ఎమ్బీయస్‌: మోతీలాల్‌ నెహ్రూ తండ్రి ముస్లిమా?- 1

నా ఎమర్జన్సీ సీరీస్‌ కామెంట్స్‌ కాలమ్‌లో ఒకాయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు – 'మోతీలాల్‌ నెహ్రూ తండ్రి ముస్లిముట, పేరు ఘియాసుద్దీన్‌ ట నిజమా?' అని. దాని కింద కాంగ్రెసు పార్టీ గురించి,…

నా ఎమర్జన్సీ సీరీస్‌ కామెంట్స్‌ కాలమ్‌లో ఒకాయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు – 'మోతీలాల్‌ నెహ్రూ తండ్రి ముస్లిముట, పేరు ఘియాసుద్దీన్‌ ట నిజమా?' అని. దాని కింద కాంగ్రెసు పార్టీ గురించి, సోనియా గాంధీ గురించి చాలా విమర్శిస్తూ చాలా రాసి, చివర్లో  ఆ కుటుంబమూలాల గురించి నిగ్గదీస్తే తప్పేముంది? అంటూ ముగించారు. నేను రాస్తున్నది 1975 నాటి రాజకీయ చరిత్ర. ఇందిరా గాంధీ వ్యక్తిగత చరిత్ర కాదు. వాళ్ల పూర్వీకుల చరిత్ర కాదు. అది ఆయన గమనించకుండా వుండరు. అయినా యింత అసందర్భంగా ఆయన ఆ ప్రశ్న ఎందుకు అడిగినట్లు? సందేహనివృత్తికి అడుగుతున్నా అంటూ యీ సందేహాన్ని యితరుల మెదళ్లలో నాటడం పుకార్లు వ్యాప్తి చేసే పద్ధతుల్లో ఒకటి. ఇటీవలి కాలంలో నాకు చాలామంది మెయిల్స్‌ రాస్తున్నారు – నెహ్రూ ముస్లిమా? అంటూ. ఇదంతా ఒక పథకం ప్రకారం సాగిస్తున్న దుష్ప్రచారం. నాకు యీ మధ్య మెయిల్‌ రాసినాయన – 'మోతీలాల్‌ నెహ్రూకి ముస్లిము వుంపుడుగత్తెల ద్వారా జిన్నా, కశ్మీర్‌ నాయకుడు షేక్‌ అబ్దుల్లా పుట్టారని నెహ్రూ సెక్రటరీ ఎం ఓ మత్తయ్‌ రాసిన పుస్తకంలో వుంది కాబట్టి నమ్మవచ్చా?' అంటూ రాశారు. ''మత్తయ్‌ రాసిన పుస్తకంలో అలా వుందా? ఉంటే ఏ పేజీలో వుంది?'' అని అడిగాను. ఆయన వెంటనే ''నేను ఆ పుస్తకాన్ని చదవలేదు. నాకు వచ్చిన ఫార్వార్డ్‌లో అలా వుంది.'' అన్నాడు. ''అలాటప్పుడు '..పుస్తకంలో వుందట' అని రాయాలి తప్ప వుంది అని ఎలా రాశారు?' అని నిలదీశాను. 

మత్తయ్‌ రాసిన ఆ పుస్తకం జనతా ప్రభుత్వం వున్న రోజుల్లో వచ్చింది. నేను చదివాను. నెహ్రూకు సంబంధించిన కొన్ని ఆంతరంగిక విషయాలు రాసిన మాట వాస్తవమే కానీ యిది మాత్రం లేదు. ప్రస్తుతం ఆ పుస్తకం ప్రతులు అలభ్యం.  ''ఇంప్రింట్‌'' పత్రికలో వేసిన దాని సంక్షిప్త రూపం నా దగ్గర వుంది. అందువలన ఆ పుస్తకం పేరు చెప్పి అబద్ధాలు చెపితే నేను కనుక్కోగలను. కానీ యీ సౌలభ్యం అందరికీ వుండదు కాబట్టి వాళ్లు పుకార్లు పుట్టించగలుగుతున్నారు. పుస్తకం ఏదైనా వెబ్‌సైట్‌లో దొరికినా చదివే ఓపిక వుండదు కాబట్టి బుకాయించేయవచ్చు. నేను గోడ్సే సీరీస్‌ రాసినప్పుడు ఒక పాఠకుడు మహాత్మా గాంధీ అనని మాటల్ని కూడా అన్నట్టుగా రాసేసి, ఆధారాలివిగో అంటూ యిచ్చేశారు. వెళ్లి వెతికితే అక్కడున్నది వేరు, యీయన రాసినది వేరు. ఇదిగో యిప్పుడు దీని గురించి వివాదం నడుస్తోంది! 

కాస్సేపు నెహ్రూ తాత ముస్లిమే అనుకుందాం. దానివలన ఏం నిరూపిస్తారు? నెహ్రూ పాండిత్యాన్ని కాని, ప్రజాదరణను కానీ, నాయకత్వ పటిమను కానీ పరిపాలనాకౌశలాన్ని కానీ తగ్గించగలరా? హెచ్చించగలరా? ప్రజలు నెహ్రూను నెహ్రూగా చూశారు తప్ప, ముస్లిమా, పార్శీయా, క్రైస్తవుడా అని చూడలేదు. నేను కశ్మీరీ బ్రాహ్మణ్ని కాబట్టి నాకు ఓట్లేయండి అని నెహ్రూ అడగలేదు కదా! కొందరు షెడ్యూల్‌ కాస్ట్‌ అని షెడ్యూల్‌ ట్రైబ్‌ అని చెప్పుకుని రిజర్వ్‌డ్‌ స్థానాల నుంచి పోటీ చేస్తారు. వాళ్లు ఆ కులాలకు చెందినవారు కాదని తక్కినవాళ్లు కేసులేస్తారు. నెహ్రూ అటువంటి రిజర్వ్‌డ్‌ స్థానం నుంచి పోటీ చేసి వుంటే యిలాటి సమాచారం కీలకమయ్యేది. కొంతమంది రాష్ట్ర, కేంద్ర మంత్రులు ఎన్నికల అఫిడవిట్లలో లేని డిగ్రీలు రాసేసుకుంటారు. వాళ్ల మీదా కేసులు పడతాయి. నెహ్రూ అలా దొంగ డిగ్రీ చెప్పుకున్న దాఖలా కూడా లేదు. జనాలు అతని కులం, మతం చూసి కాదు, అతని సిద్ధాంతాలు నచ్చి ఓట్లేశారు.  ఇంకెందుకు వంశ చరిత్ర తవ్వాలి? 'అబ్బే, యీ రహస్యం ఛేదిస్తే నెహ్రూ ముస్లిములను బుజ్జగించడానికి గల కారణం ఏమిటో తెలిసిపోతుంది' అంటారా? దేశవిభజనకు అంగీకరించడం ముస్లిములను బుజ్జగించడంలో మొదటి మెట్టు అనుకుంటే దేశవిభజనకు అందరి కంటె ముందుగా అంగీకరించిన రాజాజీ, ఆంబేడ్కర్‌ తాతల గురించి కూడా ఆరాలు మొదలుపెట్టాలి. స్వాతంత్య్రానంతరం ముస్లిములను ఓటు బ్యాంకులుగా చూసి వారిని బుజ్జగించారు అనుకుంటే, ఆ పని చేసిన, చేస్తున్న, చేయబోతున్న జాతీయ, ప్రాంతీయ, కుడి, ఎడమ పార్టీల నాయకులందరి తాతల సంగతీ కూపీలు లాగాలి. 

వారందరినీ వదిలేసి నెహ్రూ, మోతీలాల్‌ నెహ్రూ, గంగాధర నెహ్రూల గాథలే ఎందుకు తవ్వితీయాలి? అదేమిటో సడన్‌గా అందరూ హిస్టరీ రిసెర్చర్లు అయిపోయారు. నెహ్రూకు, లేడీ మౌంట్‌బాటెన్‌కు సంబంధం వుందా? నెహ్రూ పచ్చి వ్యభిచారిట కదా, ఇందిరా గాంధీ తిరుగుబోతుట కదా, మోతీలాల్‌ నెహ్రూకు భార్య కాక ఉంపుడుగత్తెలున్నారట కదా.. యిలా ఎన్నో ప్రశ్నలు నాకు వచ్చిపడుతున్నాయి.  మోతీలాల్‌కు జవహర్‌లాల్‌కు గల సిద్ధాంతవైరుధ్యాలేమిటి? ప్రజాస్వామ్యం పట్ల నెహ్రూకు వున్న కమిట్‌మెంట్‌ ఇందిరకు వుందా లేదా? వంటి ప్రశ్నలు రావటం లేదు. ఎవరు ఎవరితో పడుక్కున్నారు అనేదే యిప్పుడు చరిత్రకు అతి కీలకమైన అంశం అయిపోయింది. మన దేశంలోనే కాదు, విదేశాలతో సహా – అనేకమంది చరిత్రలు చదివిన, వారి గురించి విన్న విషయాలతో నాకు బోధపడినదేమిటంటే – పబ్లిక్‌ లైఫ్‌లో వున్న చాలామంది జీవితాల్లో లైంగికపరమైన బలహీనత వుంటోందని! కుటుంబానికి దూరంగా వుండడం చేత, యితర నాయకులతో కలిసి టూర్లలో తిరిగే అవకాశాలు ఎక్కువగా వుండడం చేత యిలాటివి జరుగుతూండవచ్చు. స్వాతంత్య్రోదమంలో పాల్గొన్న నాయకుల్లో సైతం యిది కనబడుతుంది. అంతెందుకు, కాన్సన్ట్రేషన్‌ క్యాంపుల్లో మృత్యుముఖంలో వున్న యూదుల్లో సైతం యిది వుందని ఏనే ఫ్రాంక్స్‌ డైరీ చదివితే బోధపడుతుంది. అందువలన వీటిపై చర్చ అనవసరమని నా వ్యక్తిగత అభిప్రాయం. నాయకుల రాజకీయపరమైన నిర్ణయాలు కాని, పాలనాపరమైన విధానాలు గాని వారి అక్రమసంబంధాల కారణంగా ప్రభావితమైనప్పుడే మనం వాటిని సీరియస్‌గా పట్టించుకోవాలి. లేడీ మౌంట్‌బాటెన్‌తో స్నేహం కారణంగా నెహ్రూ మాకు స్వాతంత్య్రం అక్కరలేదని చెప్పి వుంటే అప్పుడు ఆ స్నేహాన్ని చర్చించాలి. లేకపోతే అది కేవలం వారివారి కుటుంబసభ్యులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే!

మాటవరసకి గంగాధరుడు ఒరిజినల్‌గా ఘియాసుద్దీన్‌ అనుకుందాం, ఏదో ఒక కారణం చేత హిందూమతంలోకి మారాడనుకుందాం. తప్పేమైనా వుందా? ఎంతోమంది హిందువులు ముస్లిములుగా, క్రైస్తవులుగా మారారు. వారందరినీ మీ తాతల కాలం నాడు హిందూ కుటుంబం అని వాళ్లెవరైనా ఎత్తి చూపుతారా? వివక్షత చూపుతారా? ఈనాడు స్వామీజీల బోధనలు విని హిందూ మతంలోకి చేరిన అనేకమంది విదేశీయులున్నారు. వారిని మనం వేలెత్తి చూపిస్తున్నామా? ఇటీవలి కాలంలో  కొన్ని సంస్థలు ''ఘర్‌ వాపసీ'' పేరుతో అనేకమంది గిరిజనులను, ముస్లిములను హిందూమతంలోకి చేర్చుకుంటున్నాయి. రేపు వారిని కూడా మీ నాన్న పేరిది, మీ తాత పేరిది, మీరు ఒరిజినల్‌గా హిందువులు కాదు అని అదో పెద్ద అంశంగా చేస్తారా? నిజానికి ఏ వ్యక్తి మూలాలు ఎక్కడున్నాయో కనుక్కోవడం అంత సులభం కాదు. మన దేశంలోకి శకులు, హూణులు, కుషానులు, యవనులు, మ్లేచ్ఛులు యిలా ఎందరో దండెత్తి వచ్చి మన దేశజనాభాలో విలీనమై హిందువులయ్యారు. మన దేశంలో కొంతకాలం బౌద్ధం, జైనం ప్రసిద్ధమతాలుగా వున్నపుడు అనేకమంది హిందువులు ఆ మతాల్లో చేరారు. వాటి ప్రభావం క్షీణించగానే మళ్లీ హిందూమతంలోకి వచ్చేశారు. వీరందరి గతాన్ని ఎత్తి చూపి 'మూడు తరాల కితం నువ్వు ఫలానా' 'నూరు తరాల కితం నువ్వు ఫలానా' అని ముద్రలు కొడుతున్నారా? ముస్లిములు, ఆంగ్లేయులు అధికారంలో వున్నపుడు కొందరు హిందువులు పదవుల కోసమో, ఉద్యోగాల కోసమో మతం మారారట. వాళ్లను చూసి ఒరిజినల్‌ ముస్లిములు, క్రైస్తవులు అసూయ పడి వుండవచ్చు. ఇప్పుడు మోతీలాల్‌ తండ్రి హిందూమతంలోకి వచ్చినందువలన ఆయనకు గాని, కొడుకుకు గాని, మనుమడికి గాని ఏదైనా పదవి/ఉద్యోగం/హోదా దక్కిందా? అలాటిది లేనప్పుడు యిక దానిపై చర్చ ఎందుకు?

ఇంతకీ గంగాధర నెహ్రూ కథేమిటి అని తెలుసుకోవాలని ఎవరైనా అనుకోగానే మొదటగా చూసేది వికీపీడియా. అందుకని దానిలోనే గంగాధర్‌ అసలు పేరు ఘియాసుద్దీన్‌ ఘాజీ అని, బ్రిటిషువారి వేధింపు నుంచి తప్పించుకోవడానికి హిందువుగా మారాడని ఒక సమాచారాన్ని చొప్పించారు. ఎవరు చేశారీ పని? వికీపీడియాలో ఎవరు కావాలంటే వాళ్లు ఏది కావాలంటే అది రాసేయవచ్చు, యింకోళ్లు వచ్చి మార్చేయవచ్చు. తెలంగాణ ఉద్యమం నడిచే రోజుల్లో వికీపీడియాలో ఒక వ్యాసంలో బ్రహ్మానంద రెడ్డి 1969 తెలంగాణ ఉద్యమం అణచి వేసినందుకే నక్సలైట్‌ ఉద్యమం వచ్చిందని రాసేశారు. ఎవరో దాన్ని కోట్‌ చేస్తూ నాతో వాదనకు దిగారు. నక్సలైట్‌ ఉద్యమం రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభమైందో వేరే ఎక్కడైనా చదువుకుని అప్పుడు మాట్లాడమని చెప్పాను. 

అంతెందుకు, ''రుద్రమదేవి'' సినిమా గురించి సినిమా ఎనౌన్సు చేయగానే నిర్మాతలు కాకుండా వేరెవరో వికీపీడియా పేజీ సృష్టించారు. దానిలో రచన – డా|| ముదిగొండ శివప్రసాద్‌, మధుబాబు, ఎమ్బీయస్‌ ప్రసాద్‌ అని రాశారు. నిజానికి మేము కథాపరిశోధనా బృంద సభ్యులం. రచన గుణశేఖర్‌, రచనా సహకారం తోట ప్రసాద్‌. రచనా విభాగంలో వారి పేర్లు లేవు. ఆ తప్పు సమాచారాన్ని యితరులు కాపీ చేసి తమ బ్లాగ్‌లలో పెట్టుకోవడం వలన అదే యించుమించు ఏడాదిన్నరపాటు ప్రచారంలో వుంది. చివరకు సినిమా రిలీజుకు ముందు వికీపీడియా పేజీని సవరించారు. కానీ తక్కినవాటిల్లో సవరించబడలేదు. మీరు గూగుల్‌కి వెళ్లి mbs prasad rudramadevi film అని కొడితే  తెలుస్తుంది – ఎన్ని వెబ్‌సైట్లలో యిప్పటికీ పొరబాటుగా వుందో! ఇలా వుంటాయి వికీపీడియా రాతలు, సవరింపులు. నా ప్రమేయం ఏమీ లేకుండానే నాకు అనవసరమైన క్రెడిట్‌ యివ్వబడింది. ఫేస్‌బుక్‌ కూడా యిలాటిదే. ఎవరో కానీ నా పేర ఫేస్‌బుక్‌ పేజీ తెరిచారు. దానిలో కొన్ని వివరాలు కరక్టే అయినా నా డేట్‌, ఇయర్‌ ఆఫ్‌ బర్త్‌ తప్పుగా రాశారు. ఈ నాటి సాంకేతిక యుగంలో వేరేవారి పేర మనం మంచికాని, చెడుకాని రాయడం ఎంత సులభమో యిలాటి ఉదాహరణలు చెప్తాయి.

ఇంతకీ గంగాధర నెహ్రూ గురించి అతను జన్మతః ముస్లిము అనే సమాచారాన్ని కావాలని ఎవరు చొప్పించారు? వికీపీడియాను ఎడిట్‌ చేసేవారు ఏ సర్వర్‌ నుంచి చేస్తున్నారో గమనించేందుకు సెంటర్‌ ఫర్‌ ఇంటర్నెట్‌ అండ్‌ సొసైటీ తరఫున ప్రాణేశ్‌ ప్రకాశ్‌ అనే ఆయన సాఫ్ట్‌వేర్‌ తయారు చేశారట. దాని ద్వారా ట్రాక్‌ చేస్తే అది ఇండియన్‌ గవర్నమెంటు వారి నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఐఎన్‌సి) అందించిన ఐపి అడ్రసు నుంచే మార్చారని తేలిందట. అలాగే నెహ్రూ పేజీలో ఎడ్వినా మౌంట్‌బాటెన్‌తో వ్యవహారం గురించి రసవత్తరమైన విషయాలు జోడించారట. ఇదంతా 2015 జూన్‌లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో రాగానే (http://timesofindia.indiatimes.com/india/Wiki-entries-on-Nehru-family-edited-from-NIC-IP/articleshow/47888589.cms) కాంగ్రెసు యిదంతా మోదీ సర్కారు కావాలనే చేసిందని గొడవ చేసింది. మొత్తానికి దాన్ని తీసేశారు. అప్పణ్నుంచి  యిదిగో యిలా ప్రచారం చేయడం మొదలుపెట్టారన్నమాట. ధర్మసందేహంగానో, పుకారుగానో, పరిశోధకాంశంగానో దానికి దుస్తులు తొడిగి చలామణీలో పెట్టారు. పంచతంత్రంలో నలుగురు వరుసగా చెప్పగా ఆవుని కుక్క అనుకున్న బ్రాహ్మళ్లా కొందరైనా యీ ప్రచారం నమ్మకపోరని వారి అంచనా. ఇలాటిదే మరో దాని గురించి కూడా యిదే సందర్భంలో చెప్తాను. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2016)

[email protected]