ఏపీ బీజేపీ ఇవాళ ట్విటర్ వేదికగా జగన్ సర్కార్‌పై విమర్శతో కూడిన పోస్టు పెట్టింది. అదేంటంటే…
“దేశమంతా జరుపుకునే శ్రీరామనవమి పండుగ హిందువులకు అతి పవిత్రమైనది. దీనికి ఎందుకు సెలవు ప్రకటించడం లేదు?. ఇతర మతాల పండుగలకు ఇచ్చే వైసీపీ ప్రభుత్వం, జాతి మొత్తం జరుపుకొనే నవమికి బ్యాంకులకు సెలవు ప్రకటించలేదు!. తక్షణమే శ్రీరామనవమికి సెలవు ప్రకటించాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోంది”
ఈ పోస్టు చూస్తే ఏపీ బీజేపీకి పూర్తిగా మైండ్ పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ మూడో వారంలో 2023వ సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 23 సాధారణ, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. వీటిలో మార్చి 22న బుధవారం ఉగాది, అలాగే అదే నెల 30న గురువారం శ్రీరామ నవమికి సెలవులు ప్రకటించింది.
మరి ఏపీ బీజేపీకి ప్రభుత్వం సెలవులు ప్రకటించలేదని ఎవరో చెప్పారో అర్థం కావడం లేదు. తాజాగా ఏపీ బీజేపీ ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన పోస్టులో ఉగాదికి కూడా సెలవు ఇవ్వనట్టుంది. బీజేపీ మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ హిందువుల పండుగలకు సెలవులు ఇవ్వలేదనే దుష్ప్రచారంతో రాజకీయ ప్రయోజనం కంటే అభాసుపాలవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉగాది, శ్రీరామనవమి లాంటి హిందువుల పండుగలకు సెలవులు ఇవ్వదని ఎవరైనా చెప్పినా, కనీసం నమ్మేందుకైనా కాస్తైనా కామన్‌సెన్స్ వుండాలి కదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తాజా పోస్టుతో ఏపీ బీజేపీ విమర్శల పాలవుతోంది.