Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ కథలు - 28 'మెతక మనిషి'-1

మెతక మనిషి 

సదాశివ్‌ అతిసాధారణమైన మనిషి. చక్రాల్లాంటి అతని కళ్లు, సున్నాలాటి మొహం చూస్తే 'ఇతను శుద్ధ వెర్రిబాగులవాడు' అని నుదుటిరాత రాసిన చేత్తోనే బ్రహ్మ రాసేశాడనిపిస్తుంది. అతనికి ఏదీ ఓ పట్టాన తలకెక్కదు. ఎవరైనా ఏదైనా కాస్త ముఖ్య విషయం చెప్పబోతే దాన్ని అర్థం చేసుకోవడానికి లవలేశమంతున్న అతని మెదడుమీద ఎంతో భారం పడుతుంది.

అంతకంతకీ పెద్దవయ్యే అతని కళ్లు చూసినా, ఈ బుగ్గనుండి ఆ బుగ్గకు తిరుగాడే అతని నాలిక చూసినా అతను పడే శ్రమ అర్థమవుతుంది. ఈ తతంగం చూసిన ఎదుటి మనిషి జాలిగుండె కలవాడైతే నిర్లిప్తంగా ఓ నవ్వు నవ్వి, అతనికి బోధపరిచే ప్రయత్నాన్ని కట్టిపెట్టేవాడు. ఒకవేళ ఆరంభించిన పనిని పూర్తిచేసే ఉత్తముల కోవకు చెందినవాడయితే సదాయే ఓ వెర్రినవ్వు నవ్వి కణతలు రుద్దుకుంటూ, ''అంతటి తికమక విషయాలు అర్థం చేసుకోవడం నాబోటివాడివల్ల అయ్యేపనా? పోన్లెండి సార్‌'' అంటూ అతడి ప్రయత్నాన్ని ఆపేసేవాడు.

లోకమంతా తెలివైన వాళ్లతో కిక్కిరిసిలేదు. సదా సైజు మెదడున్నవాళ్లు కూడా సంక్రమించిన ఆస్తితోనో, ఆదుకొనే ఆత్మీయులతోనో నెట్టుకొచ్చేస్తున్నారు. కానీ పాపం, సదాకి వంటలక్కగా పనిచేసే విధవతల్లి తప్ప వేరే ఆధారం ఏమీలేదు. స్థితిమంతుడైన ఓ మేనమామ ఒకడున్నాడు. కానీ అతను వీళ్లను దరిక్కూడా రానివ్వడు. రఘుకాకా అనే వేలు విడిచిన బంధువుక్కూడా ఆస్తి ఉంది. కానీ ఆయనకు మహా కర్కోటకుడనీ, కాసు విదల్చడనీ పేరుంది.

సదా కాస్త ఎదిగి రాగానే అతనికి ఏకైక దిక్కుగా ఉన్న తల్లి పెద్దల్లో కలిసిపోయింది. ఏదో చిన్నా చితకాపనులు చేసి పొట్టపోసుకోవలసిన గతి సదాకి పట్టింది. మెదడు, తదితర విషయాల్లో లోటుచేసిన మాయదారి దేవుడు అతని శరీరం విషయంలో మాత్రం చల్లని చూపు చూసేడు. గంటలకొద్దీ నిర్విరామంగా పనిచేసినా అలుపూ, సొలుపెరుగని దుక్కశరీరం అతనిది. అన్నట్టు సదాకి ఇంకో సుగుణం కూడా ఉంది. తానెక్కడినుండీ దిగిరాలేదనీ, అతి సాధారణమైన మనిషిననీ అనే ఎరిక అతనికుంది. తన తాహతుకి మించిన కోర్కెలు కోరకూడదనీ, జీవిత సౌఖ్యాలకు తను తగననీ ఖచ్చితంగా అతనికి తెలుసు.

అంతమాత్రాన అతను కలలు కూడా కనడని అర్థం కాదు. ప్రతీ యువకుడిలాగే అతనూ కలలుకనే జన్మహక్కుని ఉపయోగించుకొన్నాడు. రఘుకాకా లాగా గడియారాల షాపొకటి పెట్టి అందరినీ ఆదలిస్తూ తిరుగుతున్నట్టు పదిహేడేళ్ల వయస్సులో ఓ కల కన్నాడు. మరోసారి ఆయనలాగే ఇంటికీ, షాపుకీ కారులో తిరుగుతున్నట్టు, ఇంకోసారి అందమైన భార్య చేత్తో కాఫీ అందుకొంటున్నట్టు (ఆ కలను ఇంకా కొనసాగించేడనుకోండి) కలలు కన్నాడు. వాళ్ల పిచ్చుక గూళ్లలాటి ఇంటికెదురుగా రోడ్డుకసింటా ఉన్న భాగ్యవంతుల కాలనీలో, అరుణ అనే ఎర్రని, బుర్రని ఉంగరాల జుట్టుతో, నవ్వే కళ్లతో ఉండే అమ్మాయి షోకేసులో మిఠాయిలా సదాను ఊరిస్తూండేది. చూసి లొట్టలేయడమే గాని స్వంతం చేసుకోలేని పరిస్థితి. ఆమంటే పడిచచ్చే ఇతర కుర్రాళ్ల ద్వారా తను కాలేజీలో ఆటల్లోనూ, పాటల్లోనూ కూడా ఫస్టేనని తెలిశాక షోకేసు కూడా తనకు అందరానంత ఎత్తులో ఉందనిపించింది సదాకు.

ఓరోజు చిత్రంగా అరుణ సదా కలలోకి వచ్చేసి బహిరంగంగా చెప్పుకోలేని పనులు తనతో కలిసి చాలా చేసేసింది. మర్నాడు పొద్దున్న కల గుర్తుకొచ్చి సిగ్గుతో ఎర్రబడ్డ బుగ్గల్ని సదా లెంపలేసుకొని శిక్షించేడు. తన లెవెలు మనుష్యులు ఎటువంటి కలలు కనకూడదో అతనికి బాగా తెలుసు.

సదా చదువుకూడా సరిగ్గా సాగింది కాదు. స్కూల్‌ ఫైనల్‌ పరీక్ష తప్పాడు. అతను నొచ్చుకోలేదు. తనలాంటి మందబుద్ధులు ఒకటికి నాలుగుసార్లు వెళితేగాని పాసవరని అతనికి ముందే తెలుసు. బుద్ధిగా రెండోసారి పరీక్షకి కూచున్నాడు. వినూ అనే ఓ స్నేహితుడు కొన్ని ప్రశ్నలిచ్చి బట్టీ పట్టేయమన్నాడు. మనవాడు గానుగెద్దులాగా వాటిని రాపాడించేసి, బట్టీ పట్టేశాడు. పుణ్యం పుచ్చి వాటిలో సగానికి సగం పరీక్షలో దిగిపోయేయి. దెబ్బకి పాసయిపోయేడు.

వినూ హితబోధ చేసేడు, ''కాలేజీ చదువు కూడా లాగించేయ్‌. నేనుంటాను పక్కన. నాలుగేళ్లు కష్టపడ్డావో, జీవితమంతా సుఖపడతావు. ఈ వెధవ పిచ్చికగూళ్ల సత్రం లాటి కొంప వదిలి, దర్జాగా ఓ ఫ్లాట్‌లో ఉండొచ్చు.''

ఇది వినగానే సదా కళ్లు మెరవడం, కనుబొమ్మలు పైకెగబాకడం చూసి తన సలహా వృథా కానందుకు వినూ సంతోషిస్తుండగానే ఊహాలోకంలో విహారం ముగించి సదా నేలకు దిగివచ్చేశాడు. నాలిక కాస్సేపు ఈ బుగ్గలో, కాసేపు ఆ బుగ్గలోనూ ఉంచి కళ్లనూ, కళ్లలో వెలుగునూ ఆర్పేసి, నోరు చప్పరించి, ''ఇవన్నీ నా బోటివాళ్లకు కాదులే గురూ'' అని తేల్చేశాడు. ''నువ్వు మాత్రం బాగా చదువుకొని పైకిరా, సుఖపడు. బుద్ధిపుడితే ఓసారి నన్ను పిలిచి కాఫీపోయించు. నువ్వే నేననుకొని సంతోషిస్తాను'' అన్నాడు.

అంచేత వినూ కాలేజీలో చేరగా అతను రాసిపెట్టిన అప్లికేషన్లు చేతబట్టి సదా ఉద్యోగాల కోసం వేట సాగించేడు. ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం అయిందేకానీ ఎస్సెల్సీ చదివిన వాడికి ఉద్యోగాలెక్కడినుంచి వస్తాయి? చివరికి ఓ రోజున ఏమైతే అయింది రఘుకాకా ఇంటికెళ్లి కాళ్లావేళ్లా పడాల్సిందే అనిపించేసింది.

తల్లిమాట గుర్తుకొచ్చింది. 'వాడసలే దుర్వాసుడు, నోటికొచ్చినట్టు తిట్టి గెంటేస్తాడు. వెళ్లకురా నాన్నా' అని. ఉద్యోగానికి వెళ్లిన ప్రతీచోటా జరుగుతున్నదదేగా, కొత్తగా ఆయన మాత్రం ఏం జేయబోతాడు అనుకొంటూ వెళ్లాడు.

xxxxxxxxxxxxxxxxxxx

మరుసటి రోజు రఘుకాకాను చూడగానే సదాకి వణుకు పట్టుకుంది. కాకా ప్రతీ అవయవం, ప్రతీ కదలికా భీతి గొల్పేవే! చింతనిప్పుల్లాటి అతని కళ్లు చూసినా, గరుత్మంతుడి లాటి ముక్కు చూసినా, గజంబద్ద మింగేసినట్టు కూచునే తీరు చూసినా - భృకుటి దగ్గర ముడివేసిన కనుబొమలు చూసినా, ముఖంమీద అసంఖ్యాకంగా గీసిన గీతలు చూసినా, వీటిలో ఏ ఒకటి చూసినా చాలు అవతలివాడు దడదడలాడటానికి. సదాలాటి వాడైతే చెప్పనే అక్కర్లేదు. సదాని చూడగానే రఘుకాకాకు ఒళ్లు మండుకొచ్చింది, వచ్చి తన టైము వృథా చేస్తున్నాడని. తన్ని తగిలేయబోయేడు కానీ చేతులు కట్టుకొని, తలకాయ దించుకొని నుంచున్నవాడిని అంత త్వరగా ఏమీ చేయలేం కదా!

కానీ గుర్రుమన్నాడు, ''ఎవరయ్యా నువ్వు? ఎక్కడో చూసినట్టుందే?''

సదా పెదాలు తడుపుకొని ''నా పేరు సదాశివ్‌ అంటారండి. భాగీరథమ్మ కొడుకుని''

కాకా కనుబొమలు పీటముడి పడిపోయి, ''అలా చెప్పు. దూరపు బంధుత్వం పేరు ఎప్పి, ఏవో శోకగాథలు వినిపించి నొల్లుకుపోదామని ఒచ్చివుంటావ్‌. ఈ పప్పులు నా దగ్గిర ఉడకవ్‌! రాగిదమ్మిడీ ఇచ్చేది లేదు. నంగిరి పింగిరి వేషాలు కట్టిపెట్టి వచ్చిన దారిపట్టు'' అంటూ అందుకొనేసరికి సదా బిత్తరపోయి నోరు పెగల్చలేకపోయాడు.

దాంతో కాకాకు చిరాకు ఇంకా పెరిగింది. ''నీ ఏడుపు కథేదో త్వరగా చెప్పేడు. అవతల నాకు టైమవుతోంది'' అంటూ అరిచేడు. సదాకు భయం ముంచుకొచ్చింది. మాటలు తోసుకొచ్చేయి. ''ఊ...  ఉద్యోగం కావాలి నాకు''

రఘుకాకా శివమెత్తిపోయేడు. ''ఉద్యోగం కావాలా? అవేమైనా చెట్లకు కాస్తున్నాయా? నేనిక్కడ నోముపట్టి ఉద్యోగదానాలు చేస్తున్నా ననుకొన్నావా?'' అంటూ లంకించుకొన్నాడు. సదా సమాధానం చెప్పలేదు. 'ఎందుకు వచ్చానురా భగవంతుడా?' అనిపించేసింది. అతనికి ఉన్నట్టుండి మాయమయిపోతే బాగుణ్ణు అనుకొన్నాడు. కానీ అతని దుర్భర పరిస్థితి అతణ్ణి పలికించింది. ''నేను ఏ... ఏ పనైనా చేస్తాను. ఏదైనా సరే... ఏదైనా''

కాకా వాక్ప్రవాహానికి గండిపడింది. వెటకారం మేళవించి, ''ఏదైనా సరే చేస్తావా? అయితే ఈ గదులూ ఆ పావంచాలూ తుడవమన్నాననుకో..?'' అనబోయేడు.

''ఓ తప్పకుండా'' అన్నాడు సదా మారు ఆలోచన లేకుండా.

''అయితే ఆ మూలనున్న చీపురు తీసి తుడు, చూద్దాం''

సదా సంకోచపడలేదు. బిడియపడలేదు. ఇదేం మనకు కొత్తపనా? పనిమనిషి లేకపోవడంవల్ల చిన్నప్పణ్ణుంచీ ఇంట్లో చేసుకొనేదే ఇవాళ వీళ్లింట్లో చేస్తున్నాం. తప్పేముంది? అనుకొని శుభ్రంగా తుడిచేశాడు.

ఈసారి బిత్తరపోవడం కాకా వంతయింది. అయినా వదిలిపెట్టదలచుకోలేదు. ''ఈ పెట్టె నెత్తినెట్టుకొని స్టోర్‌రూమ్‌కి పట్టుకెళ్లు'' అన్నాడు. 'మావూరి ఓడ ఎక్కినప్పుడు నేను చేసే పనేగా ఇది' అనుకొంటూ సదా నిస్సంకోచంగా పెట్టె నెత్తికెత్తుకున్నాడు.

మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు కాకా. ఎదురు ప్రశ్నలూ, వెధవ సందేహాలు లేకుండా చెప్పిన పని పుచ్చుకుక్కలా చేసే పనివాళ్లను అతగాడు చూసి చాలా ఏళ్లయింది. బ్రహ్మదేవుడు అలాటివారి తయారీ మానేసేడేమోననుకొనే రోజుల్లో ఇలాంటి నంబికొండయ్యలాటి వ్యక్తిని ఎవరొదులుకుంటాడు? మొహంమీద చిరాకు ముద్ర నలాగే ఉంచి, ''సరేలే, రేప్పొద్దున ఏడుగంటలకొకసారి కనపడు. ఏదైనా పనుందేమో చూద్దాం. ఏడంటే ఏడే సుమా. ఒక్క నిమిషం ఆలస్యమయిందో, అంతే...''

ఆవిధంగా రఘుకాకా వాచీల దుకాణంలో సదాకు పని దొరికింది. కొద్ది కాలంలోనే ఇతను రాని క్రితం పనులెలా గడిచేవిరా అని ఆశ్చర్యపడేటంతగా ఆ దుకాణంతో అతను మమేకం అయిపోయేడు.

సాధారణంగా కాకా దుకాణంలో పనివాళ్లు చేరేవాళ్లు చేరుతుంటారు, జారుకొనేవాళ్లు జారుకొంటుంటారు. పనిలో చేరిన నాలుగు రోజులలోనే కాకాతో వేగలేక దండంపెట్టి పారిపోయేవారు. సదా మాత్రం తిట్టినా, తిమ్మినా, కొడతానన్నా, కోస్తానన్నా కొట్టునే నమ్ముకొని ఉండిపోయేడు.

ఎవరైనా, ఇదేమిటోయ్‌ బొత్తిగా అంటే 'నాబోటి చవటలకు ఇంతకన్నా రాజోద్యోగం దొరుకుతుందా? ఒకవేళ ఎవడైనా ఇచ్చినా రెండోరోజు ఇంటికి పంపిస్తాడు. నోటి దురుసుంటేనేం, కాకా జీతం సరిగ్గా ఇస్తాడు. ఇక తిట్లంటారా? విని, విని అలవాటు పడిపోయేను. అవి నన్ను బాధించవు'' అనేవాడు.

దానాదీనా కొద్ది సంవత్సరాల్లోనే సదా అందరికంటే సీనియర్‌ పనివాడు అయిపోయేడు. ఉపకార స్వభావంతో అందరి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండటంతో అన్ని శాఖల్లో పనీ పట్టుబడింది. అందరికీ తలలో నాలుకగా ఉండటం వలన కొలీగ్స్‌కి అతనంటే ఇష్టం ఏర్పడింది. కస్టమర్లకు అతను మరీ బాగా నచ్చేడు. దానివల్ల వ్యాపారమూ పెరిగింది.

రఘుకాకా షాపుకి మంచిపేరుంది. నాణ్యమైన వస్తువులు అమ్ముతాడనీ, రిపేరింగు కూడా బాగా చేస్తాడనీ... అందులోనూ రిపేరు చేసే జాతిలో తప్పబుట్టినట్లు అన్న టైముకి ఇచ్చేస్తాడు కూడానూ. వచ్చిన చిక్కల్లా కట్టె విరిచినట్లు మాట్లాడే కాకా అలవాటుతోనే. తెలియకో, తక్కినచోట్ల అలవాటు కొద్దో ఎవరైనా బేరమాడబోతే ముఖం బద్దలు కొట్టినట్టు 'మీకిష్టమైతే తీసుకోంది, లేకపోతే వదిలి పెట్టి వెళ్లండి. బేరమాడాలని అంత సరదాగా ఉంటే, వేరేచోటి కెళ్లండి' అనేసేవాడు.

అతని షాపుకున్న పేరు ప్రఖ్యాతులు చూసి రిపేరు కోసం చాలా వాచీలే వచ్చేవి. రద్దీవల్ల రిపేరింగుకు వచ్చినవి పది, పదిహేను రోజుల తర్వాత తిరిగి ఇచ్చేవాడు. ఎవరైనా 'కాస్త ముందు ఇవ్వలేరా?' అని అడిగితే కాకా వల్లకాదు అంటూ దురుసుగా వాచీ వెనక్కిచ్చేసేవాడు.  ఏదో నోరుజారి అన్నాను రిపేరింగుకి తీసుకో బాబూ అని కస్టమరు బతిమాలేదాకా పని ఒప్పుకొనేవాడు కాదు. ఈ ధోరణి నచ్చక కొంతమంది రావడం మానుకొన్నారు కూడాను.

అయితే సదా ఆ కౌంటరు చూసుకోవడం మొదలెట్టిన దగ్గర్నుంచీ పరిస్థితి మారింది. కాకా చెప్పిన జవాబులే సదా కూడా చెప్పేవాడు. మెత్తగా, ప్రాధేయపడుతున్నట్లు చెప్పేవాడు. అదీ తేడా! పెరుగుతున్న ధరల గురించి, రిపేరింగులో ఆలస్యానికి కారణాల గురించి ఎంత వివరంగా చెప్పుకొచ్చేవాడంటే కస్టమర్లు కరిగిపోయి, ''మీ చిత్తం వచ్చిన రేటుకే, చిత్తమొచ్చినప్పుడే ఇవ్వండి నాయనా' అనేసేవారు. అప్పుడిక 'మీలా ఇతరుల ఇబ్బందులను అర్థం చేసుకొనేవాళ్లు ఎంతమంది ఉంటారు చెప్పండి' అంటూ సదా స్తోత్రపాఠం మొదలెట్టేవాడు.

వ్యాపార విషయాలు మాత్రమే కాదు, మిగతా విషయాల గురించి మాట్లాడడానికి కూడా సదా  రెడీగా ఉండేవాడు. కూరగాయల ధరవరలు, కూతుళ్ల కివ్వాల్సిన కట్నకానుకలు, విడాకుల కోసం ఎగబడే యువజంటలు, వైజయంతిమాల పుట్టుసొగసులు, పెట్టుసొగసుల మధ్య తేడాలు - వీటి గురించి తమ అభిప్రాయాల్ని ఉద్ఘాటించదలచుకొన్న కస్టమర్లను వాగనిచ్చేవాడు, తనూ వాగేవాడు.

దాంతో కౌంటర్‌ వద్ద పని మందగించేది. అయినా కస్టమర్లు నొచ్చుకొనేవారు కాదు. రఘుకాకాకు మాత్రం చిరాకేసేది. కబుర్లు కట్టిపెట్టి పనిచూడమని సదాను హెచ్చరించేవాడు. అక్షింతలు పడగానే నాలిక్కరుచుకొని సదా నోటికి తాళం వేసేవాడు. కస్టమరుకి ఇదంతా వేడుకగా ఉండేది. నవ్వుకొంటూ వెళ్లిపోయేవాడు.

సదా వాగుడు కాకాకు ఎంత విసుగు పుట్టించిందంటే కొన్ని రోజులకి అతన్ని ఆ కౌంటర్‌ నుండి తప్పించేసి తనే కస్టమర్లతో వ్యవహరించసాగాడు. మళ్లీ అరుపులూ, వాదోపవాదాలు పునర్దర్శన మిచ్చేయి. కస్టమర్లు విసుక్కుంటూ వెళ్లిపోయేవారు. కొంతమంది సదా ఎక్కడ, అతనితో పనుంది అనేవారు. కాకాకు ఒళ్లుమండుకొచ్చి తిక్క పుట్టుకొచ్చి కస్టమర్లను చూడడం మానేసి ఆ పని సదాకు ధారాదత్తం చేసేశాడు. చేసేముందు కస్టమర్లను నెత్తికెక్కించుకొన్నందుకు సదాను బాగా తిట్టిపోశాడు. సదా నాలిక్కరుచుకొని తప్పంతా తనదేనంటూ ఒప్పుకున్నాడు.

xxxxxxxxxxxxxxxxxxxxxxx

సదాకు జీవితం తృప్తికరంగానే ఉండేది. కాకా చెప్పినంతసేపూ గొడ్డులా చాకిరీ చేసేవాడు. తిట్టినా కిమ్మనేవాడు కాదు. జీతం ఎంతిస్తే అంత పుచ్చుకొనేవాడు. తన సత్తా తనకు తెలుసు కాబట్టి ఇంతకంటే ఎక్కువ జీతానికి తను తగననుకొనేవాడు. గుట్టుగా సంసారం నెట్టుకొచ్చేవాడు. అందువల్ల తనతో పనిచేసే మెకానిక్‌ ఒకతను జీతం గురించి ప్రస్తావించినప్పుడు ఆశ్చర్యపడ్డాడు.

ఆ మెకానిక్‌ వాచీలు రిపేరు చేయడంలో నేర్పు ఉన్నవాడు, ఆ నేర్పు ఉందని ఎరిక గలిగినవాడు. దాంతో కించిత్తు పొగరూ, తగినంత గుర్తింపు రాలేదన్న వగపూ కలవాడు. తక్కినవారందరిలాగే అతనికీ సదా అంటే ఇష్టం. ఓ రోజు ఇరానీ టీ స్టాల్లో టీ తాగుతూ కదలేశాడు.

''సదా బాబూ, మీ జీతం ఎంత?''

సదా ఆశ్చర్యపడ్డాడు. ''ఏం అలా అడిగేవ్‌? రెండొందలు ఇస్తార్లే. ఏదో నా ఒంటికాయ సొంటికొమ్ము బతుక్కి అదే ఎక్కీతొక్కీ''

''సిగ్గు లేకపోతేసరి. నెలకు నాలుగైదు వేలు షాపుమీద సంపాదిస్తూన్న షావుకారు నాకూ, నీకూ ఇచ్చేది రెండొందలు, మూడొందలూ. నిజానికి షాపు నడిచేదే మీ బోటి, నా బోటి నిజాయితీపరులైన వర్కర్లవల్లే కదా''

ఆ ధోరణి ఆలోచనలు సదాకెప్పుడూ రాలేదు. అందువల్ల మొదటిసారి వినగానే సదా గుక్క తిప్పుకోలేకపోయాడు. ''నిజంగానా? నువ్వు చెప్పేదంతా నిజమే?'' అంటూ నోరు వెళ్లబెట్టాడు. ఆశ్చర్యంతో అతని కనుగుడ్లు బయటకు వచ్చేశాయి.

కుర్ర మెకానిక్‌ పుంజుకొన్నారు. ''పదహారణాల నిజం! నేను చెప్పేది సింపుల్‌. ఆ డబ్బంతా మనవల్లే వస్తున్నప్పుడు దాంట్లో ముప్పాతిక పాలు షావుకారు ఎదాన ఎందుకు పోయాలి? మనమే ఓ షాపు పెడదాం. నువ్వు కస్టమర్ల సంగతి చూడు. రిపేర్ల సంగతి నేను చూసుకొంటా. లెక్కేసి చూశా. సంవత్సరంలో మన పెట్టుబడి వెనక్కి రావడమే కాదు. ఆ తర్వాత నెలకు తలా రెండువేలు సంపాదిస్తాం''

రెండువేలు సదా నోరూరించేయి. కళ్లు మెరిశాయి. ''అమ్మయ్యో, రెండువేలే, బోల్డంత డబ్బు, రాజాలా బతకొచ్చు. ఏవంటావ్‌? కారు కూడా కొనచ్చు, ఏవంటావ్‌? తాజ్‌మహల్‌ హోటల్‌కెళ్లి కడుపు పట్టినంత తినొచ్చు, ఏవంటావ్‌?''

కుర్ర మెకానిక్‌ మురిపెంగా నవ్వేడు. ''అంతకంటే చాలా పనులు చెయ్యచ్చు. తాజ్‌లో భోజనం ఓ లెక్కకాదు. మీకూ నా అయిడియా నచ్చినట్టుగానే ఉంది. మనమిద్దరమూ వాటాదార్లుగా కొట్టు పెడదామా?''

''బ్రహ్మాండంగా ఉంటుంది'' అన్నాడు సదా పొంగిపోతూ.

''మరి మాట కరారేనా?'' అంటూ షేక్‌హేండు ఇవ్వడానికి మెకానిక్కు చేయి చాపేడు.

అంత హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు లేని సదా గాభరాపడిపోయాడు. మనసులోనే గందరగోళపడిపోయి, నాలికను ఆ బుగ్గకూ, ఈ బుగ్గకూ కాస్సేపు తిప్పాడు. కళ్లలో మెరుపూ, మొగంమీద నగవూ ఇగిరిపోయాయి.

ఎప్పటిలాగానే వెర్రివాలకం వేసుకొని, ''వద్దులే గురూ, నేను లాభంలేదు.. అలాంటివాటిలో నా సత్తా నాకు తెలుసుగా. రఘుకాకా కొట్లో చాకిరీ, చీకటి గుయ్యారపు ఇంట్లో కాపురం... ఇవే నా మొహాన రాసున్నాయి''

కుర్ర మెకానిక్‌కు ఆశ్చర్యం. చిరాకూ, కోపం అన్నీ వచ్చేశాయి -  ''అదే మీ ఉద్దేశమయితే, నేను అయిడియా చెప్పినప్పుడు ఎగిరి గంతేయడమెందుకు?'' అని నిలదీశాడు.

సదా చప్పబడిపోయి, క్షమాపణలు మొదలెట్టేడు. ''కోపం తెచ్చుకోకు గురూ, నిజానికి నీ ప్లాను నాకెంతో నచ్చింది. నిజంగా అర్హత ఉంటే దాంట్లో చేరివుండేవాణ్ణే. కానీ ఏం చెయ్యను? పనికిమాలినవాణ్ణి. అవన్నీ నా వల్లకావు. నా మాటవిని నువ్వు మాత్రం ఈ దిక్కుమాలిన ఉద్యోగం వదిలేసి కొట్టుపెట్టుకొని బాగుపడు. నాలాటివాణ్ణి కాకుండా, నీలాటి చాకులాటివాణ్ణి భాగస్తుడిగా పెట్టుకో. నువ్వు తప్పకుండా పైకొస్తావ్‌. ఓ బంగళా, కారు అమర్చుకొంటావ్‌. నాకు తెలుసు. నువ్వు కారుకొన్నాక, నన్ను మర్చిపోకుండా ఓసారి కార్లో జుహూ బీచికి తీసుకెళ్లి ఓ గంగాబోండం ఇప్పించు, నా కదే చాలు''

కుర్రమెకానిక్‌కు ఒళ్లు మండి లేచిపోయేడు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి, ఇంకొక ఇద్దరితో చేరి దుకాణం తెరిచాడు. అయితే సదాశయాలతో ఆరంభించే అనేక పథకాలలాగే ఇదీ ఆచరణలో చీదేసింది. పార్ట్‌నర్లు కొట్టుకున్నారు, విడిపోయేరు, షాపు మూతబడింది. కుర్ర మెకానిక్‌ కష్టపడి దాచుకొన్నది ఊచ్చుకుపోయింది. వేరేచోట నౌకరీకి కుదిరేడు.

సదా మాత్రం అదే అరవచాకిరీ చేస్తూ, ముక్కచివాట్లు తింటూ ఆ రెండువందల రూపాయిలతోటే నెట్టుకొస్తున్నాడు.-(సశేషం)

గంగాధర్‌ గాడ్గీళ్‌ మరాఠీ రచనకు  అనువాదం 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

mbsprasad@gmail.com
 
విపుల ఏప్రిల్‌ 1995 లో ప్రచురితం