Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍ కథ 48: నాటునాటు

ఎమ్బీయస్‍ కథ 48: నాటునాటు

తను ఫారిన్లో పుట్టి ఉంటే బాగుండేదనుకొంది రూపిణి. అక్కడైతే తనలాటి కేసు అర్థం చేసుకొంటారు, అర్థం చేసుకోకపోయినా అడగ్గానే విడాకులు మంజూరు చేస్తారుట. ఇక్కడ విడాకులు కావాలంటే చచ్చే చావు చావాలి. అత్తమామలుండాలి, తండ్రి కట్నం గురించి యిచ్చిన మాట తప్పి ఉండాలి, అత్తా, మామా, మొగుడూ, ఆడపడుచూ వీళ్లంతా కలిసి కట్నం బకాయి కోసం హింస పెట్టాలి, తను దాన్ని నిరూపించాలి, అప్పుడు విడాకులిస్తారు. కట్నం పేచీ లేకపోతే మొగుడు నపుంసకుడై యుండాలి. అధమం సరరూప రాక్షసుడై ఉండాలి. వాడు వేసిన వాతలు. కొట్టిన దెబ్బలూ కోర్టు వారి సమక్షంలో ప్రదర్శించి, దేబిరిస్తేనే విడాకులు విదిలిస్తారు.

మా ఆయన నాతో కలిసి కాపురం చేద్దామనుకొంటున్నాడు గానీ ఆయనకు శుచీ శుభ్రం లేదండి. అందువల్ల నాకు విడాకులు దయచేయించండి అని తనలాగ అడిగితే ఫ్యామిలీ కోర్టు జడ్జిగారు కళ్లు తేలేస్తారు. తనకి మతిపోయిందనుకొని పిచ్చాస్పటలుకి పంపుతారు పిచ్చాసుపత్రిలో వున్నా బాగుణ్ణు. సంసారం చేసే బాధ తప్పుతుంది. చట్టప్రకారం మొగుడికి శయ్యాసుఖం కోరే హక్కులున్నాయట. అది నెరవేర్చడం భార్య బాధ్యతట. ఆసుపత్రిలో ఉంటే ఆ బాధ్యత నెరవేర్చక్కర్లేదు. అలా అని తనకు సెక్సంటే విముఖత ఏమీ లేదు. ఇష్టమే. కానీ మొగుడి తీరుతెన్నులే నచ్చవు. మొదటి రాత్రి గదిలోకి వచ్చినప్పుడే తెలిసింది. మల్లెపూల వాసనను మింగేసే సిగరెట్టు కంపు. అదీ లోక్లాసు సిగరెట్టు. అదేమిటంటే ‘నీకు తెలియదా, రఫ్‌ ఉండే టఫ్‌గా మనుషులు సంపూర్తిగా సంతృప్తి చెందేది ఘాటైన సిగరెట్టుతోనే, మెగాస్టార్ బ్రాండ్ బీడీ అయితే యింకా బెటరనుకో కానీ నాకది పడదు.’ అని ప్రవచనం ఒకటి.

తండ్రి సిగరెట్టు తాగడు కాబట్టి తనకా పొగ పడక రాత్రంతా దగ్గుతూనే వుంది. పోనీ కదాని జాలిపడలేదు. నువ్వే అలవాటు పడతావులే అన్న హామీ ఒకటి పడేశాడు. ఆ రోజు సిగరెట్టు గురించే తిట్టుకుంది. కానీ ఆ తర్వాత అతని తక్కిన పద్దతులు చూశాక దాని గురించి మర్చిపోయింది. మనిషికి బొత్తిగా శుభ్రం లేదు. రోడ్డు మీద నుంచి వచ్చి ఆ బూట్ల తోనే మంచం ఎక్కి కూర్చుంటాడు. మంచం మీదనే తినడాలు, సిగరెట్టు కాల్చడాలు, మందు కొట్టడాలు, మంచింగ్‌కి తెచ్చిన కక్కాముక్కా ప్లేట్ల లోంచి కింద పడి దుప్పటి మీద మరకలు చేస్తూంటే ఫ్రెండ్స్‌తో కూర్చుని పేకాటలు! అంతమంది ఎక్కి తొక్కేసిన మంచం మీద పడుకోవడం ఎలాగో వుంటుంది బాబూ అని తనంటే, కావాలంటే దులిపేయ్, సిగరెట్టు బూడిదంతా పోతుంది అంటూ చులాగ్గా చెప్పేస్తారు.

మంచం ఒకటే అని కాదు, దాని మీద మనిషీ అంతే. స్నానం గురించి పట్టింపు లేదు. ఒక పౌడరు, క్రీము రాసుకోవాలని లేదు. గడ్డం రోజూ గీసుకోవాలని అనుకోరు. అలా అని మోడల్స్‌లా అందమైన గడ్డం పెంచుకోరు. అలాగే వారం పది రోజులు వదిలేయడం, ఒకేసారి గీసేయడం, మళ్లీ పది రోజులు బూచాడిలా తిరగడం. గుచ్చుకుంటుందనే కాదు, చూడడానికే చికాకుగా. అన్‌క్లీన్‌గా కనబడతారు. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి క్షవరం చేయించి తలంటు పోసేద్దామనిపిస్తుంది. చెప్తే అర్థం చేసుకోకపోగా యిప్పుడంతా అదే ఫ్యాషన్ అంటారు. ‘చాకొలేట్ ఫేస్‌డ్ హీరోల కాలం కాదిది. నాటునాటుగా ఉండే హీరోలే రాజ్యం చేస్తున్నారు. వాళ్లని చూసి అందరూ అదే ఫాలో అవుతున్నారు. లుంగీ ఎగ్గట్టి, బూతులు మాట్లాడుతూ రావే పోవే అంటేనే హీరోయిన్లు ఎగబడుతున్నారు. ఇదివరకు నిక్కరేసుకుని కనబడితే కూలివాడో, పాలవాడో అనుకునేవాళ్లం. ఇప్పుడు చూడు సిటీల్లో ఐటీ కుర్రాళ్లంతా నిక్కర్లు, హవాయి చెప్పులు, చింపిరి గడ్డాలూ వేసుకుని షాపింగు మాల్స్‌కి వస్తున్నారు. వీళ్లు బెడ్‌రూమ్‌లో మరోలా ఉంటారా?’ అని వాదించారు.

నేటి రోజుల్లో నాటుగా, మోటుగా, మురికిగా ఉండడమే ఫ్యాషన్ కావచ్చు. తను మాత్రం రోజూ రెండు పూటలా స్నానం చేయకుండా ఉండలేదు. వేసవి కాలంలో మూడోసారి కూడా చేస్తుంది. రోజూ స్నానం చేయకపోతేనేం? అన్న ఫిలాసఫీ మొగుడిది. తను చెప్పింది – ‘శరీరమన్నాక కొన్ని అవయవాలు వ్యర్థ పదార్థాలను విసర్జించక తప్పడు. చెమట రావడం, మట్టి చేరడం అన్నీ జరుగుతాయి కదా! శుభ్రం చేసుకోకపోతే ఎలా?’ అని. ‘ఫారిన్లో వారానికోసారి స్నానం చేస్తారు. చలి దేశాల్లోనే కాదు, వేడి వున్న చోట్లలో కూడా. వారి కేమవుతోంది? ఆవులు, గేదెలూ రోజూ స్నానం చేస్తున్నాయా?’ అంటూ అడ్డంగా ఆర్గ్యూ చేస్తారాయన. ‘పశువులకు, మనకు తేడా లేదా?’ అంటే ‘మనిషంటే మాట్లాడే పశువని తెలుసుకో. అంతే తేడా’ అంటారు. ఎలా వేగడం?

తనవరకు తాను అపరిశుభ్రంగా వుంటూ రూమ్మేటుగా ఉంటే ఏదో ముక్కుకి గుడ్డ కట్టుకొని కాలక్షేపం చేసేది. కానీ మొగుడై పోయాడే! దూరంగా మసలగలదా? వచ్చి పక్కన చేరతాడు. ఏదో సినిమాలో చూసాట్ట. అప్పణ్నుంచి పాచి పళ్ళతోనే కాఫీ తాగడం, తనను ముద్దివ్వమని చంపడం. తానివ్వనంటే అలుగుతాడు. కోపగించు కుంటాడు. ఏం చేస్తుంది? ఇచ్చి మళ్ళీ పళ్లు తోముకుంటుంది. ఆయన మాత్రం పేపరు చదివాక ఏ తొమ్మిది గంటలకో బ్రష్ చేసుకొంటాడు. రాత్రుళ్లు తనది యమయాతన. చెమట వాసన, అనవసరమైన రోమాలు, కంపునోరు, కళ్లు మూసుకుని కానిమ్మంటుంది. మళ్లీ అది పనికి రాదు. తనూ ‘ఎంజాయ్’ చేయాలిట!

తను సూచించిన ప్రకారం మసలుకుంటే కుదరదట. అబ్బే అలా బావుండదట. కేవ్‌మన్‌ సెక్స్ కావాలట. అంటే పశుప్రాయంగా రమించడం అన్నమాట. అదే నిజమైన శృంగారానుభవంట. ఈ పైపై మెరుగులన్నీ బూటకంట. శుచీ, శుభ్రం అంటూ తాపత్రయ పడే నాగరీకం అసహజమైనదట. గుహల్లో వుండే మనుషులు పశుపక్ష్యాదులను చూసి ఎలా అనుకరించారో అలాగే మనమూ చేయాలిట. ‘అయితే పచ్చి మాంసం అలాగే తినచ్చుగా? వండి పెట్టమని నన్ను చంపుకు తినడం ఎందుకు?’ అంది తనోసారి ఒళ్లు మండి. ‘తిందును గానీ చిన్నప్పణ్నుంచి అలవాటు చేయలేదు. అందుకే నీకు ముందునుంచే ఈ కేవ్‌మన్ సెక్స్ అలవాటు చేస్తున్నాను. మొదట్లో యిబ్బంది పడినా తరువాత సర్దుకు పోతావు. ఆ తర్వాత ఎంజాయ్ చేస్తావ్.’ అంటారు.

అసలు తనని చూసి ఆశ్చర్య పడతారాయన. 'పెళ్లయ్యే దాకా టూత్‌పేస్టు ఎడ్వర్టయిజ్‌మెంట్లు ఒత్తి హంబగ్ అనుకునేవాణ్ణి. ప్రియుడో, మొగుడో దగ్గరకు వస్తే నోటి దుర్వాసన అంటూ దూరంగా పెట్టరెవరూ అనుకునే వాణ్ని. అంటే నీలాటి వాళ్లింకా లోకంలో వున్నారన్న మాట’ అన్నాడోసారి, సగం ఆశ్చర్యంగా, సగం వెకసెక్కంగా! తనకేం జవాబు చెప్పాలో తెలియలేదు. ‘ఏం పాచి నోరు కంపు కొట్టదా?’ అని అడిగింది. ‘నీదో చాదస్తం. గట్టిగా త్రేన్చినా ఏడుస్తావు. ఆవలిస్తే చెయ్యి అడ్డం పెట్టుకోకపోతే కొంప మునిగి పోతుందంటావు. మనిషి మీద ప్రేమ వుంటే ఇవేమీ అడ్డు రావు.’’ అంటాడాయన. ప్రేమకీ, దీనికి సంబంధమేమిటి? పోనీ ఆయనన్నట్టే తనకి ఇటువంటి విషయాల్లో అనవసరమైన పట్టింపులనుకొందాం. కానీ ఎంగిలి మాటేమిటి?

ఓ సారి వాళ్ల అన్నగారు వచ్చాడు. కాఫీ ఇస్తే కొద్దిగా తాగి ‘పంచదార ఎక్కువైంది. నేను సుగర్ పేషంటుని, ఇంత తాగకూడ’దంటూ వదిలేసాడు. ‘‘పోనీ ఇలా ఇచ్చేయ్, నాకిచ్చిన కాఫీ సరిపోలేదు’’ అంటూ ఈయన చటుక్కువ తాగేసారు. తనకి అసహ్యం వేసింది. కొద్దిసేపయ్యాక ఆయన వెళ్లాక, ఈయన తనని ముద్దాడబోయేరు. “వెళ్లి నోరు కడుక్కుని రండి’’ అని బలవంతం చేసింది. ‘‘మీ నోట్లో మీ అన్నయ్యగారి ఎంగిలి వుంది కదా. ఆయన ముద్దు పెట్టినట్టవదూ’’ అని. కారణం చెప్పాక తను ఇంకా లోకువై పోయింది.

‘‘ఏమిటీ, వాడి ఎంగిలి నోట్లో యింకా కూచుందా? అది పొట్టలోకి ఎపుడో వెళ్లిపోయి వుంటుంది. అయినా చిన్నప్పటి నుంచి వాడూ, నేనూ ఒకరి ఎంగిలి మరొకళ్లం తినేవాళ్లం. కొంత మంది ఫ్రెండ్స్ ఎంగిలి ఇప్పటికీ తింటాను. అప్పుడు ఎన్నోసార్లు ముద్దు పెట్టించుకున్నావు. ఇవాళ ఇది నీ ఎదుట జరిగింది కాబట్టి వద్దంటున్నావు. ఆ మాట కొస్తే హోటల్లో, ఫంక్షన్లలో ఎంతమంది ఎంగిలి తింటామో! అసలు ఎంగిలి మన ఇండియాలో తప్ప వేరే ఎక్కడా లేదు తెలుసా? నీ చాదస్తం మార్చడానికైనా ముద్దు పెట్టుకు తీరాలి. సెక్స్ అనేది స్వభావసిద్ధంగా కోర్స్ అండ్ రా, మొరటైనది, ముతకదీ అని గ్రహించు’’ అంటూ బలవంతాన ముద్దు పెట్టుకున్నారు. తనకు వాంతి వచ్చినంత పనయింది. తన మొహం చూసి ‘ఉండు నీ పని చెప్తా’ అన్నారు.

రాత్రి నాటు సారా తాగి వచ్చారు. ఫ్రెండ్స్ ఎంగిలి చేసినది కూడాట. గొప్పగా చెప్పారు. ‘నోటి జోలికి రాకండి. మిగతాదంతా మీ యిష్టం. తర్వాత డెట్టాల్ పెట్టి కడుక్కొంటా’ అంది తను. కానీ వినందే, తనకు బుద్ధి చెప్పి సరైన దారిలో పెట్టాలిట, సినిమాల్లో హైక్లాస్, పొగరుబోతు పెళ్లాలకు హీరోలు యిలాగే బుద్ధి చెప్పారట. ఆ తర్వాత పెళ్లాలు వాళ్లని పట్టుకుని వదలలేదట. మోటు సరసానికి పడని మగువ ఉండదట. తను గింజుకుంటున్నా ముద్దు పెట్టేశారు. తనకు నిజంగా వాంతి వచ్చేసింది. జాలి పడక పోగా ‘మూడంతా పాడయింది’ అంటూ తిట్లు.

ఆ సంఘటన తర్వాత తను అలిగి గోల చేయడంతో కాస్త ఉధృతం తగ్గింది. కరోనా రోజుల్లో  భయపెట్టి కాళ్లూ, చేతులూ కడిగించింది. తిట్టుకుంటూ కొన్నాళ్లు చేసి, మానేశాడు. అదేమిటంటే ‘నా బోటి నాటుగాళ్లకు ఇమ్యూనిటీ ఉంటుంది. నీలాటి క్లీన్ అండ్ గ్రీన్ గాళ్లకే రిస్కెక్కువ’ అన్నాడు. ఎంత గోల చేసినా ఏదో మొక్కుబడిగా, అదీ తన ఎదురుగానే చేయడం తప్ప, ఆయనకు వీటి మీద బొత్తిగా ‘కన్విక్షన్’ లేదన్న సంగతి, జన్మలో మారడన్న సంగతి ఇవాళ పొద్దున తేటతెల్లంగా తెలిసింది.

తెల్లవారుఝామున మూడున్నరకి ఎవరిదో ఫ్రెండ్ పెళ్లి. తనొక్కరూ వెళ్తానన్నారు. మూడు గంటలకు లేపమన్నారు. కానీ అలారం సరిగ్గా మోగలేదు. మూడుంపావుకి హఠాత్తుగా మెలుకువ వచ్చి లేపితే ఆదరా బాదరగా, మొహమైనా కడుక్కోకుండా బట్టలేసుకుని బండెక్కారు. తను నిద్ర పోయింది. నాలుగున్నరకు తిరిగొచ్చారు. తలుపు తీయగానే తనను పట్టుకుని మంచం మీదకు తీసుకొచ్చి మంచం ఎక్కేశారు. ‘‘అదేమిటి? బట్టలు మార్చుకోరూ? వీధిలో తిరిగిన బట్టలతో కాళ్లు కడుక్కోకుండా మంచం ఎక్కేయడమే?’’ అని తను అంటున్నా వినిపించుకోకుండా తనని ఆక్రమించుకో సాగారు.

అక్కడ పెళ్లిలో సీతాకోక చిలకలని ఎవరైనా చూసి మూడ్‌లోకి వచ్చేసి వుంటారు. ఆ తాపం తగ్గేదాకా ఊరుకోరేమో అనుకొని ఆ మాటే అడిగింది. ‘ఏడిశావులే, ఇలాంటి ప్రశ్నలు ఇక అడక్కుండా నోరు మూసేయ్యాలి’ అంటూ మీదకి వంగబోతే తను అభ్యంతరపెట్టింది. ‘పళ్లు తోముకోలేదు, పెళ్లివారిచ్చిన కాఫీ తాగేసి కూడా వచ్చారు. పైగా ఇదొకటా’ అనబోతున్నా వినిపించుకోలేదు. అంతా అయ్యేక ఆయన గుర్రుకొట్టి నిద్రపోతుంటే తనకు ఏడువు వచ్చింది.

విడాకులు తీసుకోవాలనిపిస్తోంది. ఏమిటీ మనిషి తత్వం? తనకు తోచడు. చెబితే వినరా? తనది చాదస్తమే కావచ్చు. చెబితే అర్ధం చేసుకోవద్దా? తన ఫీలింగ్స్‌కి ఏ విలువా లేదా? తన మాటకు విలువ లేదా? పెళ్లయితే చాలు పార్టనర్ శరీరాన్ని ఎలా పడితే అలా వాడుకునే సర్వహక్కులు సిద్ధిస్తాయా? భార్యకూ అలాంటి హక్కు లుంటాయా? తనూ చింపిరి జుట్టేసుకుని తల బరుక్కుంటూ, ఒళ్లు గీరుకుంటూ తయారయి ‘అదియే ప్రేమ, అసలైన ప్రేమ’ అంటే!? తను అలా వేషం వేయగలదా?

భార్య చెప్పినది చలానికి ఇంట్రస్టింగ్‌గా తోచింది. ఆవేళ రూపిణి “మన పక్కింట్లో వడ్డీ వ్యాపారస్తుడున్నాడు కదా. ఆయన భార్య వనజ గారు నాకు ఫ్రెండే. వాళ్లీ మధ్య ఎవరో సినిమా వాళ్లకు ఫైనాన్స్ ఇచ్చారట, వాటా తీసుకున్నారట కూడా. వాళ్లు ఏదో డాన్సు సీక్వెన్సు షూటింగ్ కోసమని మనూరొచ్చారట. మీవారి పెర్సనాలిటీ బాగుంటుంది కదా! ఏవైనా ఇంట్రస్టెడా? అని అడిగిందావిడ’’ అని చెప్పింది.

‘‘డాన్స్ చేయడం అంటే మైదానంలో హీరో హీరోయిన్ల డాన్సాడుతూంటే వెనక గెంతే బ్యాచా?’’

‘‘ఛ ఛ అది కాదండి. ఏదో డాన్సింగ్ హాల్లో సీనట. హీరో హీరోయిన్లు పాట పాడుకుంటూంటే వెనకాల అయిదారు జంటలు ఇంగ్లీషు డాన్సులాటిది చేస్తారట. కాస్త గాఢంగా కౌగిలించుకుని ఊగుతుంటారుగా! దానికి రఫ్, టఫ్ మొగాళ్లు కావాలని చూస్తున్నారేమో అందుకే మీ గురించి అడిగారనుకొంటా’’ అంది రూపిణి చిరునవ్వు నవ్వుతూ.

“చూశావా? నేను చెప్పలా? మాస్క్యులైన్ ఫీచర్స్ అంటే రఫ్‌గా, బ్రూటల్‌గా వుండాలి. సినిమాల్లో కాబరే డాన్సులు చూడు. డాన్సరు తుమ్మమొద్దులా వున్న వాణ్ని పట్టుకొని వేళ్లాడుతుంది తప్ప నాజూగ్గా ములక్కాడలా వున్న వాడి కేసి తిరిగి కూడా చూడదు.’’

‘‘బాబూ, మీ థియరీలకో దణ్ణం. అడిగేరు. ఇష్టమైతే చేయండి. లేదంటే ఊరుకోండి. లెక్చర్లు వద్దు.’’

‘‘పోన్లే, దానికేముంది, ఓ సారి చేసి చూద్దాం. ఉన్న ఊళ్లో ఛాన్స్. నీకేమీ అభ్యంతరం లేనప్పుడు ట్రై చేయడంలో తప్పేముంది? షూటింగెప్పుడట?’’

‘‘ఎల్లుండి పొద్దున్న ఏడున్నరకి. రామారం జమీందారుగారి బంగళా అద్దెకు తీసుకున్నారట. ఆ హాల్లోనే డాన్సు సీను తీస్తారట’’

షూటింగ్ నుంచి తిరిగొస్తూనే చలం తలంటుకొని స్నానం చేశాడు. ఏమీ తినకుండా, తాగకుండా మంచం మీద వాలేడు. ‘‘ఏం అలా వున్నారు. మీ వేషం తీసేసారా?’’ అని అడిగింది రూపిణి.

‘‘తీసేసినా బాగుండును. ఆ దరిద్రం తప్పేది. వాంతులు రావడం ఒక్కటే తక్కువ.’’

‘‘ఏమైంది?’’

‘‘ఏం చెప్పమంటావ్, నాతో బాటు డాన్స్ చేసిన ఆర్టిస్టు ఆ టైపనుకొంటాను. మనిషి బాగుంటుందిలే. రాత్రంతా బేరాలొప్పేసుకుని ఉంటుంది. అసలే మనవాళ్లకి సినిమా వాళ్లంటే వెర్రి. ఏ హైదరాబాదో వెళ్లక్కర్లేకుండా ఇక్కడే దొరుకుతోందంటే క్యూలో నిలబడి పోయి వుంటారు. కష్టం తట్టుకోవడానికో, కస్టమర్లను ఖుషీ చేయడానికో చెడ తాగేసింది. ఒకటే కంపు. షూటింగ్‌కి వచ్చేదాకా కార్యక్రమాలు సాగాయేమో, కళ్లు, పళ్లు, ఒళ్లు ఏదీ కడుక్కోకుండా మొహం మీద మేకప్పేయించుకుని తయారై పోయింది. ఆ డాన్సు డైరెక్టరు గాడు పైనా కిందా మొహం అక్కడ పెట్టు. యిక్కడ పెట్టు అంటాడు నన్ను. చీదర పుట్టినా మొహం మాత్రం తన్మయత్వంలో మునిగి తేలినట్టు పెట్టాలిట. మధ్యలో వచ్చేస్తానంటే బాగుండదని ముక్కూ, నోరూ మూసుకుని భరించి వచ్చాను. గొప్ప మహాతల్లి దొరికిందిలే. నోరిప్పితే పచ్చి బూతులు మాట్లాడుతుంది. భరించలేం. వేరే డాన్సరుతో ట్రై చేసి చూస్తానంటే కంటిన్యుటీ పోతుంది, కుదరదన్నాడు వెధవ.’’

‘‘మీరు కేవ్‌మన్ కదాని మీకు జోడీగా కేవ్ విమన్ను వెతికి కుదిర్చారేమో’’ అంది రూపిణి నవ్వు ఆపుకుంటూ. చలానికి కోపం వచ్చింది. ‘‘ఏం వేళాకోళంగా వుందా? నేనంత అసహ్యంగా, మురికిగా వుంటానా?’’ అంటూ చివ్వున లేచాడు. “తనదాకా వస్తే కానీ ఎవరికీ తెలియదు లెండి... వదిలేయండి. ఒక రోజుతో వదిలింది దరిద్రం.’’ అంది రూపిణి. ‘‘పాట షూటింగంటే ఒక రోజులో తేల్తుందేమిటి? ఇంకో మూడు రోజులు కచ్చితంగా ఉంటుంది. అదీ ఆ హీరోహీరోయిన్లు సరిగ్గా చేసి ఛస్తే..’’

‘‘అమ్మో, యీ నరకమేదో టీవీ సీరియల్లా ఉందే!’’ అని రూపిణి విస్తుపోతూండగా, చలం ‘‘అందుకే నువ్వెళ్లి వనజగారికి చెప్పేయ్, మా ఆయన రేపణ్నుంచి రాడని.’’ అన్నాడు కోపంగా.

‘‘అమ్మో, వాళ్లస్సలు మంచివాళ్లు కాదు. బాకీ పడ్డవాళ్లను రౌడీల చేత చావగొట్టించడం చూశాను. మీ కారణంగా యీ రోజు షూటింగంతా మళ్లీ తీయాల్సి వస్తుందంటే... ఎంత ఖర్చు! తాట తీసి, తోలు వలిచి లాక్కెళతారు. బాబోయ్, తలచుకుంటేనే భయం వేస్తోంది.’’ అంది రూపిణి గుండెల మీద చేయి వేసుకుని.

చలం జావ కారిపోయాడు. ‘‘ఔను, నేనూ చూశాను. పరమ కర్కోటకులు. నవరంధ్రాలూ మూసుకుని షూటింగు ముగించుకుని బయట పడాల్సిందే.’’ అన్నాడు దీనంగా.

షూటింగు వారం రోజులు సాగింది. రోజూ యింటికి రాగానే చలం కాస్సేపు శివతాండవం చేసి, ఆ తర్వాత డెట్టాల్‌ను కాలకూట విషంలా పుక్కిటా, గొంతునా పట్టి, ఫినాయిల్‌తో తలారా స్నానం చేసేవాడు. నెల్లాళ్ల దాకా భార్య దగ్గరకి రాలేదు. ఆ తర్వాత కూడా తనది నాటు పద్ధతి అని చెప్పుకోవడం మానేశాడు. అలవాట్లు మార్చుకోసాగాడు. భర్తలో కనబడిన మార్పుకి సంతోషించింది రూపిణి. తన లాజిక్ పని చేసింది. వనజ గార్ని బతిమాలి మొగుడికి వేషం ఇప్పించినప్పుడే అనుకొంది, ‘ఇలాంటి ఆర్టిస్టెవరో తగులుతుంది, మొగుడికి బుద్ధి వచ్చి తీరుతుంది’ అని. తన అంచనా తప్పలేదు’ అని సంబరపడింది.

వ్యథా వనితాయణం సీరీస్‌లో మరో కథ వచ్చే నెల తొలి వారంలో..

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రియల్ 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?