Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: నెదర్లాండ్స్‌ ఎన్నికలో ముస్లిము వ్యతిరేక పార్టీ ఓటమి

బ్రెగ్జిట్‌ తర్వాత, అమెరికాలో ట్రంప్‌ ఎన్నిక తర్వాత యూరోప్‌లో అనేక దేశాల్లో అల్ట్రా రైటిస్టు పార్టీలు బలం పుంజుకుంటున్నాయని, దాని వలన యూరోపియన్‌ యూనియన్‌నుంచి బయటకు వెళ్లిపోదామనేవారికి, వలసదారుల పట్ల, ముస్లిముల పట్ల ద్వేషం కక్కేవారికి ప్రజాదరణ పెరుగుతోందని వ్యాఖ్యానాలు వచ్చాయి. నెదర్లాండ్స్‌లో తాజాగా జరిగిన ఎన్నిక ఆ ధోరణికి అడ్డుకట్ట వేసింది. నెదర్లాండ్స్‌లో హాలండ్‌ ఒక భాగం. కానీ మొత్తం దేశాన్ని హాలండ్‌ అనడం కద్దు. ఆ దేశస్తులను డచ్చివారంటారు. పోర్చుగీసువారి తర్వాత మన దేశాన్ని వలస ప్రాంతంగా చేసుకుందామని ప్రయత్నించినవారిలో వాళ్లూ ఒకళ్లు.  ప్రస్తుతం అక్కడ ప్రజాస్వామ్యం నడుస్తోంది. వారి పార్లమెంటులో 150 సీట్లుంటాయి. ఐదేళ్లకు ఓ సారి ఎన్నికలు. 28 పార్టీల వరకు పోటీ చేస్తాయి. వాటికి వచ్చిన ఓట్ల శాతం బట్టి సీట్లు కేటాయిస్తారు. 1918లో ప్రవేశపెట్టిన యీ ప్రపోర్షనల్‌ రిప్రటంజేషన్‌ పద్ధతిలో ఇప్పటిదాకా ఎవరికీ సగానికి మించిన సీట్లు రాలేదు. అందువలన కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాలు నడుపుతూ వచ్చాయి. వాటి విధానాలను బట్టి ఈ పార్టీలను  ఫార్‌-రైట్‌, సెంటర్‌-రైట్‌, సెంటర్‌, సెంటర్‌-లెఫ్ట్‌, లెఫ్ట్‌ గా వర్గీకరిస్తారు. ఈ పార్టీలు అంగీకారానికి రావడానికి నెలలు పడుతూంటుంది. 

ప్రస్తుతం 41 సీట్లు పొందిన పీపుల్స్‌ పార్టీ ఫర్‌ ఫ్రీడమ్‌ అండ్‌ డెమోక్రసీ (వివిడి) అనే సెంటర్‌-రైట్‌ పార్టీ కొన్ని పార్టీలతో కలిసి పాలిస్తోంది. ఆ పార్టీకి చెందిన మార్క్‌ రూట్‌ ప్రధానిగా వున్నాడు. అదే పార్టీలో నాయకుడిగా ఎదిగిన గీర్ట్‌ విల్డర్స్‌ అనే నాయకుడు 2006లో పార్టీలోంచి బయటకు వచ్చేసి, పార్టీ ఫర్‌ ఫ్రీడమ్‌ (పివివి) అనే ఫార్‌-రైట్‌ పార్టీని నెలకొల్పాడు. ముస్లింలను దేశంలోకి రానియ్యకూడదని, ఇతర దేశాల నుంచి వలస వచ్చేవారిని దేశంలోకి అడుగు పెట్టనీయకూడదని, యూరోపియన్‌ యూనియన్‌తో బాంధవ్యం తెంపుకోవాలనీ తీవ్రభావాలు వ్యక్తం చేసి జాతీయతావాదం పేర ప్రజలను ఆకట్టుకోసాగాడు. 'నేను నెగ్గితే నెదర్లాండ్స్‌లో డీ-ఇస్లామైజేషన్‌ తథ్యం. ఏ ముస్లిము దేశాన్నించి ఎవర్నీ రానివ్వను. మసీదులన్నీ మూసేస్తా.' అనే నినాదంతో ముందుకు వచ్చిన అతన్ని యూరోప్‌లో పెరుగుతున్న అసహనానికి ప్రతీకగా ప్రపంచమంతా గుర్తించింది. జనవరిలో ఒపీయనియన్‌ పోల్స్‌ నిర్వహిస్తే అతనికి 22 సీట్లు పెరిగి 37 సీట్లు వస్తాయని తేలింది. ప్రత్యర్థులందరూ అతన్ని చూసి భయపడసాగారు. అతన్ని నిలవరించడానికి అతని విధానాలలో కొన్నిటిని తీసుకుని తమకు అనువుగా మలచుకున్నారు.

బుధవారం నాడు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందు మార్క్‌ ''ఈ కొత్త అసహన ధోరణులపై మనవి క్వార్టర్‌ ఫైనల్స్‌, ఫ్రాన్సులో ఏప్రిల్‌, మేలలో జరగబోయే ఎన్నికలు సెమీ ఫైనల్స్‌, ఆ తర్వాత సెప్టెంబరులో జర్మనీ ఎన్నికలు ఫైనల్స్‌. మనం వాళ్లకు దిశానిర్దేశం చేయాలి.'' అంటూ పిలుపు నిచ్చాడు. బ్రిటన్‌లో వలసదారులకు వ్యతిరేకంగా బ్రెగ్జిట్‌ ఉద్యమం నడిపిన నైజిల్‌ ఫరాగే ఎన్నికల వేళ నెదర్లాండ్స్‌ వచ్చి గీర్ట్‌కు మద్దతుగా ప్రచారం చేశాడు. 130 లక్షల మంది ఓటర్లలో 80% మంది ఓటేశారు. 30 ఏళ్లల్లో యిదే గరిష్టం. మర్నాడు ఫలితాలు వచ్చాయి. అందరూ భయపడినట్లు గీర్ట్‌ అధికారంలోకి రావటం లేదు. అతని పార్టీకి 5 సీట్లు పెరిగి 20 వచ్చాయంతే కానీ ద్వితీయ స్థానంలో నిలిచాడు. మార్క్‌ ప్రథమస్థానాన్ని నిలుపుకున్నాడు కానీ గతంలో కంటె 8 తగ్గి 33 తెచ్చుకున్నాడు. తృతీయ స్థానంలో రెండు సెంట్రిస్టు పార్టీలు డెమోక్రాటక్‌ ఎప్పీల్‌, లిబరల్‌ ప్రోగ్రెసివ్‌ చెరి 19 సీట్లతో నిలిచాయి. వాటికి గతంలో కంటె 6, 7 సీట్లు ఎక్కువ వచ్చాయి. క్రిస్టియన్‌ యూనియన్‌ అనే మరో సెంట్రిస్టు పార్టీకి 5 వచ్చాయి.

సెంటర్‌-రైట్‌కు చెందిన మార్క్‌ ఈ సెంట్రిస్టు పార్టీలతో  చేతులు కలిపి, యితరులు(17)లో కొంతమంది మద్దతు తీసుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచి మూడోసారి ప్రధాని అయి, గీర్ట్‌ను దూరం పెట్టవచ్చు. లెఫ్టిస్టు పార్టీలకు వస్తే సెంటర్‌-లెఫ్ట్‌ భావజాలానికి చెందిన లేబర్‌ పార్టీ ప్రస్తుత ప్రభుత్వంలో ద్వితీయస్థానంలో వుంటూ కూడా 29 సీట్లు పోగొట్టుకుని 9 నెగ్గింది. మరో లెఫ్ట్‌ పార్టీ అయిన సోషలిస్టు పార్టీ 1 సీటు కోల్పోయి 14 తెచ్చుకుంది. లెఫ్ట్‌కే చెందిన గ్రీన్‌ లెఫ్ట్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 10 సీట్లు ఎక్కువ గెలిచి మొత్తం 14 పొందింది. దానికి నాయకత్వం వహించిన 30 ఏళ్ల జెస్‌ క్లేవర్‌ యితరుల పట్ల సహనం, అంతర్జాతీయ దృక్పథం దేశానికి చాలా అవసరమనీ, రైట్‌ పార్టీల వలన వాటికి ప్రమాదం ఏర్పడిందని వాదించాడు. అంటే పాప్యులిజంతో బాటు దానిని ప్రతిఘటించే ఉదార శక్తులు కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయన్నమాట.

ఈ ఫలితాలను యూరోప్‌లోని ప్రభుత్వాలు హర్షించాయి. ముఖ్యంగా జర్మన్‌ ఛాన్సెలర్‌ ఏంజిలా మెర్కెల్‌! గీర్ట్‌ ఓటమి ఫ్రాన్సులో ఫార్‌-రైట్‌ నాయకురాలైన మారీన్‌ లె పెన్‌కు ఆశాభంగం కలిగించింది. గీర్ట్‌ మాత్రం నిరాశపడినట్లు లేడు. ట్విట్టర్‌లో తనను ఫాలో అయ్యే 8 లక్షల మందిని ఉద్దేశించి ''నిన్నటిదాకా మనం మూడో పెద్ద పార్టీ, ఈ రోజు రెండో పెద్ద పార్టీ. రేపు మనదే పెద్ద పార్టీ'' అని ట్వీట్‌ చేశాడు. ఎందరు హర్షించినా టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్‌ మాత్రం డచ్‌ ప్రభుత్వంపై, మార్క్‌పై కోపంగానే వున్నాడు. దానికి కారణం వుంది. టర్కీలో అధ్యక్షుడికి మరిన్ని అధికారాలు ప్రసాదించే కొత్త రాజ్యాంగ సవరణలపై ఏప్రిల్‌ 16న రిఫరెండం జరగబోతోంది. విదేశాల్లో వున్న టర్కు దేశస్థులకు తన తరఫున ప్రచారం చేయడానికి ఎర్దోగాన్‌ మంత్రులను వివిధ దేశాలకు పంపించాడు. నెదర్లాండ్స్‌లోని రాటర్‌డామ్‌లో ర్యాలీలో ప్రసంగించడానికి ఫత్మా బేతుల్‌ కాయా అనే విదేశాంగ మంత్రిణిని మార్చి 12 న పంపిస్తే ఆమెను మార్క్‌ ప్రభుత్వాధికారులు అడ్డుకున్నారు. వెనక్కి పంపేశారు. 

ఆమెను అనుమతిస్తే 'ముస్లిముల పట్ల యీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది' అని గిర్ట్‌ విరుచుకు పడడానికి అవకాశం యిచ్చినట్లవుతుందని, అది ఎన్నికలలో తనను దెబ్బ తీస్తుందని మార్క్‌ భయం కాబోలు. ''ఎన్నికల కోసం మన యిరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బ తీయడం నాజీయిజం, ఫాసిజం' అంటూ ఎర్దోగాన్‌ మండిపడ్డాడు. డచ్‌ రాయబారిని తన దేశం నుంచి బహిష్కరించాడు. ఇదంతా చూసి జర్మనీలోని కొన్ని చిన్న రాష్ట్రాలు ''ఇతర దేశాల ఎన్నికల ప్రచారాలను యిక్కడ నిర్వహించకుండా నిషేధించే ఆలోచనలో వున్నాం. టర్కీలోని అంతర్గత కలహాలకు జర్మనీ వేదిక కావడమేమిటి?'' అంటున్నాయి. నిజానికి టర్కీ చట్టం ప్రకారం విదేశాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు. అయితే యీ మంత్రులు విదేశాలలో వున్న టర్కుల సాంస్కృతికి కార్యకలాపాల్లో పాలు పంచుకోవడానికి వస్తున్నామని చెప్పుకుంటూ వస్తున్నారు. దాన్ని అడ్డుకుని నెదర్లాండ్స్‌ ఎర్దోగాన్‌ ఆగ్రహానికి గురైంది. 'గీర్ట్‌ ఎన్నికైతే రెండు దేశాల మధ్య గొడవలు మరింత పెరిగేవేమో, మార్క్‌ నెగ్గడం మంచిదే అయింది కదా' అని ఎర్దోగాన్‌ని అడిగితే 'దొందూ దొందే' అని తేల్చి పారేశాడు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

-mbsprasad@gmail.com