Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍ కథ: సంశయనివృత్తి

ఎమ్బీయస్‍ కథ:  సంశయనివృత్తి

‘‘మీరంతా కథలు చెప్తూంటే నాకూ చెప్పాలనిపిస్తోంది. ఇది నేను విన్నది కాదు. ఇన్వాల్వ్ అయినది..’’ అంటూ మొదలుపెట్టాడు తేజేశ్వర్రావు అనే పోలీసధికారి.

‘‘మొత్తం మీద చూస్తే  పోలీసువాళ్లే ఎక్కువ కథలు చెప్తున్నట్లున్నారు.’’ అన్నారు ముఖ్యమంత్రిణి చిరునవ్వుతో.

‘‘ఈ అద్భుతాలూ అవీ నేరాల విషయంలోనో, అవి బయటపడడం విషయంలోనో హైలైట్ అవుతాయండి. నేరం అనగానే పోలీసు పిక్చర్‌లోకి వచ్చేస్తాడు కదా’’ అన్నాడు తేజేశ్వర్రావు. ‘‘ఇంతకీ దీని సంగతేమిటంటే – కొన్నేళ్ళ క్రితం మా ఫ్రెండు విష్ణు వచ్చి ఓ సహాయం అడిగాడు. అతని చెల్లెలు డివోర్సీ. మొదటి భర్తకు విడాకులు యిచ్చి రెండో పెళ్లికి సంబంధాలు చూస్తున్నారు. ఈ మధ్యే ఒక అబ్బాయి, హరనాథ్ అని.. అతని సంబంధం వచ్చింది. మనిషి రూపం, ఉద్యోగం, ఆస్తి అన్నీ బాగానే ఉన్నాయి. అతనూ డివోర్సీయే. భార్య విడాకులిచ్చి ఫారిన్ వెళ్లిపోయిందని చెప్పాడు. కాంటాక్ట్ చేసి క్రాస్‌చెక్ చేసుకుంటాం, నెంబరివ్వండి అని వీళ్లు అడిగితే ‘మూడేళ్ల క్రితం వెళ్లినపుడు న్యూజెర్సీ వెళుతున్నానంది. ఆ తర్వాత వేరే స్టేట్‌లో ఉద్యోగం చూసుకుని వెళ్లిపోయింది అని విన్నాను. మా మధ్య కాంటాక్ట్ లేదు. ఇచ్చిపుచ్చుకొనే విషయాలన్నీ ఎప్పుడో తేల్చేసుకున్నాం. అవసరం ఏమీ పడటం లేదు.’ అన్నాట్ట. సరేనని యీ ప్రపోజల్ కన్సిడర్ చేసి, వ్యవహారం ముందుకు నడిపిస్తూ ఉంటే మా వాడికి ఎవరో చెప్పారట - అతని భార్య ఆత్మహత్య చేసుకుందని, యితనే కారణమని పుకార్లు వచ్చాయని!

దాంతో విష్ణు వెళ్లి హరనాథ్‌ని నిలదీశాడు, నిజమేమిటో చెప్పు అని. అప్పుడు హరనాథ్ ‘నిజమే ఆత్మహత్య చేసుకుంది. కారణమేమిటో తెలియదు. సహజంగానే నాపై అనుమానాలు వచ్చాయి. సత్యప్రమాణంగా ఎందుకు చేసుకుందో నాకు అర్థం కాలేదు. మా మధ్య ఏ గొడవలూ ఉండేవి కావు. అన్యోన్య దాంపత్యం నాది. ఉన్నట్టుండి ఉరేసుకుంది. పోలీసుల వచ్చి యిన్వెస్టిగేట్ చేశారు. ఏదీ రుజువు కాలేదు. ఎవరో ఏదో అనుకున్నా నాకు ఏ యిబ్బందీ కలగలేదు. కానీ ఎప్పుడైతే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నానో అప్పణ్నుంచి చిక్కులు వచ్చాయి. ఆత్మహత్య చేసుకుంది, కారణమేమిటో తెలియదు అని నిజాయితీగా చెప్పినా పెళ్లాడడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఏడాదిలో పది సంబంధాలు వెనక్కి వెళ్లిపోయాయి. నిజంగా తనను చంపేసి, ఆధారాలు దొరక్కుండా చేసి, తప్పించుకున్నానని నమ్మసాగారు. నిజమో అబద్ధమో విచారణ చేసి కనుక్కోవలసిన అవసరం మనకేముంది? వేరే సంబంధం చూసుకుంటే పోలా! అనుకున్నారు. వాళ్లదీ తప్పు లేదు. ఇకపై ఎవరొచ్చినా ఆత్మహత్య సంగతి చెప్పకూడదు అనుకున్నాను. అలా అనుకోగానే మీరొచ్చారు.’ అన్నాడతను.

ఇదంతా చెప్పి విష్ణు ఆనాటి కేసు వివరాలు కనుక్కో అని అడిగాడు. అనుమానం మనసులో పెట్టుకుని యీ ఆచూకీ ఎందుకురా, యింకోటి చూస్కోండి అన్నాను. ‘నీకేం ఏమైనా చెప్తావ్, సంబంధాలు దొరకడం అంత యీజీయా ఏమిటి? మనమ్మాయిదీ డివోర్స్ కేసే కదా. పాత మొగుణ్ని అడిగితే పొగరుబోతుని, తిరుగుబోతని ఎన్నయినా చెప్పవచ్చు. అవన్నీ నిజాలా? ఇతన్ని నమ్మాలని అనిపిస్తోంది మాకు. మోసపోతున్నామా అనే భయం వెనక్కి లాగుతోంది’ అన్నాడు విష్ణు.

సరే అని రికార్డులు తిరగేస్తే ధీరజ్ అని నా కొలీగే, అతను డీల్ చేసినట్లుంది. అతనున్న ఊరెళ్లి వెళ్లి అడిగాను, ఆధారాల సంగతి అలా ఉంచు. నీకేం తోచింది? నీ గట్ ఫీలింగేమిటి, అది చెప్పు చాలు అన్నాను. ‘అది హత్య కాదు, ఆత్మహత్యే, దానిలో అనుమానం లేదు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం యిది అని రాసిన ఉత్తరం అదీ ఏమీ లేదు, బ్రదర్. అతనికి ఎలైబీ గట్టిగానే ఉంది. బంధువుల పెళ్లి పార్టీలో ఉన్నాడు. వందమంది సాక్ష్యం చెప్పగలరు. అవేళ భౌతికంగా హింసించి చంపలేదు, అంత వరకు చెప్పగలం. కానీ అనుమానించి, మానసికంగా హింసించి, ఆత్మహత్యకు ప్రేరేపించాడేమో మనకేం తెలుసు? ఇలాటివి హత్యలుగా చూపించలేం కదా. అగాథా క్రిస్టీ ఓ నవలలో రాస్తుంది, ఓ ముసలి దంపతులకు సహాయంగా ఓ దూరపు బంధువు యింట్లో ఉంటుంది. కావాలని సమయానికి వాళ్లకు మందులివ్వదు. వాళ్లు చచ్చిపోతారు. ఆస్తి ఆమెకు వస్తుంది.

‘దీన్ని హత్యగా నిరూపించగలమా? ఏ టైముకి మందిచ్చిందో ఎవరైనా సిసిటివిలో రికార్డు చేయగలరా? పోస్టు మార్టమ్‌లో తెలుస్తుందా? ఒకవేళ తెలిసినా అబ్బే, వాళ్లే కాస్త ఆలస్యంగా వేసుకుంటామన్నారు అని ఆమె దబాయిస్తే..? అందుకే యివన్నీ తవ్వడం కష్టం. అందుకే ఆత్మహత్యే అని రిపోర్టిచ్చి క్లోజ్ చేశా. మీడియా మాత్రం ఏదో చెత్త రాసింది. మామూలు చావంటే వాళ్లకేం లాభం? ఏదో మసాలా చల్లితే నాలుగు కాపీలు ఎక్కువ అమ్ముడుపోతాయి, నలుగురు వ్యూయర్లు పెరుగుతారు. వాళ్ల ఏడుపు వాళ్లది, దానికి మనమేం చేస్తాం?’ అన్నాడు ధీరజ్. ఆ విషయం మొత్తం మా ఫ్రెండు విష్ణుకి చెప్పి, ‘ఆ అబ్బాయి ప్రమేయం లేదని స్పష్టంగా తెలుస్తోంది. మానసికంగా టార్చర్ చేశాడా లేదా అన్నది ఎవరూ తేల్చలేరు. ఆ మాటకొస్తే మీ సిస్టర్ కూడా మొగుణ్ని హింస పెట్టిందేమో అనే అనుమానం అవతలివాళ్లకు వస్తుంది కదా. అందుచేత శంకలు మాని ముందుకెళితే మంచిది’ అని సలహా యిచ్చాను. వాడు సరేనని తలూపి వెళ్లాడు.

ఇంకో రెండు వారాల తర్వాత ఎక్కడో తారసిల్లితే ఏమైందని అడిగాను. ‘మా చెల్లెలికి చెప్పాను. అంతా బాగానే ఉంది, అతను అమాయకుడని నమ్ముతున్నాను. ఈ విషయం అతనే డైరక్టుగా చెప్పి ఉంటే ఒప్పుకుందును. కానీ అనవసరంగా అబద్ధం చెప్పాడని కోపంగా ఉంది. డ్రాప్ చేద్దామంది.’ అన్నాడు. నాకు కోపం వచ్చింది. ‘అతను అబద్ధం చెప్పాడన్న సంగతి మీకు ముందే తెలుసు. అయినా నిజానిజాలు తెలుసుకుందామని నన్ను వాకబు చేయమన్నావు. తీరా శ్రమపడి తెలుసుకుంటే యిప్పుడు యిలా చెప్తున్నావు. నాకేం పని లేదనుకుంటున్నావా?’ అని తిట్టాను. ‘నీ లాజిక్ కరక్టే. నాకు తట్టలేదు. ఉండు, మా సిస్టర్ని అడుగుతాను.’ అని వాడు వెళ్లబోయాడు. ‘అక్కర్లేదులే, నాకోసం మీరు మనసు మార్చుకోనక్కర లేదు. సంబంధం వదులుకుందా మనుకుంటే వదులుకోండి. అది నా సమస్య కాదు.’ అన్నాను యింకా కోపంగానే. ‘నీ కోసం కాదురా, నా కోసమే. నాకూ మా చెల్లెలి పద్ధతి బోధపడటం లేదు. ఆ హరనాథ్‌ను చూస్తే మంచివాడిలాగానే ఉన్నాడు. అందుకని..’’ అన్నాడు బతిమాలుతూ. ‘మీ చావు మీరు చావండి.’ అని వాణ్ని తోలేశాను.

తర్వాత ఒక పదిహేను రోజులకనుకుంటా, మా విష్ణు చెల్లెలు, తన పేరు మహతి, వచ్చింది. తన వింత అనుభవం గురించి చెప్తానంటూ కూర్చుంది. సరే కానీయమన్నాను. తను వైజాగ్ వెళ్లి, ముందు రోజు రాత్రి ట్రెయిన్‌లో తిరిగి వచ్చిందిట. కూపేలో సీటు వచ్చింది. వైజాగ్‌లో ఒక్కతే ఉంది. తునిలో కాబోలు, యింకో అమ్మాయి ఎక్కింది. ఇద్దరూ అమ్మాయిలే కాబట్టి కబుర్లు చెప్పుకున్నారు. కాస్సేపు అవీయివీ మాట్లాడాక ఆ అమ్మాయి పెళ్లయిందా? అని అడిగితే మహతి తన మొదటి పెళ్లి, విడాకుల గురించి చెప్పింది. మళ్లీ పెళ్లి చేసుకొందామని చూస్తున్నామని చెప్పింది. ఆ అమ్మాయిని అడిగింది. ఆ అమ్మాయి నిట్టూర్చింది. చెపితే మీకు చికాకు పుడుతుంది అంది. ఫర్వాలేదు చెప్పండి అంది మహతి.

ఇక ఆ అమ్మాయి చెప్పింది – ‘నాకు పెళ్లయింది. మా ఆయన మంచివాడు. నన్ను ప్రేమగా చూసుకునేవాడు. కానీ నాకు మరో అతనితో పరిచయం ఏర్పడింది. అతనికి పెళ్లి కాలేదు. మా స్నేహం మోహంగా మారింది. వద్దువద్దనుకుంటూనే అతనితో చాలా దూరం వెళ్లిపోయాను. అతన్ని విడిచి ఉండలేననిపించింది. అతని పరిస్థితీ అలాగే ఉంది. అతను బాగా చదువుకున్నాడు. మంచి ఉద్యోగం ఉంది. కావాలంటే ఫస్ట్‌క్లాసయిన అమ్మాయిని చేసుకోవచ్చు. కానీ నేనంటే ప్రాణం పెట్టేవాడు. మా ఆయనకు చెప్పేసి విడాకులు తీసుకుని అతన్ని చేసుకోవచ్చు. కానీ ఏ కారణం చెప్పి విడాకులు తీసుకుంటాను? మా ఆయన నన్ను కట్నం తెమ్మని అడగలేదు, అనుమానించలేదు, హింసించలేదు. అతి సౌమ్యంగా ఉండేవాడు. అసలు ఆయన ఎదుట ‘నేను యింకో అతనితో ప్రేమలో పడ్డాను, మిమ్మల్ని విడిచి వెళ్లిపోతాను’ అని చెప్పడం సాధ్యమా? చెప్పకపోతే విడాకులు ఎలా యిస్తాడు? ఈ సమస్యను రవి, అదే ఆ అబ్బాయి పేరు.. రవితో చెప్తే ‘ఏమీ చెప్పకుండా లేచిపోతే సరి’ అన్నాడు.

విడాకులు తీసుకోకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటే నేరమౌతుంది కదా అని అడిగాను. ‘ఎవరైనా కేసు పెడితే కదా! నేను ఢిల్లీలో ఓ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాను. రాగానే ఎవరికీ తెలియకుండా మనం లేచిపోదాం. మనం ఎక్కడున్నామో మీ ఆయనే కాదు, ఎవరూ ఊహించలేరు. ఎవరూ వచ్చి గొడవ పెట్టలేరు. ఢిల్లీకి వెళ్లాక అక్కడ గుళ్లో పెళ్లి చేసేసుకుందాం. మా వాళ్లకు నీ గతం తెలియదు కదా, కన్యవే అనుకుంటారు.’ అన్నాడు. నాకు యీ ప్లాను నచ్చింది. రవికి ఢిల్లీ ఉద్యోగం వచ్చేదాకా మా ఆయనతో కాపురం సాగిస్తూ, రవితో రహస్యప్రణయం కొనసాగించాను. మా ఆయనకు ఏ అనుమానమూ రాకుండా మామూలుగానే వ్యవహరించాను. చివరకు కొన్ని నెలలకు ఢిల్లీ ఉద్యోగం ఆర్డర్ చేతికొచ్చింది. మా ఆయన ఊళ్లో ఉండని ఒక రాత్రి వెళ్లిపోదామని ప్లాను చేశాం. ఆ రోజు దగ్గర పడుతున్నకొద్దీ నాకు భయం కలగసాగింది. నేనే లేచిపోయానని తెలియక నన్ను ఎవరో ఎత్తుకుపోయారనుకుని మా ఆయన పోలీసు కంప్లెయింటు యిస్తే పోలీసులు వెతుకుతారు కదా, ఒకవేళ మనల్ని ఢిల్లీ వచ్చి పట్టుకుంటారేమో అనే సందేహం కలిగింది.

రవితో అని చూశాను. ‘నీ మొహం, నువ్వు ఒకత్తివీ కనబడకపోతే ఎత్తుకు పోయారనుకోవచ్చు కానీ నీ బట్టలూ, నగలూ కూడా మిస్సవడం చూసి నువ్వే ఉడాయించావని అర్థం చేసుకుంటాడు. కుక్కిన పేనులా పడి వుంటాడు తప్ప పోలీసులకు ఫిర్యాదు చేసి పరువు పోగొట్టుకోడు’ అన్నాడు రవి నవ్వుతూ. అతను చెప్పినది నిజమే ఐనా మాట్లాడిన తీరు నాకు నచ్చలేదు. నేను నా సౌఖ్యం చూసుకుని వెళ్లిపోతున్నాను సరే, మా ఆయన పరువెందుకు పోవాలి? ఆయన్ని మనఃక్షోభ పెట్టి వెళితే నా కొత్తకాపురం సవ్యంగా సాగుతుందా? అనే శంక కలిగింది. బాగా ఆలోచించి ఓ రోజంతా కూర్చుని ఓ పెద్ద ఉత్తరం రాశాను. మీ తప్పేమీ లేదు, నేను రవిని విడిచి ఉండలేక పోతున్నాను కాబట్టి వెళ్లిపోతున్నాను. మీరు నా గురించి వెతికించకండి. ఎవరైనా అడిగితే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిపోయి, ఏదైనా మఠంలో చేరానని చెప్పండి. నమ్మినవాళ్లు నమ్ముతారు, లేనివాళ్లు లేరు. మా అమ్మానాన్నా యిప్పటికే పోయారు కాబట్టి పుట్టింటివాళ్లు ఎవరూ వచ్చి అడగరు. నేను చేస్తున్నదానికి క్షమించండి అంటూ విపులంగా రాశాను.

ఎందుకైనా మంచిదని ఆ ఉత్తరం రవికి చూపించాను. అతను వెంటనే దాన్ని చింపి ముక్కలు చేసేశాడు. ‘మతుందా లేదా? నువ్విలా రాస్తే నీతో ఎఫైర్ నడిపినవాడెవడాని అతను కూపీ లాగుతాడు. మనం కలిసి షికార్లు చేశాం, సినిమాలకు వెళ్లాం, నువ్వు మా రూముకి తరచుగా వచ్చేదానివి. ఎవరో ఒకరు మనల్ని జంటగా చూసేవుంటారు. మామూలుగా అయితే పట్టించుకోరు కానీ, యిన్వెస్టిగేషనంటూ మొదలుపెడితే గుర్తు చేసుకుంటారు. రవి అని పేరుతో ఎవరైనా కుర్రాడు వచ్చి పోయేవాడా అని మొదలుపెడితే తీగలాగితే డొంక కదిలినట్లు అంతా బయటకు వస్తుంది. మా యింటి యిరుగుపొరుగులను అడిగితే నీ పోలికలు చెప్పేయడంతో పాటు నా ఆఫీసు, ఉద్యోగం అన్నీ చెప్పేస్తారు. మా ఆఫీసుకి వెళితే నా కొత్త ఉద్యోగం తెలిసిపోతుంది. ఢిల్లీ వచ్చి పడతారు. పెళ్లయినదాన్ని లేపుకుని వచ్చినందుకు కేసున్నా లేకపోయినా మా కొత్త ఆఫీసు వాళ్లు వీడికి నీతి లేదనుకుంటూ ఉద్యోగం పీకేస్తారు.’ అంటూ తిట్టిపోశాడు.

‘‘నువ్వు చెప్పినది జరిగేందుకు ఆస్కారం ఉంది. కానీ మా ఆయన్ని ఏమీ తెలియని అయోమయ స్థితిలో వదిలివెళ్లడం నాకు అన్యాయంగా తోస్తోంది. ఆయన్నెందుకు క్షోభ పెట్టడం?’’ అన్నాను. ‘‘పెళ్లాన్ని ఏలుకోలేనివాడికి ఆ పాటి శిక్ష వేయడం తప్పు లేదులే’’ అని రవి పకపకా నవ్వి నన్ను దగ్గరకు లాక్కున్నాడు. నేనూ అప్పుడు నవ్వేశాను కానీ తర్వాత ఆలోచిస్తే మాది దుర్మార్గం అనిపించింది. ఆయన సరిగ్గా ఏలుకోలేక పోవడమేమిటి? నాకు ఏదీ లోటు చేయలేదు, శృంగారంతో సహా! తప్పు నాది, శిక్ష ఆయనకు! కానీ అప్పటి వ్యామోహంలో యివేమీ తోచలేదు. ఉత్తరం, గిత్తరం ఏమీ లేకుండా ఆయనకు షాకిచ్చి మాయమై పోదామనుకున్నాం. ఆయనకు యిప్పట్లో ఊరెళ్లే ప్రోగ్రాం ఏమీ లేదు. పగటిపూట సామానుతో సహా యిల్లు వదిలి వెళితే అందరి కళ్లలోనూ పడుతుంది కాబట్టి రాత్రే పారిపోవాలి. ఇవతల చూస్తే ఢిల్లీ ఉద్యోగం వాళ్లు ఎప్పుడొస్తావని రవిపై ఒత్తిడి తెస్తున్నారు.

చివరకు ఓ రోజు రాత్రి మా బంధువుల యింట్లో పెళ్లి ఉంటే నాకు ఒంట్లో బాగుండలేదు, మీరెళ్లండి అని ఆయన్ని పంపించి యింట్లో ఉండిపోయాను. సామాన్లన్నీ సర్దేసుకుని రెడీగా కూర్చున్నాను. తొమ్మిది గంటల ప్రాంతంలో రవి ఆటోలో సామాన్లు వేసుకుని వచ్చాడు. బయలు దేరబోతూండగా నాకో విషయం గుర్తుకు వచ్చింది. ఢిల్లీ వెళ్లాక చెప్దామనుకున్నాను కానీ యిప్పుడే చెప్పేస్తే మంచిదని ఎందుకు తోచిందో తోచింది. ‘రవీ, నేను గర్భవతిని’ అన్నాను. అతను ఆనందపడలేదు. నిర్ఘాంతపోయాడు. ‘ఎప్పుడు తెలిసింది?’ అన్నాడు. ‘అనుమానం ఉండింది. నిన్ననే కన్‌ఫమ్ అయింది.’ అన్నాను. ‘అబార్షన్ చేయించుకుంటే సరిపోతుంది’ అన్నాడు రవి. ‘అలా చేయించుకున్న వాళ్లకు మళ్లీ పిల్లలు పుట్టరట, మా ఫ్రెండ్స్ చెపుతూంటారు. గర్భం ఉంచుకుందాం. మనతో పాటే వాడూను. వాడో, అదో..’ అని నవ్వాను. ‘వాడో, అదో ఎవరి పిల్లాడో, పిల్లో..’ అన్నాడు రవి మొహం చిట్లిస్తూ. ‘అఫ్‌కోర్స్ అదీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనుకో..’ అన్నాను నేను. ‘మీ ఆయన పిల్లాణ్ని నేనెందుకు పెంచాలి?’ అన్నాడు రవి రౌద్రంగా.

నాకు కోపం వచ్చింది. ‘మా ఆయన పిల్లాడా, నీ పిల్లాడా అనేది నాకూ తెలియదు. నాకు తెలిసినదల్లా వాడు నా పిల్లాడు. నాతో పాటే వాడూనూ. నేను కావలసి వచ్చినపుడు, వాడు అక్కర్లేక పోయాడా?’ అన్నాను గొంతు పెంచి. ‘వాడు నా కొడుకైతే నాక్కావాలి. ఓ చవట గాడి కొడుకుని నేనెందుకు పెంచాలి? నా రెక్కల కష్టమంతా వాడి ఎదాన పోయాలా? నెవర్!’ అన్నాడు రవి ప్రతీ మాటా ఒత్తి పలుకుతూ. అతనలా మాట్లాడతాడని నేను ఊహించలేదు. మా ఆయన్ని చవట అనడం నాకు ఆగ్రహం తెప్పించింది. ‘ఆయన చవటేమీ కాదు, నాది చపలబుద్ధి అంతే!’ అని అరిచాను. ‘ఓహో, విడిచి పెట్టేవేళ అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? మొగుడి మీద అంత యిదే ఉంటే నాతో ఎందుకు కులికేవు?’ అంటూ వెక్కిరించాడు. ‘బుద్ధి లేక..’ అన్నాను కళ్లల్లో నీళ్లు ఆపుకుంటూ. ‘నన్ను యీ రొంపిలో లాగడానికి ముందు ఉండాల్సింది, యీ బుద్ధి’ అంటూ రెచ్చిపోయాడు.

నాకు అర్థమై పోయింది. అతనికి నేనంటే గౌరవం లేదనీ, రేపేదైనా అనుకున్న ప్రకారం జరగకపోతే నన్నే తప్పుపడతాడనీ. అబార్షన్ చేయించుకోవడానికి ఒప్పుకుంటే అతనితో గొడవ రాదు కదాని ఐదు నిమిషాల క్రితం వచ్చిన ఐడియా వచ్చిన మాట నిజమే కానీ, ‘రొంపిలో లాగడం’ అనే మాటతో దాన్ని మనసులోంచి తుడిచివేశాను. హాయిగా భర్తతో కాపురం చేసుకుంటున్నదానిపై వలపు వల విసిరి, యిన్నాళ్లూ అనుభవించి ఊబిలో దింపింది తను. ఇప్పుడు గర్భం వచ్చింది అనగానే మొత్తం పెర్‌స్పెక్టివ్ మారిపోయింది. నేను కావాలి, నా కడుపులో బిడ్డ అక్కరలేదు. ఇలాటివాణ్ని నమ్ముకుని నేను పారిపోవాలా? మా ఆయన నాకు సమకూర్చిన నగలూ, నాణ్యాలూ వీడి మొగాన పోయాలా? ‘నీ మాట వెనక్కి తీసుకుంటేనే, నేను నీతో వస్తాను, రవీ’ అని స్పష్టంగా చెప్పాను. అతను తగ్గలేదు. ‘కావాలనుకుంటే నాకు కన్నెపిల్లలు దొరుకుతారు. కొత్త ఉద్యోగం చూసి డబ్బున్నవాళ్లూ పిల్లను ఆఫర్ చేస్తారు. నీలాగ యిద్దరితో కాపురం చేసి, కడుపు తెచ్చుకునే దానితో కాంప్రమైజ్ కావలసిన అగత్యం నాకు లేదు. పోనీ కదాని...’ అంటూ ఏదో చెప్పబోతూండగా నాకు రోషం వచ్చింది. ‘..పోనీగీనీ అక్కర్లేదు. గుడ్‌బై. తక్షణం యిక్కణ్నుంచి వెళ్లిపో.’ అని అరిచాను. హమ్మయ్య అనుకున్నాడేమో వెంఠనే వెళ్లిపోయాడు.

నాకు మతి పోయింది. క్షణాల్లో అంతా తారుమారైనందుకు ఏడుస్తూ కూర్చున్నాను. అంతలో గుర్తుకు వచ్చింది, యింకో పావుగంటలో మా ఆయన తిరిగి వస్తాడని. నేను సర్దుకుని పెట్టుకున్న పెట్టెబేడ, ఖాళీ బీరువా చూసి ఆయనేమంటాడు? నేను ఏ సమాధానం చెప్పగలను? అనే ఆలోచన రాగానే గజగజ వణికిపోయాను. ఇక అక్కడ ఉండలేనను కున్నాను. జరిగినదంతా వివరంగా ఉత్తరంలో మా ఆయన పేర రాసి క్షమించమని కోరి బయటకు వచ్చేశాను. ఇక అప్పణ్నుంచి నా బతుకు నాదే...’ అని యిక్కడిదాకా చెప్పి ఆ అమ్మాయి ఏడవ నారంభించింది.’’

మహతి యిక్కడిదాకా చెప్పేటప్పటికి నాకు కుతూహలం పెరిగింది. ‘‘ఇంతటి వ్యక్తిగత విషయాలు నీకెందుకు చెప్పింది?’’ అని అడిగాను. ‘‘ఆ అమ్మాయి ఉద్దేశం ఏమిటి? ఇంతా చెప్పి, జాలి పుట్టించి, హెల్ప్ చేయమంటూ డబ్బడిగిందా?’’ అని అడిగాను.

‘‘రైల్లో ప్రయాణం చేసేటప్పుడు రాత్రవుతున్నకొద్దీ ఆంతరంగిక విషయాలు చెప్పేసే ప్రయాణీకులు మనకు తారసిల్లుతూంటారు కదా, ఈవిడా అలాటిదే అనుకున్నాను. డబ్బేమీ అడగలేదు కానీ ఏడుపు ఆపలేదు. కాస్సేపు ఊరడించే ప్రయత్నం చేశాను. ఆపకపోవడంతో విసుగొచ్చింది. రాత్రంతా యీవిడతో కూర్చుంటే నిద్రపోవడం కల్ల అనుకుని నేను దుప్పటి ముసుగుపెట్టాను. ఆవిడ పై బెర్త్ ఎక్కింది. తెల్లవారుఝామున అనుకుంటా నిద్ర లేపింది. ‘‘నా కష్టాలన్నీ చెప్పి మిమ్మల్ని చాలా యిబ్బంది పెట్టాను. ఏమీ అనుకోకండి.’’ అంది. ‘ఈ మాట చెప్పడానికా తల్లీ నన్ను లేపావ్’ అని మనసులో అనుకున్నా, పైకి అనలేదు. అంతలో లైటు వెలుగులో ఆమె మెడమీద గీతలు కనబడ్డాయి. రాత్రి మెడ చుట్టూ చీర కప్పుకుందేమో, కనబడలేదు. ఇప్పుడవి కనబడగానే ఏమిటవి? అన్నాను.

‘‘చెప్పానుగా, యింట్లోంచి బయటకు వచ్చేశానని. వచ్చేముందు ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాను.’ అంది. ఉలిక్కిపడ్డాను. ‘ఉరి వేసుకున్నా బతికారా? జారి పడ్డారా?’ అని అడిగాను ఆశ్చర్యంగా. ‘ఇదీ ఓ బతుకేనా?’ అంది నిర్లిప్తంగా. నాకేమనాలో తెలియక మౌనంగా ఉంటే అంతలో ఆమె ‘‘ఎలాగోలా కాలం నెట్టేద్దును కానీ నా బాధేమిటంటే, నేను రాసిన ఆ ఉత్తరం మా ఆయనకు అందలేదు. ఆ ఇన్‌స్పెక్టరు దాన్ని తన జేబులో పెట్టుకుని ఎవరికీ చూపించలేదు.’’ అంది.

నాకు ఏమీ అర్థం కాలేదు. ‘‘మీకెలా తెలుసు? నిన్ననేగా మీరు యింట్లోంచి బయటకు వచ్చింది’’ అన్నాను.

‘‘నిన్ననే అని మీకెవరు చెప్పారు? మూడేళ్ల మూణ్నెళ్లయింది.’’ అంది.

నాకు వెన్నెముకలో చలి పుట్టింది. ఈవిడేమైనా పిచ్చిదా అని అనుమానం వచ్చింది. ఇప్పుడే వాష్‌రూమ్‌కి వెళ్లి వస్తా అని కూపె బయటకు వచ్చేసి, టిసి ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని పిలుచుకుని వచ్చా. లోపల ఎవరూ లేరు. ఈవిడెక్కడికి పోయింది? ఈవిడ తన పేరు చెప్పలేదని గుర్తుకు వచ్చి యింతకీ యీ పాసెంజరు పేరేమిటి? అని టిసిని అడిగితే, మీతో పాటు ఎవరూ ఎక్కలేదంటాడు అతను. ఏమైనా కలగన్నారేమో అన్నాడు. ‘నాన్సెన్స్, ఎవరూ చూడకుండా ఆ అమ్మాయి పెట్టెలోకి ఎక్కేసి ఉంటుంది, మీరు సరిగ్గా చెక్ చేయటం లేదు.’ అన్నాను నేను. అతను భుజాలెగరేసి, ‘మీ సామాన్లేమైనా పోతే చెప్పండి. అప్పుడు చూదాం సంగతేమిటో’ అన్నాడు. సామాన్లేమీ పోలేదు.

‘ఆవిడ తనతో సామానేమైనా తెచ్చిందా?’ అని అడిగాడు. ‘నేను తునిలో వాష్‌రూమ్‌కి వెళ్లి నా కంపార్ట్‌మెంట్‌కి వచ్చేసరికి తనుంది. సీటు కింద సూట్‌కేసు ఏమైనా పెట్టిందేమో గమనించలేదు.’ అని చెప్పాను. అతను విసుక్కుని ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు.

నాకు నిద్ర పట్టలేదు. ఆవిడెవరు? మూడేళ్ల క్రితం ఉరి వేసుకున్న మనిషంటుంది. ఇన్‌స్పెక్టరు ఉత్తరం దాచేశాడంటుంది. నాకెందుకు చెప్పినట్లు? కొంపదీసి దెయ్యమా? ఎవరి దయ్యం? నాకేమీ అర్థం కాలేదు. రైల్వే స్టేషన్ నుంచి యింటికి వస్తూంటే హరనాథ్ భార్య ఉరి వేసుకున్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే మీ దగ్గరకు వచ్చాను.’ అని ముగించింది మహతి.

నాకూ ఏమీ అర్థం కాలేదు. కాస్సేపు ఆలోచిస్తే హరనాథ్ భార్యే మహతికి కనబడిందా అని తోచింది. రిడిక్యులస్ ఐడియా అనుకుంటూనే చెక్ చేస్తే తేలిపోతుంది కదానుకుని, రికార్డుల్లోంచి హరనాథ్ మొదటి భార్య ఫోటో తెప్పించి మహతికి చూపించాను. మహతి వెంటనే ‘ఈమెయే నాకు కనబడి, మాట్లాడింది.’ అంది. అంటూనే దెయ్యంతో అంతసేపు గడిపానా అని గుండె పట్టుకుంది. దయ్యాలున్నాయనే సంగతి నాకూ డైజెస్ట్ కాలేదు. ఇద్దరం కాఫీలు తాగుతూ రెండు గంటలు గడిపాం. విష్ణును పిలిపించి, వాడికి యిదంతా చెప్పాం. అంతా విని ‘నేను చెప్తున్నానా, ఆ అబ్బాయి మంచివాడని. మహతి చెవిన పెట్టలేదు.’ అన్నాడు. ‘ఇంతకీ ఉత్తరం దాచేసిన ఇన్‌స్పెక్టరెవడు? అతని వల్లనే కదా హరనాథ్‌కు చెడ్డపేరు వచ్చింది.’ అన్నాడు. అప్పటిదాకా ఆ దిశగా ఆలోచించనందుకు నుదురు కొట్టుకుని ధీరజ్ దగ్గరకు ప్రయాణమయ్యాను.

అతను కనబడగానే ‘‘హరనాథ్ విషయంలో ఉత్తరాన్ని ఏం చేశావు?’’ అని అడిగాను. ‘‘చెప్పానుగా..’’ అని అతను సమాధానం యివ్వబోతూండగానే ‘‘..నాకు తెలుసు. ఉత్తరం ఉంది. నువ్వు దాన్ని నాశనం చేశావ్.’’ అన్నాను. ‘‘నాకేం అవసరం?’’ అంటూ బుకాయించాడు. చివరకు దయ్యం సంగతి చెప్పాను. చచ్చిపోయినామె దయ్యమై తిరుగుతోందని, ఉత్తరాన్ని నాశనం చేసిన యిన్‌స్పెక్టర్‌పై పగ తీర్చుకుంటానంటోందని కలిపి చెప్పాను. అతను దాదాపుగా మూర్ఛపోయాడు. శవాన్ని చూడగానే హరనాథ్ పోలీసులకు ఫోన్ చేసి, ఏడుస్తూ ఓ మూల కూర్చున్నాట్ట. ధీరజే యిల్లంతా సోదా చేస్తూ, ఉత్తరాన్ని చూడగానే జేబులో పెట్టుకున్నాట్ట. కానిస్టేబుల్ కూడా గమనించలేదట. అందువలన దాన్ని కాల్చేసిన సంగతి నరమానవుడికి తెలియదు. తెలిసిందంటే అది మానవాతీత శక్తి అయి వుండాలని నమ్మాడు. దయ్యానికి శాంతిపూజలేమైనా ఉంటే చెప్పమని బతిమాలాడు.

‘‘ఇంతకీ ఎందుకు కాల్చేశావ్?’’ అని అడిగాను.

‘‘ఆ రవి మాకు బంధువే. మంచి ఫ్యూచరున్న కుర్రాడు. ఈ ఉత్తరం బయటకు వస్తే లేనిపోని గొడవల్లో చిక్కుకుంటాడని దాన్ని నాశనం చేశాను. ఎట్ ద సేమ్ టైమ్, భర్తకు శిక్ష పడకుండా, పోయినావిడకు చెడ్డపేరు రాకుండా చేశాను. అందరికీ న్యాయం చేశాననుకున్నాను కానీ యిప్పుడీ దెయ్యమేమిటండీ బాబూ, నా మీద కక్ష సాధిస్తానంటోంది..’’ అంటూ వణకసాగాడు...’’ అని తేజేశ్వర్రావు ఆగగానే సిఎం ‘‘కథ అర్థమై పోయింది లెండి. మహతికి హరనాథ్ మీద అనుమానం పోయి, పెళ్లి చేసుకుంది. అతని మొదటి భార్య తన భర్త పరిస్థితి చూసి జాలిపడి అతనిపై నింద పోగొట్టడానికి దెయ్యమై వచ్చి సమస్య పరిష్కరించిందన్నమాట. మామూలుగా ఎవరైనా చెప్తే కొట్టి పారేద్దును కానీ, మీరే చెప్పారు కాబట్టి నమ్మాల్సి వస్తోంది. ఇంతకీ కథలో దుష్టులకు మీరే శిక్ష వేశారో అది చెప్పండి.’’ అన్నారు.

‘‘ఏం వేస్తాం చెప్పండి. ధీరజ్ యిప్పటికీ భయపడి ఛస్తూనే ఉన్నాడు. భూతపూజలూ, తాయెత్తులూ అంటూ డబ్బులు తగలేస్తున్నాడు. మానసిక వ్యథే అతనికి శిక్ష. ఇక రవి అంటారా, ఏ సెక్షన్ కింద కేసు పెడతాం? ఏ ఆధారం చూపిస్తాం? హరనాథ్ భార్య ఆత్మహత్య తర్వాత గిల్ట్ ఫీలింగుతో అతనూ మానసికంగా క్షోభ అనుభవించి ఉంటాడు. అసలా అమ్మాయే విషయమంతా కాంప్లికేట్ చేసింది. మొగుడు తిరిగి వచ్చి సామానంతా సర్ది పెట్టేవేమిటి? అని అడిగితే ‘మా ఫ్రెండెవరికో అనారోగ్యం, అర్జంటుగా బయలు దేరాల్సి వస్తోంది అని చెప్పి ఉండాల్సింది. దొంగలు పడతారేమోనని నగలన్నీ మూటగట్టి మీ చేతికి యిస్తున్నాను అని చెప్పి ఉండాల్సింది. అలా అయితే భర్తతో, బిడ్డతో హాయిగా కాపురం చేసుకుంటూ ఉండేది. తెలివి తక్కువది, అందరికీ చిక్కులు తెచ్చిపెట్టింది. క్రైమ్స్ ఆఫ్ పేషన్ వలన సంబంధిత వ్యక్తులందరూ బాధపడతారు. మంచి మొగుడున్నా పక్కచూపులు చూసింది, తన తప్పుకు భారీ మూల్యం ప్రాణంతో చెల్లించింది. ఎఫయిర్స్ ప్రారంభించడం యీజీయేనండి. ఎలా ముగుస్తాయో అది మన చేతిలో ఉండదు. ఎమోషనల్‌గా హేండిల్ చేయలేని వాళ్లు యిలాటి వాటిల్లో దిగకూడదు...’ అన్నాడు తేజేశ్వర్రావు విరక్తిగా.

అతను చెప్పినది విని, కాస్సేపాగి, ముఖ్యమంత్రిణి ‘‘గట్టున ఉన్నవాళ్లు ఎన్నయినా చెప్పవచ్చండి. కానీ ఒకటి గమనించండి. ఆడవాళ్లు మోర్ ఎమోషనల్. అనుకోని విధంగా రవి కొట్టిన దెబ్బలోంచి కోలుకునే లోపే భర్త వచ్చేస్తున్నాడనే ఆదుర్దా ఆమెను ఆలోచింప చేయనీయలేదు. ఆ క్షణంలో ఆ యిబ్బందికర పరిస్థితిలోంచి పారిపోవడానికి ఆమెకు తోచిన ఏకైక మార్గం - చావు! దురదృష్టవంతురాలు. బతికున్నపుడు పొరపాట్లు చేసినా, చావు తర్వాత కూడా భర్త గురించి ఆలోచించి, అతనికి మేలు చేసే దొడ్డ గుణం ఉందని ఒప్పుకోవాలి...’’ అన్నారు.

అందరూ ఆమెను తలచుకుని సీరియస్‌గా ఉంటే వాతావరణం తేలిక పరచడానికి డాక్టరు గారు ‘‘ఇంతకీ ఆమె చేసిన మంచిపనికి గాను ఆమెకు పిశాచజన్మ నుంచి విముక్తి లభించిందంటారా, తేజాగారూ?’’ అని అడిగారు.

‘‘చందమామ కథైతే అదే ఆఖరి వాక్యమయ్యేది. పోలీసు వాళ్లం కాబట్టి రెసిడెంటు స్టేటస్ చూసి గాని ఏ విషయం చెప్పలేమని ప్రెస్ వాళ్లకు చెప్తాం.’’ అన్నాడు తేజేశ్వర్రావు నవ్వుతూ.

‘‘అద్భుతరసయామిని’’లో తర్వాతి కథ వచ్చే నెల 

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2023)

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా