Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : ఫలితాల విశ్లేషణ - ఉత్తరాఖండ్‌

16 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్తరాఖండ్‌లో ఏ ప్రభుత్వమూ రెండోసారి వరుసగా గెలవదు. ఈ సారి అదే జరిగింది. అయితే గతంలో కాంగ్రెసు, బిజెపిలకు మధ్య సీట్ల వ్యత్యాసం తక్కువగా వుండేది. ఈసారి చాలా తేడా వచ్చేసింది. బిజెపి ఏకంగా 81% సీట్లు గెలిచేంది. దీనికి కారణం ఐదేళ్ల క్రితం 33% ఓట్లు తెచ్చుకున్న బిజెపి యీసారి 47% తెచ్చుకోవడం! అయినా 2014 నాటి 56% కంటె 9% తక్కువే. అదే ఉధృతి కొనసాగివుంటే 63 అంటే 90% సీట్లు వచ్చి వుండేవి. కాంగ్రెసుకు 2014 ప్రకారం అయితే 7 సీట్లు వచ్చివుండాలి. కానీ 11 వచ్చాయి. ఎంత అధ్వాన్నంగా పాలించినా కాంగ్రెసు ఓటింగు శాతం పెద్దగా తగ్గటం లేదు. 2012లో అది 33.8% వుంటే 2017లో అది 33.5%, మధ్యలో 2014లో కూడా ఆ మధ్యనే వుంది. మరి బిజెపి ఎక్కడ లాభపడిందంటే - 2012లో బియస్పీకి 12%,  స్వతంత్రులకు 12%, ఇతరులకు 9% వచ్చాయి. ఆ మొత్తం 23% లోంచి యీసారి బిజెపి 13% తన వైపు లాక్కుని 46.5% తెచ్చుకుంది. బియస్పీకి 2012 నాటి 12% నుండి యీసారి 7%కి పడిపోయింది. ఉత్తరాఖండ్‌ క్రాంతి దళ్‌ వంటి చిన్న పార్టీలు యింకా ఘోరంగా నష్టపోయాయి. ఈ ముఖాముఖీ పోరాటంలో బిజెపి గెలిచింది. దాని విజయానికి కాంగ్రెసు సకల విధాలా సహకరించింది.

2012లో కాంగ్రెసుకు బిజెపి కంటె ఒకే సీటు ఎక్కువ వచ్చింది. ఎవరికీ మెజారిటీ రాలేదు. అప్పట్లో కేంద్రంలో ఎన్‌డిఏ లేకపోవడం చేత ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీనే గవర్నరు పిలిచాడు. మూడు సీట్లున్న బియస్పీ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోకపోయినా అసెంబ్లీలో కొమ్ము కాస్తానంది. ఆ విధంగా కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడింది. కానీ 2013లో వచ్చిన వరదల కారణంగా చార్‌ధామ్‌ సర్వనాశనమైంది. ముఖ్యమంత్రి విజయ బహుగుణ (కాంగ్రెసులోను, జనతా పార్టీలోను పెద్ద పదవులు అనుభవించిన ఎచ్‌ ఎన్‌ బహుగుణ కుమారుడు) పరిస్థితిని సరిగ్గా హేండిల్‌ చేయలేకపోయాడని భావించిన కాంగ్రెసు 2014లో అతన్ని తీసివేసి హరీశ్‌ రావత్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అది విజయ్‌ బహుగుణను దహించివేసింది. పార్టీలో అసమ్మతి రాజేసి హరీశ్‌కు చిక్కులు కలిగించాడు. పాలన అస్తవ్యస్తంగా సాగింది. అతన్ని తీసివేయాలని అసమ్మతి వర్గం అధిష్టానం దగ్గర మొర పెట్టుకున్నా సోనియాకు, రాహుల్‌కు దీనిపై దృష్టి సారించడానికి తీరికే లేకపోయింది. సొంత పార్టీలోనే అసమ్మతి వచ్చి వాళ్లు బిజెపితో చేతులు కలపడంతో బిజెపి అధికారం చేజిక్కించుకోబోయింది కానీ కోర్టు రావత్‌ ప్రభుత్వాన్ని రక్షించింది. తర్వాత కూడా అతను తన పొరపాట్లను సరిదిద్దుకోలేదు. నిస్పృహతో కాంగ్రెసు వాదులు బిజెపివైపు ఫిరాయించసాగారు. ఎలాటి శషభిషలు పెట్టుకోకుండా బిజెపి వారిని ఆహ్వానిస్తూ పోయింది. 2014లో సత్‌పాల్‌ మహరాజ్‌ ఫిరాయించగా, విజయ బహుగుణ, హరక్‌ సింగ్‌ రావత్‌లు 2016లో 7 గురితో కలిసి ఫిరాయించాడు. విజయ్‌ బహుగుణ ఎంపీగా వున్నాడు కాబట్టి అసెంబ్లీకి పోటీ చేయలేదు. అతని కొడుక్కి అసెంబ్లీ టిక్కెట్టు యిస్తే గెలిచాడు. విజయ్‌ సోదరి రీటా యుపిలో కాంగ్రెసు రాష్ట్ర అధ్యక్షురాలిగా వుంటూ ఓ రోజు బిజెపిలోకి ఫిరాయించి, యిప్పుడు ఏకంగా యుపి లో కాబినెట్‌ మంత్రిణి అయిపోయింది. 

మోదీ మూడు పెద్ద బహిరంగ సభలకు వచ్చాడు. రావత్‌ అవినీతిపై, పర్వత ప్రాంతాల నుండి వలసలపై, నిరుద్యోగంపై ఘాటుగా మాట్లాడి, బిజెపి అధికారంలోకి వస్తే టూరిజంకు ప్రాచుర్యం కల్పించి రాష్ట్రప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచుతానన్నాడు. వాటికి విశేషంగా స్పందన వచ్చింది. రాజనాథ్‌ సింగ్‌, అరుణ్‌ జేట్లే, స్మృతి ఇరానీ కూడా ప్రచారానికి వచ్చారు. ఉత్తరాఖండ్‌లో మిలటరీలో పనిచేసి వచ్చినవారు చాలామంది వున్నారు. అలాటి 1.75 లక్షల యిళ్లపై బిజెపి బాగా దృష్టి పెట్టింది. తాము ఒన్‌ ర్యాంక్‌, ఒన్‌ పెన్షన్‌ స్కీముకు అంగీకరించామని చెప్పి వారి అభిమానాన్ని చూరగొంది. వారంతా బిజెపికి ఓటేశారు. యుపిలోని ముజఫర్‌ నగర్‌లో మతకలహాల వలన భయపడిన ముస్లిములు పొరుగున వున్న ఉత్తరాఖండ్‌కు తరలి రాసాగారు. ఇది స్థానికులలో బెదురు పుట్టించింది. దీన్ని కూడా బిజెపి తనకు అనువుగా వాడుకుంది. కానీ పార్టీ ఫిరాయింపులపై ఆధారపడి తన పార్టీ వ్యవస్థను పాడు చేసుకుంది. 14 మంది నాయకులను కాంగ్రెసు నుంచి తీసుకుంది. కాంగ్రెసు నుంచి ఫిరాయించి వచ్చినవారికి టిక్కెట్లు యివ్వవలసి వచ్చింది. దాంతో ఆ నియోజకవర్గాల్లో ఎప్పణ్నుంచో వున్న బిజెపి నాయకులు అలిగి కాంగ్రెసులోకి వెళ్లిపోయి టిక్కెట్లు తీసుకున్నారు. కాంగ్రెసుదీ యించుమించు అదే పరిస్థితి. 80% నియోజకవర్గాల్లో అధికార అభ్యర్థి, తిరుగుబాటు అభ్యర్థి యిద్దరూ వున్నారు. కాంగ్రెసు నుంచి బిజెపికి వచ్చిన 14 మందిలో 12 మంది గెలిచారు. బిజెపి ఘనవిజయాన్ని సాధించినా అంతఃకలహాలు పార్టీ పరువు తీశాయి. బిజెపి అనుకూల ప్రభంజనంలో కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌ భట్‌ కాంగ్రెసు అభ్యర్థి చేతిలో 49 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడమే దానికి నిదర్శనం. 

2012లో కాంగ్రెసు 19 సీట్లలో 2 వేల కంటె తక్కువ తేడాతో గెలిచింది. అంటే దానికి వున్న ప్రజాదరణ అంతంత మాత్రమే అన్నమాట. వరదలు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం తన చేతకానితనాన్ని చాటుకుంది. ఆ ముఖ్యమంత్రి స్థానంలో వచ్చిన రావత్‌ బాగా పాలించవలసిన అవసరం ఎంతైనా వుంది. కానీ అతని పాలనలో ఉద్యోగకల్పనంతా డెహ్రాడూన్‌, హరిద్వార్‌ ఉధమ్‌ సింగ్‌ నగర్‌ జిల్లాలకే పరిమితమైంది. అక్కడ కూడా లేబరు చట్టాలు సరిగ్గా అమలు చేయకపోవడం వలన కార్మికుల్లో అసంతృప్తి వుంది. ఇక పర్వతప్రాంతాల్లో అభివృద్ధి సరిగ్గా జరగలేదు. వ్యవసాయపరంగా, ఆర్థికపరంగా, నిరుద్యోగపరంగా చాలా సమస్యలు చుట్టుముట్టి వారంతా బతుకుతెరువు కోసం మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లవలసి వచ్చింది. రావత్‌ ప్రభుత్వంపై విపరీతంగా అవినీతి ఆరోపణలున్నాయి. పరిపాలన కూడా సవ్యంగా లేదు. కాంగ్రెసు అమలు చేసిన పంచాయితీ రాజ్‌ చట్టం దానికి చాలా అపఖ్యాతి తెచ్చిపెట్టింది. 500 మంది వున్న చోట గ్రామ పంచాయితీ అనడం గందరగోళాన్ని సృష్టించింది. ఇంట్లో పనిచేసే టాయిలెట్‌ వుంటే తప్ప ఎన్నికలలో పోటీ చేయడానికి వీల్లేదన్న షరతు పెట్టడంతో ఉత్సాహం వున్న చాలామంది పోటీ చేయలేకపోయారు. వాళ్లందరికీ కాంగ్రెసుపై కోపం రగిలింది. 

కాంగ్రెసు ఉత్తరాఖండ్‌పై మొదటి నుంచి ఆశ వదిలేసి గాలికి వదిలేసినట్లయింది. పెద్ద కాంగ్రెసు నాయకులెవరూ ప్రచారానికి రాలేదు. ఉత్తరాఖండ్‌ను హరీశ్‌ రావత్‌ ఒక్కడే ప్రచారభారం నిర్వహించాడు. అతనంటే ప్రజలకు ఏ మాత్రం యిష్టం లేదన్న సంగతి పోటీ చేసిన రెండు చోట్ల నుండి ఓడిపోవడంతోనే తేటతెల్లమైంది. అతనితో బాటు కాబినెట్‌ సహచరులు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మట్టి కరిచారు. రావత్‌ చేసిన టిక్కెట్ల పంపిణీ సరిగ్గా లేదంటూ ఎన్నికలకు నెల ముందు ఏడు జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు బిజెపిలో చేరారు. వారితో బాటు బిసి కౌన్సిల్‌  చైర్మన్‌ కూడా పార్టీ మారాడు. దాంతో కాంగ్రెసు బిసిలను పట్టించుకోవటం లేదన్న మాట వచ్చింది. కాంగ్రెసు అధినాయకుల్లో రాహుల్‌ గాంధీ మాత్రం రెండే రెండు ర్యాలీలకు వచ్చాడు. వాటికి కూడా స్పందన బాగా లేదు. ఓటర్లలో సగం కంటె ఎక్కువమంది యువత వుంది. వారిని ఆకట్టుకోవడానికి రావత్‌ చివరి నిమిషంలో ''బేరోజ్‌గారీ భత్తా'' పేర నిరుద్యోగ భృతి పథకం ఏర్పాటు చేయబోయాడు. దాని ప్రకారం ఇంటికో ఉద్యోగం చొప్పున 18-35 సం||ల మధ్య వున్న యువతీయువకులకు 2020 నాటికల్లా ఉద్యోగం యిస్తామని, యీ లోపున నెలకు రూ.2500 భృతి యిస్తామని ప్రకటించాడు. అయితే పథకం ప్రారంభమైన 48 గంటల్లో ఎన్నికల కమిషన్‌ దాన్ని ఆపేసింది. ఈ లోపునే 10 వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మోదీ తమ కేదో చేస్తాడన్న ఆశతో యువత బిజెపికి భారీగా ఓటేసింది. ఎందుకంటే బిజెపి కూడా ఉద్యోగాలు కల్పిస్తానని, నిరుద్యోగ భృతి యిస్తానని హామీ యిచ్చింది. మొత్తానికి బిజెపి యుపి లాగే, ఉత్తరాఖండ్‌ను భారీ మెజారిటీతో తన ఖాతాలో వేసుకుంది. అయితే యుపిలో కంటె ఉత్తరాఖండ్‌లో బిజెపిలోకి కాంగ్రెసు నుంచి ఫిరాయింపులు ఎక్కువ జరిగాయి. కాంగ్రెసులో కట్టినట్లే వీరంతా బిజెపిలో కూడా ముఠాలు కడితే ప్రమాదం. అలా జరగకుండా కట్టడి చేయవలసిన బాధ్యత బిజెపి అధిష్టానంపై వుంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
- mbsprasad@gmail.com