సుధీర్ వర్మ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూ

సుధీర్ వర్మ..స్వామిరారా సినిమాతో అటు ప్రేక్షకులను, ఇటు టాలీవుడ్ జనాలను తన వైపు తిప్పుకున్నాడు. తన దైన క్లాస్ టచ్ తో క్రైం కామెడీ తీసి చూపించాడు. ఇప్పుడు మళ్లీ అదే స్టయిల్ తో…

సుధీర్ వర్మ..స్వామిరారా సినిమాతో అటు ప్రేక్షకులను, ఇటు టాలీవుడ్ జనాలను తన వైపు తిప్పుకున్నాడు. తన దైన క్లాస్ టచ్ తో క్రైం కామెడీ తీసి చూపించాడు. ఇప్పుడు మళ్లీ అదే స్టయిల్ తో నాగచైతన్య హీరోగా దోచేయ్ సినిమా చేస్తున్నాడు. 24న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా సుధీర్ వర్మతో గ్రేట్ ఆంధ్ర ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూ.

ఎలా వుండబోతోంది మీ దోచేయ్.?

ఎలా వుండబోతోంది అంటే..నేనెప్పుడూ బావుంటుందనే అంటాను. అయితే కచ్చితంగా చెప్పాలంటే క్రైమ్ కామెడీ, ప్లస్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ వుంటుదని చెబుతాను. అంటే నేను ఈ సినిమాలో ఓన్లీ క్రైమ్ మీదకు ఎక్కువ వెళ్లకుండా ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువ వాడాను ఈ సినిమాలో. దట్ టు కూడా అన్ వాంటెడ్ కామెడీ ఏమీ వుండదు..అంతా సినిమాలో మిక్స్ అయి వుంటుంది. పైగా క్లీన్ కామెడీ.

మీ మొదటి సినిమా చేసినపుడు మీ మీద ఒక అంచనా అన్నది లేదు. కానీ ఇప్పుడు మీరంటూ ప్రేక్షకులకు ఓ అంచనా వుంది. దాన్ని ఎలా మీటవ్వాలనుకున్నారు?

ఈ సినిమా తీసిన దానికన్నా నా మెయిన్ టెన్షన్ అదే. ఎందుకుంటే స్వామిరారా వచ్చినపుడు సుధీర్ అంటే ఎవరో తెలియదు. నిఖిల్ కూడా అంత పెద్ద హీరో కాదు. ఆ టైమ్ లో మా ఇద్దరి మీద ఎక్స్ పెక్టేషన్ లేదు. సో నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లి, ఓ క్రైమ్ కామెడీ చేసాను. అది అందరికీ నచ్చింది. చూసారు. ఇప్పుడు జనం ఆ సినిమా అంత బాగా తీసాడు.. ఇప్పుడు ఇదెంత బాగా తీస్తాడో అని అనుకుంటారు. ఆ టెన్షన్ ముందు వుంది..కానీ సినిమా తీసేటప్పుడు మాత్రం లేదు. ఒకసారి స్క్రిప్ట్ అనుకున్నాక, అది ఎలా అటెంప్ట్ చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచించి, అలా తీసుకెళ్లిపోయానంతే. డెఫినిట్ గా స్వామిరారా కన్నా మంచి స్క్రిప్ట్ అని నేను అనుకుంటున్నాను. మంచి స్క్రిప్ట్ అయితే మంచి హిట్ అవుతుంది. లేదంటే రిలీజ్ అయ్యాక చూడాలి. 

స్క్రిప్ట్ అనుకున్నాక నాగచైతన్యను ఎంచుకున్నారా? లేక నాగచైతన్య కావాలనుకుని ఈ స్క్రిప్ట్ తయారు చేసారా?

డెఫినిట్ గా స్క్రిప్ట్ అనుకున్నాకే నాగచైతన్య కు చెప్పాం. ఫస్ట్ మీట్ లోనే, ఇది లైన్ అని  మీరు ఓకె అంటే మొత్తం తయారుచేసి వినిపిస్తా అని చెప్పాను. ఒక ప్లాట్ కింద చెప్పాను.. ఫస్ట్ సిటింగ్ లోనే ఆయనకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆయనకు స్వామిరారా అంటే చాలా ఇష్టం. ఇది కూడా దానికి కాస్త దగ్గరలోనే వుండే జోనర్. అందుకే ఆయన డెవలప్ చేయండి చేద్దాం అన్నారు. అక్కడి నుంచి అలా మొదలైంది. 

స్క్రిప్ట్ చేసేటపుడు నాగచైతన్య ఇమేజ్, బాడీ లాంగ్వేజ్, లిమిటేషన్లు అన్నీ దృష్టిలో పెట్టుకున్నారా?

డెఫినిట్ గా. నాగచైతన్య హీరో అని అనుకున్నపుడు అతని స్ట్రెంగ్త్ ఏమిటి? వీక్ నెస్ ఏమిటి ఇవన్నీ నాకు తెలుసు. సో హండ్రెడ్ పర్సంట్ స్ట్రెంగ్త్ కు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాను. పైగా నేను సినిమా చేస్తున్నాను అంటే డెఫినిట్ గా హీరోకు మంచి పేరు రావాలి..అదరగొట్టాడు అని జనం అనుకోవాలి. స్వామిరారా చేసినపుడు కూడా అందరికన్నా నాకు నిఖిల్ స్ట్రెంగ్త్ ఏమిటన్నది బాగా తెలుసు. అది ఎక్కువ ప్రొజెక్ట్ చేసాను. ఇందులో కూడా నాగచైతన్యను చాలా బాగా ప్రొజెక్ట్ చేసాను. సినిమా విడుదలయ్యాక చూసి మీరే చెబుతారు.

చైతూ చేత కామెడీ కూడా చేయించారా?

అంటే నేను సెపరేట్ కామెడీ కన్నా, సినిమాలో హ్యూమర్  వుండాలనుకుంటాను. అంటే సినిమాలో జెల్ అయిపోయి, హీరో, బ్రహ్మానందం గారు కావచ్చు..పోసాని గారు కావచ్చు..అంతా కలిసిపోయి, సినిమాతో కూడా కలిసిపోయి వుండేలా అన్నమాట. 

ఈ సినిమాలో చైతూ డబుల్ రోల్ చేసాడని..?

లేదండీ. అది ఫాల్స్ న్యూస్. అంటే చైతన్యను చేయ్ అంటారు. దో చేయ్..అన్నాను కదా అని ఇద్దరు వున్నారని అనుకుంటున్నారేమో? కానీ ఇప్పుడే కాదు నేను డ్యూయల్ రోల్ అన్నది ఎప్పుడూ ఇమేజిన్ చేయలేను. ఎందుకంటే ఎప్పుడన్నా నేను కథ రెడీ చేసుకుంటే, అది రియాల్టీకి దగ్గరగా వుండాలి. డ్యూయల్ రోల్ అన్నది ఏ విధంగానూ రియాల్టీ కాదు. అలాఅని డ్యూయల్ రోల్స్ తో వచ్చిన సినిమాలు మంచి హిట్ లు వున్నాయనుకోండి..హలో బ్రదర్ లాంటివి. బట్ నా వరకు నేను అవి అటెంప్ట్ చేయలేను. ఈ విషయంలో ఎంత వరకు మాట మీద వుంటానో అన్నది ఫ్యూచర్ లో వ్యవహారాలను బట్టి వుంటుంది.

ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి స్క్రిప్ట్ ల్లో స్వామిరారా ఒకటి. దాన్ని తయారు చేయడానికి మీరు చాలా టైమ్ తీసుకుని వుంటారు. ఎందుకంటే అది మీ మొదటి సినిమా. కానీ ఈ స్క్రిప్ట్ చేయడానికి అంత టైమ్ దొరికిందా?

నేను ఒకసారి స్క్రిప్ట్ పూర్తిగా రెడీ అయ్యాకే వెళ్తాను. సినిమా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారి అబ్బాయి నాకు చిరకాల మిత్రుడు. ఆయన కూడా నువ్వు స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యాక చెప్పు అప్పుడే షెడ్యూలు వేద్దాం. తొందర ఏమీ లేదు అనే చెప్పారు. వన్స్ స్క్రిప్ట్ అంతా లాక్ అయ్యాక, చేయ్ కు రీడింగ్ ఇచ్చాకే ఫైనల్ చేసాం.

స్వామిరారా చేసినపుడు చిన్నరేంజ్ సినిమా. ఇప్పుడు హీరో రేంజ్, సినిమా రేంజ్ పెరిగింది. మరి అక్కడున్న ఫ్రీడమ్ ఇక్కడ వుందా?

నాకా డిఫరెన్స్ అన్నది తెలియలేదు. నేను బ్రహ్మనందం గారితో చేస్తున్నాననో, పోసాని గారితో చేస్తున్నాననో కాకుండా, ముందు నేనేం చేయాలనుకుంటున్నాను, నాకేం కావాలనుకుంటున్నాను అన్నది నాకు క్లారిటీ వుండాలి. వాళ్లంతా పెద్ద ఆర్టిస్టులే. కానీ నేను ముందుగా వాళ్ల దగ్గర నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నాన్నది ఆలోచించుకుని, పెద్ద వాళ్లతో చేస్తున్నానని కన్ఫ్యూజ్ కాకుండా వుండాలి. ఉదయాన్నే కారవాన్ లో వాళ్లకి సీన్ వివరించి, నాకేం కావాలో స్పష్టంగా చెప్పేస్తాను. వాళ్లు చేసేసాక ఎలాంటి సమస్యలు రాలేదు. చాలా కంఫర్ట్ గా చేసేసాను.

కృతి సనన్-చైతన్య జోడీ ఎలా వుంది.?

చాలా బాగుంది. ఇద్దరూ చాలా క్యూట్ గా వున్నారు. చాలా బాగా పెర్ఫార్మ్ చేసారు. పైగా ఆ అమ్మాయి కూడా మంచి ఆర్టిస్టు. చేయ్-సమంత జోడీ ఎలా పాపులర్ అయిందో, ఈ జోడీ కూడా అలాగే వుంటుంది.

ఈ సినిమాకు మొదట్నించీ ఇది ఎ సెంటర్ సినిమా అవుతుంది అన్న అంచనా వుంది. కానీ సినిమా హిట్ కావలంటే బి సి సెంటర్ల ఆడియన్స్ కు కూడా పట్టాలి. దానికి సంబంధించి ఏమన్నా కేర్ తీసుకున్నారా?

ఈ సినిమా డెఫినిట్ గా ఎ బి సి ల్లో కూడా వుంటుంది. నేను ఎక్కువ ఈ మాట చెప్పను. కానీ సినిమాలో చివరి నలభై నిమషాలు ఏదైతే వుంటుందో అది ఎ బి సి సెంటర్ల ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది. స్వామిరారా అన్నది నేను నా బడ్జెట్ ను దృష్టిలో వుంచుకుని,  ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ చూస్తే చాలు వచ్చేస్తుంది అన్నది లెక్క వేసుకుని తీసింది. అన్ని సెంటర్లను దృష్టిలో వుంచుకుని ఏదేదో చేసేయడం కన్నా, నా సెట్ ఆఫ్ ఆడియన్స్ చూస్తే చాలు రికవరీ అవుతుంది అనుకునేంత బడ్జెట్ లో తీసింది.  అయితే నేను టార్గెట్ చేసిన వారి కన్నా ఎక్కువ మందే చూసారు. హ్యూమర్ అన్నది ఎ సెంటర్లకే నచ్చుతుంది అనుకున్నాను. కానీ కిందకు వున్న ప్రేక్షకులు కూడా విజిల్స్ వేసేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఈ సినిమాలో హ్యూమర్ తో పాటు..లేదా హ్యూమర్ కన్నా కామెడీ ఎక్కువగా వుంది. అది కూడా సినిమాలో జెల్ అయిన కామెడీ. అందువల్ల డెఫినిట్ గా హండ్రడ్ పర్సంట్ బి సి ల్లో కూడా బాగా ఆడుతుంది. నేను చెబుతున్నానని కాదు, సినిమా విడుదలయ్యాక మీరే చెబుతారు.

బ్రహ్మానందం గారికి మంచి కీ రోల్ మళ్లీ దొరికిందని..?

డెఫినిట్ గా కీ రోల్ అండి. అంటే ఏదో బ్రహ్మానందం గారు వుండాలని సినిమాలో, స్క్రిప్ట్ కు సంబంధం లేకుండా వుంచడం కాకుండా, ఇక్కడ ఆయన రిక్వైర్ మెంట్ కు అనుగుణంగా వుంటుంది. ఆయన ఎపిసోడ్ వచ్చినదగ్గర నుంచి ఆయన మీదే వుంటుంది. అది కాగానే క్లయిమాక్స్ కు వెళ్లిపోతాం. సో కావాలని పెట్టింది కాదు..సినిమాలో ఆయనా ఓ భాగం.

ఇది క్రైం కాన్ జోనర్ కదా. దానిలో చైతూ ఇమేజ్ కోసం డ్యూయట్లు, రొమాన్స్, ఇవన్నీ బాగానే కుదిరాయా?

ఇంట్రడక్షన్ అప్పుడు సాంగ్ వుంటుంది. అక్కడ హీరో ఏం చేస్తాడు అని చెప్తాం. అదే విధంగా చై మంచి డ్యాన్సర్ కూడా అన్నది ప్రూవ్ అయ్యేలా ఓ సాంగ్ వుంటుంది. అదే విధంగా హీరో హీరోయిన్ల మధ్య బంధం డెవలప్ అయ్యేలా ఓ మాంటేజ్ సాంగ్ వుంటుంది. మిగిలినవన్నీ సినిమాలో పార్ట్ గానే వుంటాయి. ఇక ఫైట్ల విషయానికి వస్తే, అన్నీ సినిమాలో రిక్వైర్ మెంట్. ఓ మంచి ఛేజ్ కూడా వుంటుంది. చేయ్ కు బైక్ నడపడం అంటే చాలా ఇష్టం. హాబీ కూడా. అదంతా ఈ సినిమాలో ఎక్కువగా వాడడం జరిగింది. 

అంటే ఈ సినిమాతో మీరు మాస్ డైరక్టర్ గా కూడా ప్రొజెక్ట్ అవ్వబోతున్నారా?

మాస్ అనుకోను కానీ సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా. అసలు మాస్ సినిమా అంటే నాకు పెద్దగా తెలియదు. నా దృష్టిలో మాస్ సినిమా అంటే అన్ని తరహాల ప్రేక్షకులకు నప్పాలి. ఆ సినిమా స్టయిలిష్ గా కూడా వుండొచ్చు. కిందివాళ్లు విజిల్ వేసారు అంటే అది డెఫినిట్ గా మాస్ సినిమా అవుతుంది. అంతే కానీ లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేయాలి..అదే మాస్ అనుకోను. బి సి సెంటర్లో అందరికీ నచ్చే సినిమా తీస్తే చాలు అది మాస్ సినిమా అవుతుంది అనుకుంటాను. రేసుగుర్రం వుంది. నా వరకు నేను క్లాస్ సినిమాగానే చూస్తాను. చాలా స్టియిలిష్ గా వుంటుంది.

మాస్ అంటే చేజ్ లు , ఫైట్లు..?

ఆ..అవన్నీ వుంటాయి. కానీ అలా అని ఓ వంద మందిని కొట్టేయడం, యాభై మందిని కొట్టేయడం అలాంటివి వుండవు. ఫైట్లు కూడా చాలా స్టయిలిష్ గా వుంటాయి.

అంటే మీ స్టయిల్ లో మీరు కంటిన్యూ అవుతున్నారు అనుకోవాలి.?

అంతే..నా స్ట్రెంగ్త్ నేను తెలుసుకుని, అది వదులుకోకుండా. ప్రేక్షకులు నా దగ్గర నుంచి ఏం ఆశిస్తారో అది తెలుసుకుని సినిమా తీయాలనుకుంటాను. అది ఆడియన్ కు నచ్చుతుందా లేదా అన్నది 24న విడుదలయ్యాక తెలుస్తుంది. నేను తీసిన సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా నా కంటూ ఓ శాటిస్ ఫాక్షన్ వుండాలి. అలా కాకుండా ఇలా అయితే జనాలకు నచ్చుతుంది అనుకుని తీసి, అది నచ్చకపోతే, అబ్బా..నేను అనుకున్నదే తీసి వుంటే బాగుండేది అని జీవితాంతం బాధపడాలి. అందుకే నేను అనుకున్నదే తీస్తాను. వారికి నచ్చితే ఆనందం.

మీరు మొదటి సినిమా తీసినపుడు బడ్జెట్ అందుబాటులో అన్నది తక్కువ. ఇప్పుడు ఆ సమస్య లేదు. అందుకు అనుగుణంగానే ముందుకు వెళ్లారా?

బడ్జెట్ అన్నది సినిమా ప్రకారం వేసుకుంటాం. స్వామిరారా లో తక్కువే కానీ, ఏ రోజూ నిర్మాత, హీరో ఇలా వెళ్లు అని చెప్పలేదు. కానీ నేను మార్కెట్ అంచనా వేసుకుని, టేబుల్ ప్రాఫిట్ ను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకున్నాను. దీనికి బడ్జెట్ వుంది అలా అని మరీ ఖర్చు చేసేయలేదు. అయితే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ వుంది. దానికి మాంచి లైటింగ్ కావాలన్నారు కేమేరా మెన్. అప్పుడు ఖర్చు చేసాం. అలాగే చైతన్య, బ్రహ్మానందం తదితరులపై ఓ ఐటమ్ సాంగ్ చేసాం. దానికి మాంచి లైటింగ్ వాడాం. మీరు చూస్తే తెలుస్తుంది. అలా కావాల్సినపుడు ఖర్చు చేసాం తప్ప, వృధా చేయలేదు.

మీ తరువాతి ప్రాజెక్టు.?

తరువాతి ప్రాజెక్టు అంటే, 24న సినిమా విడుదలయ్యాక, రిజల్ట్ ను బట్టి ఈక్వేషన్లు అన్నీ వుంటాయి. అంతకు ముందే వాళ్లను వీళ్లను కలవడం, తీరా విడదలయ్యాక తేడా వస్తే వాళ్లు ఫోన్ ఎత్తక, నేను గిల్టీగా ఫీల్ అయ్యి, ఎందుకిదంతా? అదే సినిమా హిట్ అయితే ఆ ట్రీట్ మెంట్ వేరుగా వుంటుంది.

అంటే రెండు సినిమాలకే టాలీవుడ్ లెక్కలు తెలిసిపోయినట్లున్నాయి.?

సింపుల్ ఈక్వేషన్ అండీ..నేను ఇక్కడే వుండదల్చుకున్నాను. తొందరపడి పోవడం ఎందుకు?

కానీ ఓ సినిమా చేతిలో వుండగానే మరో సినిమా తెచ్చుకోవాలనుకుంటారు.?

అనుకుంటారు నిజమే. నా వరకు సినిమా విడుదలయ్యాక, ఓ రెండు వారాలు  రెస్ట్ తీసుకుని, ఆ రెస్పాన్స్ ను బట్టి పిలుపులు వుంటాయి. వాటిని బట్టి ప్లానింగ్ వుంటుంది. హిట్ అయితే పిలుపులు ఎలాగూ వుంటాయి.

స్వామిరారా కు సీక్వెల్ తీస్తారని.?

సీక్వెల్ అంటే..తప్పకుండా దానికి కంటిన్యూయేషన్ వుంటుంది. ఎందుకంటే అక్కడ స్కోప్ వుంది. వినాయకుడి విగ్రహం పోలీసులకు ఇచ్చేయడానికి హీరో నిర్ణయించుకోవడంతో ఆ సినిమా ముగుస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్నది బట్టి రెండో స్క్రిప్ట్ అన్నమాట. నిఖిల్ తో కూడా డిస్కస్ చేసాను. అయితే ఇంకా ఆలోచించలేదు. స్కోప్, ఆలోచన వుంది. కానీ ఎప్పుడన్నది చెప్పలేను. ఇప్పటికే స్వామిరారా 2 చేస్తున్నారు. అంటే అది క్రైం కామెడీ మాత్రమే. దానిక సంబంధం కాదు. కానీ నేను కంటిన్యూయేషన్ చేస్తాను. అయితే స్క్రిప్ట్ పక్కాగా కుదరాలి. అప్పుడే చేస్తాను. చేయాలి అని చేయను.

దోచేయ్ సినిమాకు ప్రేక్షకులు ఏ అంచనాతో రావాలి..నాగ చైతన్య సినిమాగానా? సుధీర్ వర్మ సినిమాగానా?

సినిమా బాగా వచ్చింది. సెన్సార్ అయింది. క్లీన్ యు వచ్చింది. నాగచైతన్య అభిమానులు ఆయన సినిమా అని వస్తారు. నా దర్శకత్వం నచ్చేవాళ్లు నా కోసం వస్తారు. ప్రసాద్ గారు పెద్ద ప్రొడ్యూసర్. పెద్ద బ్యానర్. అలా వచ్చే వాళ్లు వుంటారు. అందరూ రావాలి. ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఆనందం కదా.? డెఫినిట్ గా ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది సినిమాలో. 

థాంక్యూ..బెస్టాఫ్ లక్

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి