cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : పాలనంటే పండగలే

ఎమ్బీయస్‌ : పాలనంటే పండగలే

విదేశీ పర్యటనలో వున్నాను కాబట్టి ప్రస్తుతాంశాలపై రాయను అన్నా కొన్నిటి గురించైనా, కనీసం అమరావతి గురించైనా రాయండి అని చాలామంది పాఠకులు కోరుతున్నారు. ఇక్కడ మా యింట్లో తెలుగు టీవీ ఛానెళ్లన్నీ వస్తున్నాయి. చూస్తున్నాను కానీ నాకు విషయం సరిగ్గా బోధపడటం లేదు. పది రోజులుగా టీవీలో ఒకటే న్యూసు - అమరావతి, అమరావతి, కాస్సేపు కట్టేసి మళ్లీ పెడితే బతకమ్మ (యీ మధ్య బతుకమ్మ అని సవరించారు) బతకమ్మ. బతకమ్మ పండగ యివాళ్టిదా? ఎప్పుడూ కొన్ని వర్గాల వారు చేసుకునేవారు. ఇప్పుడు బతకమ్మ ఆడకపోతే మనిషే కాదన్న బిల్డప్‌ యిచ్చి తెరాస ప్రభుత్వం సొంతం చేసేసుకుంది. ప్రజల్ని వాళ్ల మానాన వాళ్లని వదలటం లేదు. పండగలు చేసుకోవడమే వాళ్ల విధి అన్నట్టు తయారుచేస్తున్నారు. హుస్సేన్‌ సాగర్‌ను ప్రక్షాళన చేస్తున్నామని కాస్సేపు చెప్తారు, మళ్లీ దానిలోనే వినాయకవిగ్రహాలను ముంచుతారు, బతకమ్మ ఘాట్‌లు పెడతారు. ఆ నీళ్లు ఎప్పటికి శుద్ధి అవుతాయి? వాటి పక్కన ఆకాశహర్మ్యాలు ఎలా వెలుస్తాయి?

ఏడాదికి ఓ సారి వచ్చే బతకమ్మకే కెసియార్‌ యింత హంగు చేస్తే జీవితంలో ఒక్కసారి వచ్చే రాజధాని శంకుస్థాపన పండగకు యింకెంత చేయాలని బాబు అనుకున్నారులాగుంది. ప్రభుత్వం మీడియాకు కళ్లగంతలు కట్టిందో, తక్కినదేదీ ముఖ్యం కాదని మీడియాయే డిసైడయ్యిందో తెలియదు కానీ తక్కిన సమస్యలకు కవరేజీ పెద్దగా యివ్వలేదు. ఆహ్వానపత్రికలు తయారువుతున్నాయి, మట్టి పోగేస్తున్నారు, నీరు సేకరిస్తున్నారు, రెండిటినీ కలుపుతున్నారు, పంచెలు యిస్తున్నారు, ధోవతులు యిస్తున్నారు, సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. యిదే న్యూస్‌, మరేదీ కాదు. న్యూసు యింత విన్నా నా మనసులో కొన్ని సందేహాలు అలాగే వుండిపోయాయి. 

మొదటిది - పిఎంఓకు వచ్చిన సందేహమే, గతంలోనే భూమిపూజ జరిగింది కదా, యిప్పుడు మళ్లీ శంకుస్థాపన ఏమిటి అని. దీనిపై వచ్చిన ఆర్టికల్‌లో కొందరు పాఠకులు రెండూ వేర్వేరే, పేరు బట్టే తెలుస్తోంది కదా అన్నారు. మనం యిల్లు కడితే భూమిపూజ, శంకుస్థాపన ఒకసారే జరుపుతాం కదా, ఇక్కడ వేర్వేరు రోజుల్లో నెలల గ్యాప్‌లో చేస్తున్నారెందుకు? ఒక ఫంక్షన్‌ను రెండుగా విడగొట్టారా? ఎందుకు? అధికస్య అధికం ఫలం అన్నట్లు, ఎన్ని పండగలైతే జనాలు అంత ఉబ్బిపోతారనా? ఇలాగైతే రాబోయే రోజుల్లో కలశస్థాపన ఒకసారి, కలశపూజ మరోసారి చేస్తారేమో! ఇలాటివి పురోహితులు చేస్తున్నారంటే దక్షిణ కోసం కార్యక్రమాలు పెంచేస్తున్నారని అనుకుంటాం, కానీ పాలకులే అలా చేస్తున్నారంటే వారికి కావలసినది దక్షిణా? లేక ప్రజలకు కాలక్షేపం కల్పించడమా?

రెండోది - మనం యింటికి శంకుస్థాపన ఎప్పుడు చేస్తాం? కట్టడానికి పర్మిషన్లు, నిధులు అన్నీ వచ్చేదాకా ఆగి అవి చేతిలో పెట్టుకుని దీనికి దిగుతాం. మరి అమరావతి విషయంలో రేపణ్నుంచే పని ప్రారంభమయ్యే పరిస్థితి వుందా? తెలియదు. కట్టేది ప్రభుత్వమే కాబట్టి అనుమతులు తెచ్చుకునే బాధ లేదు, కుడిచేత్తో కాగితం మీద సంతకం పెట్టి ఎడం చేతికి యిచ్చేస్తే చాలు అనుకుంటాం. కానీ వాళ్లూ మాస్టర్‌ ప్లాను ప్రకారం కట్టాలి. కేంద్రం ఔననాలి. పర్యావరణశాఖ అనుమతులు లేవని కాస్త కంగారు పెట్టి, చివర్లో దయచేయించారు. ఇక మాస్టర్‌ ప్లాను సంగతి ఎంతవరకు వచ్చిందో నాకైతే తెలియదు. ఏది బ్రోషరో, ఏది ప్లానో బోధపడటం లేదు. రాష్ట్ర విభజన వార్త రాగానే రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు కావాలని బాబు స్టేటుమెంటు యిచ్చారు. విడిపోయి, కొత్త ప్రభుత్వాలు ఏర్పాడి ఏడాదిన్నరైంది. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు అడుగుతున్నారో తెలియదు. రాజధాని నిర్మాణానికి యింత యిస్తామని మోదీ ఒక్క ప్రకటనైనా చేయలేదని తక్కినవాళ్లు ఎద్దేవా చేసిన ప్రతీసారి స్థానిక బిజెపి నాయకులు 'మన ప్రభుత్వం నుంచి ప్లాను వెళితే దానికి ఎంత ఖఱ్చు అవుతుందో అంచనా వేసి శాంక్షన్‌ చేస్తారు తప్ప గాల్లో మేడలని చూపిస్తే ఎలా కేటాయిస్తారు?' అని అడుగుతూ వచ్చారు. కేంద్ర బజెట్‌లో ఆంధ్ర రాజధానికి యింత అనే కేటాయింపు కూడా చూసిన గుర్తు లేదు. ప్లాను తయారైనప్పటి మాట కదా అని వాళ్లూ తేలిగ్గా తీసుకున్నారేమో తెలియదు.  ఇంతకీ ప్లాను వెళ్లిందా? దానిపై కొర్రీలు ఏమైనా వచ్చాయా? శాంక్షన్‌ చేసి, యిదిగో కట్టుకోండి అని డబ్బులిచ్చారా? శాంక్షన్‌ రానిదే పని మొదలుపెడితే అదో చిక్కని చంద్రబాబుకి వేరే ఎవరూ చెప్పనక్కరలేదు. జూబిలీ హిల్స్‌లో సొంత యిల్లు అలాగే మొదలుపెట్టేసి, పెనాల్టీ ఎదుర్కున్నారు. మోదీ ప్రభుత్వం దేనిలో మొండి చెయ్యి చూపించినా అనుమతుల విషయంలో చూపించదని నమ్ముకున్నా, చేతిలో డబ్బులు లేకుండా శంకుస్థాపనకు దిగారంటే మాత్రం అంతకంటె హాస్యాస్పదం మరొకటి వుండదు. 

విజయదశమి మంచి రోజు కాబట్టి ఫంక్షన్‌ పెట్టేసుకున్నారు అనుకున్నా, యింత హంగామా అవసరమా అన్న ప్రశ్న వదలడం లేదు. ఎంత చెట్టుకి అంతగాలి అన్నారు. గుడ్డ చూసుకుని కోటు కుట్టించుకోమన్నారు. పిండి కొద్దీ రొట్టె అన్నారు. ఇలా పెద్దలెన్ని సామెతలు చెప్పినా సర్కారు వినటం లేదు. ప్రభుత్వం తనకు కావలసిన మేర కట్టడానికి ఏర్పాట్లు చూసుకుంటే సరిపోయేది. ఎవరైనా పారిశ్రామికవేత్త ఓ ఫ్యాక్టరీ కట్టేసి వూరుకుంటాడు. మహా అయితే స్టాఫ్‌కి క్వార్టర్స్‌ కడతాడు. అంతేగానీ గేటు దగ్గర టీ స్టాలూ, సిగరెట్ల కోసం ఆ పక్కన బడ్డీ కొట్టు, స్టాఫ్‌ సరుకులు కొనేందుకు కిరాణా కొట్టు, వారాంతంలో వెళ్లేందుకు సినిమా హాలు, యూనియన్‌ నాయకులు ప్రదర్శనలు చేసేందుకు, ఉపన్యాసాలు దంచేందుకు వీలుగా రావిచెట్టు సిమెంటు గట్టు - యివన్నీ కట్టడు. అవన్నీ వాటికవే పుట్టుకుని వస్తాయి. ప్రజలు తమ ధనంతో, తమ ప్రయత్నంతో వాటిని డెవలప్‌ చేసుకుంటారు. ఇక్కడ అమరావతి విషయంలో అవన్నీ ప్రభుత్వమే తలకెత్తుకుంది. 'మీకెందుకు వచ్చిన తలనొప్పి? ప్రజలు చిత్తం వచ్చినట్లు కట్టేస్తారన్న భయం వుంటే, జోన్స్‌గా విభజించి, ఎక్కడ ఏ తరహాది కట్టవచ్చో డిక్లేర్‌ చేసేయండి' అని ఎంతోమంది సలహా యిచ్చినా పాలకులకు తలకెక్కటం లేదు. దేశంలో ఏ రాజధాని నిర్మాతా యింత పని నెత్తి మీద పెట్టుకోలేదు. ఆంధ్ర సిఎం ఖాళీగా వున్నారు కాబట్టి యీ పని పెట్టుకున్నారు అనుకోవడానికి లేదు. విభజన అనంతరం కృత్యాద్యవస్థలా వుంది రాష్ట్రం. ఎన్నో చేయాలి. ముఖ్యంగా రాష్ట్రానికి రావలసిన వాటాలపై తెలంగాణ రాష్ట్రంతో నిరంతరం పోరాడుతూనే వుండాలి. అలాటప్పుడు యింత పెద్దపని పెట్టుకోవాలా?

ఆహ్వానపత్రిక డిజైన్‌ దగ్గర్నుంచి బాబుగారే ఫైనలైజ్‌ చేయాలి. కాబినెట్‌లో కూడా డిస్కస్‌ చేశారనుకుంటా. అవసరమా? దానికి ఓ శాఖ వుండదా? ఓ మంత్రి వుండడా? ప్రభుత్వం అన్నాక రోజూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వుంటుంది. ఆహ్వానపత్రికలు వేయడాలు, పంచడాలు, ప్రెస్‌ రిలీజులు యివ్వడాలు, ఫోటోలు అందించడాలూ, వక్తలకు సమాచారం అందివ్వడాలు, ప్రసంగాలు రాసివ్వడాలు - యివన్నీ చేయడానికి ఓ పెద్ద శాఖే వుంటుంది.  ఈ ఫంక్షన్‌ దగ్గరకు వచ్చేసరికీ ప్రతీదీ పెద్ద హంగామాయే. రెండు లక్షల యిన్విటేషన్లు పంచారట. అవసరమా? ఇవే కాదు, భోజనాల ఏర్పాట్లు దగ్గర్నుంచి బాబు స్వయంగా చూశారు అని మీడియా హంగామా. భోజనాలేమిటి స్వామీ, బాబు పూర్తిగా పురోహితుడి అవతారం ఎత్తేశారు. హెలికాప్టర్‌లోంచి దర్భపుల్లతో రాజధాని ప్రాంతమంతా సంప్రోక్షణ చేసేశారు. వాటిలో ఎన్ని చుక్కలు నేలమీద పడ్డాయో, ఎన్ని పక్కరాష్ట్రమైన తెలంగాణాలో పడ్డాయో తెలియదు. ఇలా చల్లడానికి ముందే ఊళ్లో మట్టి ఎలా పోగేయాలో, దానిలో ఎన్ని నీళ్లు కలపాలో, ఎలా పూజ చేయాలో, దాన్ని రాజధానికి ఎలా పంపాలో కూడా చంద్రబాబు స్వయంగా ప్రజల్లో అవగాహన కల్పించారు. ఏమిటిదంతా? ఈయన ముఖ్యమంత్రా? లేక పురోహితుడా? 

1999 నాటి చంద్రబాబు యిలా లేడు, ఆయన గద్దె దింపిన ఎన్టీయార్‌కు ఎన్ని ఉన్నతాశయాలు వున్నా చాదస్తాలకు ప్రతిరూపంగా వుండేవాడు కాబట్టి మేధావులు హేళన చేసేవారు. కార్టూన్లు వేసేవారు. ఎన్టీయార్‌ తను సన్యాసిని అనేవాడు, చెవికి పోగు పెట్టేవాడు, ఛాందసత్వపు మాటలు మాట్లాడేవాడు. ఆయనకు పూర్తి వ్యతిరేకంగా చంద్రబాబు కొత్త ఆలోచనలకు, కొత్త తరానికి, తరహాకు ప్రతినిథిగా కనబడేవాడు. అందుకే బాబు అంటే దేశవిదేశాల్లో మోజు పెరిగింది. ఇప్పుడు బాబు ఆ కుబుసాన్ని విడిచిపెట్టేశారు. దేశంలో యిన్ని రాజధానులు కట్టారు అక్కడ ఏ ముఖ్యమంత్రయినా యిలా చేశారా? పోనీ సింగపూరు మోడల్‌ కాపీ కొడుతున్నాం కదా, అక్కడ చేశారా యీ పుణ్యాహవచనాలు? రాజధానికి పునాదులు కూడా తీయకుండా భూమిపూజ అని ఒకసారి, శంకుస్థాపన అని మరోసారి యిన్ని కోట్లు ఖఱ్చు పెట్టిన ఉదాహరణ ఎక్కడైనా చూశామా? సరే, ఖర్చు పెట్టారు. ధనం పోయినా ఫలం దక్కాలి. దక్కినదేమిటి? ఇదంతా చూసి ముచ్చటపడి, తనను పిలిచారు కదాని మురిసి మోదీగారు వరాలవర్షం ఏమైనా కురిపించారా? లేదే! ప్రత్యేక హోదా కోసం జగన్‌ దీక్ష చేసినపుడు 'ఇదంతా వేస్టు. మోదీ సభకు వచ్చి ప్రకటన చేయబోతున్నాడని తెలిసి, అదంతా తన వల్లే వచ్చిందని చెప్పుకుందామని చేస్తున్న ప్రయత్నం' అని కొందరు టిడిపి నాయకులు యీసడించారు. 

మోదీ వచ్చాడు, వెళ్లాడు. దసరాకు 'అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లలకు చాలు పప్పుబెల్లాలు' అని పాడడం రివాజు. బాబుకు ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక హోదా దక్కుతాయని అందరూ అనుకున్నారు. మోదీ మనందరి నోట్లో మట్టి కొట్టి, ఆశలపై నీళ్లు చల్లి 'కాంగ్రెసే కాదు, నేను సైతం యింతే..' అని చెప్పి వెళ్లారు. కాంగ్రెసు విభజన సరిగ్గా చేయలేదని దాని నెత్తిమీద దుమ్ము చల్లారు. దానికి ఒక్కటంటే ఒక్క సీటైనా దక్కకుండా చేసిన ఆంధ్రులకు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా? బిజెపి, టిడిపి సహకారం లేనిదే వాళ్లలా చేయగలిగి వుండేవారు కాదన్న విషయమూ వాళ్లకు చెప్పనక్కరలేదు. అన్నీ తెలిసే వాళ్లు బిజెపి-టిడిపిలకు పట్టం కట్టారు - లెస్సర్‌ యీవిల్‌ అనే లెక్క వేసి. అబ్బే లెస్‌ కాదు, యీక్వలే, ఆట్టే మాట్లాడితే గ్రేటర్‌.. అని చేతల ద్వారా చూపిస్తే వాళ్లకు వచ్చిన రీతిలో పాఠం చెప్తారు. విభజనకు కారణం స్వార్థపరశక్తులు, రాజకీయప్రయోజనాలు అన్నారు మోదీ. తన పార్టీ, తనతో పాటు భాగస్వామిగా వున్న టిడిపి కూడా విభజనలో పాలు పంచుకున్నాయన్న సంగతి మరిచారో ఏమో! అదిగో హోదా, యిదిగో హోదా అంటూ ఏడాదిన్నర గడిపేశారు. ఈ విషయమై వెంకయ్యనాయుడు ఎన్ని కుప్పిగంతులు వేశారో లెక్కపెట్టడం ఎవడి తరం కాదు. ఆయన వ్యంగ్యం వింటూంటే వెగటు పుడుతోంది. ఇప్పుడు తాజాగా 'మాకు ఐదేళ్లు గడువుంది. అప్పుడే అడక్కండి' అంటున్నారు. అంటే ఐదేళ్ల తర్వాత ఎన్నికల మానిఫెస్టోలో 'ఈసారి కచ్చితంగా యిస్తాం' అనే హామీ చొప్పిస్తారా? 

అమరావతి మీటింగులో మోదీ చెప్పినదేమిటి? 'విభజన చట్టంలో వున్నది అమలు చేస్తాం' అని. అదొక హామీయా? 'ఆఫీసుకి వెళ్లి పనిచేస్తా' అని ఉద్యోగి చెప్పినట్లుంది. నువ్వు వున్నది చట్టంలోనిది అమలు చేయడానికి, దాన్ని అధిగమించి ఏమైనా యిస్తావా? మరీ ఎక్కువేమీ వద్దు, నీ ఎన్నికల మానిఫెస్టోలో వున్నదే చేయి చాలు అని ఆంధ్రులు అడుగుతున్నారు. చట్టం లోపభూయిష్టంగా వుందని మాకు చెప్పడం దేనికి? ఆదరాబాదరాగా, కాబినెట్‌ మంత్రులు కూడా చదవకుండా సంతకం పెట్టిన చట్టం అది. పార్లమెంటులో టీవీలు ఆపేసి, ఎంపీలను చావబాదేసి పాస్‌ చేయించిన చట్టం అది. ఆ పనిలో కాంగ్రెసుకు సాయపడినది బిజెపి, టిడిపిలే. అది అన్యాయంగా తోస్తే చట్టాన్ని మార్చండి. మీకు మెజారిటీ వుందిగా. మా దగ్గరకు వచ్చి చెప్పడం దేనికి? అయినా ఆ చట్టం మాత్రమే అమలు చేస్తానంటున్నావ్‌. దానిలో వున్నదేమిటి? ఏది చూసినా పరిశీలిస్తాం, సాధ్యాసాధ్యాలు పరీక్షిస్తాం అనే. రైల్వే జోన్‌ దగ్గర్నుంచి నిర్దిష్టమైన హామీలు అతి తక్కువగా వున్నాయి. మోదీ తన ఉపన్యాసంలో వాడిన 'చేస్తాం' అనే భవిష్యత్కాలపు క్రియాపదం వాడవలసినది, అధికారంలోకి వచ్చేముందు. సీటెక్కిన ఏడాదిన్నర తర్వాత కాదు. నిజాయితీ వుంటే చేశాం, చేసిచూపించాం అనే భూతకాలం వాడాలి. ప్రత్యేక హోదా యివ్వండి, ప్రత్యేక పాకేజీ యివ్వండి అని మోదీని సభాముఖంగా అడిగే ధైర్యం బాబుకి లేకపోయింది. పాతిక సర్‌ల తాలింపుతో పక్క రాష్ట్రాల్లో బెంగుళూరు, మద్రాసు, హైదరాబాదులున్నాయి, మాకు లేవు అని చెప్పారు. 'ఢిల్లీని తలదన్నే రాజధాని ప్రసాదిస్తామన్నారు మీ తిరుపతి ప్రసంగంలో..' అని గుర్తు చేయాల్సింది. అదీ చేయలేదు.

మోదీ కలిగించిన నిరుత్సాహంతో మర్నాడు రాష్ట్రమంతా ఆందోళనలు చెలరేగడంతో 'అబ్బే, ఇద్దామనే అనుకున్నారు, పనగారియా విదేశీ పర్యటన వలన నీతి ఆయోగ్‌వారి రిపోర్టు రెడీ కాలేదు, 15 రోజులు టైము కావాలని అడిగారు' అనే న్యూస్‌ లీక్‌ చేశారు. నీతి ఆయోగ్‌ టైము ప్రకారం పనిచేయకపోతే టాస్క్‌ మాస్టర్‌ మోదీ ఊరుకుంటాడా? బిహార్‌ ప్యాకేజీ విషయంలో ఎంత చురుగ్గా వున్నాడు! కరక్టుగా చెప్పాలంటే ఆగస్టు నుంచి యీ కబుర్లు వింటున్నాం, 'బాబు ఢిల్లీ వెళ్లారు, వాళ్లకు గట్టిగా చెప్పారు, వాళ్లు తలవూపారు, వెధవ హోదాదేముంది, దానికి బాబులాంటి ప్యాకేజి యిస్తామన్నారు' అని. ఇద్దామనుకుంటే యింతకంటె గొప్ప సందర్భం ఏముంది? పునాదులు తీసినపుడు మళ్లీ యింకో మహా సభ పెట్టి మోదీని పిలుస్తాం, అప్పుడు ప్రకటిస్తాడు అని చెప్తారేమో! మీడియాలో వచ్చిన యింకో వార్త ఏమిటంటే - బాబు ఢిల్లీ వెళ్లి మోదీతో బాబు మాది లోటు బజెట్‌,  నిధులిచ్చి ఆదుకోకపోతే మునిగిపోతాం అని అడుగుతూంటే అక్కడే వున్న పనగారియా అంత లోటుగా వుంటే ఋణమాఫీ ఎవడు చేయమన్నాడని అడిగాడట. తెలుగు రాదు కానీ లేకపోతే 'సిరి గలవానికి చెల్లును.. ' పద్యం పాడి, మీస్థాయికి యిన్ని హంగులతో రాజధాని అక్కరలేదు అని తేలుస్తాడేమో! బిజెపితో బంధం తెగిపోయే రోజు వస్తే తప్ప బాబు యీ విషయాలు బయటపెట్టరు. 

ఇవన్నీ తాపీగా ఆలోచించే సమయం ప్రజలకు యిస్తే పాలకులకు ముప్పు. అందువలన పండగ తర్వాత పండగతో వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేయాలి. అదే బాబు వ్యూహం. మొన్నటిదాకా పుష్కరాల హడావుడి. ఇప్పుడు అమరావతి మట్టి-నీరు, వచ్చేవారం నెల్లూరులో రొట్టెల పండగ, మధ్యలో దేవరకట్టు పండగ.. యిలా పాలన అంటే పండగలే పండగలు. రొట్టె ఎలా పట్టుకోవాలో, తెలుగు జాతి బాగుపడాలని కోరుకుంటూ ఒకరి కొకరు ఎలా రొట్టెలు యిచ్చుకోవాలో ఓ సినిమా డైరక్టరు డైరక్షన్‌లో బాబు స్వయంగా నటించి వీడియో తీయించి టీవీల్లో వేయిస్తారేమో. ఇవన్నీ సరే, కందిపప్పు ధర రెండు వందల రూపాయలైపోయిందేమిటండీ అని ఎవరైనా అడిగితే 'ఉండవయ్యా, రొట్టెల పండగకు సింగపూరు నుంచి రొట్టెలు తెప్పిస్తూ వుంటే మధ్యలో శకునపక్షిలా యీ కూతలు, ఆంధ్రులు బాగుపడడం నీ కిష్టం లేదు, మనం ఎప్పటికీ వెనకపడి వుండాలనే నీ ఆలోచన' అని తిట్టిపోస్తారు. రెండు మూడేళ్లు పోయాక ఆర్థికాంశాల్లో రాష్ట్రపరిస్థితి ఎలా వుందో గణాంకాల శాఖ చెప్పినప్పుడు వీళ్లు శకునపక్షులో కాదో తేలుతుంది. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

mbsprasad@gmail.com

స్టార్ హీరోలతో చెయ్యాలనే ఇంట్రెస్ట్ లేదు

అందుకే కాంగ్రెస్ సీనియర్లు జగన్ వెంట రాలేదు

 


×