Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : ఇరోమ్‌ షర్మిల భవిష్యత్తు ఏమిటి?

మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఇరోమ్‌ షర్మిలకు 90 ఓట్లు మాత్రమే రావడం మణిపూర్‌ బయట వున్నవారందరినీ ఆశ్చర్యపరిచింది. 16 ఏళ్లు ముక్కు ద్వారానే ద్రవాహారాన్ని గ్రహిస్తూ, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, అహింసా పద్ధతుల్లో సుదీర్ఘ పోరాటం చేస్తోందన్న అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకున్న నిస్వార్థజీవికి 90 ఓట్లా? ఆమెపై పోటీ చేసిన ముఖ్యమంత్రి ఇబోబి సింగ్‌కు 18,649 ఓట్లా? అతనిపై వున్న అవినీతి ఆరోపణల కారణంగా అతనికి ఓటేయడానికి యిష్టపడని 150 మంది నోటా మీట నొక్కారు కానీ షర్మిలకు ఓటేయలేదు. ఎంత ఘోరం! ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తను ప్రేమించినవాణ్ని పెళ్లాడి జీవితంలో సంసారం ఏర్పాటు చేసుకుంటానంటూ ఆమె తన నిరాహారదీక్షను విరమించుకున్నందుకు ఓటర్లు ఆమెను శిక్షించారా అన్న సందేహం వస్తుంది. అదే నిజమైతే ఆమెకు వ్యక్తిగత జీవితం వుండకూడదని, తమ కోసం ఆమె కొవ్వొత్తిలా హరించుకుపోవాలని వారు అభిలషించినట్లు తోస్తుంది. వాస్తవం అది కాదని మణిపూర్‌ పరిశీలకులు అంటారు.

షర్మిల మణిపూర్‌ బయటి ప్రజలకు ఒక యోధురాలిగా తోచవచ్చు కానీ మణిపూర్‌ ప్రజలు ఆమెను లైట్‌గానే తీసుకున్నారని రుజువైంది. ఎందుకంటే ఆమె వెనుక ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రజా ఉద్యమం కానీ లేదు. ఆమె సాధారణ కార్యకర్త. ఏదో ఆవేశంలో ముందూవెనకా ఏర్పాట్లు చేసుకోకుండా చటుక్కున నిరాహారదీక్షకు దిగింది. అప్పటికి ఆర్మీ మణిపూర్‌ను ఏలుతోంది. ఆమెకు మద్దతు ప్రకటిస్తే ఆర్మీవాళ్లు పగబట్టి తిరుగుబాటుదారు అనే పేర మీద కాల్చేసినా దిక్కు లేదు, కేసూ లేదు. అందువలన సాధారణ మణిపూర్‌ పౌరుడు ఆమె జోలికి వెళ్లలేదు. మణిపూర్‌ బయట  మాత్రం ఆమె పేరు మారుమ్రోగిపోయింది. ప్రజాహక్కుల సంఘాల వాళ్లు ఆమె ఆకాశానికి ఎత్తివేశారు. ఒక ఎత్తయిన పీఠం మీద కూర్చుని దిగనివ్వలేదు. కొన్నాళ్లకి ఆమె ప్రేమలో పడి, దీక్ష మానేసి పెళ్లి చేసుకుంటానంటే కుదరదంటూ అడ్డు పడ్డారు. ఆమె ప్రియుణ్ని తరిమికొట్టారు. ఇదంతా చూసి విసుగెత్తి ఆమె 2016లో దీక్ష విరమించింది. అప్పుడైనా మణిపూర్‌ ప్రజలు ఆమెకు ఊరూరా సన్మానసభలు నిర్వహించలేదు. ఎందుకంటే ఆమె దీక్షకు కూర్చున్న నాటికి, యిప్పటికి ఆర్మీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. చట్టం అలాగే వుంది కానీ, అమలు చేయడంలో క్రూరత్వం తగ్గింది. రాజకీయ నాయకులే ఏలుతున్నారు. 

బయటకు వచ్చిన షర్మిల పరిస్థితిని గ్రహించి తన కిష్టమైనవాణ్ని పెళ్లి చేసుకుని చల్లగా సంసారం చేసుకుంటే బాగుండేదేమో. పార్టీ పెడతానంది. ''పీపుల్స్‌ రిసర్జన్స్‌ అండ్‌ జస్టిస్‌ ఎలయన్స్‌'' పేర పార్టీ పెట్టింది. ఎజెండా ఒక్కటే ఒక్కటి - ఆ సైన్యానికున్న ప్రత్యేక అధికారాల చట్టం ఎత్తివేయాలని. ఆమె ఆలోచనలన్నీ దాని చుట్టూనే తిరుగుతున్నాయి కానీ ప్రజలకు దాని కంటె ముఖ్యమైన విషయాలు చాలా వున్నాయి. వాటిని తామిస్తామని పార్టీలు ఊరిస్తున్నాయి. అందుకే వాళ్లు షర్మిలను పట్టించుకోలేదు. అసలు మణిపూర్‌ రాజకీయాల్లో స్త్రీలకు ప్రాముఖ్యత లేదు. 1972లో రాష్ట్రం ఏర్పడితే 18 ఏళ్లపాటు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేదు. 1990లో ముగ్గురు మహిళా ఎమ్మేల్యేలు ఎన్నికయ్యారు. అంటే మొత్తం సంఖ్యలో 5% అన్నమాట. ఆ మహిళలు కూడా స్వయంగా నాయకులుగా ఎదిగినవారు కాదు. రెండు కేసుల్లో భర్త/సమీప బంధువు చనిపోతే సానుభూతితో నెగ్గినవారు. మూడో కేసులో ముఖ్యమంత్రి రెండు స్థానాల్లో గెలిచి, ఒక స్థానం వదిలేసి, దానిలో భార్యను గెలిపించుకున్నాడు. 2012లో కూడా ముగ్గురే వున్నారు. ఈ సారి 60 సీట్లకు 11 మంది నిలబడితే యిద్దరే యిద్దరు గెలిచారు. అంటే 3.5% అన్నమాట. ఇలాటి సమాజంలో ఒంటరిగా ఆమె సైకిలు మీద యిల్లిల్లూ తిరిగి, తనకు ప్రచారం చేసుకుంది. ఎన్నికలకై ఆమెకు నిధులు సమకూర్చినవారు కూడా బయట వున్న స్నేహితులు, సమర్థకులే. స్థానికంగా విరాళాలు ఎవరూ యివ్వలేదు.  ఆమె సమర్థకులకు కూడా రాజకీయాలు, బూత్‌ మేనేజ్‌మెంట్‌ ఏమీ తెలియదు. తను కూడా పోయిపోయి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడికి వ్యతిరేకంగా నిలబడింది.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌

-mbsprasad@gmail.com