ఇండియాలో క్రికెటర్ గా కాస్త స్టార్ స్టేటస్ ను సంపాదిస్తే చాలు.. రెండు చేతులా సంపాదన! బీసీసీఐ కాంట్రాక్టు.. ఐపీఎల్ వేలం పాట.. ఎండార్స్ మెంట్స్ ఒప్పందాలతో వచ్చే డబ్బు. ఇలా సంపాదన పరులయ్యే క్రికెటర్లు వెంటనే వ్యాపారవేత్తలుగా మారిపోతున్నారు. సచిన్ దగ్గర నుంచి అనేక మంది క్రికెటర్లకు సైడ్ బిజినెస్ లుఉన్నాయనే విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ జాబితాలో విరాట్ కొహ్లీ కూడా చేరిపోతున్నాడు. భారీ ఎత్తున వ్యాపార విస్తరణకు ఈయన శ్రీకారం చుట్టాడు. విరాట్ జిమ్ కమ్ ఫిట్ నెస్ సెంటర్లపై దృష్టి సారించాడు. ఈ మేరకు ఒక చైన్ ఆఫ్ ఫిట్ నెస్ సెంటర్ల ప్రారంభానికి రెడీ అవుతున్నాడు.
దీని కోసం ఆదిలోనే 90 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నారు. విరాట్ తో పాటు చీసెల్ ఫిట్ నెస్ సంస్థ ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉంది. దేశంలోని ప్రజల్లో ఫిట్ నెస్ పై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో.. జిమ్ లలో హడావుడి కనిపిస్తున్న తరుణంలో వీరు చైన్ జిమ్ సెంటర్లతో వ్యాపారాన్ని చేపడుతున్నారు.
దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లోనూ.. తమ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారట విరాట్ అండ్ కంపెనీ. ప్రస్తుతానికి 90 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తామని.. 190 కోట్ల రూపాయలు వెచ్చించి వీటిని విస్తరించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వీరు ప్రకటించారు. ఇప్పటికే కెప్టెన్ ధోనీ కి కూడా జిమ్ అండ్ ఫిట్ నెస్ సెంటర్ల శ్రేణి ఒకటి ఉంది. ఇప్పుడు విరాట్ కూడా అదే బిజినెస్ లోకి ప్రవేశిస్తుండటం విశేషం!