. లాసా నుంచి భారత్‌కు వచ్చినపుడు దలైలామా తవాంగ్‌ ద్వారా వచ్చారు. అక్కడకు 50 ఏళ్ల తర్వాత 2009లో మన్‌మోహన్‌ సింగ్‌ అనుమతితో వెళ్లి వచ్చారు. మళ్లీ 8 ఏళ్ల తర్వాత యిప్పుడు వెళుతున్నారు. దీనికి అనుమతి 2016 నవంబరులో లభించింది. న్యూక్లియార్‌ సప్లయిర్స్‌ గ్రూపులో ఇండియా సభ్యత్వానికి చైనా అడ్డు తగిలిన నేపథ్యంలో మోదీ సర్కారు యీ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 90 వేల చ.కి.మీ. ప్రాంతాన్ని చైనా దక్షిణ తిబత్‌గా పేర్కొంటూ అది కూడా తమదే అంటుంది. ఆ విషయంగా 1962లో ఇండియాపై దాడి చేసింది కూడా. ఆ తర్వాత నుంచి చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి యిరు దేశాలు చూశాయి కానీ యిప్పటికి దాకా వివాదం సాగుతూనే వుంది. ఈ మధ్యలో చైనా ఒక ప్రతిపాదన తెచ్చింది. 'పశ్చిమ సెక్టార్‌లో వున్న వివాదాస్పద ప్రాంతమైన అక్‌సాయి చిన్‌పై హక్కులు వదులుకుంటాం, తవాంగ్‌పై హక్కులు మీరు వదులుకోండి' అని. 1962లో అక్‌సాయ్‌ చిన్‌ కీలకమైన ప్రాంతం. కానీ లాసా రైల్వే కట్టాక, తిబత్‌ రోడ్ల వ్యవస్థ నిర్మించాక దానికి ప్రాధాన్యత పోయింది. అందుచేత దాన్ని వదులుకోవడానికి చైనా సిద్ధపడుతోంది. తవాంగ్‌పైనే దాని దృష్టి యిప్పుడు. అలాటి తవాంగ్‌లో తమ శత్రువు దలైలామాను అనుమతించడం చైనాను మండిస్తోంది. 2009లో గొడవ చేయనిది యిప్పుడే ఎందుకు చేస్తోంది అంటే దలైలామా తన యింటర్వ్యూలో చైనా నాయకుల గురించి చేసిన వ్యాఖ్యలు అని కారణం చెపుతున్నారు. 

దలైలామా పర్యటన ప్రారంభించడానికి నాలుగు రోజుల ముందు చైనా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ''చైనా, భారత్‌లు అభివృద్ధి బాటలో నడుస్తున్న రెండు పెద్ద యిరుగుపొరుగు దేశాలు. ఇద్దరి మధ్య సఖ్యత ఎంతో అవసరం. దానికి గట్టి పునాది ఏర్పడాలి. దలైలామా వంటి వేర్పాటువాదిని తవాంగ్‌ అనుమతించడం ద్వారా భారత్‌ సత్సంబంధాలను దెబ్బ తీస్తోంది. చైనాతో సఖ్యత ముఖ్యమో, దలైలామా ముఖ్యమో భారత్‌ తేల్చుకోవాలి.'' అని హెచ్చరిక లాటిది చేశాడు. ఇవేమీ పట్టించుకోకుండా భారత ప్రభుత్వం దలైలామాను ముందుకు వెళ్లమంది. ఆయన ఏప్రిల్‌ రాగానే ముందుగా అసాంకి వెళ్లాడు. అక్కడ గువాహటిలో వుండగా 76 ఏళ్ల గార్డు ఒకతను కలిసి నమస్కరించాడు. 58 ఏళ్ల క్రితం దలైలామా లాసా నుంచి పారిపోయి వస్తున్నపుడు భారత్‌ ప్రభుత్వం అసాం రైఫిల్స్‌లోని ఐదుగుర్ని రక్షణగా పంపింది. నరేన్‌ చంద్ర దాస్‌ అనే యితను అప్పుడు అసాం రైఫిల్స్‌లో పని చేస్తుండేవాడు. అసాం రైఫిల్స్‌ 9 వ నెంబరు ప్లాటూన్‌ దలైలమాను, అనుచరులను జుతాంగ్‌బో నుంచి తీసుకుని వచ్చి శక్తి వద్ద ఐదుగురు సభ్యుల వీళ్ల బృందానికి అప్పగించింది. వీళ్లు వారిని లుంగ్లా వరకు తీసుకుని వచ్చి వేరే దళానికి అప్పగించారు. వాళ్లు ఆయనను తవాంగ్‌ కు తీసుకెళ్లారు. ఇప్పుడా గార్డు వచ్చి పలకరించడంతో దలైలామా పులకరించి, ధన్యవాదాలు అర్పించాడు. ఈ 10 రోజుల పర్యటనలో దలైలామాను యింకెందరు సత్కరిస్తారో, దానికి చైనా ఎలా స్పందిస్తుందో, మొత్తం మీద దీని పర్యవసానాలు ఎలా వుంటాయో యిప్పుడే చెప్పలేం.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
- mbsprasad@gmail.com