cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : గోవింద్‌ పన్సారే హత్య వెనుక ఎవరున్నారు?

ఫిబ్రవరి 16 న కొల్హాపూర్‌లో కమ్యూనిస్టు, లాయరు, సామాజిక కార్యకర్త అయిన గోవంద్‌ పన్సారే అనే 81 ఏళ్ల ఆయన తన భార్యతో మార్నింగ్‌వాక్‌కి వెళుతూండగా మోటార్‌సైకిల్‌ వచ్చిన యిద్దరు యువకులు తుపాకీతో 4 రౌండ్లు కాల్చి గాయపరిచారు. చికిత్స పొందుతూ పన్సారే ఫిబ్రవరి 20 న  మరణించారు. ఈ వృద్ధుడు ఏం తప్పు చేశాడని యీ శిక్ష విధించారన్నదే అంతు పట్టటం లేదు. గతంలో మూఢవిశ్వాసాలు వ్యతిరేకంగా ఉద్యమించిన దభోల్కర్‌ను 2013 ఆగస్టులో హత్య చేసిన రీతిలోనే యీ హత్యా జరగడంతో యిది మతఛాందస వాదుల పని అని ఒక అనుమానం మెదలుతోంది. హత్య జరగగానే మహారాష్ట్ర నాయకులందరూ ఖండించారు. నాసిక్‌, ఔరంగాబాద్‌, ముంబయి వంటి నగరాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇటీవలి కాలంలో టోల్‌-గేట్లకు వ్యతిరేకంగా యీయన ఉద్యమించి వివాదాన్ని సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లాడు కాబట్టి దానివలన నష్టపోతున్న కార్పోరేట్లలో ఎవరైనా హత్య చేయించారా అన్న చిరుసందేహం కూడా వుంది.

1933లో అహ్మద్‌నగర్‌లో శ్రీరాంపూర్‌ తాలూకాలో పుట్టిన గోవింద్‌ పన్సారే దరిద్రంలోనే పెరిగాడు. వాళ్ల పొలం అప్పులవాళ్ల పరమై పోయింది. తల్లీ తండ్రీ వ్యవసాయ కూలీలుగా వుండేవారు. తల్లి పట్టుదలతో అతను బడికి వెళ్లాడు. సోషలిస్టు భావాలతో నెలకొల్పిన రాష్ట్ర సేవా దళ్‌ అనే సంస్థలో చేరడం వలన వారు నిర్వహించే హైస్కూలులో ఫీజు లేకుండా చదువుకోగలిగాడు. ఆ థలో కమ్యూనిస్టు ఉద్యమంతో పరిచయం కలిగింది. కాడూ పాటిల్‌  అనే కమ్యూనిస్టు నాయకుడికి అసెంబ్లీ ఎన్నికలలో సాయపడితే అతను కొల్హాపూర్‌ తీసుకెళ్లి రాజారాం కాలేజీలో బిఏలో చేర్పించాడు. కమ్యూనిస్టు పుస్తకాలు అమ్మే రిపబ్లిక్‌ బుక్‌స్టాల్‌లోనే బస. ఇంటింటికి న్యూస్‌ పేపర్లు వేస్తూ, మునిసిపాలిటీలో ప్యూన్‌గా, ప్రైమరీ స్కూలులో టీచరుగా పనిచేస్తూ తిండికి గడించుకునేవాడు. శివాజీ యూనివర్శిటీలో లెక్చరర్‌గా పనిచేశాడు. కొన్నాళ్లకు న్యాయశాస్త్రం చదివి 1964 నుండి లేబర్‌ సమస్యలపై న్యాయవాదిగా వున్నాడు. సిపిఐలో చేరి స్టేట్‌ సెక్రటరీగా వుంటూ అనేక ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకున్నాడు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునేవారిని ఆదుకోవడానికి సంస్థ నడిపాడు. అతని ముగ్గురు పిల్లలు కులాంతర వివాహాలు చేసుకున్నారు.

కమ్యూనిస్టు పార్టీలో వుంటూ కూడా వారి విధానాలు కొన్నిటిని విమర్శించేవాడు. ఛత్రపతి శివాజీ గురించి మహారాష్ట్రలో సరైన చర్చ జరగడానికి యిష్టపడరు. శివాజీ హిందూమతాన్ని నిలబెట్టడానికే అవతరించాడని, ముస్లింలను ద్వేషించాడనీ హిందూత్వ సంఘాలు ప్రచారం చేస్తాయి. ఖేడేకర్‌ అనే అతను శంభాజీ బ్రిగేడ్‌ పేర బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నడుపుతూంటాడు. శివాజీ పుట్టుపూర్వోత్తరాలు పరిశోధించి జేమ్స్‌ లేన్‌ అనే అమెరికన్‌ రాసిన ''శివాజీ-హిందూ కింగ్‌ యిన్‌ యిస్లామిక్‌ ఇండియా'' అనే పుస్తకం 2004లో వెలువడినపుడు యితను చాలా హింసాత్మకమైన ఆందోళన చేశాడు. పుణెలో భండార్కర్‌ ఓరియంటల్‌ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ అనే గొప్ప పుస్తక భాండాగారాన్ని తన అనుచరులతో కలిసి తగలబెట్టాడు. గోవింద్‌ శివాజీపై ''శివాజీ కోన్‌ హోతా?'' (శివాజీ ఎవరు?) అనే చిన్న పుస్తకాన్ని 1987లో రాశాడు. శివాజీ ముస్లిం వ్యతిరేకి కాదని, సెక్యులర్‌ భావాలు కలవాడని, మహిళలను గౌరవించాడని, రైతులకు మేలు చేసే సంస్కరణలు చేశాడని, దళితులను, వెనకబడినవారిని పెద్ద పదవుల్లో నియమించాడని, బానిసత్వం నిర్మూలించాడని నిరూపించాడు. ఈ పుస్తకం లక్షలాది కాపీలు అమ్ముడుపోయింది. 

ఇటీవలి కాలంలో హిందూత్వ శక్తులు మళ్లీ పుంజుకుంటూన్నాయి. ముస్లిం వ్యతిరేకతకు ప్రతీకగా శివాజీని వాడుకోవాలని చూస్తున్నాయి. గోడ్సేను ఆరాధించడం కూడా మొదలైంది. గోవింద్‌ యీ ధోరణులను నిరసించాడు. దానిపై యిటీవల యిద్దరు ఎబివిపి కార్యకర్తలు అతన్ని బెదిరించడం జరిగింది. ముంబయిపై దాడి జరిగిన సందర్భంగా మరణించిన హేమంత్‌  కర్కారేను ఎవరు చంపారన్నది మిస్టరీగా మిగిలిపోయింది. 'కర్కారేను ఎవరు చంపారు?' అని పుస్తకం రాసిన మాజీ ఐజీ ఆఫ్‌ పోలీసు ఎస్‌ ఎమ్‌ ముష్రిఫ్‌ను గోవింద్‌ జనవరిలో కొల్హాపూర్‌ రప్పించి సభ ఏర్పాటు చేశాక అతనిపై బెదిరింపులు యింకా ఎక్కువయ్యాయి. కొల్హాపూర్‌, పుణె వంటి ప్రదేశాల్లో విద్యాసంస్థల్లో కూడా రైటిస్టు ధోరణులు చొచ్చుకుపోయాయి. దభోల్కర్‌ హత్య జరిగి 18 నెలలైనా యింకా హంతకులను పట్టుకోలేదంటే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు యీ వృద్ధుడి హత్యతో అవి బలపడుతున్నాయి. నిన్న ఔరంగాబాద్‌ పోలీసులు అమోల్‌ పాటిల్‌ అనే యువకుడిపై కేసు పెట్టి విచారణ చేస్తున్నారు. అతను సోషల్‌ మీడియాలో దభోల్కర్‌, పన్సారేల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్టు చేశాడు. వీరిద్దరూ ప్రగతిశీలవాదులు కాబట్టి అమోల్‌ రైటిస్టు అయి వుంటాడన్న అనుమానం సహజంగా వస్తుంది. అయితే కన్‌ఫ్యూజ్‌ చేయడానికి కాబోలు అతను యీ ఇద్దరి భావాలకు బద్ధవిరోధి ఐన ఎక్సీట్రీమ్‌ రైటిస్టు ఖేడేకర్‌ పేరు కూడా జాబితాలో చేర్చాడు. 'మొదట దబోల్కర్‌, తర్వాత గోవింద్‌, యిక ఖేడేకర్‌' అని అతను నినదించాడు. 

విచారణ సాగుతోంది. నిందితులు ఎప్పటికైనా దొరుకుతారో లేదో ఫడ్నవీస్‌కే తెలియాలి. ఈ లోగా రైటిస్టు శక్తుల మీదనే అనుమానం నీడలు పడుతున్నాయి. పన్సారేపై కాల్పులు జరిగిన మర్నాడే దానిని ఖండిస్తూ మరాఠీ దినపత్రిక తన సంపాదకీయానికి ''ఆలోచనాపరులారా, జాగ్రత్త'' అని శీర్షిక పెట్టింది. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

mbsprasad@gmail.com

 


×