అసలు దేశానికి, రాష్ట్రానికి జాతకాలు ఎలా గీస్తారు? మనిషికైతే పుట్టుక వుంటుంది. ఆ సమయం, స్థలం చూసి రాశిచక్రం గీస్తారు. ప్రాంతం విషయంలో దాని పుట్టుక ఎలా చెప్తారు? ఇండియా పుట్టినది 1947 ఆగస్టు 15 న అంటే నవ్వాలి. భూమి పుట్టినపుడు మన దేశం పుట్టింది. ఆగస్టు 15 న ఒకరి నుంచి మరొకరికి అధికారం బదిలీ అయింది. అలాగే తెలంగాణ ఏర్పాటు కూడా! 2014 జూన్ 2 న కొంత ప్రాంతానికి పేరు మారింది. భద్రాచలం ముంపు గ్రామాలు తీసేసి, ఆంధ్రకు అప్పగించాక రాష్ట్రం రూపు మళ్లీ మారింది. వీటిలో ఏ తేదీ, ఎందుకు పరిగణించాలి? దీన్ని బట్టి ఎవరు ఎంతకాలం పాలిస్తారో ఎలా చెప్పగలిగారు? రాజకీయ జోస్యాలు తప్పడం ఎన్నో థాబ్దాలుగా గమనిస్తూ వచ్చాను. గుజ్రాల్, దేవెగౌడ, చంథ్రేఖర్, పివి నరసింహారావు, మన్‌మోహన్ సింగ్… వీరిలో ఎవరూ ప్రధాని అవుతారని ఏ జ్యోతిష్కుడూ చెప్పలేదు. అంతెందుకు మోదీ ప్రధాని అవుతారని ఐదేళ్ల క్రితం ఎవరైనా చెప్పారా? ఆయన ఏడాదిన్నర క్రితం రాజకీయరంగంపై వచ్చి వెలుగుతూంటే అప్పుడు మొదలెట్టారు. ఇలాటి మిడతంభొట్లు జోస్యాలను కోట్ చేస్తూ యువరాజకీయ నాయకుడు మాట్లాడితే జాలి పడాలి. తన బలంపై, ప్రజాబలంపై నమ్మకం పోయి దైవబలాన్ని, చిలకజోస్యాలను నమ్ముకుని ఆ ఆశతో ముందుకు సాగుతున్నాడు పాపం అనుకోవాలి.
ఏ మాట కా మాట చెప్పాలంటే చంద్రబాబులో మొదట్లో యీ నమ్మకాల గొడవ కనబడేది కాదు. ఎన్టీయార్‌కు 9 సంఖ్య అంటే వెర్రి అని, సన్యాసి రాజవుతాడని ఎవరో చెపితే నమ్మి కాషాయం కట్టారని, కక్షుద్రపూజలు చేస్తారని యిలా అందరూ అనుకునే రోజుల్లో నెంబర్ టూగా వున్న బాబు ఎప్పుడు చూసినా సైంటిఫిక్ మెథడ్, మేధావులతో చర్చ… యిలాటి భాష మాట్లాడేవారు. ఎన్నికలు జరగగానే ఎన్టీయార్ తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకునేవారు కానీ బాబు ఎప్పుడూ కొట్టించుకునే వారు కాదు. బాబాల చుట్టూ ప్రదక్షిణలూ కనబడేవి కావు. ఆయన నాస్తికుడని నేను అనను. దైవభక్తిని ప్రముఖంగా చాటుకునేవారు కాదంటున్నాను. ఎన్టీయార్ సంతానం క్రికెట్ టీమంత వుంటే, యీయనకు ఒక్కడే ఒక్కడు. ఇవన్నీ టిడిపిలో యువతను బాబుకు దగ్గర చేశాయి. అప్పుడు బాబు యువకుడు. ఇప్పుడు ఆయనకూ వయసు మీరింది. ఇవాళ ఎన్టీయార్ తరహాలో ఎక్కువమంది పిల్లల్ని కనండి అంటూ మాట్లాడుతున్నారు. చదువుకున్నవాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం లేదట, చేసుకున్నా లైఫ్ ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని కనటం లేదట, జనాభాలో యువత శాతం తగ్గిపోతుంది కాబట్టి, పిల్లల్ని కనదలచుకున్నవారు యింకా ఎక్కువమందిని కనాలట.
రోగాలపై సాగే యుద్ధంలో మానవుడు గెలుస్తున్నకొద్దీ జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతుంది. వారి శక్తియుక్తులను సమాజానికి ఉపయోగపడేలా ఎలా మలచుకోవాలా అని ఆలోచించాలి తప్ప గీతను చిన్నది చేయాలంటే అంతకంటె పెద్ద గీత గీయాలన్నట్లు వారి సంఖ్యను మించేట్లా పిల్లల జనాభా పెంచేయకూడదు. ఇంకో తరం గడిచేసరికి యీ పిల్లలంతా వృద్ధులై, వృద్ధుల శాతం మరింత పెరిగిపోదా? పెళ్లిళ్లు చేసుకోకపోవడం, పిల్లల్ని కనకపోవడం సమాజంలో ఒక వర్గం మాత్రమే చేస్తున్న పని. పెళ్లి చేసుకుందామనే కోరిక వుండి ఖర్చు భరించలేక వాయిదా వేసుకుంటున్నవారు వున్నారు కాబట్టే కళ్యాణలక్ష్మి వంటి పథకాలు పెడుతున్నారు. సమాజంలోని దిగువ వర్గాలు పిల్లల్ని కంటునే వున్నారని ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్లినా కనబడుతుంది. చదువుకున్నవారి చేత బలవంతంగా కాపురాలు చేయించేబదులు, యిలాటి పేదపిల్లలను చదివిస్తే సరిపోతుంది కదా. ప్రభుత్వ బలవంతం వలన ధనికులెవరైనా పిలల్ని కన్నా, వాళ్లను పట్టించుకోకపోతే వాళ్లు విలాసాలు మరిగి డ్రంకెన్ డ్రైవింగ్‌లోనో, డ్రగ్ ఎడిక్ట్‌గానో పట్టుబడితే లాభం ఏమిటి? మనకు పెరగవలసినది యువతీయువకుల సంఖ్య మాత్రమే కాదు, బాధ్యతాయుతులైన, విద్యావంతులైన, సుశిక్షితులైన యువతీయువకులు. జనాభా పెరిగిన కొద్దీ సమాజానికి, ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతుంది. అంతకంటె ఆ నిధులను యీ పేదబాలబాలికలను చదివించడానికి, తర్ఫీదు యిప్పించడానికి వినియోగిస్తే మంచిది కదా!
మరి చంద్రబాబు గారికి యిలా ఎందుకు తోచలేదో? అసలు ఆయన తన కొడుక్కి మేనరికం చేసుకున్నపుడే నేను ఆశ్చర్యపడ్డాను. మేనరికాలు వద్దని వైద్యులు, శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. బాబు ఆధునికంగా ఆలోచిస్తారు కాబట్టి ఆ ప్రతిపాదన వచ్చినపుడు తిరస్కరిస్తారేమో అనుకున్నాను. ఇలాటి వ్యక్తిగత విషయాలపై యింతకు మించి వ్యాఖ్యానించకూడదు. తన దైవభక్తిని బాహాటంగా చాటుకునే నాయకుడు కెసియార్. చండీయాగాలకు పాప్యులారిటీ తెచ్చిపెట్టారు. అధికారంలోకి వచ్చాక ప్రజలను మతాలవారీగా, కులాల వారీగా విభజించి, టాకిల్ చేస్తున్నారు. ప్రతీ కులానికీ ఓ భవన్! అదీ హైదరాబాదులో!! ఎందుకంటే – ఆ కులసంఘాల వాళ్లు సభలు, సమావేశాలు జరుపుకోవాలంటే హాలు కావాలిట. అందుకని కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనంతో భవంతులు కడతారట. సభలకు, సమావేశాలకు జనాలు రావడం మానేసి చాలాకాలమైంది. మీటింగుతో యీటింగు ఎట్రాక్షన్ కూడా పెడితేనే రెండు, మూడు వందల మంది వస్తున్నారు. మూణ్నెళ్లకో, ఆర్నెల్లకో మీటింగు జరగడం అబ్బురం. దానికోసం ఏ రవీంద్రభారతో, మరోటో ఆ పూట అద్దె లేకుండా యిస్తే సరిపోతుంది. దానికోసం బిల్డింగు కట్టాలా? కట్టినా ఆ కులస్తులు ఎక్కువగా వున్న జిల్లాలో కడితే వికేంద్రీకరణ జరిగినట్లూ వుంటుంది, స్థలం ఖరీదూ తగ్గుతుంది. ఆ కులస్తులకు ఉద్యోగస్తులగానో, వ్యాపారస్తులగానో మార్చడానికి అవసరమైన ఓ రెండు నెలల ట్రెయినింగ్‌కై ఆ నిధులు వెచ్చిస్తే భేషుగ్గా వుంటుంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2015)